Monday, 11 August 2014

కుల నిర్మూలన సాధ్యంకాని అంశమా?

భారతదేశంలో కుల నిర్మూలనకు అనేక ఉద్యమాలు సాగాయి. ఇంకా సాగుతున్నాయి. అయినా ఆశించిన లక్ష్యం ఆమడ దూరంలోనే వుంది. అందరూ కుల నిర్మూలన కావాలని కోరుకున్నా అమలుకాదెందుకు? ప్రపంచంలోని ఏ దేశంలోనూ లేనివిధంగా భారతదేశంలో 4,350 కులాలు వున్నట్టు ఒక సర్వే చెబుతున్నది. మతాలకు, జాతులకు కూడా కొదవలేని దేశంగా వుంది. ఉత్పత్తిరంగంలో గలవారు ఐక్యంగా తమ ఉత్పత్తి క్రమంలో పాల్గొనకుండా కులాలు, మతాలు వారిని అనైక్యతకు గురిచేసి ఉత్పత్తిరంగాన్ని దెబ్బతీస్తున్నాయి.
రాజ్యాంగం రీత్యా అన్ని కులాలు, మతాలు సమానంగా వుండాలని చెప్పబడినది. రాజ్యాంగంలో ఆర్టికల్‌ 14లో సమతత్వం మరియు  ఆర్టికల్‌ 15 ప్రకారం మత, జాతీయత, జాతి, లింగ వివక్షలకు అతీతంగా అందర్నీ సమానంగా చూడాలి. ఆర్టికల్‌ -16 ప్రకారం అందరికీ ఉద్యోగావకాశాలు కల్పించాలి. ముఖ్యంగా ఆర్టికల్‌ - 17లో అస్పృశ్యత (అంటరానితనం) నిషేధించారు. ఆర్టికల్‌ - 19 ప్రకారం అందరికీ సమానంగా జీవించే హక్కు, స్వేచ్చ వుండాలి. రాజ్యాంగాన్ని ప్రమాణ పత్రంగా అందరూ అంగీకరిస్తున్నారు.
కానీ ఆచరణకు వచ్చేటప్పటికి రాజ్యాంగాన్ని అమలుచేయాలన్న దృక్పథం పాలకులకు లోపించింది. అందువల్లనే ఆరు థాబ్ధాలు పూర్తయి మరో రెండు సంవత్సరాలు గడిచినా కులవివక్షత, మతవివక్షత కొనసాగుతూనే వున్నాయి. సమాజ గమనాన్ని లోతుగా పరిశీలిస్తే ఈ వివక్షతలు కొనసాగడానికి, స్థిరంగా వుండడానికి అనేక కట్టుబాట్లు ఏర్పరచుకున్నారు. ఈ కట్టుబాట్లు దాటి వెళ్ళకుండా కులం పేరుతో, మతం పేరుతో అనేక ఆంక్షలను విధించారు.
