Monday, 11 August 2014

దళితులకు ఎన్నికల ప్రణాళికలు అమలు జరుగుతున్నాయా ?

    2009లో జరిగిన 15వ లోక్‌సభ ఎన్నికలు, 13వ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వచ్చాయి. ఎన్నికలకు ముందు పాలకవర్గ పార్టీలు ప్రణాళికలు ప్రకటించాయి. ఆ ప్రణాళికలలో దళితులు, గిరిజనుల అభివృద్ధికి ప్రాధాన్యత యిచ్చారు. ఎన్నికల అనంతరం దళితుల - గిరిజనుల అభివృద్ధికి యిచ్చిన హామీలు జరపడంలో ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినా దళితులు - గిరిజనుల ఓట్లను రాబట్టడానికి ఎత్తులపై ఎత్తులు వేసి ప్రలోభపెట్టి వారి ఓట్లతో అధికారానికి వస్తున్నారు. కొద్దిమందికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో మంత్రి పదవులు కూడా యిచ్చారు. అటు ప్రభుత్వాలు కాని, యిటు మంత్రిపదవులు పొందినవారు కానీ వీరి సంక్షేమం గురించి అంతగా పట్టించుకోలేదు. చివరకు వారికి కేటాయించిన బడ్జెట్‌ కూడా విడుదల చేయకుండా  మురగపెట్టడమో లేక యితర పద్దులకు మళ్ళించడమో జరిగింది. నేటికీ అంటరానితనం, అవిద్య, అనారోగ్యం, గూడులేనితనం వీరిని వెన్నాడుతూనే వున్నాయి. దారిద్య్రానికి మారుపేరుగా యీ వర్గాలు మురికివాడల్లో నివాసాలు వెల్లదీస్తున్నాయి.
    ఆరు దశాబ్ధాలు గడచినా దళిత గిరిజన సంక్షేమాభివృద్ధిలో యెలాంటి మార్పులూలేవు. స్వాతంత్య్రానంతరం దారిద్య్ర రేఖకు దిగువన 45శాతం ప్రజలుండగా, నేడు 15శాతానికి తగ్గినట్లు రాష్ట్ర ఎకనమిక్‌ సర్వే తెలియజేస్తున్నది. కానీ, దళిత జనాభాలో మాత్రమే గణాంకాలు పరిశీలించినప్పుడు స్వాతంత్య్రానంతరం దళితులలో ఐదారు శాతానికి మించి అభివృద్ధి జరగలేదు. విద్యాభివృద్ధికి, ఉపాధి కల్పనకు అనేక పథకాలు పెట్టినా, రిజర్వేషన్లు అమలు జరిపినా ‘‘ఎక్కడవేసిన గొంగళి అక్కడే ’’ అన్న చందంగా వుంది.  క్రిమిలేయర్‌ విధానాన్ని అనుసరించాలంటూ ఒకే కుటుంబానికి ఒకరికే ఒకసారి మాత్రమే ఉపాధి కల్పించాలన్న సిద్ధాంతం పాటించాలంటున్నారు.  ఒక విధంగా ఈ సూత్రం అమలుజరపడమంటే  దళితుల అభివృద్ధిని నిరాకరించడమే. ఎన్నికల అనంతరం దళితుల అభివృద్ధికి జరుగుతున్న కృషిని సమీక్షించడానికి శాసనసభలలోగానీ, పార్లమెంట్‌లో గానీ నేటి వరకు యేనాడూ సమీక్షలు జరపలేదు. జరపాలన్న లక్ష్యం కూడా ప్రభుత్వాలకు లేదు. ఎన్నికలకు ముందున్న ఉత్సాహం ఎన్నికల అనంతరం పాలకులు ప్రదర్శించడంలేదు.
