''వ్యవసాయరంగ ప్రాథమిక వనరుల కల్పన మరియు ఉపకరణాల లభ్యతలో రైతులకు లోటు రాదు. ప్రభుత్వం రైతు పక్షపాతిగా పనిచేస్తున్నది. మిగిలిన రంగాలకన్నా వ్యవసాయరంగానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నాం.''
- డాక్టర్ వై.యస్. రాజశేఖరరెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి
2008 ఖరీఫ్‌లో విత్తనాల కొరకు రైతులు దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు. వేరేశనగ, వరి, కందులు, సోయా విత్తనాలు మార్కెట్‌లో కావాల్సిన లభ్యతలేవు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ సంస్థల ద్వారా సరఫరా చేస్తామని ప్రకటించడంతో ప్రభుత్వ గోదాముల వద్ద క్యూలు కట్టి వుంటున్నారు. తోపులాటలు జరిగినప్పుడు పోలీసులు రైతులపై లాఠీలు ప్రయోగిస్తున్నారు. విత్తనాలకొరకు వచ్చిన రైతులను అరెస్టు చేసి అక్రమ లాకప్‌లలో పెడుతున్నారు. ఈ సంవత్సరం వర్షాలు అక్కడక్కడా సకాలంలో పడటం మూలంగా విత్తనాల అవసరం ఏర్పడింది. వర్షం పడగానే విత్తనం వేయాలి. ఒకపూట విత్తనం వేయడం ఆలస్యమైనచో పంట దిగుబడి తగ్గుతుంది. ముఖ్యంగా, మృగశిర, ఆశ్లేష కార్తెలలో విత్తనాలు వేయడం వలన దిగుబడి పెరగడానికి ఆస్కారం వుంది. ఈ కార్తెలలో పంటలు వేసినప్పుడు పంటలకు కీడు చేసే క్రిమికీటకాదుల దాడినుండి తట్టుకోవడానికి మొక్క పెరిగి నెల రోజులు కావడం వలన రక్షించబడుతుంది. సాధారణంగా రైతులు వర్షం పడకముందే అనగా మే లోనే విత్తనాలు సేకరించుకుంటారు. కానీ, ఆర్థిక యిబ్బందుల వలన అనేకమంది వర్షాలు రెండు మూడు రోజులకు వస్తాయనగానే గానీ లేదా వర్షం పడిన తర్వాతగానీ విత్తనాల సేకరణకు పరుగులు పెడుతుంటారు.
రైతుల వత్తిడిని గమనించి వ్యాపారులు దీనిని మంచి అవకాశంగా భావించి విత్తనాల ధరలు పెంచడం లేదా విత్తనాల కృత్రిమ కొరత సృష్టించడం చేస్తుంటారు. ఇదే సందర్భంలో నాణ్యతలేని విత్తనాలను కూడా అధిక ధరలకు అమ్ముతుంటారు.
ముందే ప్రణాళికలు రూపొందించి ఏ మండలంలో, ఏ ప్రాంతంలో ఏ విత్తనాలు ఏ మోతాదులో వేస్తారో సమాచారం సేకరించిన వ్యవసాయశాఖ ఆ విత్తనాలను ఆ మండలంలో వారికి అందుబాటులో వుంచాలి. రాష్ట్ర వ్యవసాయశాఖ యేటా ప్రణాళికను విడుదల చేస్తూనే వుంటుంది. గత సంవత్సరం, ఈ సంవత్సరం రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా రైతుల కొరకు ''సమగ్ర వార్షిక ప్రణాళిక''ను జూన్ మొదటి వారంలోనే విడుదల చేస్తున్నారు. అందులో విత్తనాల ప్రాధాన్యతను కూడా ప్రస్తావిస్తున్నారు. అయినా ఆచరణలో విత్తనాల కొరత సాగుతూనేవుంది.
విత్తనోత్పత్తి రాష్ట్రం
ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రకాల విత్తనాల ఉత్పత్తిని కంపెనీలు, ప్రభుత్వం ప్రోత్సహించి పెంచుతున్నాయి. ఇక్కడే ప్రోసెసింగ్ కూడా చేసి ప్యాకింగ్ చేస్తున్నారు. దానిపై 'ట్రూత్‌ఫుల్ సర్టిఫికేట్' (నిజనిర్థారణ ధృవీకరణ పత్రం) జతపరచి అమ్ముతుంటారు. భారత దేశ విత్తన అవసరాలలో మన రాష్ట్రంలో జరిగే విత్తనాల ఉత్పత్తి 60శాతాన్ని సమకూరుస్తున్నది. అనగా, భారతదేశంలోనే ఎక్కువ విత్తనాలను ఉత్పత్తి చేసే రాష్ట్రంగా వుంది. విత్తనాల ఉత్పత్తి జరిగే రాష్ట్రంలోనే విత్తనాల కొరత కల్పించడం విశ్లేషించదగ్గ విషయం. విత్తనాల ధరలు కూడా క్రమబద్ధీకరణ లేకుండా పెంచుకుంటూ కంపెనీలు కోట్లాది రూపాయల లాభాలను ఆర్జిస్తున్నాయి.
