Monday, 11 August 2014

వ్యవసాయ సంక్షేమ చర్యలా? సంక్షోభానికి దారా?

ఖరీఫ్‌ వర్షాలు ప్రారంభమవుతున్న దశలో రాష్ట్ర రైతాంగం  విత్తనాలు, ఎరువులు, రుణాల కొరకు పరుగులెత్తడం ప్రారంభించారు. ఈ రోజు మార్కెట్‌లో విత్తనాలు, ఎరువుల కొరత కారణంగా వ్యాపారులు బ్లాక్‌మార్కెట్‌లో ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. ఏ జిల్లాలో చూసినా రైతుల ఆందోళనలు సాగుతున్నాయి. ఏటా ఖరీఫ్‌, రబీ సాగుచేస్తున్న సందర్భంలో వస్తున్న సమస్యలే ఈ రోజు కూడా రైతుల ముందుకొచ్చాయి. ప్రభుత్వం రైతాంగ సమస్యను తక్షణమే పరిష్కరిస్తామంటూ ప్రకటనలపై ప్రకటనలు చేస్తున్నాయి. అయినా, సమస్యల పరిష్కారానికి మార్గం మాత్రం కన్పించడంలేదు.
ఎరువులు నిల్వచేసి ఎక్కువ ధరలకు అమ్మే వారిని ప్రీవెంటివ్‌ డిటెన్షన్‌ చట్టం క్రింద అరెస్టు చేయాలని ముఖ్యమంత్రిగారు స్వయంగా ప్రకటించారంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. పైగా, విత్తనాలు కూడా ఈరోజు కొరతగానే వున్నాయి. వరి, వేరుశనగ, కందులు, సోయా విత్తనాలు బ్లాక్‌మార్కెట్‌లో అమ్ముతున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై యిస్తామని ప్రకటించడంతో ప్రభుత్వ గోదాముల వద్ద రైతులు క్యూ లలో నిలబడుతున్నారు. విత్తనాల సంపాదనకే రెండు మూడు రోజులు దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు. అలాగే ఎరువుల కొరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. అన్నింటికి మించి వ్యవసాయ పెట్టుబడులు పెట్టడానికి రైతులు ప్రయివేటు వ్యాపారస్తులను ఆశ్రయించాల్సి వస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘‘రుణ మాఫీ పథకం-2008’’ అమలు జూన్‌లో పూర్తిచేస్తామని ప్రకటించారు. కానీ యింతవరకు గణాంకాల సేకరణ కూడా పూర్తికాలేదు. సకాలంలో పడుతున్న వర్షాల వలన రైతులకు పెట్టుబడికి నిధులు అత్యంత ఆవశ్యకం. పై మూడు ప్రాథమిక వనరుల సేకరణకు రైతాంగం ఆందోళన చెందుతున్నది. వర్షాలు పడకముందే పై మూడు ఉపకరణాలను సిద్ధం చేసుకోవాలి. అలాంటిది వర్షాలు పడినప్పటికీ వేచి చూడండని ప్రభుత్వం చెబుతున్నది. వారం రోజులు ఆగి కొనుగోలు చేస్తే ఎరువుల ధరలు తగ్గుతాయని ముఖ్యమంత్రి మరియు వ్యవసాయశాఖా మాత్యులు సెలవిస్తున్నారు. ఎరువుల కొనుగోలుకు రైతులు పడుతున్న ఆందోళనను దాటవేయడానికి యీ నినాదం బాగా ఉపకరిస్తున్నది. ఎరువుల ధరలు తగ్గుతాయని చెప్పడమంటే ప్రస్తుతం ఎక్కువ ధరలకు ఎరువులను కొనేవాళ్ళు నష్టపోవాల్సి వస్తున్నది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలను తగ్గించబూనుకొన్నప్పుడు ఆ నిర్ణయం మే నెలలోనే చేయాలి. జూన్‌లో ఎరువులు కొనేవారందరికీ ఆ మినహాయింపు వర్తించబడాలి. కానీ, ఖరీఫ్‌ సీజన్‌కు కావాల్సిన ఎరువులు కొనుగోలు చేసిన తర్వాత ఎరువుల ధరలు తగ్గుతాయని ప్రకటించడం బాధ్యతగల ప్రభుత్వం చేయాల్సిన పనికాదు.