    2008-09 సంవత్సరానికి దళితుల సంక్షేమానికి ఆ శాఖనుండి రు. 2800 కోట్ల బడ్జెట్‌కు డిమాండ్‌ చేయగా, రు. 2200 కోట్లు మాత్రమే కేటాయించారు. కానీ, రు. 1700 కోట్లు మాత్రమే విడుదల చేశారు. ఈ నిధులతో దళిత సంక్షేమం జరుగుతుందా? యేటా జరుగుతున్నదిదే !. బడ్జెట్‌లోను, యితర అన్ని కేటాయింపులలోను స్పెషల్‌ ఎకనమిక్‌ కాంపోనెంట్‌ పేరుతో 15శాతం నిధులను కేటాయించాలని కేంద్ర ప్రణాళికా బోర్డు ఆమోదం తెలిపింది. ఈ కాంపోనెంట్‌ క్రింద కేటాయించిన నిదులు వాస్తవంగా నేటివరకు యీ వర్గాలకు యేం చేస్తే ప్రస్తుతమున్న స్థితికన్నా వీరి అభివృద్ధిలో కొంతమార్పు వచ్చేది. కానీ యీ నిధులను కూడా దారి మళ్ళిస్తున్నారు.  ఒక ఆంధ్రప్రదేశ్‌లోనే రు. 20వేల కోట్లు నేటివరకు దారిమళ్ళాయంటే దేశంలో ఎన్నివేల కోట్లు దారి మళ్ళాయో అర్థం చేసుకోవచ్చు. చట్టబద్ధంగా కేటాయించిన యీ నిధులను దారిమళ్ళిస్తుంటే ఎన్నికైన ప్రజా ప్రతినిధులు యేం చేస్తున్నట్లు? కనీసం దళిత, గిరిజన ప్రజా ప్రతినిధులు కూడా యీ అంశంపై ప్రభుత్వాలను నిలదీయలేకపోతున్నారు. వీరి సంక్షేమానికి వేల కోట్లు కేటాయిస్తున్నామన్న ప్రభుత్వ వాదనలు యీ విధంగా వున్నాయి.
    రాజ్యాంగంలో హక్కులు కల్పించినా అవి అమలుకు నోచుకోలేదు. వీరి కొనుగోలు శక్తి పెరగడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రకటించాయి. అయినా ‘‘ఎక్కడవేసిన గొంగళి అక్కడే’’ అన్నట్లుగా వుంది. కొన్ని ఆకర్షనీయ పథకాలను ప్రకటించి తాత్కాలిక ప్రయోజనం మాత్రమే కల్పిస్తున్నారు. దీర్ఘకాలికంగా వీరి అభివృద్ధికి నేటి వరకు యేఒక్క పథకం అమలు చేయలేదు. ప్రధానంగా భూ పంపిణీ సమస్య అలాగే వుంది. 1973లో భూ సంస్కరణల చట్టం వచ్చినా నేటికీ యీ వర్గాలు నాల్గు రాష్ట్రాల మినహా ఎక్కడా యీ వర్గాలకు భూ పంపిణీ జరగలేదు. చట్టవిరుద్ధంగా నేటికీ లక్షలాది ఎకరాలు కల్గిన భూస్వాములు కొనసాగుతున్నారు. చట్టవిరుద్ధంగా ప్రభుత్వాలు వీరికి అండగా వుంటున్నాయి. పట్టణ భూ పరిమితి చట్టాన్ని ఆంధ్రప్రదేశ్‌లో రద్దుచేశారు. గ్రామీణ భూ పరిమితి చట్టాన్ని కూడా రద్దుచేసే ఆలోచన కొనసాగుతుంది. ప్రత్యేక ఆర్థిక మండళ్ళకు భూ సేకరణకు చట్టాన్ని మార్చాల్సిన అవసరంవుందని వాదిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం నుండి భూ పంపిణీ జరగడానికి బదులు పేద, దళిత, గిరిజనుల నుండి ప్రభుత్వమే బలవంతంగా భూ సేకరణ చేస్తుండగా కొద్దీగొప్పా ఆస్తులున్న వారు వీధిపాలవుతున్నారు. వీరివద్ద నుండి సేకరించిన భూమిని రియల్‌ ఎస్టేట్‌ల పరంచేసి ధనిక వర్గాలు వేలకోట్ల ఆదాయాన్ని సంపాదిస్తున్నారు.