గతంలో బి.టి-1 పత్తి విత్తనాలకు 'మోన్‌శాంటో' కంపెనీ (450 గ్రాముల) రు. 1850లలో విక్రయించింది. ఈ ధరలో రు. 1250లు తన రాయల్టీగా లబ్ధి పొందింది. ఇదే కంపెనీ అమెరికాలో రు. 130, చైనాలో రు. 40ల రాయల్టీని మాత్రమే తీసుకొని బి.టి టెక్నాలజీని అమ్ముకొంటున్నది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలోని ఎం.ఆర్.టి.పిలో కేసు వేసి రాయల్టీ తగ్గించాలని కోరింది. ఫలితంగా, గత సంవత్సరం ఎకరా విత్తనాలకు రు. 650ల నుండి 750ల మధ్యలో అమ్మారు. తిరిగి ఈ సంవత్సరం అదనపు ధర రాబట్టడానికి బి.టి-2 పేరుతో అదే కంపెనీ మరలా ధరను రు. 1800లకు పెంచే ప్రయత్నం చేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం మరియు రైతు సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. హైకోర్టు కంపెనీకి స్టే యివ్వలేదు. ఈ పరిస్థితుల్లో కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ కేసు వేసింది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే, విత్తనాలు అత్యధికంగా ఉత్పత్తిచేసే రాష్ట్రానికి ''సమగ్ర విత్తన చట్టం'' లేకపోవడమే. విత్తన చట్టం - 2004 బిల్లు యింతవరకు ఆమోదించబడకుండా పార్లమెంట్‌లోనే వుంది. సమగ్ర విత్తన చట్టం లేనందున ఇటు రైతులు, అటు విత్తన వ్యాపారుల మధ్య సంబంధాలలో అనేక సమస్యలు వస్తున్నాయి. వాస్తవానికి విత్తన చట్టం చేసి అమలు జరపాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను కేంద్రం పైకి నెట్టింది.
రాష్ట్రంలో విత్తన మార్పిడి క్రింద ప్రధాని ప్యాకేజీలో రు. 470.18 కోట్లు కేటాయించారు. 100శాతం విత్తన మార్పిడికి అవకాశం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. కానీ, ఆచరణలో మాత్రం 'ఎక్కడవేసిన గొంగళి అక్కడే' అన్నట్టు వుంది.
రాష్ట్రంలో విత్తన అవసరాలు
రాష్ట్రంలో ఖరీఫ్‌లో 40 లక్షల క్వింటాళ్ళు, రబీలో 12 లక్షల క్వింటాళ్ళ విత్తనాలు అవసరం. ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల ద్వారా 20లక్షల క్వింటాళ్ళు మాత్రమే ఖరీఫ్‌లో సరఫరా చేస్తున్నారు. విత్తన మార్పిడి క్రింద ఖరీఫ్‌లో 47శాతం, రబీలో 64శాతం విత్తనాలను వినియోగిస్తున్నట్లు 2007-08లో ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. కానీ, నాణ్యతకల్గిన విత్తనాలు రైతులకు అందుబాటులో లేవు. 2008-09 ఖరీఫ్‌లో 144 లక్షల ఎకరాలలో మెట్టపంటలు సాగుచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది.
ఇవిగాక చెరకు, పొగాకు, ఉల్లి, జనుమలతో పాటు యితర కూరగాయల పంటలు కూడా వేస్తారు. హార్టీకల్చర్ (సుగంధ ద్రవ్యాలు, పండ్ల తోటలు, కూరగాయలు, ప్లాంటేషన్, పూలు) 40లక్షల ఎకరాలలో వేస్తున్నారు. వాస్తవానికి ఈ గణాంకాలకు మించే సాగవుతున్నట్లు అంచనా. ఈ పంటలకు కూడా మొక్కలను, తగు విత్తనాలను హార్టీకల్చర్ శాఖ సరఫరా చేయాలి. కానీ, అనేక యిబ్బందులకు రైతాంగాన్ని గురిచేస్తున్నారు.
