Monday, 11 August 2014

రైతుల రుణరద్దు పథకం రుణభారం తీరుస్తుందా?

ఫిబ్రవరి 28, 2008న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో మూడు కోట్ల మంది రైతులకు రు. 60వేల కోట్లు రుణ భారాన్ని తగ్గిస్తున్నట్లు బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం గారు ప్రకటించారు. ఈ ప్రకటనతో పార్లమెంట్‌ హాలులో కాంగ్రెస్‌ సభ్యులు అత్యంత ఉత్సాహంగా కరతాళధ్వనులు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినతర్వాత (25-05-2004) నుండి రైతుల సంక్షేమం కొరకు అనేక చర్యలు చేపడుతున్నట్లు, అందులో రుణరద్దు పథకం అత్యంత విప్లవాత్మకమైనదిగా అభివర్ణించారు. జూన్‌ 2008 నాటికి అర్హతగల వారందరికీ రుణాలు రద్దుచేసి తిరిగి కొత్త రుణాలు యిస్తామని చెప్పారు.

ఈ రద్దు పథకం ప్రకారం 31-03-2007 లోగా బట్వాడా జరిగి వుండి 31-12-2007 నాటికి వాయిదా మీరివుండి, 29-02-2008 నాటికి చెల్లించని అన్ని రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. అలాగే కేంద్రప్రభుత్వం వారిచే 2004 మరియు 2006లో ప్రకటించిన రీ- స్ట్రక్చర్‌ /రీ- షెడ్యూల్‌ చేయబడిన రుణాలు, 31-03-2007న రుణం పొందినవారికి కూడా ఈ రద్దు పథకం వర్తిస్తుంది. ఈ పథకం ఐదెకరాలలోపు వారికి మాత్రమే ప్రకటించారు. ఐదెకరాలకు పైబడిన రైతులకు ఏకకాల పరిష్కృత (వన్‌టైం సెటిల్‌మెంట్‌) పథకం ప్రకారం 75శాతం చెల్లించినచో 25శాతం రాయితీగా యిస్తారు. ఈ రాయితీ రు. 20,000ల వరకు యివ్వబడుతుంది.

కేంద్ర ప్రభుత్వం తిరిగి అంచనావేసి నాలుగు కోట్ల మందికి రు. 71వేల కోట్లు రుణమాఫీ క్రింద పంపిణీ చేయాల్సి వస్తున్నట్లు రెండోసారి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ పథకం క్రింద రాష్ట్రంలో 70లక్షల మందికి రు. 12వేల కోట్లు మాఫీ జరగబోతున్నట్లు అట్టహాసంగా ప్రకటించారు. ఐదెకరాల రైతులకు గల పరిమితిన సడలించాలని, ప్రధానంగా కరువు ప్రాంతాల్లోని రైతులకు ఈ పరిమితి సడలించాలని ఆందోళనలు జరిగాయి. అలాగే కేంద్ర మంత్రి ప్రకటించే నాటికి వున్న రుణ బాకీలకు దీనిని వర్తింపజేయాలని రైతులు ప్రభుత్వాలను కోరారు. దీనిపై ప్రభుత్వం యేమాత్రం స్పందించలేదు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం క్రిందకు వచ్చే అర్హతగలవారు రుణాలు చెల్లించినచో వారికి రు. 5000లు చొప్పున నగదు రాయితీ యిస్తామని తెలిపింది. ఈ రాయితీని జూన్‌ 30 నాటికి పూర్తిచేయాలని, అర్హతగల వారి జాబితాలను తయారుచేసి పంపాలని ఆదేశాలు యిస్తున్నట్లు చెప్పారు.

