Wednesday, 13 August 2014

ఆంధ్రప్రదేశ్‌లో రైతాంగ ఉద్యమం

          పోరాట వారసత్వం కలిగిన ఆంధ్రప్రదేశ్‌ రైతాంగ ఉద్యమం రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం ఉద్యమాలు, ఆందోళనలు, పోరాటాలు చేస్తున్నాయి. 1946 సెప్టెంబర్‌ 11న సాయుధ రైతాంగ పోరాటానికి పిలుపివ్వగా, రైతులు సాయుధులై 3వేల గ్రామాల్లో భూస్వాములను తరిమివేసి గ్రామ రాజ్యాలు సాధించుకున్నారు. నైజాం మరియు భూస్వాముల గుంఢాల కాల్పుల్లో 1500 మంది రైతులు, రైతు నాయకులు చనిపోగా, 1948 సెప్టెంబర్‌ 17న భారత యూనియన్‌ సైన్యాలు వచ్చి సాయుధ ఉద్యమాన్ని అణచడానికి పూనుకున్నాయి. 1951 అక్టోబర్‌ 20న సాయుధ పోరాటం విరమించేనాటికి మరో 2500 మంది ప్రాణత్యాగం చేసారు. 4000 మంది ప్రాణత్యాగం చేయగా, సుమారు 50వేల మంది అరెస్టయ్యారు. 5వేల మందికి పైగా సంవత్సరాల తరబడి జైళ్ళల్లో నిర్బంధించబడ్డారు. ప్రజలు తామంతట తామే 10 లక్షల ఎకరాల భూమిని ఆక్రమించి సాగు చేసుకున్నారు. 1937లో మునగాల రైతాంగ పోరాటం, 1920లో కౌలు రైతుల పోరాటాలు, 1915లో అమ్మపాలెం రైతుల పోరాటాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడక ముందు ఆంధ్రరాష్ట్రంలో కరువు సమస్యలపైన రెంట్‌ రికవరీ చట్టం 1965 రద్దుకు, 1937లో వెంకటగిరి జమీందారీకి వ్యతిరేక పోరాటాలు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో కాళిపట్నం, మందాస రైతాంగ ఉద్యమాలు, 1950లో చల్లపల్లి రాజ మిగులు భూముల పోరాటాలు జరిగాయి. 1937లోనే రైతు రక్షణ యాత్ర నిర్వహించారు. 1512 మైళ్లు కాలినడకన మద్రాస్‌కు చేరుకున్నారు.
1956 ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తర్వాత భూ సంస్కరణల కొరకు పెద్ద ఎత్తున ఉద్యమం సాగింది. అప్పటి వరకు గరిష్ట భూపరిమితి చట్టం క్రింద ప్రతి వ్యక్తి 324 ఎకరాలు ఉంచుకోవచ్చు. ఈ సీలింగ్‌ చాలా ఎకరాలు ఉండడం వలన అనేక గ్రామాల్లో రైతులు ఉద్యమాలు నిర్వహించి సీలింగ్‌ తగ్గింపుకు పోరాడారు. చివరకు 1973లో ప్రతి కుటుంబానికి 10 స్టాండర్డ్‌ ఎకరాలు లేదా 54 మెట్ట భూమి ఎకరాలు సీలింగ్‌గా నిర్ణయిస్తూ చట్టం తెచ్చారు. కానీ ఈ చట్టాన్ని 1975 జనవరి నుండి అమలు చేసారు. ఈ చట్టం క్రింద ఆరు లక్షల ఎకరాల భూములు పంపిణీ చేసారు. ఇవి కాక ప్రభుత్వ భూములు మరో 15 లక్షల ఎకరాల వరకు పంపిణీ చేసారు.  2007లో నాలుగు మాసాల పాటు భూపోరాటం జరిగింది. ఈ ఉద్యమంలో 40,760 మందిని అరెస్టు చేసారు. 18,622 కేసులు పెట్టారు. 3051 మందిని జైళ్ళకు పంపారు. 2007 జూలై 28న రాస్తారోకో నిర్వహిస్తున్నవారిపై ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రంలో ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఏడుగురు మరణించారు. ఈ ఉద్యమాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం 2005 నుండి 2012 వరకు ఆరు విడతలుగా 7,01,920  ఎకరాలను 5,64,229 మందికి పంపిణీ చేసారు. ముఖ్యంగా ప్రభుత్వ భూముల పంపిణీ, మిగులు భూముల పంపిణీతో పాటు అటవీ హక్కుల చట్టం క్రింద వచ్చిన భూముల పంపిణీకి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాపిత ఉద్యమాలు జరిగాయి.
