Tuesday, 12 August 2014

మారుతున్న కేంద్రప్రభుత్వ విధానం` రైతులకు భారమవుతున్న ఎరువులు

కేంద్ర ప్రభుత్వం 2010 ఏప్రిల్‌ 1 నుండి ఎరువుల అమ్మకం విధానాన్ని మారుస్తూ ‘‘ మూలకాల ఆధారిత సబ్సిడీ ’’ విధానాన్ని రూపొందించి అమలు చేస్తున్నది. కేంద్ర మంత్రిత్వ శాఖ కెమికల్‌ మరియు పర్టిలైజర్స్‌ `ఫైల్‌ నెం.23011/2010 ఎంపిఆర్‌ తేది :16.03.2010 ప్రకారం భాస్వరం మరియు పొటాష్‌ ఎరువులకు ఈ విధానాన్ని వర్తింప చేశారు. ఈ విధానంతో ఎరువులు డి`కంట్రోల్‌ అవుతాయి. అనగా ప్రభుత్వానికి ధరల నిర్ణయం పై ఎలాంటి నియంత్రణ ఉండదు. ఈ విధానానికి ముందు కంట్రోల్‌ ఉండడం వలన ఎరువుల ధరలను కేంద్రం నిర్ణయించి అమలు చేసింది.  ఎరువుల ఉత్పత్తి వ్యయం పెరిగినా, తగ్గినా కేంద్రం నిర్ణయించిన ధరలకు రైతులకు అమ్మాలి. పెరిగిన ధరలను సబ్సిడీల రూపంలో కేంద్రం భరిస్తుంది. మూలకాల ఆధారిత సబ్సిడీ విధానం వలన ఎరువుల బస్తాకు కేంద్రం సబ్సిడీ నిర్ణయిస్తుంది. ఆ సబ్సిడీ పోగా ఎరువుల ఉత్పత్తి వ్యయం పెరిగినపుడు రైతులు భరించాలి. నూతన విధానం అమల్లోకి వచ్చిన తర్వాత కిలో మూలకానికి ఈ విధంగా సబ్సిడీలు నిర్ణయించారు.2010లో నిర్ణయించిన సబ్సిడీలను 2011లో పెంపుదల చేశారు. ఈ సబ్సిడీలు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే నిర్ణయిస్తారు.
   

   సబ్సిడీలను లెక్కించే విధానం :
     ఉదాహరణ :  యూరియా బస్తాపై 46 శాతం నత్రజని ఉంటుందని వ్రాస్తారు. అనగా 50 కిలోల బస్తాలో 23 కిలోల నత్రజని మూలకం మాత్రమే ఉంటుంది. అదేవిధంగా 28:28:0 గ్రోమోర్‌ 50 కిలోల బస్తాలో నత్రజని 14 కిలోలు భాస్వరం 14 కిలోలు మాత్రమే ఉంటుంది. ఈ విధంగా ప్రతి కాంప్లెక్స్‌ ఎరువుల బస్తాపై ఎన్‌.పి.కె, అనగా వరుసగా నత్రజని,భాస్వరం, పొటాష్‌ ఉంటుందని అర్థం చేసుకోవాలి. బస్తాపై నున్న అంకె 100 కిలోలకు నిర్ణయించినది కావడం వలన 50 కిలోల బస్తాకు నిర్ణయించిన అంకెలో సగం మూలకాలు ఉంటాయి. ఉదా : యూరియా 50 కిలోల బస్తాలో 23 కిలోల నత్రజని ఉంటుంది. 2011 సబ్సిడీ ప్రకారం 23I27.48 R632.04 సబ్సిడీ ఇస్తారు. సబ్సిడీ పోగా బస్తా ఉత్పత్తి వ్యయం రైతు భరించాలి. ఈ విధానం వలన ఉత్పత్తి వ్యయం పెరిగినపుడు రైతుపై భారం పడుతుంది. నాఫ్తాతో 50 కిలోల యూరియా ఎరువుల బస్తా ఉత్పత్తి వ్యయం ప్రస్తుతం రు.1750 ఉంది. సబ్సిడీ రు.632 పోగా రు.1118 రైతు భరించాలి. అదే యూరియా గ్యాస్‌తో ఉత్పత్తి చేస్తే, ఉత్పత్తి వ్యయం రు.500 అవుతుంది. అయితే నాఫ్తా, గ్యాస్‌ ఉత్పత్తి వ్యయాలను సగటు చేసి సబ్సిడీ తీసివేసి బస్తా ధర నిర్ణయిస్తారు. ఆ విధంగా ఎరువుల ధరలు అనూహ్యంగా పెరిగాయి.