ఆగస్టు నెల ముగుస్తున్ననాటికి కూడా ఈ రుణరద్దు పథకం అమలు కాకుండానే వుంది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 31-03-2007 నాటికి సంవత్సరం ముందు అప్పు పొందిన వారికి మాత్రమే అనగా జూన్‌ 2007లో అప్పుతీసుకొన్నవారికి మాత్రమే రద్దు పథకాన్ని వర్తింపజేయాలని ఆదేశాలు దిగువ బ్రాంచ్‌లకు పంపించారు. వడ్డీ, అపరాధపు వడ్డీ, యితర ఖర్చులు రైతులనుండి వసూలు చేయాలని మౌఖికంగా ఆదేశాలు జారీచేశారు.  అవే జిల్లాల్లో వాణిజ్య బ్యాంకులు 31-03-2007న రుణం తీసుకొన్నవారికి కూడా రద్దును వర్తింపజేస్తున్నారు. అన్ని రకాల వడ్డీలను ఐదెకరాల లోపు వారికి రద్దుచేస్తున్నారు. ఒకే జిల్లాలో రెండు రకాల విధానాలు అమలు జరపడం వలన రుణం రద్దుకాని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపున వర్షాలు బాగాపడి పంటలు వేయడం దాదాపు పూర్తికావచ్చిన తరుణంలో కూడా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన గడువు దాటి రెండు మాసాలు అవుతున్నప్పటికి కూడా రుణరద్దు పథకం అమలు పూర్తికాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రు. 5000ల రాయితీకి జాబితాలను తయారుచేయలేదు. తిరిగి కొత్త రుణాలు యివ్వలేదు. ఈ పథకం ఒక విధంగా రైతులకు మొదట కల్పించిన సంతోషాన్ని నీరుగార్చింది. తిరిగి వడ్డీ వ్యాపారస్తుల వద్దకు వెళ్ళి అత్యధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పంటలు వేసుకున్నారు. ప్రభుత్వం, బ్యాంకులు చోద్యం చూస్తూ కాలం గడుపుతున్నాయి. జూన్‌ ఆఖరు వరకు పై నుండి ఆదేశాలు రాలేదని రైతులకు చెప్పారు.

రుణాల రద్దు ఎందరికి?
ఈ పథకంలోని నిబంధనల వల్ల వివిధ బ్యాంకులు అమలు జరుపుతున్న విధానాల వల్ల 20శాతానికి మించిన రైతులకు రుణాలు రద్దుకావడంలేదు. కోస్తా జిల్లాల్లో ఒక్కరికి కూడా రుణం రద్దుకాని సహకార సొసైటీలు వున్నాయి. పథకం రావడానికి మాసం రోజుల ముందు రాష్ట్ర సహకార బ్యాంకు అధ్యక్షులు రైతులపై వత్తిడి తెచ్చి వందల కోట్ల రుణాలు వసూలు చేశారు. మార్చి 31న అనేక సహకార సంఘాలలో బుక్‌ అడ్జెస్ట్‌మెంట్‌ చేశారు. ఈ విధంగా రుణం చెల్లించినవారు బుక్‌అడ్జెస్ట్‌మెంట్‌కు గురైనవారు. కొత్త రుణగ్రస్తులుగా అవతారమెత్తారు. వారికి ఈ రద్దు పథకం ఏమాత్రం ప్రయోజనం కల్గించలేదు. వి.పి సింగ్‌ ప్రధానిగా వున్న హయాంలో రు. 10,000లోపు రుణాలను రద్దుచేశారు. ఆత్మహత్యలు జరుగుతున్న 16 జిల్లాల్లో ప్రధాని 29-09-2006న  ప్రకటించిన వడ్డీ రద్దు పథకం క్రింద రు. 1900 కోట్లు మాపీ చేశారు. పై మూడు సందర్భాల్లో రుణమాఫీకి అర్హులైనవారికి తిరిగి కొత్తరుణాలు యివ్వలేదు. రుణమాఫీ జరగడమంటే ఆ రైతుకు తిరిగి రుణమాఫీ యివ్వకూడదని బ్యాంకులు దాదాపుగా నిర్ణయించుకున్నాయి. క్రమంగా రుణాల రద్దు పథకం వల్ల ప్రయోజనం కన్నా అదనపు సమస్యలు ఉత్పన్నమైనాయి.

కమీషన్లు ఏం చెప్పాయ్‌?
2005, అక్టోబర్‌ 8న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ''రైతుల సంక్షేమ కమిషన్‌''పై చర్యల నివేదికలో 66.59లక్షల మంది రైతులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు యిచ్చి తగినన్ని రుణాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. బ్యాంకుల వద్ద వున్న డిపాజిట్లు రు. 47331 కోట్లలో 40శాతం రుణాలు ప్రాథమిక రంగానికి మార్చి 2005 నాటికి పంపిణీ చేసినట్లు చెప్పారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌ (ఆంధ్రా ఏరియా) రుణ రక్షణ చట్టం - 1934ను తిరిగి కొత్త చట్టంగా తెచ్చి రైతులకు రుణ విముక్తి కల్గిస్తామని నివేదికలో ప్రకటించారు.