రాష్ట్రంలో 3.80 లక్షల ఎకరాల దేవాలయ భూములు ఉన్నాయి. వీటిని వేలం వేసి బ్యాంకులో డిపాజిట్‌ చేసి దేవాలయాలను నిర్వహించాలన్న ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఉద్యమించి దేవాలయ భూములు పేదలు కౌలుకు చేసుకునే విధంగా ప్రభుత్వాన్ని ఆమోదింపచేసారు. నేటికీ కొంత మంది దేవాలాయ భూములు భూస్వాముల స్వాధీనంలోనే ఉన్నాయి. వాటిని పేదలకు కౌలుకివ్వాలని ఆందోళనలు సాగుతున్నాయి.
కౌలు ఉద్యమం:
           రాష్ట్ర వ్యాపితంగా కౌలు ఉద్యమం బాగా విస్తరించింది. సరళీకృత ఆర్థిక విధానాల అమలుతో భూస్వాములు స్వయంగా సాగు చేయకుండా తమ భూములను కౌలుకిచ్చి ఇతర ఆదాయ వనరులు చేపట్టారు. రాష్ట్ర వ్యాపితంగా కౌలు ఉద్యమ నిర్మాణంలో గత మూడు సంవత్సరాలుగా తీవ్రమైన కృషి జరిగింది. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ అంచనా ప్రకారం 25 లక్షల మంది కౌలుదారులున్నారని ప్రకటించగా, రైతుసంఘం తన సర్వేలో 40 లక్షల మంది కౌలుదారులున్నట్లు అంచనా వేసింది. కైలు రైతులకు ఎలాంటి రక్షణ లేదు. రెవెన్యూ రికార్డుల్లో నమోదు లేదు. కౌలుదారుల పేర్లు రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలని, వారికి పంట రుణాలు ఇవ్వాలని గత దశాబ్ద కాలంగా పెద్ద ఎత్తున ఆందోళన సాగింది. రెవెన్యూ కార్యాలయాలను ముట్టడిరచారు. బ్యాంకుల పని స్థంభింపజేసారు. ఫలితంగా ‘‘లైసెన్స్‌డ్‌ కల్టివేటర్‌ యాక్ట్‌ ` 2011’’ వచ్చింది.  కౌలుదారులకు రుణాలు, భీమా సౌకర్యం, ప్రభుత్వ పథకాలతో పాటు ప్రకృతి వైఫరిత్యాల పరిహారాన్ని ఈ చట్టం క్రింద కార్డుపొందినవారికి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 2011లో ఆరు లక్షల మందికి కార్డులిచ్చారు. 350 కోట్లు పంట రుణాలు ఇవ్వడం జరిగింది. 2012`13లో నాల్గు లక్షల మందికి కార్డులివ్వగా, అందులో లక్ష మందికి 221 కోట్లు రుణ సౌకర్యం కల్పించారు. రైతుల సంఘటిత శక్తి వలన చట్టం వచ్చినప్పటికీ బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో ఏటా బ్యాంకుల ముందు పెద్ద ఎత్తున ఆందోళనలు సాగుతున్నాయి.