పై పంటలకు కావాల్సిన విత్తనాలను రైతులకు అందుబాటులో వుంచడంలో వ్యవసాయశాఖ వైఫల్యం కొనసాగుతున్నది. రాష్ట్రంలో ఖరీఫ్, రబీకి కలిపి 50లక్షల క్వింటాళ్ళ విత్తనాలు అవసరం. విత్తన పంపిణీ వ్యవస్థను క్రమబద్దీకరించినప్పుడు ఈ లక్ష్యాన్ని సాధించడం పెద్ద సమస్యకాదు. 1965 - 85 మధ్య కాలంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, జాతీయ విత్తనాభివృద్ధి సంస్థలు రైతులకు కావాల్సిన విత్తనాలను అందుబాటులో వుంచినాయి. కానీ, 1994 సరళీకరణ తర్వాత విత్తన రంగంలోకి కార్పొరేట్ సంస్థల ప్రవేశంతో కంపెనీలో అరాచకం, ధరల నిర్ణయంలో నియంత్రణ లేకపోవడం, విత్తన నాణ్యతలో లక్ష్యశుద్ధి లేకపోవడం జరుగుతున్నది.
విత్తన గ్రామం
రాష్ట్రంలో ''విత్తన గ్రామం'' పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం 25 ఎకరాలను ఒక యూనిట్‌గా నిర్ణయించి విత్తనోత్పత్తి చేయాలి. ఆ విధంగా 22 జిల్లాల్లో ఖరీఫ్‌లో 6450 యూనిట్‌లలో 1.60 లక్షల ఎకరాలలో, రబీలో 5050 యూనిట్‌లలో 1.25లక్షల ఎకరాలలో ఈ కార్యక్రమం ప్రారంభించారు. 2.85లక్షల ఎకరాల్లో జరిగిన విత్తనోత్పత్తి మన రాష్ట్ర అవసరాలకు సరిపోతుంది. కానీ, విత్తన గ్రామ పథకం అమలు సరిగాలేకపోవడం వలన విత్తనం కొరతగానే వుంది.
విత్తన పరీక్షలు
2007-08లో విత్తన సాంపిల్స్‌ను సేకరించి నాణ్యతను పరిశీలించడానికి 19వేల యూనిట్‌లు లక్ష్యాలుగా నిర్ణయించారు. కానీ, సాధించినది 5497 యూనిట్‌లు మాత్రమే. మార్కెట్‌లలో అమ్ముతున్న విత్తనాల నాణ్యతను పరిశీలించడానికి ప్రభుత్వం యేటా నిధులు కేటాయిస్తూనేవుంది. నిధుల విడుదల లేకపోవడం వలన సాంపిల్స్ సేకరణ, వాటి పరీక్షలు ఎక్కడివక్కడే వుంటున్నాయి. 2008-09 సంవత్సరానికి రు. 271.46 కోట్లతో విత్తన పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఈ సబ్సిడీతో ఖరీఫ్‌లో 12.44 లక్షల క్వింటాళ్ళు, రబీలో 6.25 లక్షల క్వింటాళ్ళు రైతులకు పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. మరి ఈ లక్ష్యం ఏమయినట్లు? ఈ సబ్సిడీ విత్తనాలు కూడా యింతవరకు రైతులకు పంపిణీ కాకపోవడం ఆందోళన కల్గించే అంశం.
వీటికితోడు రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం, ఈ సంవత్సరం కూడా యేటా రు. 42.42కోట్లు విత్తన పంపిణీకి బడ్జెట్‌లో కేటాయించింది. ''విత్తన గ్రామం'', విత్తనాభివృద్ధి, విత్తన పంపిణీ, విత్తన మార్పిడిలాంటి పథకాలు అనేకం వున్నప్పటికీ రైతులకు ఎందుకు నాణ్యమైన విత్తనాలు సకాలంలో అందడంలేదు? దీని పరిష్కారాలేమిటి?
సరళీకరణ విధానాలు - ఫలితాలు
విత్తనరంగంలోకి కార్పొరేట్ సంస్థల ప్రవేశంతో అనేక నూతన సమస్యలు ఉత్పన్నమైనాయి. కార్పొరేట్‌ల దృష్టి లాభాలమీదనే తప్ప నాణ్యతమీద, రైతుల అవసరాల మీద లేదనేది గత అనుభవం తెలియపరుస్తున్నది. రాష్ట్రంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ప్రతి జిల్లాలో ఏదోఒక వ్యవసాయ పరిశోధనాలయాలు వున్నప్పటికీ వాటి ద్వారా గతంలో జరిగిన సేవలు కూడా నేడు అందడంలేదు.