జూలై 2007న కేంద్ర ప్రభుత్వం  ఆర్‌. రాధాకృష్ణ ఛైర్మన్‌గా నియమించిన కమిషన్‌ చేసిన సూచనల ప్రకారమే కేంద్ర ప్రభుత్వం 28-02-2008న రుణాల రద్దు పథకం ప్రకటించినట్లు చెప్పుకొన్నారు. ఈ కమిషన్‌ సన్న, చిన్నకారు రైతులకు రుణాలు రద్దుచేయాలని, అలాగే ప్రయివేటు వడ్డీ వ్యాపారుల రుణ భారం నుండి విముక్తి కావడానికి బ్యాంకులు రుణాలిచ్చి ప్రయివేటు రుణ భారాన్ని తగ్గించాలని సూచించింది. రైతులు బ్యాంకులకు తప్ప మరెక్కడా బాకీ వుండకుండా చూడాలని, వారికి పావలా వడ్డీకే రుణాలివ్వాలని సూచించింది. గ్రామీణ బ్యాంకులను విస్తరింపజేసి వాటిద్వారా ఎక్కువ గ్రామాలలోని రైతులకు రుణాలివ్వాలని కూడా సూచించింది.  బ్యాంకు లావాదేవీలలో ఎక్కువ డాక్యుమెంట్లు లేకుండాచేసి పనిని తగ్గించుకోవాలని, అలాగే రైతుమిత్ర గ్రూపులకు రుణాలివ్వాలని తన రికమండేషన్స్‌లో తెలిపింది.

పై కమిషన్ల సూచనలను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తున్నానంటూనే వాటిని చెత్తబుట్టలో వేసింది. ఈ పథకాలు ఏ రైతుకూ ఉపయోగపడలేదు.  ఒకవిధంగా సన్న, చిన్నకారు రైతులను రుణగ్రస్తుల్నిచేసి వారు వారి భూముల్ని కోల్పోయే విధానాల్నే ప్రభుత్వాలు పరోక్షంగా  అమలు చేస్తున్నాయి.

జూలై 2003న రాష్ట్ర ప్రభుత్వం మాజీ నాబార్డు చైర్మన్‌ పి.వి.ఏ రామారావు కమిషన్‌ వేసింది. ఆ కమిషన్‌ నిర్ణయాలను కూడా బ్యాంకులు గానీ, రాష్ట్ర ప్రభుత్వంగానీ అమలు చేయలేదు.

కేంద్ర ప్రభుత్వం - రాష్ట్ర ప్రభుత్వం - నాబార్డు ఒప్పందం :
నాబార్డుతో ఒప్పందం ద్వారా సహకార సంఘాలకు అత్యధికంగా రుణాలివ్వడంతో పాటు రుణ సదుపాయాన్ని సరళీకరిస్తామని వైద్యనాథన్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు నిర్ణయించింది. నాబార్డుతో త్రైపాక్షిక ఒప్పందం 29-08-2006న  కుదుర్చుకుంది. కానీ ఆ ఒప్పందంలోని నిబంధనలు రైతులకు, సహకార సంఘాలకు అత్యంత నష్టదాయకంగా పరిణమించాయి. ఈ దిగువ నిబంధనలు చూడండి.

1. ఏ సంఘమైనా 30శాతం లోపు రుణాలు వసూలు చేసినచో తిరిగి ఆ సంఘానికి రుణాలు యివ్వబడవు.

2. 30 నుండి 50 శాతం మధ్య వసూలు చేసిన వారికి ఎంత వసూలు చేశారో అంతే రుణం యివ్వబడుతుంది.

3. 50శాతం పైన వసూలు చేసిన సంఘాలలో కొంత మంది కొత్త వారికి రుణాలు యివ్వబడతాయి.

4. ప్రతి సభ్యుడు రు. 300లకు తక్కువకాకుండా వాటా ధనం చెల్లించాలి. ఏటా  10శాతం అదనంగా వాటా ధనం చెల్లిస్తూ రావాలి.

5. సహకార సొసైటీలే తమ సంఘాలను ఛార్టెడ్‌ అక్కౌంటెంట్లద్వారా ఆడిట్‌ చేయించాలి. తామే డిపాజిట్లు సేకరించుకోవాలి. తమ బాధ్యతతోనే రుణాలు యిచ్చుకోవాలి. దీనిలో ప్రభుత్వ జోక్యం వుండదు.

6. పై షరతులను అంగీకరించినప్పటికీ ఆడిట్‌ జరగని సంఘాలకు రుణాలివ్వడం నిలిపివేస్తారు.