రానున్న ఖరీఫ్‌ ధాన్యానికి క్వింటాల్‌ ధర రు. 850లు నిర్ణయిస్తూ కేంద్రం ప్రకటించడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. చివరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా క్వింటాల్‌కు రు. 1300లు వుండాలని రికమెండ్‌ చేశారు. రైతు సంఘాలు గత సంవత్సరం క్వింటాల్‌కు రు. 1000లు కావాలని పెద్దయెత్తున ఆందోళనలు చేశారు. ఈ మధ్య కేంద్ర వ్యవసాయశాఖామాత్యులు శ్రీ షరద్‌ పవార్‌గారు హైదరాబాద్‌కు వచ్చినప్పుడు వరికి క్వింటాల్‌కు రు. 1000లు ధర యివ్వడంపై పరిశీలనచేస్తామన్నారు. కేంద్ర ధరల నిర్ణాయక కమిషన్‌ ఇదే ధరను కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్‌ చేసింది. అయినా కేంద్రం రు. 850లు మాత్రమే నిర్ణయించింది. పై సమస్యను పరిశీలిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే రు. 1000లు యివ్వడానికి సుముఖంగా వున్నప్పటికీ, ధరను ఎవరో తక్కువ నిర్ణయించారని విచారం వెలిబుచ్చడం ఆశ్చర్యపరుస్తున్నది. ధరను నిర్ణయించాల్సిన ప్రభుత్వమే ‘‘కంచె చేను మేసినట్లు’’ ధర పెరగాలని కోరుతున్నది.
రుణమాఫీ పథకం ఇంకా పరిశీలన సాగుతూనే వున్నది. ఆ పథకంలో 1997 మర్చి 31 కంటే ముందు బట్వాడా చేసిన రుణములకు ఈ పథకం వర్తించదు. మార్చి 31, 2007 లోగా బట్వాడా జరిగి డిసెంబర్‌ 31, 2007 నాటికి వాయిదా మీరి వుండి ఫిబ్రవరి 29, 2008 నాటికి చెల్లించనట్లయితే వారికి మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది. పై పథకం ఐదెకరాల లోపు వారికే. ఐదెకరాలు మించినవారికి ఏకకాల పరిష్కృత పథకం (వన్‌టైం సెటిల్‌మెంట్‌) క్రింద 25శాతం రుణమాఫీ చేస్తారు. మిగిలిన మొత్తాన్ని వారు మూడు వాయిదాల్లో అనగా 30-09-2008, 31-03-2009 మరియు 30-06-2009లను చెల్లించాల్సిన తేదీలుగా నిర్ణయించారు. అలా వాయిదాలు చెల్లించడంలో విఫలమైన తీరుకు వన్‌టైం సెటిల్‌మెంట్‌ వర్తించదు. ఇది రుణమాఫీ పథకం అమలు జరుపు విధానం. 30-06-2008 నాటికి బ్యాంకు లేదా బ్రాంచి లేదా సంఘం నోటీసు బోర్డులో రుణమాఫీ దారుల జాబితాలను ప్రకటించాలని అట్టహాసంగా ప్రచారం చేస్తున్నారు.  పై సమస్యలను పరిశీలించినప్పుడు ప్రభుత్వం అనుసరిస్తున్న చర్యలు రైతుల యొక్క సంక్షోభాన్ని ఏమాత్రమూ నివారించదగిన స్థితిలో లేవు.