    ఆంధ్రప్రదేశ్‌లో 13.67 లక్షల దళిత కమతాలకు 28 లక్షల ఎకరాల భూమి మాత్రమే వుంది. 2004 నుండి 2009వరకు రాష్ట్ర ప్రభుత్వం 5.77లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేయగా, అందులో దళితులకు యిచ్చినది కొద్దిమాత్రమే. 2006-07 సంవత్సరాన్ని పరిశీలిస్తే 1.30లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేయగా అందులో 30వేల ఎకరాలు మాత్రమే దళితులకు పంపిణీ చేశారు. దళితులకు, గిరిజనులకు పంపిణీ చేసిన ప్రభుత్వ భూమి యేడాది తిరగకముందే దాదాపు 50శాతం భూమి తిరిగి భూస్వాముల ఆదీనంలోకి వస్తున్నది. అసైన్డ్‌ భూములను కొనగూడదన్న నిబంధనలను అతిక్రమించి దళితుల భూములను నయానో, బయానో కొనుగోలు చేస్తున్నారు. లేదా ప్రజా ప్రయోజనాల పేరుతో స్వాధీనం చేసుకుంటున్నారు. ఒకవైపున భూ పంపిణీ జరుగుతున్నట్లు రికార్డులలో చూపుతూనే మరోవైపున అదే భూమిని తిరిగి ధనికులు తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటున్నారు.
    గిరిజనులకు 8.63లక్షల కుటుంబాలకు 29.30 లక్షల ఎకరాల సాగుభూమి మాత్రమే వుంది. మొత్తం రాష్ట్రంలో 115 లక్షల కమతాలకు 355లక్షల ఎకరాల భూమి సాగులోవుంది.  ఈ సాగు భూమిలో దళితులు, గిరిజనుల భాగస్వామ్యం ఎంతవుంది?
    దళితులు - గిరిజన వర్గాలలో విద్యాభివృద్ధిచేసి వారికి ఐ ఎ ఎస్‌ లాంటి సివిల్‌ పరీక్షలలో ఉత్తీర్ణులు కావడానికి ప్రభుత్వమే ట్రైనింగ్‌ క్లాసులు పెట్టి ఉద్యోగ వసతులు కల్పిస్తామన్నారు. ప్రభుత్వ ట్రైనింగ్‌కు ఎందరు ఎంపికయ్యారో కానీ స్వంతంగా చదువుకొని అర్హతకల్గినవారూ నేటికీ దేశంలో లక్షల సంఖ్యలో నిరుద్యోగులగా వీరి కొరకు కేటాయించిన ఉద్యోగాలు ఖాళీగా వున్నాయి. బ్యాక్‌లాగ్‌ పోస్టుల నియామకం పేరుతో యేటా ప్రకటనలు చేస్తున్నారేగానీ అర్హులున్నప్పటికీ వీరి స్థానాలను భర్తీచేయడంలేదు. నిరుద్యోగం వీరితోపాటే కొనసాగుతున్నది.
   
    2009 ఎన్నికలకు ముందు డీ-లిమిటేషన్‌ చట్టంలో మార్పులు తెచ్చారు. ఈ మార్పుల ఫలితంగా రాష్ట్రంలో  ఎస్సీ స్థానాలను 36 నుండి 48కి మరియు ఎస్టీ స్థానాలను 15 నుండి 19కి పెంచారు. పార్లమెంట్‌ స్థానాలలో ఎస్సీ స్థానాలను 6 నుండి 7కు మరియు ఎస్టీ స్థానాలను 2 నుండి 3కి పెంచారు. స్థానాల పెంపకంతో పోటీచేసేవారిని సంతృప్తిపర్చవచ్చునేమోగానీ సంఖ్య పెరగడంతో యీ వర్గాల ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయన్న ఆశ కనబడటంలేదు.
    పార్లమెంట్‌లో కూడా యీ స్థానాలను పెంపుదలచేశారు. గతంలో 79 ఎస్సీ స్థానాలు వుండగా అవి 84కి పెరిగాయి. అలాగే ఎస్టీ స్థానాలు 41 నుండి 47కి పెరిగాయి. ఈ పెరిగిన స్థానాలలో సింహభాగం స్థానాలను బిజెపీ, కాంగ్రెస్‌లు గెల్చుకున్నాయి. 1998లో జరిగిన 12వ లోక్‌సభ ఎన్నికలలో బిజెపీ 24 ఎస్సీ, 14 ఎస్టీ స్థానాలను సంపాదించగా, కాంగ్రెస్‌ 14 మరియు 18లు మాత్రమే గెల్చింది. 1999లో జరిగిన 13వ లోక్‌సభలో బిజెపీ 25 ఎస్సీ, 21 ఎస్టీ స్థానాలను గెలిపొందగా, కాంగ్రెస్‌ 7 మరియు 9 స్థానాలను మాత్రమే గెలిపొందింది. 2004 లోక్‌ సభ ఎన్నికలలో బిజెపీ 18 ఎస్సీ, 15 ఎస్టీ స్థానాలను గెలుపొందగా, కాంగ్రెస్‌ 14 మరియు 14 స్థానాలే గెలిపొందింది. సింహభాగం యీ స్థానాలను బిజెపీ గెలిపొందింది. అయినప్పటకీ దళిత, గిరిజనుల సమస్యలు పరిష్కారం కాలేదు.