కులం - మతం ఒక భావజాలం. ప్రజలు చైతన్యవంతులై ఈ భావజాలం నుండి బయటపడాలని కొందరు మెట్ట వేదాంతులు వల్లిస్తున్నారు. కుల నిర్మూలన అంటూనే కుల వ్యవస్థ పోకుండా అన్ని కోణాలలో అడ్డంపడుతున్నారు. అంటరానితనాన్ని బహు జాగ్రత్తగా పాలకులు రక్షించే చర్యలు సాగిస్తున్నారు. గత చరిత్రను పరిశీలిస్తే అంటరానితనం వికృత రూపాలు అత్యంత దారుణంగా వుండేవి. బయటకు వెళ్ళి వచ్చిన వ్యక్తి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు తన బట్టలు పూర్తిగా యిప్పివేసి, గొంగలి చుట్టుకొని బట్టలు మార్చుకొనేవారు. గొంగలికి (గొర్రె బొచ్చుతో నేసినది) అంటు వుండదని వితండవాదం. దళితులనే కాదు చివరకు క్షవరం చేసుకోవడానికి కూడా గొంగలి చుట్టుకొని చేసుకొన్న ఆచారం మనకు తెలుసు. బ్రాహ్మణ్యం కుల వివక్షతను ప్రోత్సహిస్తున్న కాలం నుండి నేడు టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిన పరిస్థితుల్లో కూడా పాలకులు కుల సంఘాలు పెట్టడం, ఉప కులాలను సృష్టించడం, కుల వివక్షతను పాటించడం సామాన్యంగా చూస్తున్నాం. సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా దాదాపు కార్పొరేట్‌ హాస్పిటల్‌ల ముందు చిన్నగుడి నిర్మాణం చూడొచ్చు.  ఈ గుడిలలోకి అన్ని కులాల వారు వెళ్ళడానికి వీలులేదు. కొందరికే ఆ అర్హత వుంది. దళితులను, గిరిజనులను, యితర వెనకబడిన వర్గాల వారిని సమాజానికి దూరంగా వుంచడానికి అభివృద్ధి పేరుతో వారి గృహాలను గ్రామానికి దూరంగా ''కాలనీ''ల పేరుతో నిర్మాణాలు చేసి దూరంగా వుంచుతున్నారు.
ఆరు థాబ్ధాల పాటు నిమ్న కులాలకు రిజర్వేషన్లు అమలుజరిపినా కులవివక్షత లేదా కులతత్వం మాత్రం నిర్మూలించబడలేదు. జ్యోతిరావ్‌పూలే కుల నిర్మూలనకు చేసిన ఉద్యమం తక్కువేమీ కాదు. రాజా రామ్మోహన్‌రాయ్‌ మహిళా సంక్షేమానికి నాటి కాలంలోనే అనేక ఉద్యమాలు సాగించారు. వీరి కృషిని అందరూ నేటికీ శ్లాఘిస్తున్నారు.  కులాంతర వివాహాలు ఎక్కువగా జరిగితే కుల నిర్మూలన జరుగుతుందని అంబేద్కర్‌ మహాశయులు అనేక సందర్భాల్లో సెలవిచ్చారు. సహపంక్తి భోజనాలు నిరంతరం సాగించాలంటూ ఉద్యమాలు వచ్చాయి. కులాంతర వివాహాలు జరిగిన కుటుంబాలు కూడా వారి సంతానానికి కులాన్నే అంటగడుతున్నారు. చివరకు కులాలపట్ల విసుగు చెందిన అంబేద్కర్‌గారు బౌద్ధమతాన్ని స్వీకరించారు. బౌద్ధమతంలో కూడా హీనయానం, మహాయానం అంటూ శాఖలను ఏర్పరచిన ఘనత భారత సమాజానిదే. క్రైస్తవ మతం భారతదేశానికి వచ్చిన తర్వాత అనేక ఉప శాఖలు అందులో ఏర్పడ్డాయి. ప్రపంచంలో లేని విధంగా రెడ్డి క్రైస్తవులు, కమ్మ క్రైస్తవులు, దళిత క్రైస్తవులంటూ అనేక విభాగాలను ఏర్పాటు చేసిన ఘనత కూడా మన సమాజానిదే. మనుచరిత్రలో నిర్మాణం గావించిన కులవివక్ష నేటికీ కొనసాగడం ఆశ్చర్యం కల్గిస్తున్నది. ఆదిమ సమాజంలో మానవ, సమాజ అవసరాల కొరకు కొన్ని వృత్తులను చేపట్టారు. నాడు వృత్తులలో పనిచేసేవారు ఒక వృత్తినుండి మరొక వృత్తికి బదిలీ అయ్యేవారు. ఆ విధంగా జరగడం వలన కొన్ని వృత్తులలో సంఖ్య తగ్గింది. అన్ని వృత్తులను స్థిరంగా వుంచడానికి వృత్తులలోని వారు మరొక వృత్తిలోనికి మారకుండా నిషేధం విధించారు. ఆ విధంగా వృత్తులు ఘనీభవించి కులాలుగా రూపాంతరం చెందాయి. నేటి ఆధునిక సమాజం ఆ కులాలకు ఉప కులాలను సృష్టించి, సమాజంలో మరిన్ని చీలికలు తెచ్చి, పాలక పదవులకు ఎదురు లేకుండా చేసుకుంటున్నారు. ఇప్పటికీ ఉప కులాల సృష్టి కార్యం జరుగుతూనే వుంది. కులం, మతాలన్నీ సమానమని, మానవులంతా ఒక్కటేనని చెప్పిన వారికి ''దైవాంశ'' అంటగట్టి కుల,మత నిర్మూలనకు అడ్డుకట్టలు వేస్తున్నారు. గౌతమ బుద్ధునికి, చివరికి మహాత్మా గాంధీకి కూడా దైవత్వాన్ని అంటగట్టే ప్రయత్నాలు సాగాయి.
