Monday, 11 August 2014

ప్రజలకు అందుబాటులో బ్లాక్‌ సమితి - నిర్వహణ

 కాల్పట్టా బ్లాక్‌ సమితి వివరాలు యీ విధంగా వున్నాయి.
బ్లాకులోని 10 గ్రామ పంచాయితీల నుండి ఎన్నికయినవారు 14 మంది బ్లాకు కమిటీ సభ్యులు కాగా, 10 మంది సర్పంచ్‌లు ఎక్స్‌- అఫిషియోగా వున్నారు. ప్రతి బ్లాకులో నాలుగు కమిటీలు పనిచేస్తాయి. 1. ఫైనాన్స్‌ కమిటీ 2. డెవలప్‌మెంట్‌ కమిటీ 3. వెల్ఫేర్‌ కమిటీ 4. స్టీరింగ్‌ కమిటీ. ఫైనాన్స్‌ కమిటీకి వైస్‌ ఛైర్మన్‌ అధ్యకక్షునిగా వుంటాడు. స్టీరింగ్‌ కమిటీలో బ్లాకు ప్రెసిడెంట్‌, వైస్‌ ప్రెసిడెంట్‌, పై మూడు స్టాండింగ్‌ కమిటీల ఛైర్మన్‌లు సభ్యులుగా వుంటారు. ఈ బ్లాకులో 1.75 లక్షల ఓటర్లు వున్నారు. ప్రతి బ్లాకు సభ్యునికి 10-12 వేల ఓట్లు వుంటాయి.
నిధులు :
జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయిస్తారు. గ్రామం, బ్లాకు, జిల్లాలకు రాష్ట్ర ప్రణాళికా బడ్జెట్‌ నుండి 40శాతం కేటాయిస్తారు. ఈ మూడింటికీ సమానంగా నిధులు కేటాయిస్తారు. ఈ బ్లాకుకు ఏటా రు. 20-25 కోట్లు బడ్జెట్‌ వ్యయం చేస్తున్నారు.
జిల్లా బడ్జెట్‌ రు. 50 కోట్లు వుంటుంది.
వ్యవసాయ రంగంగం :
40శాతం ప్రణాళికా నిధులు వ్యవసాయ రంగానికి వ్యయం చేయాలి. విత్తనాలు, మిషనరీ, ఎరువులు, సబ్సిడీపై రైతులకు అందజేస్తారు. 2007-08లో హెక్టారుకు రు. 5000లు విలువగల్గిన పై ఉపకరణాలను సబ్సిడీగా యిచ్చారు.
వైద్యం:
బ్లాకు దావఖానాలో 120 పడకలు వున్నాయి. ఏడుగురు డాక్టర్లు పనిచేస్తున్నారు. ఇవిగాక కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ ఒకటి, (40 పడకలు), బ్లాకు ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ ఒకటి (30 పడకలు) పనిచేస్తున్నాయి. పై రెండు సెంటర్లలో నలుగురు చొప్పున డాక్టర్లు పనిచేస్తున్నారు. ఈ మూడు వైద్యశాలల పనిని బ్లాకు సమావేశాలలో సమీక్షిస్తారు. మందులు ఉచితంగా యిస్తున్నారు.
సిబ్బంది:
1. బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ 2. అసిస్టెంట్‌ అగ్రికల్చరల్‌ డైరెక్టర్‌ 3. సిడిపిఓ (సోషల్‌ వెల్ఫేర్‌, ఛైల్డ్‌ & వుమెన్‌ వెల్ఫేర్‌ మరియు అంగన్వాడీ కేంద్రాలను సిడిపీవో గారు నిర్వహిస్తారు.), 4. బ్లాకు ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ డాక్టర్లు, 5. ఎస్సీ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ 6. పశు సంవర్థక డాక్టర్‌ 7. లిటరీసీ (అక్షరాస్యతా) ఆఫీసర్‌ 8. డెయిరీ విస్తరణాధికారి 9. అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు, ఇద్దరు ఓవర్సీస్‌ 10. ట్రైబల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌. వీరు నిరంతరం ప్రజలకు అందుబాటులో వుండేవిధంగా బ్లాకు పర్యవేక్షణ వుంటుంది.
ఈ బ్లాకులో ఒక ఓల్డేజ్‌ హోమ్‌ (వృద్ధాశ్రమం) వుంది.  అందులో 50 మంది లబ్ధి పొందుతున్నారు.
వార్డుల రిజర్వేషన్‌:
ఈ బ్లాకులో రెండు ఎస్టీ, ఒకటి ఎస్సీ, 33శాతం మహిళలకు స్థానాలు రిజర్వు చేయబడినాయి. ఈ బ్లాకు ప్రెసిడెంట్‌గా ఎస్టీ ఉమెన్‌కు రిజర్వ్‌ చేయబడింది.