రాష్ట్ర ముఖ్యమంత్రి 2008-09 సంవత్సరంలో వ్యవసాయాభివృద్ధి కొరకు 22 శాఖలనుండి రు. 32,074 కోట్ల బడ్జెట్‌ కేటాయింపుతో సమగ్ర వ్యవసాయాభివృద్ధి పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం క్రింద పంటలు, హార్టీకల్చర్‌, సెరీకల్చర్‌, పశు సంవర్థక శాఖ, చేపలు, డెయిరీ (పాలు), పౌల్ట్రీ, గొర్రెలు, మేకల పెంపకం, తేనెటీగల పెంపకం చేరివున్నాయి. 180 లక్షల టన్నుల నుండి 191 లక్షల టన్నులకు ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచాలని లక్ష్యంగా పెట్టారు. ఉచితవిద్యుత్‌, జలయజ్ఞం, మైక్రో ఇరిగేషన్‌ (సూక్ష్మనీటిపారుదల), పంటరుణాల పెంపు, పంటల బీమాపథకం, ఆదర్శ రైతుల పథకం, పొలంబడి, విత్తనగ్రామ పథకం, పశుక్రాంతి, జీవక్రాంతి తదితర కార్యక్రమాల ద్వారా వ్యవసాయాభివృద్ధి జరుగుతుందని ఈ పథకంలో పేర్కొన్నారు. జాతీయ ఆహార భద్రత క్రింద వరి మరియు పప్పుధాన్యాల పెంపుదలకు 2008-09 బడ్జెట్‌లో రు. 77 కోట్లు కేటాయించారు? 80శాతం రైతులకు రుణాలు రద్దవుతాయని అంచనావేశారు. రుణాలు చెల్లించినవారికి రు. 5వేలు చొప్పున యిస్తారట.
మే 17నుండి జూన్‌ 15 వరకు రైతుచైతన్య యాత్రలు మరియు సదస్సులు నిర్వహించి రైతుల సమస్యలను అక్కడిక్కడే పరిష్కారం చేస్తామన్నారు. కానీ, రైతు సదస్సులలో సమస్యలపై మాట్లాడిన రైతులపై మంత్రులే నేరుగా దాడిచేయించి తమ వ్యవసాయ సంక్షేమాన్ని చాటుకొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో రైతు సమస్యల పరిష్కారాన్ని కోరిన బుడితి అప్పలనాయుడు అను రైతును స్వయంగా రెవిన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాద్‌రావే దాడికి పూనుకొన్నారు. పైగా, పోలీసులకు చెప్పి బూటుకాళ్ళతో తన్నించారు. సదస్సులలో రైతులను చైతన్యపర్చే విధానమా ఇది?
రాష్ట్ర ప్రభుత్వం రైతుల యెడల ఎన్ని పథకాలు ప్రకటించినా వారి సంక్షోభం మాత్రం నివారణ కావడంలేదు. అందుకు రైతుల ఆత్మహత్యలే నిదర్శనం. నిత్యం రైతు సంక్షేమం గురించి మాట్లాడటం, వరాలు ప్రకటించడం నిరంతరం సాగుతున్నది. 2007-08లో 18 శాఖల నుండి రు. 22647 కోట్లతో ఇలాంటి పథకాన్నే ప్రకటించారు. అందులో సాధించింది మాత్రం ప్రభుత్వం తన సమీక్షలో తెలపలేదు.
రాష్ట్రంలో 25లక్షల మంది కౌలురైతులు ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు లేకుండా వున్నారు. పట్టుగూళ్ళు రు. 160లకు కిలో అమ్మాల్సింది రు. 60లకు మాత్రమే అమ్ముకొంటున్నారు. చెరకు పంట వేసిన రైతులు ధరరాక దివాళా తీశారు. ప్రకృతివైపరీత్యాల వల్ల గత సంవత్సరం నాలుగుసార్లు పంటలను కోల్పోయిన రైతులు రుణగ్రస్తులైనారు. రుణాల రద్దు పథకం 15-20శాతం రైతులకు మాత్రమే ఉపయోగపడుతున్నది. 2007 మార్చి తర్వాత రుణం పొందిన వారు ఎక్కువమంది వున్నారు. గత సంవత్సరం బ్యాంకులు ప్రకటించిన లెక్కల ప్రకారమే పంట రుణాలు 17300 కోట్లు యిచ్చినట్లు చెబుతున్నారు. ఈ రుణాలు మాఫీకి వర్తించవు. రుణం చెల్లించలేనివారిని బలవంతపెట్టి, వారితో సంతకాలు తీసుకొని వారి లెక్కలను బుక్‌ అడ్జెస్ట్‌మెంట్‌ చేసి వారిని కొత్త బాకీదారుగా చేశారు. ఈ విధానం గత ఐదారు సంవత్సరాలుగా సాగుతున్నది. పైగా, 1997కు ముందు అప్పు పొందిన వారికి రుణమాఫీ లేదు. ఎరువులు, విత్తనాలు నేడు కార్పొరేట్‌ కంపెనీల స్వాధీనంలో వున్నాయి. వారిని నియంత్రించడానికి రాష్ట్రంలో ఎలాంటి చట్టాలూ లేవు. వ్యవసాయ తరణంలో విత్తనాలు, ఎరువులు, రుణాలు అత్యంత కీలకమన్నది అందరూ ఎరిగినదే. కానీ, ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కారానికి మాత్రం సుముఖంగాలేదు. పైగా, సమస్యలేవీ లేవని, అన్నీ పరిష్కరించబడ్డాయని బుకాయింపు ప్రచారం చేస్తున్నది.