1946 -51 మధ్య కాలంలో దేశవ్యాపితంగా అనేక సాయుధ ఉద్యమాలు సాగాయి. భూస్వాముల- రాజుల పాలనలకు వ్యతిరేకంగా అన్ని వర్గాల, కులాల, మతాల ప్రజలు ఏకమై పెద్దయెత్తున పోరాటం సాగించారు. తెలంగాణా సాయుధ పోరాటం, మహారాష్ట్రలో వర్లి ఆదివాసుల పోరాటం, బెంగాల్‌లో తెబాగా పోరాటం, కేరళలో మలబార్‌ రైతుల పోరాటం, పంజాబ్‌లో బెటర్‌మెంట్‌ ట్యాక్స్‌కు వ్యతిరేకంగా సాగిన చారిత్రాత్మక ఉద్యమాల్లో కలిసి పనిచేసిన సందర్భాలలో ఉద్యమించిన వారిలో కులం - మతం ప్రసక్తి రాలేదు. నేటికీ ఆ ఉద్యమాలు సాగిన ప్రాంతాల్లో పాలకులు ఎన్ని ఎత్తుగడలు వేసినా కులాల పట్టింపులు మిగతా ప్రాంతాల కన్నా తక్కువగా వుండడాన్ని గమనిస్తాం. కుల వ్యతిరేకోద్యమం వ్యవసాయ విప్లవంతో విడదీయరానిదని, నిర్మూలన జరగాలంటే వ్యవసాయ విప్లవం అనివార్యమన్న వాదనలూ ముందుకొచ్చాయి.  బడుగు వర్గాలకు ఆర్థిక వనరులు ఏర్పడితే కొంతమేర కుల నిర్మూలన జరుగుతుందని వాదనలు వస్తున్నాయి. కానీ నేడు నిమ్న కులాలలో ధనవంతులు వున్నవారు కూడా కుల పట్టింపులను పాటిస్తూనే వున్నారు. దేవాలయాల నిర్మాణాలు గావించి, పూజారులకు విద్యా బోధన కల్పించి పరీక్షలలో ఉత్తీర్ణులైనవారినే పూజారులుగా నియమించాలని అంబేద్కర్‌గారు సూచించారు. అలా నియమించేవారికి అర్హత పరీక్షలలో ఉత్తీర్ణతే తప్ప కులం కాకూడదు. ఒకే కులం వారికి స్థిరంగా పూజారీ హక్కులు వుండరాదన్నది వాదన. కానీ, నేటికీ అనేక దేవాలయాల్లో నిమ్న కులాల వారికి ప్రవేశం నిశిద్ధంగానే వుంది. దేవాలయాల నిర్మాణాలు చేసినా దేవుని పేరుతో కాకుండా నిర్మించిన దాతల పేరుతో ప్రచారాలు సాగిస్తున్నారు. బిర్లా మందిర్‌ (వెంకటేశ్వర దేవస్థానం), సంఘీ దేవాలయం (వెంకటేశ్వర దేవస్థానం) అంటూ కొత్తగా దేవాలయాలు వెలుస్తూనే వున్నాయి. దేవాలయాల నిర్మాణానికి వెచ్చిస్తున్న డబ్బు నిమ్న జాతుల అభివృద్ధికి మాత్రం వెచ్చించడానికి యిచ్ఛగించరు. చివరకు హోటళ్లలో రెండు గ్లాసుల పద్ధతి కొనసాగుతూనే వుంది. కుల పట్టింపులతో యితర కులాల వారిపై దాడులు సాగుతూనే వున్నాయి. దాడులకు గురైన వారికి థాబ్ధాలు గడచినా న్యాయస్థానాలలో తీర్పులు రావడంలేదు.     