ఇరిగేషన్‌ :
         2004 నుండి 2012 మార్చి నాటికి 86 ప్రాజెక్టుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 1.46 లక్షల కోట్లు వ్యయం చేసింది. 13 ప్రాజెక్టులకు పూర్తిగానూ, మరో 18 ప్రాజెక్టులకు పాక్షికంగానూ నీరు వదిలినప్పటికీ సాగుకు నిర్ణయించిన ఆయకట్టుకు నీరు అందలేదు. పంట కాలువలు, బ్రాంచ్‌ కెనాల్స్‌ లేకపోవడంతో ప్రాజెక్టుల నీటిని వినియోగించుకోలేక పోయాం. దీనిపై అన్ని జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టులను సత్వరమే పూర్తిచేయాలని పాదయాత్రలు, కలెక్టరాఫీసుల ముట్టడి కార్యక్రమాలు, రాస్తారోకోలు సాగాయి. రైతుల ఉద్యమంతో దిగి వచ్చిన ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టులనైనా పూర్తిచేయడానికి ముందుకొచ్చింది. రాష్ట్రంలో 30 లక్షల బావుల క్రింద రైతులు 45 లక్షల ఎకరాలు సాగు చేస్తున్నారు. ఉచిత విద్యుత్‌ 2004 మే లో ప్రకటించారు. రోజుకు ఏడు గంటల విద్యుత్‌ను ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం 3`4 గంటలే రోజుకు సరఫరా చేయడంతో పంప్‌సెట్ల క్రింద నిర్ణయించిన ఆయకట్టు 10`15 లక్షల ఎకరాలు మాత్రమే సాగువుతున్నది. విద్యుత్‌ సరఫరా మెరుగుపరచాలని, నాణ్యతగల విద్యుత్‌ను సరఫరా చేయాలని సబ్‌స్టేషన్ల ముందు ఆందోళనలు సాగాయి. ప్రపంచబ్యాంకు ఆదేశంతో ఉచిత విద్యుత్‌ను ఎత్తివేయడానికి ‘‘డిమాండ్‌ సైడ్‌ మేనేజ్‌మెంట్‌’’ విధానాన్ని ముందుకు తెచ్చింది. ఐఎస్‌ఐ పంప్‌సెట్లు లేనిచో, రెండున్నర ఎకరాలకు మించిన ఆయకట్టు ఉన్నచో వారిని ఉచిత విద్యుత్‌ నుండి మినహాయించారు. ఈ విధంగా రాష్ట్రంలో లక్ష పంప్‌సెట్లు వుచిత విద్యుత్‌నుండి మినహాయించబడ్డాయి. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ఉపసంహరించుకోవాలని రాష్ట్ర వ్యాపిత ఆందోళనలు కొనసాగుతున్నాయి.
రుణాలు :
         యేటా రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశమై వ్యవసాయ పంటల రుణ ప్రణాళికను ప్రకటిస్తున్నాయి. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఉన్నప్పటికీ దానిని అమలు  జరపలేదు. గత సంవత్సరం 1128 మండలాలకు 1060 మండలాలు కరువుకు గురయ్యాయి. 2012`13 సంవత్సరంలో 234 మండలాలు కరువుకు గురయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే నీలం తుఫాన్‌ వల్ల 10 లక్షల ఎకరాల పంటకు నష్టం వాటిల్లింది. ప్రకృతి వైఫరిత్యాల నష్టం జరిగిన రైతాంగం యొక్క రుణాలను రీషెడ్యూల్డ్‌ చేసి తిరిగి కొత్త రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం మరియు రిజర్వు బ్యాంకు ఆదేశించినప్పటికీ బ్యాంకులు రుణమివ్వడానికి ముందుకు రావడం లేదు. రాష్ట్ర సహకార బ్యాంకు తగినన్ని రుణాలు ఇచ్చే ఆర్థిక స్థోమత కలిగిలేదు. ప్రస్తుతం ఏటా 2500 కోట్లు మాత్రమే సహకారబ్యాంకు రుణాలు ఇస్తుంది. వాణిజ్య బ్యాంకులు ఇచ్చే రుణాలు పెద్ద రైతులకు వ్యాపారం చేసుకోవడానికి, బంగారం కుదువపెట్టి వ్యవసాయం పేరిటి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకోవడానికి, కోల్డ్‌ స్టోరేజీల నిర్మాణానికి, భారీ యంత్రాల కొనుగోలుకు మరియు మైక్రో ఫైనాన్స్‌ సంస్థలకు బ్యాంకులిచ్చిన రుణాలను లెక్కగట్టి వాటిని వ్యవసాయ రుణాలుగా చూపుతున్నారు. ఈ విధానానికి వ్యతిరేకంగా అన్ని బ్యాంకుల ముందు పెద్ద ఎత్తున ఆందోళనలు, ఉద్యమాలు జరిగాయి. ఉద్యమం జరిగినచోట కొంత మేరకైనా రుణాలు ఇచ్చారు.