ఈ నిబంధనల వల్ల రాష్ట్రంలోని 4610 సొసైటీలను 2740కి కుదించారు. 1.38 కోట్ల సభ్యత్వాన్ని 29లక్షలకు కుదించారు. ఒక్క కలం పోటుతో లక్షలాది మంది సహకార సభ్యత్వాన్ని తొలగించారు. నేడు ఒక్కో మండలానికి సగటున 3,4 సొసైటీలకు మించి లేవు. రుణం కొరకు 20 కిలోమీటర్ల దూరంలో వున్న సొసైటీలకు వెళ్ళాలి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు సహకార సంఘాల రుణాలకన్నా, అధిక వడ్డీలు వున్నప్పటికీ ప్రయివేటు రుణాల వైపు మొగ్గుచూపడం జరిగింది.

బ్యాంకులు రద్దుచేసిన మొండి బకాయిలు:
19 వాణిజ్య బ్యాంకులు 2003-04లో రు. 6328కోట్లు, 2004-05లో 6108 కోట్లు, 2005-06లో 5182కోట్ల రుణాలను పారిశ్రామిక వర్గాలకు రద్దుచేశారు. ఈ రద్దుకు ఏ నిబంధనలూ లేవు. మూడు సంవత్సరాలు వాయిదా మీరిన బాకీలను ''నిరర్ధక ఆస్తులు''గా పరిగణించి రుణాలు రద్దుచేశారు. ఈ బ్యాంకులే రైతుల నుండి రుణాలను నిర్బంధంగా వసూళ్ళు చేశాయి. గత దశాబ్ధకాలంగా యేటా సగం రాష్ట్రం కరువు బారిన పడినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కరువుమండలాలుగా ప్రకటించినప్పటికీ బ్యాంకులు నిర్బంధ వసూళ్ళకు పూనుకున్నాయి. లేదా బలవంతంగా బుక్‌ అడ్జెస్ట్‌మెంట్‌ చేసి కొత్తరుణాలుగా మార్చాయి.

అరెస్టులు :
రుణ వసూళ్ళకు నిర్బంధాన్ని సాగించిన బ్యాంకులు రైతులను జైళ్లకు పంపడానికి కూడా వెనుకాడలేదు. ఫిబ్రవరి 2007న మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం ఎల్లూరుకు చెందిన లక్కగొల్ల కృష్ణయ్య, మాల బాలకృష్ణయ్యలను ఎస్‌.బి.ఐ వారు తమ రుణ వసూళ్ళ కొరకు 15 రోజులు జైలుకు పంపించారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం, దిమ్మంపేట గ్రామానికి చెందిన ఎం.నల్లపురెడ్డి(60) ను కడప జైల్‌లో పెట్టారు. 2002 నుండి ఈ విధానం కొనసాగుతూనే వుంది.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి వ్యవసాయ కుటుంబం రు. 41,576 రుణంతో వున్నట్లు ఏప్రిల్‌ 2007లో చేసిన సర్వేలో తేలింది. ఈ రుణ భారాన్ని తగ్గించడానికి అనేక కమిషన్లు వేసినా, అనేక పథకాలు ప్రకటించినా నేటికీ రుణ భారం తగ్గలేదు. కేంద్రప్రభుత్వం ప్రకటించిన రుణల రద్దు వలన తాము రుణవిముక్తి చెందుతామని రైతులు ఆశించారు. కానీ ఆ ఆశలు నెరవేరే స్థితి లేదు. రిజర్వు బ్యాంకు నిబంధనలను, ఆదేశాలను ఒక్కోబ్యాంకు ఒక్కో విధంగా వాఖ్యానించి అమలు చేస్తున్నాయి. ఈ విధానం పోవాలి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని బ్యాంకులకు ఒకే విధానాన్ని అమలుచేయాలి.

తేది 28-02-2008 నాటికి వున్న అన్ని రకాల రైతుల వ్యవసాయ రుణాలను రద్దుపర్చాలి. తిరిగి స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం పావలా వడ్డీకే రుణాలు యివ్వాలి. ఐదెకరాల వరకు నిర్ణయించిన పరిమితిని కరువు ప్రాంతాల్లో సడలించాలి. సహకార రంగంలో జిల్లాకు ఒక్కోరకంగా విడుదల చేసిన రుణ మాఫీ జీవోలను రద్దుపర్చాలి. కౌలు రైతులకు రుణార్హత కార్డులు యిచ్చి పావలా వడ్డీకే రుణాలు అందించాలి. ప్రయివేటు వడ్డీ వ్యాపారుల వద్ద తీసుకొన్న రుణాల మాఫీకి రుణ విమోచన ఆర్డినెన్స్‌ తేవాలి. రుణ మాఫీ వర్తించని రైతులకు యిస్తామన్న రు. 5000ల రాయితీని వెంటనే అమలు చేయాలి.


No comments:

Post a Comment