    అందరికీ ‘‘గూడు’’ ఐదేండ్లలో పూర్తిచేస్తామంటూ ఎప్పటికప్పుడు ఎన్నికల ముందు ప్రకటిస్తున్నారు. దశాబ్ధాలు గడిచినా యిండ్లు లేనివారి సంఖ్య పెరుగుతూనే వుంది. మురికివాడలే వీరికి నివాస ప్రాంతాలుగా వున్నాయి. ఈ మధ్య ప్రభుత్వ విధానాల ఫలితంగా జరుగుతున్న పట్టణీకరణలో ఎక్కువమంది యీ వర్గాల వారు గ్రామీణ ప్రాంతాలనుండి పట్టణ ప్రాంతాలకు తరలివస్తున్నారు.  పట్టణాలలో వీరి స్థితి అత్యంత అద్వాన్నంగా వుంది. త్రాగునీటికి, ఆరోగ్యానికి, విద్యకు దూరమై జీవిస్తున్నారు. పట్టణాలలో ఖాళీగా వున్నచోట తాత్కాలికంగా గుడిసెలు వేసుకోవడం  ప్రభుత్వంలేదా ఆ భూ యజమాని తొలగించగానే మరో చోటకు వెళ్ళి గుడిసెలు వేసుకోవడంతోనే వీరి బ్రతుకు సంచార జీవుల బ్రతుకుగా మారింది. నేటికీ గ్రామీణ ప్రాంతాలలో 90శాతం మంది జీవిస్తున్నారు. వీరి పరిస్థితి అత్యంత దీనంగానే వుంది. ఇండ్ల నిర్మాణ పథకాలన్నీ పాలకుల బందు మిత్రులకు యిస్తున్నారు. అర్హతగల దళిత, గిరిజనులు నిర్లక్ష్యానికి గురవుతున్నారు. రేషన్‌కార్డులు- అంత్యోదయ పథకం, పెన్షన్లు, ఆరోగ్యశ్రీ అర్హులకు రాలేదు. మన కూలీలకు ఏవీ వర్తించవు.
    నేటికీ భిక్షాటన సాగుతూనేవుంది. ఆంధ్రప్రదేశ్‌ భిక్షాటన నివారణా చట్టంలోని 11 (1) క్రింద బాల భిక్షుకుల కోసం వర్క్‌ సెంటర్లను ప్రారంభించారు. ఒక్కో సెంటర్‌లో 50మంది చొప్పున రాష్ట్రంలో 15 బాల భిక్షుకుల సదనాలు వున్నాయి. అనగా 750 మందికి మాత్రమే యీ సదనాలు సక్రమంగా పనిచేస్తే ఉపయోగపడతాయి. మరి యింకా రోడ్లపై తిరుగుతున్న బీద పిల్లల సంక్షేమం కోసం చేపట్టిన చర్యలేమి? ప్రభుత్వం అనాధ సదనాలను, విముక్తి హాస్టళ్ళను విలీనం చేసి వాటికి ఆనంద నిలయాలు అనే పేరుపెట్టారు. ఈ ఆనంద నిలయాలు రాష్ట్రంలో 79 వున్నాయి. ఒక్కో సదనంలో 50 మందికి మాత్రమే ప్రవేశం వుంటుంది. ఈ సదనాల వల్ల మూల సమస్య భిక్షాటన, వెట్టి చాకిరీలు విముక్తి అవుతున్నాయా? వెట్టి చాకిరీ కార్మికులకు పునరావాసం కల్పించడానికి 25-10-1976న చట్టం తెచ్చారు. ఆ చట్టం క్రింద తక్షణ సహాయంగా విముక్తిచేసిన వ్యక్తికి రు. 