గతంలో ఎం.ఓ.యు (పరస్పర అవగాహన ఒప్పందం) వున్నప్పటికీ వ్యాపారులు దాన్ని పాటించలేదు. కార్పొరేట్ సంస్థలు ఆ ఒప్పందంపై సంతకాలు చేయనిరాకరించాయి. అయినా, ప్రభుత్వం వారిపై ఎలాంటి వత్తిడి తేలేకపోయింది. ఆ ఒప్పందం వున్నప్పటికీ నాణ్యతలేని విత్తనాలు సరఫరా చేసినట్లు జిల్లాస్థాయి ఎం.ఓ.యు కమిటీలు నిర్థారించినా రైతులకు నష్టపరిహారం యివ్వలేదు. వరంగల్, ప్రకాశం, గుంటూరు, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో లక్షలాది ఎకరాల పంటలకు నాణ్యతలేని విత్తనాల వల్ల వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. చివరకు బొప్పాయి విత్తనాలు కూడా నాణ్యత లేనివి సరఫరా చేసిన ఘటనలు వున్నాయి.
ఒక విధంగా ప్రభుత్వ రంగం విత్తన రంగం నుండి పూర్తిగా దూరం కావడమే దీనికి కారణం. పైగా, కార్పొరేట్ సంస్థలకు అనుగుణంగా చట్టాలు, మార్పులు తెచ్చారు. అవి రైతులకు ప్రయోజనకరంగా వున్నాయా? లేదా? అన్న పరిశీలన లేదు. హరితవిప్లవ కాలంలో మన ఉత్పత్తి పెంచడంలో విత్తన రంగం ప్రముఖ పాత్ర వహించింది. నేడు ఆ విత్తన రంగమే రైతుల ఆత్మహత్యలకు కారణమవుతున్నది. ఈ మార్పు రావడానికి సరళీకరణ విధానాల అమలు కారణంగా వుంది. రైతాంగ ప్రయోజనాలను రక్షించడానికి, దేశంలో వ్యవసాయోత్పత్తులను పెంచడానికి ఆటంకంగా వున్న ఈ సరళీకరణ విధానాలను విడనాడాలి. రైతుల ప్రయోజనాలను రక్షించేవిధంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో పరీక్షలు జరిపి వారి ఆమోదం పొందిన తర్వాతనే విత్తనాలను వాణిజ్యపరంగా విడుదల చేయాలి. కంపెనీలే తమ ఉత్పత్తులకు తామే ధృవీకరించుకొనే విధానానికి స్వస్తి పలకాలి. ప్రతి మండలంలో ఆయా పంటల అవసరాలకు తగినవిధంగా నాణ్యతగల విత్తనాలను అందుబాటులో వుంచాలి. వ్యవసాయశాఖ ద్వారా పంపిణీ చేయాలి. లేదా పంపిణీ చేసే వ్యాపారులపై వ్యవసాయశాఖ నియంత్రణ వుండాలి. మే మాసంలోనే వ్యవసాయ ప్రణాళిక సిద్ధం చేసి అందుకు తగిన విత్తనాలను అందుబాటులో వుంచాలి. విత్తన ధరలను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికే వుండాలి. విత్తన ఉత్పత్తి వ్యయం, నిర్వహణ వ్యయం అందుకుతగిన లాభం వుండేవిధంగా విశ్లేషణ చేసి ప్రభుత్వం ధరలను నిర్ణయించాలి. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో రైతులు,వ్యాపారులు, వ్యవసాయశాఖ ప్రతినిధులతో కమిటీలు వుండాలి. ఈ కమిటీలు నిర్ణయించే తీర్మానాలను చట్టపరంగా అమలుచేయాలి. రాష్ట్ర ప్రభుత్వం విత్తన చట్టాన్ని చేసి రైతుల ప్రయోజనాలను రక్షించాలి. కేంద్రం చేసే చట్టానికి రాష్ట్ర చట్టం లోబడి వుంటుంది. అంతేకాని కేంద్రం చట్టం చేసేవరకు కాలయాపన చేయడం రాష్ట్ర రైతాంగానికి తీవ్ర నష్టం. రాష్ట్రం చేసే చట్టం రైతు కమిటీలు ఆమోదించిన తర్వాతనే చేయాలి.
ఆ విధంగా విత్తన రంగంలో వచ్చిన మార్పులు, రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా కాపాడబడేవిధంగా చర్యలు చేపట్టాలి. పంటకు మూలం విత్తనమే.
- సారంపల్లి మల్లారెడ్డి

No comments:
Post a Comment