Tuesday, 12 August 2014

సమస్యలు మోసుకొస్తున్న నూతన సంవత్సరం

    కొత్త సంవత్సరం వస్తుందంటే అన్ని వర్గాల ప్రజల ముఖాలలో ఆనందం వెల్లివిరుస్తుంది. పాత జ్ఞాపకాల స్థానంలో రానున్న భవిష్యత్తును ఊహించుకుంటూ ఆ సంవత్సరం సుఖంగా గడవాలని కోరుకుంటారు. కానీ రైతులకు 2012 నూతన సంవత్సరం కరువుతో పాటు సమస్యలను మోసుకొస్తున్నది. 2011 ఖరీఫ్‌లో రాష్ట్ర ప్రభుత్వం 876 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించింది. 85.80 లక్షల ఎకరాలలో 51.53 లక్షల మంది రైతుల పంటలకు నష్టం వాటిల్లింది. ఇందులో 48.33 లక్షల మంది సన్న, చిన్నకారు రైతులుగా ప్రభుత్వ నివేదికలు తెలుపుతున్నాయి. రు.5,746 కోట్ల పెట్టుబడికి నష్టం వాటిల్లింది.(1886 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ అవసరమని జిల్లా కలెక్టర్లు నివేదికలు పంపారు.) రైతులు నష్టపోయినదానిలో ఇదెంత శాతం? ప్రకృతి వైపరీత్యాలకు రైతాంగాన్ని బలిపెట్టడమే తప్ప మరొకటి కాదు. తొలకరిలో రాష్ట్ర వ్యవసాయశాఖ ముందస్తు లక్ష్యాలు నిర్ణయిస్తూ 2.21 కోట్ల ఎకరాలలో 2.28 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేస్తామని లక్ష్యంగా ప్రకటించింది. రు.30,985కోట్ల పంటరుణాలు పంపిణీ చేస్తామని,30 శాతం సబ్సిడీతో రు. 400 కోట్ల విలువ గల విత్తనాలు, 50 శాతం సబ్సిడీపై జింక్‌సల్ఫేట్‌, జిప్సం సరఫరా చేస్తామన్నారు. ప్రణాళికా బడ్జెట్‌ కింద రు.2,148 కోట్లు కేటాయిస్తామని, ఇందులో రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన పథకం కింద రు.293 కోట్లు ప్రకటించారు.
    ప్రభుత్వం లక్ష్యాలకు, వాస్తవానికి పొంతన లేని పరిస్థితి ఏర్పడిరది. కరువుకు గురైన రైతులు ఈ మూడు మాసాలలోనే 250 మంది వరకు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 2011 సంవత్సరం వరదలతో ప్రవేశించింది. జనవరిలో వచ్చిన వరదలకు 699 మండలాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఆ పరిహారం నేటికీ అందాల్సి ఉంది. ఒక్క జనవరి నెలలోనే 160 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ ఖరీఫ్‌లో  కోనసీమలో లక్ష ఎకరాలు క్రాప్‌ హాలడేగా ప్రకటించారు. మిగిలిన ప్రాంతరంలో 2011 ఖరీఫ్‌ ప్రారంభంలో అప్పులు చేసి వ్యవసాయాలు ప్రారంభించారు. బ్యాంకులు రుణాలు రీషెడ్యూల్‌ చేయడానికి నిరాకరించి బుక్‌ అడ్జెస్ట్‌మెంట్‌ చేసి, పాత అప్పును కొత్త అప్పుగా మార్చారు. ఈ విధంగా రు. 8,000 కోట్లు పంటరుణాలు ఇచ్చినట్లు బ్యాంకులు ప్రకటించాయి. రిజర్వు బ్యాంకు, నాబార్డు ఆదేశాలకు భిన్నంగా బ్యాంకులు తమ వ్యాపార ధనంలో 18 శాతం పంటరుణాలు ఇవ్వాల్సి ఉండగా ఏనాడూ 11 శాతం దాటలేదు. రైతులకిచ్చే రుణాలను రిజర్వు బ్యాంకులోనే డిపాజిట్టు చేసి రిజర్వుబ్యాంకు ఆదేశాల నుండి తప్పుకుంటున్నారు. దీర్ఘకాలిక రుణాలు ఇవ్వడం మానివేశారు. పలుకుబడి గలిగిన కొందరికి మాత్రమే వ్యవసాయోపకరణాల కొనుగోలుకు రుణాలు ఇస్తున్నారు. దళిత, గిరిజనులకు మొత్తం రుణాలలో 15 శాతం ఇవ్వాలని రిజర్వుబ్యాంకు నిబంధనలలో ఉన్నా బ్యాంకులు పాటించడం లేదు.
    రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర సరుకుల చట్టపరిధిలోకి తెచ్చి 450 గ్రాముల పత్తివిత్తనాలకు రు.180 పెంచింది. అలాగే వేరుశనగ కాయ విత్తనాలను క్వింటాలుకు రు.2,500నుండి రు. 3,600 లకు పెంచారు. ఈ పెంచిన మొత్తాలను విత్తనాలు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు సబ్సిడీ కింద అంటగట్టారు. ఎరువుల ధరలు 86 శాతం పెంచారు. డిఎపి బస్తా రు.486 నుండి రు.930 కి పెంచారు.అయినా రైతులు బ్లాక్‌ మార్కెట్‌లో విత్తనాలు, ఎరువులు అత్యధిక ధరలకు కొనుగోలు చేశారు. పత్తివిత్తనాలు బ్లాకులో 450 గ్రాములను రు.2,000లకు కొనుగోలు చేసి నాటారు. వ్యవసాయోపకరణాల ధరలు అత్యధిక ధరలకు కొనుగోలు చేసి పంటలు వేసినా చివరికి కరువు కాటేసింది. గత 7 సంవత్సరాలలో వరుసగా కరువులు, వరదల వల్ల లక్షలాధి ఎకరాల పంటలకు నష్టం వాటిల్లుతున్నది. కేంద్రం సహాయం చేస్తుందని రాష్ట్రం ఎదురు చూడడమే తప్ప రైతులకు అందిన సహాయం నామమాత్రం. కేంద్ర బృందాల పర్యటనలు మాత్రం ఏటా జరుగుతూనే ఉన్నాయి. జాతీయ ప్రకృతి వైరపరిత్యాల కంటిజెంన్సి పథకం(ఎన్‌సిసిఎఫ్‌) నుండి 2001 నుండి 2009 వరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని రు.8,327 కోట్లు కోరగా, కేంద్రం చేసిన సహాయం రు.615 కోట్లు మాత్రమే. ఈ పథకం కాక సిఆర్‌ఎఫ్‌ నుండి రాష్ట్ర ప్రభుత్వం గత 7 సంవత్సరాలలో రు.42,533 కోట్లు కోరగా కేంద్రం ఇచ్చింది. రు.1,994 కోట్లు మాత్రమే. పంటల భీమా పథకం ఇదే దారిలో పయనించింది. పంటలు నష్టపోయిన రైతులు ప్రభుత్వంపై ఆశలు వదులుకున్నారు. ఈ నామక పరిహారాలు కూడా రెండు మూడు జిల్లాలకే పరిమితమయ్యాయి.
    2011 సంవత్సరంలో క్రాప్‌ హాలిడేకు గల కారణాలను తెలుపుతూ నివేదిక ఇవ్వాలని మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్‌ కందా నేతృత్వంలో ప్రభుత్వం కమిషన్‌ వేసింది. ఈ కమిషన్‌ నివేదికను పరిశీలిస్తే అందులో కౌలుదార్లకు సంబంధించి ఎలాంటి సూచనలు లేవు. అనేక ఉద్యమాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం కౌలుదార్లకు రుణగుర్తింపు చట్టం తెచ్చింది. రాష్ట్రంలో 24 లక్షల మంది కౌలుదార్లు ఉన్నట్లు అంచన కాగా, ఈ చట్టం కింద రిజిస్ట్రీ చేసుకున్న వారు 5.86 లక్షలు మాత్రమే. ఇందులో 1.30లక్షల మందికి రు.270 కోట్లు మాత్రమే రుణాలిచ్చారు. కౌలుదార్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం భూస్వామ్యవర్గాల పక్షం వహిస్తున్నది. కౌలు వ్యవస్థ రాష్ట్ర వ్యాపితంగా విస్తరిస్తున్నది. రెవెన్యూ రికార్డులలో వీరి పేర్లు నమోదు చేయడానికి చట్టం నిర్దేషించిన ప్రభుత్వం అందుకు సముఖంగా లేదు. ఒక విధంగా ప్రభుత్వమే చట్టాలను అమలు చేయడం లేదు.