     ఎరువుల కంపెనీలకు ధరల నిర్ణయంపై స్వేచ్చ కల్పించినందు వలన ఒకే రకమైన కాంప్లెక్స్‌ ఎరువుల ధరలలో ఒకే ధర అమలు లేదు. ఆయా కంపెనీల గుడ్‌ విల్‌ను బట్టి ధరలు నిర్ణయిస్తారు.


   

       2008`09లో ఎరువుల ధరలను భారీగా పెంచడంతో సబ్సిడీ మొత్తం పెరిగింది. దేశీయంగా ఉత్పత్తులను తగ్గించడం వలన దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతున్నాం. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎరువుల ధరలు పెరగడంతో ఆ భారాన్ని భారత రైతాంగంపై మోపుతున్నారు.  లేని ఉత్పత్తిని అధికంగా చూపి సబ్సిడీలు పెద్దఎత్తున అక్రమాలకు గురౌతున్నాయని, సబ్సిడీ ఇవ్వడం వలన విచక్షణా రహితంగా ఎరువులను వినియోగిస్తున్నామని గత విధానాన్ని మార్చి ‘‘మూలకాల ఆధారిత సబ్సిడీ’’ విధానాన్ని రూపొందించాల్సి వచ్చిందని కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది. ఈ ప్రచారంలో వాస్తవంలేదు. ఎరువుల ధరలపై నియంత్రణ ఎత్తివేత ప్రపంచబ్యాంకు ఆదేశితాలే. బహుళజాతి సంస్థలనుండి దిగుమతులు చేసుకున్న సందర్భంగా వారికి దిగుమతి సబ్సిడీలిస్తున్నాం. ముఖ్యంగా ఫాస్పేట్‌, పొటాష్‌ ఎరువులపై నియంత్రణ పూర్తిగా ఎత్తివేసి వీటికి టన్ను దిగుమతికి 612 డాలర్లు సబ్సిడీగా ఇస్తున్నారు. దేశానికి ఏటా 1.3కోట్ల టన్నుల డిఎపి అవసరం కాగా 80 శాతం అమెరికా, చైనా, మొరాకోల నుండి దిగుమతి చేసుకుంటున్నాం.
యూరియా ఉత్పత్తి కేంద్రాల మూత :
    సంస్కరణల ఫలితంగా దేశీయంగా యూరియా ఉత్పత్తి చేస్తున్న 9 కేంద్రాలను మూసివేశారు. వీటి ఉత్పత్తి సామర్థ్యం ఏటా 28.46 లక్షల టన్నులుగా ఉంది. స్వయం సమృద్ధం సాధించవలసిన కీలక ఎరువులను  దిగుమతులపై ఆధారపడడం వలన రైతులపై విపరీతమైన భారం పడుతున్నది.



   
           పోటాష్‌ 100 శాతం దిగుమతి చేసుకుంటున్నాం. ప్రభుత్వ రంగంలోను, సహకార రంగంలోను, ప్రైవేటు రంగంలోను ఎరువుల ఉత్పత్తి జరుగుతున్నది. సంస్కరణల ప్రభావం వలన క్రమంగా పబ్లిక్‌ రంగం, సహకార రంగంలో  కర్మాగారాలను మూతవేయడమో, ఉత్పత్తి పాక్షికంగా తగ్గించడమో జరిగింది. ప్రభుత్వ రంగంలో  ‘‘ నేషనల్‌ ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌, ఫ్యాక్ట్‌ సంస్థలు, సహకార రంగంలో ఇండియన్‌ ఫార్మర్స్‌ ఫర్టిలైజర్స్‌ కంపెనీ( కాండ్ల, పారద్వీప్‌, పూల్‌పూర్‌,) క్రిబ్‌కో, సంస్థలు సంయుక్త రంగంలోను’’ ఎరువుల ఉత్పత్తి జరుగుతున్నది. ప్రైవేటు రంగం ప్రాధాన్యత సంతరించుకున్నాక విశాఖ, కాకినాడ, కాన్పూర్‌, గోవా, మంగళూర్‌, హాల్దియా, పారద్వీప్‌లలో విస్తారంగా కర్మాగారాలు వెలిశాయి. ప్రపంచబ్యాంకు ఆదేశాల ప్రకారం  ప్రైవేటు రంగానికి లాభాలు చేకూర్చి పెడుతున్నారు. రాష్ట్ర శాసనసభలో మూసివేసిన కర్మాగారాలను గ్యాస్‌ ఆధారితంగా ఉత్పత్తి జరుగుటకు వీలుగా పున:ప్రారంభిస్తానని నాటి వ్యవసాయ శాఖా మంత్రి ఎన్‌. రఘువీరారెడ్డి ప్రకటించారు. కానీ ఆచరణలో ఇంతవరకు ఆవైపు కృషిలేదు.