వైనాడ్‌ జిల్లాలోని కాల్పట్టా బ్లాకు కేంద్రం జిల్లాకు ముఖ్య పట్టణంగా కూడా వుంది. ఆ పట్టణాన్ని పరిశీలించినప్పుడు కొత్తగా వెళ్ళిన వారికి కూడాఎలాంటి యిబ్బందులు కనబడవు. ప్రతి వ్యక్తి తన బాధ్యతను నిర్వహిస్తారు. ముఖ్యంగా పారిశుధ్ద్యానికి అక్కడి ప్రజలే ప్రాధాన్యత యిస్తున్నారు. ఇతర ప్రాంతాల ప్రజలు వెళ్ళినప్పుడు వారికి సరియైన సమాచారం యిచ్చి సహకరించడం అక్కడే కనబడుతుంది. ఆ జిల్లా ప్రధానంగా గిరిజన తరగతులకు కేటాయించినది. అక్కడ ప్రతి గిరిజన పల్లిలో కూడా 100శాతం విద్యా భోదన జరుపుతున్నారు. వారిని ఆర్థికంగా, సాంఘికంగా అభివృద్ధి చేయడానికి ఈ స్థానిక సంస్థలు నిరంతరం పాటుపడుతుంటాయి.
కొబ్బరి, పోక చెట్లు, మిరియాలు, యాలకులు, రబ్బరు ప్రధాన పంటలుగా వున్నాయి. ఖాళీగా వున్న ప్రదేశాల్లో వరి పంట పండిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరి పంటకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తున్నది. ఈ పంట వేసిన వారికి హెక్టారుకు రు. 5000 నుండి 8000ల వరకు ఉపకరణాలను రాయితీలుగా యిస్తున్నారు. పైగా, పండిన ఉత్పత్తులను ప్రభుత్వమే కిలో ధాన్యాన్ని రు. 11లకు కొనుగోలు చేస్తున్నారు. విశేషమేంటంటే బహిరంగ మార్కెట్‌లో కూడా బియ్యం ధర రు. 15లకే అమ్మకాలు సాగుతున్నాయి. కూరగాయల ఉత్పత్తులు తగినంత వుండటమే గాక ఎగుమతులు కూడా చేస్తున్నారు. ఆహారంలో  ప్రధానంగా చేపల వినియోగం ఎక్కువ.
ఎక్కడా 100 ఎకరాలు చదునుగా వున్న ప్రదేశం లేకున్నా, జిల్లా పూర్తిగా పర్వతాలతోనిండి వున్నా అందులోని సాగుకు ఉపయోగపడే స్థలాన్ని లేదా మట్టితోనున్న గుట్టలపైన సుగంధ ద్రవ్యాల పెంపకం సాగుతున్నది. సముద్ర మట్టానికి 600 అడుగుల ఎత్తులో వున్న ఈ జిల్లాలో వాతావరణం నిరంతరం చల్లగాను, ఆహ్లాదకరంగాను వుంటుంది.
రవాణా సౌకర్యాలు అపరిమితం. ఎక్కడికి వెళ్ళాలన్నా రాష్ట్ర ప్రభుత్వ వాహనాలేగాక ప్రయివేటు వాహనాలు కూడా వున్నాయి. ఈ జిల్లా గుండా 212 జాతీయ రహదారి వుంది. ఆ రహదారి గుండా ప్రయాణం చేయడం ఒక విచిత్ర అనుభూతిని కల్గిస్తుంది. జిల్లాలో అభయారణ్యం విశాలమైన ప్రాంతంలో వుంది. ఏనుగులు, లేళ్ళు, అడవి దున్నలు మొ||గునవి చూపరులకు కనువిందు చేస్తున్నాయి. అవినీతికి తోవలేని విధంగా స్థానిక సంస్థల పనులు సాగుతున్నాయి. గ్రామస్థాయిలోనే ప్రణాళిక ఏర్పాటుచేసి ఆ ప్రణాళికను బ్లాకు, జిల్లా పరిషత్‌ స్థాయిలో ఆమోదించిన తర్వాత అందుకు కావాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం వారికే కేటాయించింది. ముఖ్యంగా జాతీయ ఉపాధి హామీ పథకం పనులు పంచాయితీల ద్వారా జరపడాన్ని బ్లాకు, జిల్లా సంస్థలు సమీక్షిస్తూంటాయి. ఈ నిర్వహణల వల్ల శాసనసభ్యులు, పార్లమెంట్‌ సభ్యులపై వత్తిడి తగ్గుతుంది. వారు రాష్ట్రానికి విధానాన్ని రూపొందించడానికే ఎక్కువ సమయాన్ని కేటాయించడానికి వీలు ఏర్పడుతున్నది. స్థానిక సంస్థల నిర్వహణ గ్రామీణ ప్రజానీకానికి అత్యంత అందుబాటులో వుంది. మన రాష్ట్రంలోని స్థానిక సంస్థలు ఎప్పుడు ప్రజలకు అందుబాటులోకి వస్తాయో! ఈ పాలకులకు ఎప్పుడు జ్ఞానోదయం కలుగుతుందో!
---

No comments:

Post a Comment