    వాస్తవ సాగుదారు పేర్లు రెవెన్యూ రికార్డులో నమోదు లేదు. వారికి పాసు పుస్తకాలు లేవు. కొన్ని బ్యాంకులు రైతుల పాసుపుస్తకాలను చట్టానికి భిన్నంగా తాకట్టు పెట్టుకుంటున్నాయి. ఎరువులు, విత్తనాల కొనుగోలుకు  పాసుపుస్తకం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సంవత్సరం నెల్లూరు జిల్లాల్లో పెద్దఎత్తున ధర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు భూ సేకరణకు పూనుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తెస్తున్న భూ సేకరణ చట్టంలో 80 శాతం రైతులు అంగీకారం ఉంటేనే భూ సేకరణ చేయాలనే నిబంధన ఉన్నప్పటికీ అందుకు విరుధ్ధంగా రాష్ట్రంలో లాఠీచార్జీలే కాక పోలీసు కాల్పులు జరిపి, ప్రజలపై అక్రమ కేసులు బనాయించి భూ సేకరణలు చేస్తున్నారు. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో తడ, నాయుడుపేట, ముత్తుకూరు తదితర మండలాల్లో వివిధ పరిశ్రమలకు 60 వేల ఎకరాల భూమిని కట్టబెట్టారు. కొత్తగా 19 ధర్మల్‌ కేంద్రాలకు 10 వేల ఎకరాలను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీకాకుళంలో కొవ్వాడ, సోంపేటలో నాగార్జునా కన్సస్ట్రక్షన్‌ కొరకు భూసేకరణ సందర్భంగా పోలీసుకాల్పులు జరిగాయి. విశాఖలో బాక్సైట్‌ గనుల త్రవ్వకానికి ఎజెన్సీ గిరిజనులపై నిర్భంధం కొనసాగుతున్నది. ఆదిలాబాద్‌ జిల్లాలోని కవ్వాల ప్రాంతంలో పెద్దపులుల అభయారణ్యం కింద గిరిజన గ్రామాలను తొలగించే ప్రయత్నం కొనసాగుతున్నది. వారు గ్రామాలను ఖాళీ చేయడానికి పాములను వదులుతున్నారు. బలవంతపు భూసేకరణకు పాల్పడుతున్నారు.
    రాష్ట్ర ప్రభుత్వానికి జల విధానం లేదు. జలయజ్ఞం ద్వారా కోటి ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పిస్తామని నేటికి రు.56 వేల కోట్లు వ్యయం చేశారు. 2011`12 బడ్జెట్‌ రు.15 వేల కోట్లు కేటాయించారు. కేటాయింపులు విడుదల కాకపోవడంతో కాంట్రాక్టర్లు జనవరి 1,2012 నుండి పనులు బందు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇంత వ్యయం చేసినా నేటికీ 2.5 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటి వనరులు కల్పించారు. ప్రధాన్యతా క్రమాలు పాటించకుండా ప్రతిచోట శంకుస్థాపనలు చేసి కాంట్రాక్టర్లకు, రాజకీయనాయకులకు నిధులు అందుబాటులోకి తెచ్చారు. కనీసం మైనర్‌ ఇరిగేషన్‌ చెరువులు కూడా రిపేర్లకు నోచుకోలేదు. సమగ్రజల విధానం ద్వారా శ్రీరాంసాగర్‌, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులలోకి 80 శాతం నీరు రాగానే కాలువలు వదిలి చెరువులు నింపడం ద్వారా భూగర్భ జలాలను వృద్ధి చేయవచ్చు. ఒక పంటకు గ్యారంటీ ఉంటుంది. ఈ విధానం అనుసరించకపోవడం వలన ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేసి ఈ కరువు సంవత్సరంలో కూడా 2000 టిఎంసిలకు పైగా సముద్రంపాలు చేశారు. భారీ , మైనర్‌, ఐడిసి, రెవెన్యూ మరియు వ్యవసాయశాఖల మధ్య సమన్వయ లోపం వలన జలవిధానం రూపొందించకుండా రాష్ట్ర కేంద్రంలోని కొందరు అడ్డుపడుతున్నారు. వెనుకబడిన ప్రాంతాలను అలాగే ఉంచాలని, అక్కడి నుండి కూలీలను పట్టణాలకు తరలించాన్న లక్ష్యంతో ఉంటున్నారే తప్ప ప్రజల జీవన ఆదాయం పెరగాలని కోరడం లేదు. కనీసం ప్రజాప్రతినిధులు కూడా దీర్ఘకాలిక కరువు నివారణా చర్యలపై ప్రభుత్వానికి సూచించడం లేదు. మరొకవైపున వరదల నష్ట తగ్గింపుకు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చడానికి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి ప్రతియేటా అడ్డంకులను తొలగిండానికి ఎలాంటి ప్రణాళికా లేదు. గతంలో డ్రైనేజీ బోర్డు వేసి సమస్యను పరిష్కరించారు. కరువు, వరదల నష్టాన్ని తగ్గించడానికి గల అవకాశాలను ప్రభుత్వం రూపొందించకపోవడం వలన ఏటా ప్రకృతి వైపరిత్యాలకు రైతులు బలిపశువులుగా మారుతున్నారు.