విత్తనాలు ` ఎరువులు :
         రాష్ట్రంలో విత్తనాల ఉత్పత్తి పెద్ద ఎత్తున సాగుతున్నది. భారత దేశ విత్తన వినియోగంలో 60శాతం విత్తనాలు ఆంధ్రప్రదేశ్‌ నుండి సరఫరా అవుతున్నాయి. అయినప్పటికీ ఈ రాష్ట్రంలో బహుళజాతి సంస్థలైనా మన్‌శాంటో, డూ`పాయింట్‌, కార్గిల్‌, సింజెంటా లాంటి కంపెనీలు 80 శాతం విత్తన రంగాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. విత్తన ఉత్పత్తి చేసే రైతులకు లాభదాయకం రాకుండా ఈ కంపెనీలు చేస్తూ, మరోవైపు వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసే రైతులకు అత్యధిక ధరలకు అమ్మి యేటా వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. బహుళజాతి సంస్థల జోక్యానికి, విధానానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాపిత రైతు ఉద్యమాలు సాగాయి. ఉద్యమ ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం విత్తనాల ధరలను కొనుగోలుదారులకు తగ్గించారు. అదే సందర్భంలో ఉత్పిత్తిదారులకు ధరలు పెంచారు. రాష్ట్ర వ్యాపిత విత్తన ఉత్పత్తి రైతాంగ ఉద్యమం బలంగా ఉంది. బహుళజాతి సంస్థలను పూర్తిగా కాకున్నా నియంత్రించగల శక్తిగా ఉద్యమం కొనసాగుతున్నది.
           రాష్ట్రానికి ఖరీఫ్‌, రబీ పంటలకు కలిపి 74 లక్షల టన్నుల ఎరువుల అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఎరువుల విధానం ఫలితంగా ఎరువుల ధరలు విఫరీతంగా పెరిగాయి. దీనికి తోడు రాష్ట్రంలో 17 మిక్సింగ్‌ ఎరువుల ప్లాంట్లు పాలకవర్గం వారు నిర్మించి, వాటికి కావాల్సిన ఎరువులను కేంద్రం నుంచి కాకుండా రైతులకు పంపిణీ చేయాల్సిన సబ్సిడీ ఎరువులను తరలించారు. ఈ విధంగా బ్లాక్‌ మార్కెట్‌ సృష్టించి ఎరువుల ధరలను మరింతగా పెంచారు. ఒక డిఏపీ బస్తా పెంచిన ధర ప్రకారం 1350 రూపాయలు కాగా, బ్లాక్‌లో 1800 రూపాయలకు అమ్మారు.  అన్ని జిల్లాల్లో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించి బ్లాక్‌ మార్కెట్‌కు వ్యతిరేకంగా, మిక్సింగ్‌ప్లాంట్ల అక్రమార్జనకు వ్యతిరేకంగా పెద్దఎత్తున పోరాటాలు నిర్వహించారు. ఫలితంగా ఎరువులను సరఫరా చేయడానికి ప్రభుత్వం దిగొచ్చింది. ఉద్యమంలో అక్రమ ఎరువులను పట్టుకుని అక్కడిక్కడే రైతులకు పంపిణీచేసారు.