రాజ్యాంగాన్ని అమలుజరపాల్సిన పాలకులే వాటిని ఉల్లంఘించడం పరిపాటిగా జరుగుతున్నది. భావవాద సిద్ధాంతం కులరక్షణకు కీలకం. శాస్త్రీయంగా అభివృద్ధి జరిగినా భావ వాదాన్ని వీడకపోవడం కుల కట్టుబాట్లను అట్టే పెడుతున్నాయి. మతం మత్తుమందులాంటిదని మార్క్స్‌ ఏనాడో సెలవిచ్చారు.  ప్రజలను కులం, మతం మత్తులోకి దించి తమ దోపిడీని పాలక పెట్టుబడిదారులు సాగిస్తూనే వున్నారు.
నేటికీ కుల బహిష్కరణలు, గ్రామ బహిష్కరణలు, సమాజ బహిష్కరణలు వంటి శిక్షలు అమలు జరుపుతున్నారు. అనాగరిక సమాజంలో  కూడా యిలాంటి శిక్షలు అమలుజరపలేదు. అన్ని శిక్షల కన్నా, చివరకు మరణ శిక్షకన్నా కుల బహిష్కరణ అత్యంత తీవ్రమైనది. అది అనుభవిస్తే తప్ప దాని తీవ్రతను గమనించలేం. బహిరంగంగా ఈ బహిష్కరణల పర్వం జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం దృష్టికి వచ్చినా పట్టించుకున్న వారే లేరు. కొన్ని కులాలు తమలోతాము కలవడానికి సిద్ధపడినా వాటిని కలవనీయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నేటి ఆధునిక మీడియా సమాజంలోని పత్రికలు, ఛానెళ్లు కూడా భక్తిపేరుతో కులం, మతాలను ప్రోత్సహించడం గమనించాలి.  మహా భారతంలో  నాస్తికత్వానికే ఎక్కువ ప్రాముఖ్యత వుంది. కానీ, అందులో ''గీత''ను జొప్పించి మొత్తం భారతాన్నే భావవాద దృష్టికి మరల్చారు. రామ రాజ్యంలో  నాలుగు వర్ణాలు ( 1. బ్రాహ్మణ 2. క్షత్రీయ 3. వైశ్య 4. శూద్ర) వుండేవి. వీటికి విడిగా బాధ్యతలు, హక్కులు మతపరంగా, కులపరంగా రూపొందించబడినాయి. శూద్ర వర్ణం పై మూడు వర్ణాలకు కావాల్సిన ఆహార పదార్థాలను, సౌకర్యాలను, రక్షణను కల్పించాలి. పై మూడు వర్ణాలు శూద్ర వర్ణంపై ఆధిపత్యం చెలాయిస్తాయి. కాల క్రమేణా పైమూడు వర్ణాల ప్రాధాన్యత అంతరించింది. ప్రస్తుతం శూద్ర వర్ణం తనకు అప్పగించిన  బాధ్యతలను నిర్వర్తిస్తున్నది. దీన్ని సాకుగా తీసుకొని ధర్మం ఒంటికాలుపై వున్నదని కొన్ని పాలకపార్టీలే ప్రచారం చేస్తున్నాయి. తిరిగి రామరాజ్యంలోని మిగిలిన మూడు వర్ణాలను ఉనికిలోకి తేవాలని వారి వాదన.