    ఇలాంటి పరిస్థితుల్లో పండిరచిన పంటలకు కనీస మద్దతు ధరలు లభ్యం కావడం లేదు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల కొనుగోలు సంస్థలు పేరుకే మార్కెట్లలో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. గత సంవత్సరం ఐకెపి ద్వారా 21లక్షల టన్నులు కొనుగోలు చేశామని ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంది. ఒక రబ్బీలోనే గత సంవత్సరం కోటి టన్నుల దిగుబడులు వచ్చాయి. నేటికీ అమ్మకుండా ఉన్నారు. తిరిగి ఈ ఖరీఫ్‌లో వచ్చిన ధాన్యం, పత్తి పంటలకు నిర్ణయించిన కనీస మద్దతు ధర రావడం లేదు. అలాగే చెరుకు రైతులకు ప్రభుత్వం ప్రకటించిన ధర ఇవ్వడం లేదు. ప్రక్క రాష్ట్రాలలో టన్ను రు.2,500లు కాగా, ఈ రాష్ట్రంలో రు.1800 నుండి రు.2,000లోపు కొనుగోలు జరుగుతున్నాయి. పసుపు ధర క్వింటాలు రు.16,000లు పలికింది నేడు, రు.3,000లకు అమ్ముకుంటున్నారు. కనీసం ఉత్పత్తుల నిల్వకు గోదాంల సౌకర్యాన్ని కల్పించాలన్న లక్ష్యం కూడా ప్రభుత్వానికి కొరవడిరది. రాష్ట్ర ప్లామెంటు సభ్యుల ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిల్వ సౌకర్యాన్ని పెంపుదల చేయాలి. ఒకవైపున విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, ట్రాక్టరు అద్దెలు, ప్రైవేటు వడ్డీరేట్లు గత సంవత్సరంపై 86 శాతం పెరగగా, వ్యవసాయోత్పత్తుల ధరలు 8 శాతం మాత్రమే కేంద్రం పెంచింది. రాజ్యాంగం రిత్యా ధరల నిర్ణయం, కొనుగోలు వ్యవసాయోపకరణాల ఉత్పత్తి, పంపిణి ధరల నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. కానీ కేంద్రంపైకి తోసి రాష్ట్ర ప్రభుత్వం తప్పుకుంటున్నది. రాష్ట్రాల పరిధిలోని నాలుగు చట్టాలు (1.విత్తన చట్టం 2. భూసేకరణ చట్టం 3. క్రిమి సంహారక మందుల నియంత్రణ చట్టం 4. బయోటెక్నాలజీ రెగ్యులేటరీ చట్టం) పార్లమెంటు వద్ద పెండిరగులో ఉన్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల పెంపుదలకు, బహుళజాతి సంస్థల నియంత్రణకు ఈ చట్టాను రాష్ట్ర శాసన సభలోనే చేయాలి. రాష్ట్ర వ్యవసాయ శాఖకు పూర్తి బాధ్యత గల మంత్రి లేకపోవడం ప్రభుత్వానికి రైతులఎడల ఉన్న పక్షపాత ధోరణిని తెలుపుతున్నది. చివరికి విద్యుత్తుశాఖకు కూడా మంత్రి లేడు. ఉచిత విద్యుత్తును ఎత్తివేయడానికి రైతుల మానసిక స్థితిని సిద్ధం చేయడానికి వీలుగా నాణ్యతలేని విద్యుత్తు, మూడు నాలుగు గంటలే సరఫరా చేస్తున్నారు. బావుల సేద్యం 40 లక్షల ఎకరాల నుండి 15 లక్షల ఎకరాలకు తగ్గింది. అయినా గ్యారంటీగా దిగుబడి వస్తుందన్న నమ్మకం లేదు. ప్రభుత్వం ఉత్పత్తి లక్ష్యాలు నిర్ణయించడం, అవి అమలుకు నోచుకోకపోవడం ఏటా జరుగుతున్న తతంగమే. 