1000లు యిస్తారు. తర్వాత అతనికి పునరావాసం కల్పించాలి. దీనికి  జిల్లా స్థాయిలో జిల్లాకలెక్టర్‌ ఛైర్మన్‌గా, జాయింట్‌ కలెక్టర్‌, ప్రాజెక్టు డైరెక్టర్‌ (డిఆర్‌డిఏ), ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఎస్సీ సొసైటీ) మరియు డిప్యూటీ డైరెక్టర్‌ సాంఘిక సంక్షేమం కన్వీనర్‌గా వెట్టిచాకిరీ నుండి విముక్తిపొందినవారికి సహాయ పునరావాసం కల్పించాలని కమిటీ వేశారు. ఈ కమిటీ 09-06-1997న ఏర్పడిరది. అట్టహాసంగా వేసిన యీ కమిటీ ప్రచారానికే తప్ప అమలు జరుగుటలేదు. ప్రధానంగా వెట్టిచాకిరీలో మగ్గుతున్నవారికి పునరావాసం క్రింద రు. 10 వేల నుండి 20వేలకు ప్రభుత్వం 08-08-2000న పెంచింది. ఈ పెంచిన నిధులు కూడా విముక్తి పొందినవారికి అందడంలేదు. వెట్టిచాకిరీని నిర్మూలించాలన్న చిత్తశుద్ధి పాలకులకు లేదు.  జిల్లాల్లో వేలాదిమంది నేటికీ కడు హీన స్థితిలో వెట్టిచాకిరీ కబంధహస్తాలలో కొనసాగుతూనేవున్నారు. ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? అనంతరం ఏం జరుగుతున్నది? దళితులను దారిద్య్రవిముక్తుల్ని చేయడానికి ఆరు దశాబ్ధాల కాలం అవసరమా?  ప్రజా ప్రతినిధులకు రిజర్వేషన్‌ కల్పించానా ఆ రిజర్వేషన్‌ స్థానాల్లో ఎన్నికైనవారు యీ సమస్యలను సభలలో చర్చకు తెస్తున్నారా? శాసన, లోక్‌సభలలో జరుగుతున్న చర్చలను పరిశీలిస్తే దళిత, గిరిజన అభ్యుదయానికి చర్చిస్తున్న సమయమెంత? చర్చించే సమయంలో  న్యాయంగా రిజర్వేషన్‌ ప్రకారమైనా 19శాతం సమయాన్ని కేటాయించాలి. ఏ సభను పరిశీలించినా ఆ విధంగా కేటాయింపులు జరగడంలేదు. పైగా, రిజర్వేషన్‌లలో గెలిచినవారు కూడా వీటిపై కేంద్రీకరించడంలేదు.
    సమాజానికి మచ్చగా వున్న జోగిని/ బసవి వ్యవస్థ నేటికీ కొనసాగుతుండటం అత్యంత దుర్మార్గం.  ఈ వ్యవస్థ రద్దుకు ఆంధ్రప్రదేశ్‌ దేవదాసిల (నిషేధం, అంకితం) చట్టం 1988లో చేశారు. ఆ చట్టం క్రింద పునరావాసంగా రు. 20వేలులో రు. 10వేలు సబ్సిడీగా యివ్వాలని నిర్ణయించారు. ఈ వ్యవస్థ రద్దుకు చట్టం కావాలా? వారిని విడిగానే ఆ వ్యవస్థలోనే కొనసాగేటట్టుచేసి వారికి ఆర్థిక సహాయం చేయాలా? ఈ దుర్మార్గపు వ్యవస్థ కొనసాగింపుకు బాధ్యులైనవారిపై కఠినచర్యలు తీసుకోవడం సాధ్యంకాదా ?
    వృద్ధులకు, అశక్తులకు, అనాధలకు ఆశ్రమాలు ఏర్పాటుచేసి ఒక్కో ఆశ్రమంలో 75 మందికి అవకాశం కల్పించారు. నామమాత్రంగా పెట్టిన యీ సదనాలు ఎన్నివేల మందిని సంరక్షిస్తున్నాయి ?