ఉత్పత్తి వ్యయం ఎందుకు పెరుగుతుంది?
    ఎరువుల ఉత్పత్తి నూతన టెక్నాలజీతోనూ,గ్యాస్‌తోనూ ఉత్పత్తి చేయటం ద్వారా ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉంటుంది. క్రిష్ణా`గోదావరి బేసిన్‌లలో గ్యాస్‌ నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. ప్రభుత్వ, సహకార రంగంలో ఎరువుల ఉత్పత్తికి ముందుగానే గ్యాస్‌ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోవాలి. ప్రభుత్వ రంగాన్ని, సహకార రంగాన్ని క్రమంగా నిర్మూలించదల్చుకున్న ప్రభుత్వ విధానాల వల్ల ఎరువుల ఉత్పత్తిపై ప్రైవేటు రంగం ఆధిపత్యం పొందుతున్నది. గ్యాస్‌కు బదులు నాఫ్తాతోనూ, బొగ్గుతోనూ ఉత్పత్తి చేయడం వలన గ్యాస్‌కన్నా 5 రెట్లు అధనంగా ధర పెరుగుతుంది. పైగా ప్రైవేటు సంస్థలు అధిక లాభాలను కోరి ధరలు ప్రతియేటా పెంచుతున్నారు. దేశీయ అవసరాలకు సరిపోను ఎరువుల మూలకాలు భారతదేశంలో పుష్కలంగా ఉన్నాయి. వాటిని వినియోగంలోకి తేవాల్సిన చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు.
మిక్సింగ్‌ ప్లాంట్ల మాయాజాలం :
    దేశీయంగా ఇప్పటికే గుర్తింపు పొందిన బ్రాండెడ్‌ మిక్సింగ్‌ ప్లాంట్లు ఉన్నాయి. ఈ ప్లాంట్లు ఎరువుల మూలకాలను ప్రభుత్వం నుండి ఉత్పత్తి ధరకు కొనుగోలు చేసి వాటిని వివిధ పాళ్ళలో మిక్సింగ్‌ చేసి ప్రభుత్వం నిర్ణయించిన ధరలపై అమ్మి మిగిలిన ఉత్పత్తి వ్యయాన్ని ప్రభుత్వం నుండి సబ్సిడీల రూపంలో పొందుతున్నారు. ఉదా: 28:28 గ్రోమోర్‌,20:20:0 ఫాక్ట్‌, 17:17:17 మరియు 19:19:19 లతోపాటు 15:15:15లు అమ్మకాలు సాగుతున్నాయి. ఇవి ఉండగానే ఆంధ్రప్రదేశ్‌లో  17 మిక్సింగ్‌ ప్లాంట్‌లు కొత్తగా వెలిశాయి. కేంద్రప్రభుత్వం పై బ్రాండెడ్‌ కంపెనీలకు ఇవ్వాల్సిన కోటాలో 50వేల టన్నులు తగ్గించి రాష్ట్ర మిక్సింగ్‌ ప్లాంట్‌లకు సబ్సిడీలేని ఎరువులు కేటాయించింది. ఈ ఎరువులతోపాటు రాష్ట్ర సహకార రంగం ద్వారా అమ్మకానికి వచ్చిన సబ్సిడీ ఎరువులను వక్రమార్గాల ద్వారా ఈ కంపెనీలకు సరఫరా చేశారు. ఈ మిక్సింగ్‌ ప్లాంట్లు తిరిగి కాంప్లెక్స్‌ ఎరువులను అమ్మెటప్పుడు మరల ప్రభుత్వం నుండి సబ్సిడీ పొందుతున్నారు. ఆ విధంగా రెండుసార్లు సబ్సిడీ పొంది  లాభాలు గడిస్తున్నాయి. ఈ కంపెనీలు అధిక లాభాల నాశించి నాణ్యతలేని ఎరువులను రైతులకు అంటగడుతున్నారు. పైగా గరిష్ట ధర నిర్ణయించి బస్తాకు రు.100కుపైగా అదనపు లాభం సంపాదిస్తున్నారు. వీరి వద్ద నుండి వ్యవసాయశాఖ సేకరించిన నమూనాలను ప్రయోగశాలల్లో పరీక్షించగా నాణ్యతలేని విషయం తేటతెల్లమైనప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ కంపెనీల యజమానులు పాలకులకు ఆప్తులు కావడమే కారణం. వారి వద్ద సబ్సిడీ ఎరువులు పట్టుబడినా ఎలాంటి చర్యలులేవు.