2008`09లో 204 లక్షల టన్నులు, 2009`10 లో 153 లక్షల టన్నులు(`26శాతం) 2010`11 208 లక్షల టన్నులు ఆహారధాన్యాల దిగుబడులు వచ్చాయి. ఈ సంవత్సరం లక్ష్యంలో(228లక్షల టన్నులు) 30 శాతం తగ్గుతుందని ప్రభుత్వాధికారులు అంచనా వేస్తున్నారు. కోటి ఎకరాలు సాగు కావలసి ఉండగా నేటికీ 57 శాతం మత్రమే సాగయ్యింది. వరి పంట వాస్తవ సాగు విస్తీర్ణంలో 5వ వంతు మాత్రమే నాట్లు వేశారు. రబ్బీలో వరి పంట వేయకూడదని ప్రపంచబ్యాంకు ఆదేశాలు అమలు చేయాలని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది. ఎన్‌ఎస్‌పి కాలువల నవీనీకరణ పేరుతో రబ్బీ పంటకు ఆంక్షలు పెడుతున్నది. వాస్తవానికి ఖరీఫ్‌కన్నా రబ్బీపంట గ్యారంటీగా పండుతుంది. ఇప్పుడున్న నీటితో ఆరుతడి పంటలు వేసినా ఖరీఫ్‌ నష్టాన్ని కొంత పూడ్చుకోవచ్చు. రుణగ్రస్తులైన రైతులను ఆత్మహత్యలకు పాల్పడకుండా కొంతమేరకు నిరోధించవచ్చు.
    ‘‘మహాభారతంలో కర్ణున్ని వధించడానికి  1.ఇంద్రుడు కవచకుండలాలు తీసుకోవడం 2. నిరంతరం నిరుత్సాహపరుస్తున్న శల్యసారధ్యం 3. యుద్ద రంగంలో భూమిలోకి రథం చక్రం దిగిపోతుందని భూదేవి శపించడం 4. కన్నతల్లి కుంతి అర్జునున్ని చంపకుడదని హామి కోరడం 5. నిరాయుధుడిగా ఉండడం 6. శ్రీ కృష్ణుడు కుట్రతో అధర్మ యుద్దాన్ని ప్రోత్సహించడం. ఆ ఆరు కారణాలు తోడయ్యాయి.’’. అదే విధంగా సాగు నీటి సమస్య, విత్తనాలు, ఎరువులు మరియు క్రిమిసంహారక మందులు, వ్యవసాయ శాఖ, మార్కెట్లు, ఎగుమతి`దిగుమతి సమస్యలు  రైతుల ఆత్మహత్యలకు తోడయినాయి.
    ప్రభుత్వం ఉపకరణాల పంపిణి, రాష్ట్ర జలవిధానం, వ్యవసాయశాఖ పనిమెరుగుదల మరియు మార్కెట్లలో న్యాయమైన ధర లభ్యమయ్యే విధంగా వ్యవసాయవిధానం రూపొందించాలి. ఇందుకు అఖిలపక్ష సమావేశాలను పిలిచి వారి సలహాలతో పాటు నిపుణుల సలహాలను తీసుకొని రానున్న సంవత్సరంలోనైనా వ్యవసాయ ఉత్పత్తుల పెంపుదలకు, ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలని ఆశిద్దాం. శుష్క వాగ్దానాలకు బదులు రైతులకు ఆమోదయోగ్యమైన విధానలను  కొత్త సంవత్సరం కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి.  

సారంపల్లి మల్లారెడ్డి
29.12.2011

No comments:

Post a Comment