కుల నిర్మూలన సాధ్యంకాదా?
ఏ ఫలితాన్నైనా సాధించడానికి ఒకేఒక కోణం వలన ఫలితం రాదు. ప్రతి పనికి అనేక కోణాలు, దృక్పథాలు వుంటాయి. ఒక్కొక్కటి ఒక్కోసారి ప్రాధాన్యత వహించినా అన్ని కోణాల నుండి పరిష్కార మార్గాలకు ఉద్యమం సాగాలి. కుల నిర్మూలన అన్నది భావజాలమే అయినా అది నిర్మూలించబడడానికి అన్ని విధాలుగా ప్రధాన బాధ్యతగా పాలకుల చొరవ ఎక్కువగావుండాలి. లౌకిక రాజ్యంలో మతాన్ని, కులాన్ని రాజ్యాంగంతో ముడిపెట్టరాదు. కులమతాలను అనుసరించదలచినవారు తమ స్వంత ఆదాయాలతో వాటిని నిర్వహించుకోవాలి. దేవాలయాలైనా, పూజలు, పురస్కారాలైనా తమ స్వంత ఆదాయాలనుండి భరించాలి. ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర వుండరాదు. అనగా నేడు మన రాజ్యాంగ వ్యవస్థలో దేవాదాయ శాఖ, ధర్మాదాయశాఖ, వక్ఫ్‌బోర్డు లాంటి వాటికి ప్రాధాన్యతలు ప్రభుత్వమే కల్పించడం వలన కుల నిర్మూలనకు అవకాశమేలేదు. నచ్చినవారు తన ఆదాయం నుండి వ్యయం చేసుకొని వాటిని పాటించేవిధంగా రాజ్యాంగ యంత్రంలో మార్పులు చేయాలి. సహపంక్తి భోజనాలు, కులాంతర వివాహాలు నిరంతరం కొనసాగాలి. కుల సంఘాలను ఏర్పాటు చేయడాన్ని నిషేధించాలి.  ఆర్థికంగా అణగారిన నిమ్న జాతుల వారిని, ఆర్థికంగా, సామాజికంగా  వెనకబడిన వారికి అదనపు ఆర్థిక సౌకర్యాలు, రక్షణలు కల్పించి వారి అభివృద్ధికి కృషి సాగాలి. భూ సంబంధాలలో తీవ్రమైన మార్పులు తేవాలి. ప్రతివ్యక్తికి భూమిపై హక్కు కల్పించాలి. భూస్వామ్య విధానాన్ని రద్దుచేసి వాస్తవంగా సాగుచేసుకొనేవారికి హక్కు కల్పించాలి. సాగుతో సంబంధంలేని వారికి భూమిపై ఎలాంటి హక్కులు వుండరాదు. రిజర్వేషన్ల ద్వారా ఆ కుటుంబాలకు రక్షణ కల్పించాలి. జనాభా ప్రాతిపదికన బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు జరగాలి. కుల బహిష్కరణలను తీవ్రమైన చర్యగా భావించి అలాంటివాటికి పాల్పడినవారికి చట్టంలో కఠినమైన శిక్షలను పొందుపర్చాలి. రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయిలలో కుల నిర్మూలనను ఆశించేవారితో కమిటీలు వేయాలి. ఈ కమిటీలకు చట్టబద్దత కల్పించాలి.వీరిచ్చే సూచనలను పాలక యంత్రాంగం పాటించేవిధంగా వుండాలి. పాఠ్యపుస్తకాలలో కుల నిర్మూలనకు సంబంధించిన అంశాలు చేర్చాలి.
- సారంపల్లి
---

No comments:

Post a Comment