ఎరువుల కొరత ఎందుకు?
    అంతర్జాతీయ మార్కెట్‌లో ఎరువుల ధరలు పెరిగినపుడు దాని ప్రభావం దిగుమతులపై ఉంటుంది. కేంద్రం తగినంత సబ్సిడీ ఇవ్వకపోవడం వలన దిగుమతిదారులు వ్యాపారం చేయడానికి ముందుకు రానపుడు కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది అరుదుగా వచ్చే సమస్య. కానీ మరో రెండు కారణాలు ఎరువుల కొరతను సృష్టిస్తున్నాయి.
1. రాష్ట్రాలకు నెల వారిగా నిర్ణయించిన కోటాల సరఫరాలో అవకతవకలు చోటుచోసుకొని రాజకీయ ఒత్తిడికి లొంగి కేంద్రం ఒక రాష్ట్రానికి కేటాయించిన ఎరువులను మరొక రాష్ట్రానికి తరలించినపుడు కొరత ఏర్పడుతుంది.
2. అదనపు లాభాలు పొందడానికి ఎరువుల వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తారు. ఇది సహజంగా ప్రతి ఏటా జరుగుతున్నది. వ్యవసాయశాఖ ఎక్కడ ఎంత నిలువలున్నాయో, తన వద్దనున్న సమాచారం తెలుసుకొని సక్రమ పంపిణీ చేయడంలో వైఫల్యం ఉన్నందున ఈ కొరతను వ్యాపారులు లాభాల రూపంలోకి మార్చుకుంటారు. వ్యవసాయశాఖ, ప్రైవేటు వ్యాపారుల తమ మధ్యగల పరస్పర అవగాహన వలన ఈ కృత్రిమ కొరత కొనసాగుతున్నది.
ఎరువుల వినియోగాన్ని తగ్గించడం ఎలా?
    విచక్షణా రహితంగా ఎరువులను వినియోగిస్తున్నారని ఎరువుల వినియోగాన్ని తగ్గించాలనిఎరువుల సబ్సిడీ విధానాన్ని మార్చినట్టు కేద్రం ప్రకటించింది. ప్రస్తుతం నత్రజని: భాస్వరం: పొటాష్‌ వినియోగం 4:2:1 గా ఉండాలి. కానీ ఒక్కో సారి ఈ నిష్పత్తులలో విపరీతమైన మార్పు సంభవించి 8:2:1 గా ఉంటున్నది. అనగా నత్రజని వినియోగం పెరుగుతున్నది. సంస్కరణల ఫలితంగా భూసార పరీక్షా కేంద్రాలు పనిచేయకపోవడం వలన, మారుతున్న భూసార విధానాన్ని పరీక్షించకుండానే ఎరువులను వినియోగిస్తున్నారు. వ్యవసాయ శాఖ భూసార పరీక్షలు చేసి ఏ ఎరువుల ఎంత మోతాదులో వాడాలో రికమండేషన్‌ చేస్తే ఆ విధంగానే ఎరువుల వినియోగిస్తారు. ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించడం వలన ఎరువుల వినియోగం పెరిగిన మాట వాస్తవం. భారతదేశంలో  ఎరువుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రధమ,లేదా ద్వితీయ స్థానంలో ఉంది. అలాంటి రాష్ట్రంలో భూసార పరీక్షలు జరిపి ఎరువుల వినియోగానికి తగిన సలహాలు ఇచ్చేవిధంగా పనిలో వ్యవసాయశాఖ ఉండాలి.