2005-06లో 108.39 లక్షల హెక్టార్లు, 2006-07లో 102.39 లక్షల హెక్టార్లు, 2007-08లో 110 లక్షల హెక్టార్లు సాగైంది. బీడు భూముల సంఖ్య అదేపనిగా పెరుగుతున్నది. 1966-67లో 30.40 లక్షల హెక్టార్లు బీడు భూములు కాగా, 2006-07లో 47.49 లక్షల హెక్టార్లకు పెరిగింది. సాగుభూముల విస్తీర్ణం తగ్గుతున్నది. ఆహార పంటల విస్తీర్ణం తగ్గుముఖంలో వున్నది. హార్టీకల్చర్‌ పంటలకు ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తున్నది. తీరా పంట చేతికివచ్చాక మార్కెట్‌లో ధర రాక పండ్ల తోటలను నరికివేస్తున్నారు. ఆక్వా, ఆయిల్‌పామ్‌ రైతులు కూడా ధర రాక నష్టపోతున్నారు. ఇదీ నేటి రైతుల పరిస్థితి. అయినా ప్రభుత్వం వ్యవసాయ రంగంలో ఎక్కడాలేని విధంగా 2007-08లో 12శాతం వృద్ధి రేటు సాధించినట్లు నివేదికలో చెప్పింది. జాతీయ వృద్ధి రేటు 4.5శాతం వుండగా, దానికి మూడు రెట్లు పెరిగినట్లు అంచనావేశారు. వ్యవసాయశాఖలో శాశ్వత ఉద్యోగులను తొలగించే 50వేల మందిని ఆదర్శ రైతులుగా నియమించారు. వీరికి వ్యవసాయ పరిజ్ఞానం అతి తక్కువ. ఒక విధంగా రైతులే వీరికి వ్యవసాయ విద్య గరపాల్సివుంటుంది.  ఇదీ నేటి ప్రభుత్వ సంక్షేమ విధానం.
రాష్ట్రంలో సన్న, చిన్నకారు రైతులు 84శాతం వున్నారు. వీరివద్ద 45శాతం సాగుభూమివుంది. వీరికి రక్షణ కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలి. బీళ్లుగా మారుతున్న భూమిని సాగులోకి తేవాలి. ఆహార పంటలను ప్రోత్సహించి అందుకు తగు రాయితీలు యివ్వాలి. అంతేగాని ఎగుమతి ఆధారిత పంటలపై కేంద్రీకరించినచో ప్రపంచ మార్కెట్‌కు లోబడి వుండాల్సి వస్తుంది. ఎగుడు, దిగుడులుగా వున్న ప్రపంచ మార్కెట్‌లో మన రైతులు పోటీకి నిలబడటం సాధ్యంకాదు. వ్యవసాయరంగం నుండి వలసలను నిరోధించేవిధంగా ప్రభుత్వ వ్యవసాయ విధానాలు వుండాలి. సరళీకరణ విధానాలకు స్వస్తిపలకాలి. వాస్తవంగా రైతు రక్షణ చర్యలను చేపట్టాలి.
- సారంపల్లి మల్లారెడ్డి

No comments:

Post a Comment