చెరకు ` పత్తి ` పొగాకు :
        రాష్ట్రంలో11 సహకార చక్కెర ఫ్యాక్టరీలు, మూడు జాయింట్‌ వెంచర్‌ ప్రాజెక్టులు, 23 ప్రయివేటు ప్రాజెక్టులు పనిచేస్తున్నాయి. గత సంవత్సరం 1.17 కోట్ల టన్నులు చెరకు ఆడగా, 10 లక్షల టన్నులు ఉత్పత్తి అయ్యింది. రైతులకు 2200 నుండి 2300 రూపాయలు టన్నుకు చెల్లించారు. చెరకు ధర పెంచాలని, రాష్ట్ర ప్రభుత్వం స్టాట్యూటరీ అడ్వయిజరీ ఫ్రైస్‌ ప్రకటించాలని ఫ్యాక్టరీల వారీగా ఆందోళనలు సాగాయి. ప్రభుత్వం రైస్‌ మిల్లర్ల లాభాలకే విధానాలు రూపొందించి చక్కెర ఎగుమతి ద్వారా సహకరించింది.  రాష్ట్రంలో ఐదు లక్షల ఎకరాలు చెరకు పంట వేయాల్సి ఉండగా, 4.6 లక్షలకు తగ్గింది. రానున్న కాలంలో మరింత తగ్గే ప్రమాదముంది. చెరకు విస్థీర్ణం తగ్గడంతోపాటు, పత్తి విస్థీర్ణం విఫరీతంగా పెరిగింది. 38 లక్షల ఎకరాలు వేయాల్సిన పత్తి, 56 లక్షల ఎకరాలకు పెరిగింది. పత్తి వేసిన రైతులకు వర్షాభావ పరిస్థితుల వల్ల దిగుబడులు తగ్గాయి. మార్కెట్లలో ప్రభుత్వం నిర్ణయించిన 3900 క్వింటాల్‌ ధరకు కొనుగోలుకు వ్యాపారులు ముందుకు రాలేదు. చెరకు, పత్తి సమస్యలపైన రాష్ట్ర వ్యాపిత ఆందోళనలు జరిగాయి. కొంత మేరకు చెరకు ధర పెంచడంతోపాటు, ఉద్యమ ఫలితంగా పత్తి కనీస మద్దతుధరకు కొనుగోలు చేస్తామని మార్కెట్‌ కమిటీలు హామీ ఇచ్చాయి. ప్రధానంగా ఈ రెండు పంటలతో పాటు పొగాకు రైతులు కూడా నష్టపోయారు. గత సంవత్సరం కిలో 15 అమ్మగా, ఈ సంవత్సరం కిలో సగటును 80 రూపాయలకు మాత్రమే అమ్మింది. పొగాకు కేంద్రాల వద్ద ఆందోళనలు జరుగుతున్నాయి.
           పై మూడు వాణిజ్య పంటలకు తగినంత రుణ సౌకర్యం కల్పించాలని, ప్రకృతి వైఫరిత్యాల నష్టానికి పరిహారం చెల్లించాలని,  చెరుకుకు టన్నుకు 3500, పత్తికి క్వింటాల్‌కు 4500, పొగాకుకు కేజీ 150 రూపాయలు చెల్లించాలని ఉద్యమాల పరంపర కొనసాగింది.
ప్రకృతి వైఫరిత్యాలు :
          2012`13లో కరువులు, వరదలు తదితర ప్రకృతి వైఫరిత్యాల వల్ల 5000 కోట్ల రూపాయల పంటలకు నష్టం వాటిల్లింది. ముతక దాన్యాలు, పప్పుదాన్యాలు, నూనెగింజల పంటల దిగుబడులు గణనీయంగా తగ్గాయి. ఆహార పంటల దిగుబడి కూడా తగ్గింది. 2011`12లో 144 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి కాగా, 2012`13లో 111.74 లక్షల టన్నులు మాత్రమే బియ్యం దిగుబడి వచ్చింది. భీమా సౌకర్యం లేదు. రాష్ట్ర ప్రభుత్వం రెండు సార్లు ప్రకృతి వైఫరిత్యాల పరిహారం క్రింద 1600 కోట్లు ఇస్తున్నామని జీవోలు తెచ్చినా, నేటికీ రైతులకు పరిహారం ఇవ్వలేదు. ప్రకృతి వైఫరిత్యాల పరిహారం ఎకరాకు 10వేలు చెల్లించాలని, తక్షణమే రైతాంగానికి పరిహారం ఇవ్వాలని మండల కేంద్రాల్లో ఆందోళనలు జరిగాయి. మన ఆందోళనల ఫలితంగా కొన్ని మండలాల్లో పరిహారం ఇచ్చారు. కానీ చాలా వరకు ఇవ్వాల్సి ఉంది. ప్రకృతి వైఫరిత్యాలకు గురైన మండల కేంద్రాల్లో ఆందోళనలు పరంపరగా సాగుతూనే ఉన్నాయి.