రాష్ట్రంలో ఎరువుల వినియోగం(లక్షల టన్నులలో) :

వ్యవసాయ శాఖ ప్రతి సంవత్సరం తన వార్షిక ప్రణాళికలో ఏ నెలలో ఏజిల్లాకు ఏ ఎరువులు సరఫరా చేస్తున్నది ప్రణాళిక రూపొందిస్తారు. కానీ ప్రణాళిక కాగితాలకే పరిమితం తప్ప అమలుకు నోచుకోదు. అందువలన ఎరువుల కొరకు రైతులు ప్రతిఏటా ఆందోళనకు గురౌతున్నారు. వారికి కావలసిన ఎరువుకు అవసరంలేని ఎరువును పోటిపెట్టి అమ్మడం  జరుగుతున్నది. కొన్ని సందర్భాలలో ‘‘స్లిప్పులు’’ ఇవ్వడంతో రైతులలో ఒత్తిడి పెరిగి ఆందోళనకు గురౌతున్నారు. 2008 జూలై, ఆగస్టులలో ఎరువుల కొరకు వెళ్లి తొక్కిసలాటలో4 గురు రైతులు మరణించారు.
1. పల్లె ఉప్పలయ్య, స్టేషన్‌ గణపురం,     30,07,2008,
2. గంగాధర్‌, మేడిపల్లి కరీంనగర్‌,     01.08.2008,
3. తోకల సింగయ్య, బొడ్డురాయిసెంటర్‌,పెదనందిపాడు, గుంటూరు,  30.08.2008,
4. బత్తుల సైదులు,నెహ్రూనగర్‌ ఇల్లందు,ఖమ్మం,29.08.2008
    వీరంతా సన్నకారు రైతులే. కనీసం వీరికి ఎక్స్‌గ్రేషియో కూడా ఇవ్వలేదు.
సేంద్రియ ఎరువుల వినియోగం :
 రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రియ ఎరువుల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు పెంచవచ్చని కొందరు సలహాలిస్తున్నారు. జనాభా ఏటా 1.9 శాతం పెరుగుతున్నది. ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున 1.7 శాతంగా ఉంటున్నది. నేటి దేశ జనాభా 121 కోట్ల మంది ప్రజలకు కనీస ఆహారధాన్యాలు 26 కోట్ల టన్నులు అవసరం. కానీ మన ఉత్పత్తి నేటికీ 22 లేదా 23 కోట్ల టన్నులు దాటడం లేదు. ఫర్టిలైజర్స్‌ పాలసీ 2000`2025 ప్రకారం 2020`25 నాటికి 145 కోట్ల జనాభాకు 30.1 కోట్ల ఆహార ధాన్యాలు అవసరం. 1994`95 గణాంకాల ప్రకారం చైనా 309కిలోల ఎన్‌పికె ఎరువులు ఒక హెక్టారుకు వినియోగిస్తుండగా భారతదేశం 73 కిలోలు మాత్రమే వినియోగిస్తున్నారు. నేటికి అదే దామాషాలో పెరుగుదల ఉంది. అందు వలన ఎరువుల వినియోగం పెరగాల్సి ఉంది. సేంద్రియ ఎరువులు వినియోగించినా రసాయనిక ఎరువుల వినియోగం తప్పనిసరి. పశు సంపద తగ్గడంతో పచ్చిరొట్ట, వర్మి కంపోస్టు లాంటివి శాశ్విత ప్రాతిపాదికన ఏర్పాటు చేయడం సన్న, చిన్న కారు రైతులకు, కౌలు దారుకు గిట్టుబాటు కాదు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులను గమనించకుండా చేస్తున్న ప్రచారం ఆచరణలో ఉత్పత్తిని, ఉత్పాదకతను తగ్గిస్తున్నది.