    విద్యాభివృద్ధికి, ఆరోగ్యాభివృద్ధికి తిండి, బట్ట, ఇళ్ళు తదితర కనీసావసరాలకు నోచని కుటుంబాలు ఎన్ని వున్నాయి? వారికి కేటాయించిన ప్రభుత్వ పథకాలు ఎంత మందిని దారిద్య్ర రేఖ నుండి ఎగువకు తెచ్చాయి ? బడ్జెట్‌లో కేటాయింపులు చేసినా విడుదల చేయకుండా ఎక్కడవేసిన గొంగళి అక్కడేలా యీ వర్గాలను కొనసాగిస్తున్నారు. అనేక షెడ్యూల్డు కులాల ఆర్థిక సహాయ సంస్థలను, గిరిజన కులాల ఆర్థిక సంస్థలను ఏర్పాటుచేసినా యింతవరకు 10శాతం కుటుంబాలను కూడా అభివృద్ధిలోకి తేలేకపోయాయి. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ శాఖలకు నిర్ణయించిన రాష్ట్ర, కేంద్ర మంత్రులు కూడా తమ బాధ్యతను అమలుచేయడానికి వెనుకాడుతున్నారు. ప్రధాని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే వారు తమ పథకాలను అమలుజరుపుతున్నారు. రాష్ట్ర, కేంద్ర కేబినెట్‌ సమావేశాల్లో కూడా వీరి సమస్యలు చర్చకు రావు.
    స్థానిక సంస్థలకు, శాసనసభలకు, పార్లమెంట్‌కు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే యీ వర్గాలు గుర్తుకువస్తాయి. ఈ వర్గాల ఓట్లను సంపాదించడానికి సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగిస్తున్నారు. వీరికి రిజర్వ్‌చేసిన నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలను నిర్ణయించే బాధ్యతను అగ్రకులాలే తీసుకుంటున్నాయి. వారే పెట్టుబడులు పెట్టి, గెలిపించుకొని తమ విధానాలను అంగీకరించేవారిగా తయారుచేస్తున్నారు. ఎక్కడైనా, ఎవరైనా వాస్తవాలు చర్చిస్తే  అతనిని పార్టీనుండి తొలగించడం లేదా ప్రజాప్రతినిధిగా ఎన్నికకాకుండా చూడటం పరిపాటిగా జరుగుతున్నది. కనీస చట్టాలను అమలుచేసినా యీపాటికి (ఆరు దశాబ్ధాలకాలం) దళితులు, గిరిజనులు కొంతమేరకు అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగి సమాజంలో ఒకరుగా వుండడానికి అవకాశం వుంది.  ఆ వైపు చర్యలు తీసుకోవడంలో ఎన్నికైన ప్రజా ప్రతినిధుల బాధ్యత కీలకంగా వుంది. ఎన్నికల ప్రణాళికలలో వివిధ రాజకీయపార్టీలు ప్రకటించిన దళిత, గిరిజన సంక్షేమ చర్యలను అమలుజరిపే విధంగా ఎన్నికల అనంతరం పాలకులు కృషి చేయాలి. ఆ వైపుగా ప్రయత్నం ప్రారంభించినప్పుడు ఎన్నికల్లో చేసిన వాగ్ధానాలకు విలువవుంటుంది. వీరూ సమాజంలో ఒక భాగమేనన్న సామాజిక స్పృహ వుండాలి.  ముఖ్యంగా రిజర్వేషన్‌ స్థానాల్లో ఎన్నికైనవారు రాజ్యాంగపరంగా తమకు కల్పించిన హక్కులను సాధించుకోవడానికి చట్టసభలను సాధనంగా ఉపయోగించుకోవాలి.  చట్ట సభల ద్వారా సమస్యలను మొత్తం ప్రజానీకం దృష్టికి తేవడానికిగల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు అభివృద్ధిజరిగే తక్షణ సహాయ పథకాలకన్నా, దీర్ఘకాలికంగా, శాశ్వితంగా అభివృద్ధిని కొనసాగే చర్యలపై దృష్టిని పెట్టాలి. ఆర్థికాభివృద్ధి మాత్రమేగాక సాంఘిక సమానత్వాన్ని కూడా కొనసాగే సమాజ స్థాపనకు కృషి చేయాలి.
                                         - సారంపల్లి


No comments:

Post a Comment