           రాష్ట్ర వ్యాపితంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపైన చైతన్యవంతమైన రైతాంగం ప్రత్యక్ష్య`పరోక్ష ఆందోళనలు నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నాయి. పండ్ల తోటల రైతులు, పట్టుగూళ్ళ తయారీ రైతులు, పాల ఉత్పత్తి దారులు పెద్ద జన సమీకరణ చేసి ఆందోళనలు నిర్వహించారు. మార్కెట్‌ యార్డుల్లో కనీస మద్ధతు ధరలు అమలు జరపాలని ఆందోళనలు సాగాయి. ఈ ఉద్యమాలకు రైతుసంఘం నాయకత్వం వహించింది. స్వతంత్య్రంగానే కాక, అఖిలపక్ష రైతుసంఘాలతో కలిసి ప్రభుత్వం అనుసరిస్తున్న సరళీకృత ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా మరియు ప్రపంచబ్యాంకు విధానాలకు వ్యతిరేకంగా నిరంతర ఆందోళనలు చేస్తున్నాయి. ఈ మధ్య ‘‘పబ్లిక్‌, ప్రయివేటు పార్టనర్‌షిప్‌ అండ్‌ ఇంటిగ్రేటేడ్‌ అగ్రికల్చరల్‌ డెవలప్‌మెంట్‌’’ పేర ప్రతి 5000 మంది సన్న, చిన్నకారురైతులతో గ్రూపు ఏర్పాటు చేసి, ఆ గ్రూపుకు ఏదో ఒక కంపెనీ స్పాన్సర్‌ చేసే విధంగానూ, ఆయా భూముల్లో ఒకే పంట (మోనోక్రాఫ్‌) వేసే విధంగా విధానం రూపొందించారు. ఈ విధానం సన్న, చిన్నకారు రైతులను భూముల నుండి వెళ్లగొట్టడానికే చేస్తున్న ప్రక్రియ. దేశంలో 17 రాష్ట్రాల్లో 34 కంపెనీలతో ఒప్పందం కుదరగా, ఆంధ్రప్రదేశ్‌లో 8 జిల్లాల్లో ఐటిసీ కంపెనీతో ఒప్పందం కుదిరింది. క్రమంగా సన్న,చిన్నకారు రైతుల భూములను కంపెనీల పాలు చేయడానికి గత రెండు సంవత్సరాల్లో మూడు సార్లు ప్రయత్నించి రైతుల ఉద్యమాల ఫలితంగా విరమించుకున్నారు. మరలా కొత్త పథకం పేరుతో అమలు చేయాలని చేసిన ప్రయత్నాన్ని రైతు ఉద్యమం తీవ్రంగా వ్యతిరేకించింది. రైతు వుద్యమం విస్తృతం కావడంతో ప్రభుత్వం ప్రస్తుతం వెనకడుగు వేసింది. ఏదేమైనా వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయాలనే లక్ష్యంవైపు ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. పాత పోరాట వారసత్వంతో ఈ విధానాలను రానున్న కాలంలో తీవ్రంగా వ్యతిరేకించాల్సి ఉంది. మొత్తం రైతాంగాన్ని సమీకరించి ఆందోళనలు చేపట్టి తమ సమస్యలను పరిష్కరించుకునే దిశగా కదలాలి.
సారంపల్లి మల్లారెడ్డి
15.05.2013

No comments:

Post a Comment