బయో ఫర్టిలైజర్స్‌ వినియోగం :
    పై ఎరువులకు తోడుగా కాల్షియం, సల్ఫర్‌( గంధకం), జింక్‌, జిప్సం, బోరోన్‌, మాంగనీసు, ఐరన్‌, కాపర్‌, మెలాడినం ఎరువులను భూసారాన్ని బట్టి వినియోగించాలి. బయోఫర్టిలైజర్స్‌ అయిన రైజోబియం కల్చర్‌, పిఎస్‌బి కల్చర్‌ లను వనియోగించాలి. నాణ్యతలేని బయోఫర్టిలైజర్స్‌ను పెద్దఎత్తున మార్కెటింగ్‌ చేసి రైతులను దివాళా తీయిస్తున్నారు. వీటి నాణ్యతను పరిశీలించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టనందువల్ల రకరకాల పేర్లతో మార్కెట్లలో అనేక రకాల బయో ఎరువుల అమ్మకాలు సాగుతున్నాయి. ధరలపై నియంత్రణ లేదు. రాష్ట్రంలో 17.24 లక్షల ఎకరాల చవిటి నేలలున్నాయి.  వీటికి రాష్ట్రప్రభుత్వం 50 శాతం సబ్సిడీపై జిప్సం సరఫరా చేస్తుంది. పంటను బట్టి హెక్టారుకు 500కిలోల నుండి 5 మెట్రిక్‌ టన్నులు వేయాలి.
ఎరువుల నాణ్యతా పరీక్షలు :
    1985 ఫర్టిలైజర్స్‌ కంట్రోల్‌ ఆర్డర్‌ క్లాసు 30 ప్రకారం వ్యవసాయశాఖ వారు వ్యాపారుల నుండి ఎరువుల శాంపిల్స్‌ సేకరించి 7 రోజులలో పరీక్షలు జరిపించాలి. నిర్ణీత ప్రమాణాలు లేనివాటిని మార్కెట్‌నుండి బహిష్కరించి డీలర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో 5 ఫర్టిలైజర్స్‌ క్వాలిటీ కంట్రోల్‌ పరిశోధనా కేంద్రాలు( రాజేంద్రనగర్‌` (ఎన్‌జిరంగా యూనివర్సిట)ీ, అనంత పురం, తాడేపల్లిగూడెం (ప.గో) వరంగల్‌, బాపట్ల` (గుంటూర్‌)లలో ఉన్నాయి. కానీ వీటి పని సంతృప్తికరంగా లేకపోవుటచే నాణ్యతలేని ఎరువుల అమ్మకాలు పెద్దఎత్తున సాగుతున్నాయి.
డిమాండ్స్‌ `
1. మూలకాల ఆధారిత సబ్సిడీ విధానాన్ని తొలగించాలి.
2. అవసరాలకు తగినంత ఎరువుల ఉత్పత్తి దేశంలోనే చేయాలి.దిగుమతులపై ఆధారపడరాదు.
3. పెరిగిన ధరలకు అనుగుణంగా వ్యవసాయ ఉత్పతుల కనీస మద్దతు ధరలు పెంచాలి.
4. నాణ్యత లేని ఎరువుల అమ్మకాలు జరిపిన డీలర్లపై చర్యలు తీసుకుంటూ రైతుకు పరిహారం చెల్లించాలి.
5. బయోఫర్టిలైజర్స్‌ నాణ్యతా ప్రమాణాలు మరియు ధరలపై నియంత్రణను కొనసాగించాలి.
6. అవసరమైన ఎరువులను మండల, జిల్లా స్థాయిలలో నిలువ పెట్టాలి.
7. భూసార పరీక్షలు జరిపి వినియోగించాల్సిన ఎరువుల మోతాదును రైతుకు తెలియపర్చాలి.
8. మిక్సింగ్‌ ప్లాంట్లపై నియంత్రణ ఉండాలి.
9. సహకార సంస్థలు, మార్కెట్‌ యార్డుల ద్వారా ఎరువులను అమ్మించాలి. బ్లాక్‌ మార్కెట్‌కు అవకాశం కలిగించరాదు.
10. జిల్లా, మండల స్థాయిలలో అఖిలపక్ష సమావేశాలు వేసి ఎరువుల పంపిణీ విధానాన్ని సమీక్షించాలి.

No comments:

Post a Comment