Monday, 11 August 2014

ప్రకృతి వైపరీత్యాలనుండి రైతాంగానికి ప్రభుత్వం రక్షణలు కల్పిస్తుందా?

రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌ దిశగా వ్యవసాయరంగంలో సంక్షేమ చర్యలు చేపడుతున్నాం. విద్యుత్‌ కొరతతో ఒక్క ఎకరం పంటను కూడా ఎండనివ్వం. 2008-09లో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 190లక్షల టన్నులకు చేరుకుంటాం.
- డాక్టర్‌ వైయస్‌. రాజశేఖరరెడ్డి, ముఖ్యమంత్రి
తమ పాలనాకాలంలో పిలిస్తే వర్షాలు పలుకుతాయని, వర్షదేవుడూ మా పార్టీలోనే వున్నాడని నిరంతరం ప్రచారంచేసుకుంటున్న ప్రభుత్వం రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితిని గుర్తించ నిరాకరించినట్లు కనబడుతున్నది.
2008 ఖరీఫ్‌లో అనేక జిల్లాల్లో వర్షాభావం వల్ల మెట్ట పంటలు వేయలేదు.  ఆలస్యంగా వచ్చిన వర్షాలకు కొన్ని పంటలు వేసినప్పటికీ పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. గత రెండు మాసాలుగా ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల వల్ల ఆలస్యంగా వేసిన పంటలు ఎండిపోయాయి. అనేక జిల్లాల్లో కరువు పరిస్థితులు ఏర్పడినాయి. రబీ పంటలు వేసే కాలం కూడా గడిచిపోతున్నది. రైతులు, గ్రామీణ ప్రజలు తీవ్ర ఆందోళనల్లో ఉన్నారు. వర్షాభావ పరిస్థితుల్లో పంపుసెట్ల క్రింద పంటలు పండించుకుందామన్నా విద్యుత్‌ కోత కారణంగా పంపుసెట్ల క్రింద పంటలు ఎండిపోతున్నాయి. అర్ధరాత్రి కొన్ని గంటలే విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. 7 గంటలు సరఫరా చేస్తామన్న విద్యుత్‌ శాఖ రోజుకు 4,5 గంటలకు మించి సరఫరా చేయడం లేదు.  లో-వోల్టేజి సరఫరా వలన అనేక పంప్‌సెట్లు కాలిపోతున్నాయి. నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో (- 20శాతం) మరియు ఆదిలాబాదు, మహబూబ్‌నగర్‌, చిత్తూరు జిల్లాల్లో (-14శాతం) వర్షాలు తక్కువగా పడినాయి. ఈ జిల్లాల్లో జొన్న, సజ్జ, రాగులు, పెసళ్లు మొదలగు పప్పు ధాన్యాలు,  నువ్వులు, ఆముదం, పొద్దుతిరుగుడు పంటలు 50% మాత్రమే వేసినారు.
ప్రకాశం జిల్లాలో 2.01 లక్షల హెక్టార్లు సాగు కావాల్సి ఉండగా, 1.37 లక్షల హెక్టార్లు, కడప జిల్లాలో 2.61 లక్షల హెక్టార్లకు బదులుగా 1.25 లక్షల హెక్టార్లు, రంగారెడ్డి జిల్లా 1.74 లక్షల హెక్టార్లకు బదులు 1.22 లక్షల హెక్టార్లు, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 6.13 లక్షల హెక్టార్లకు బదులు 5.60 లక్షల హెక్టార్లలో మాత్రమే పంటలు వేసారు. ఖరీఫ్‌లో వేసిన పంటలు ఆ తర్వాత వర్షాభావం ఎండిపోయాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని నాగర్‌కర్నూల్‌ డివిజన్‌, వనపర్తి డివిజన్ల పరిధిలో వరి, మక్క, వేరుశనగ పంటలు ఎండిపోతున్నాయి. ప్రకాశం  జిల్లాలో నాగార్జున సాగర్‌ ఆయకట్టు పరిధిలో 2లక్షల ఎకరాలకు ఖరీఫ్‌లో నీరు రాలేదు. నల్లగొండ జిల్లాలో వర్షాభావం వల్ల పండ్లతోటలు చనిపోతున్నాయి. తొలకరి వర్షాభావం వల్ల పప్పు ధాన్యాల పంటలు మరియు జొన్న పంటలు వేయలేదు. పత్తిపంట దిగుబడి బాగా తగ్గింది. శ్రీకాకుళం జిల్లాలో సోంపేట, పలాస, కంచిలి, వజ్రపుకొత్తూరు, రణస్థలం మండలాల్లో 50 వేల ఎకరాల వరిపంట ఎండిపోయింది. కాలువ చివరి భూములకు నీరు అందక మరియు వర్షాలు లేకపోవడం వలన ఈ నష్టం వాటిల్లింది. విజయనగరం జిల్లాలో చీపురుపల్లి, గరివిడి, నెల్లిమర్ల, గంట్యాడ మండలాలు, పార్వతీపురం, విజయనగరం రెవెన్యూ డివిజన్లలో లక్ష ఎకరాల్లో వరిపంట నష్టం వాటిల్లింది.కర్నూలు జిల్లాలోని ఆదోని డివిజన్‌లో పత్తి, వేరుశనగ, పొద్దుతిరుగుడు పంటలు ఎండిపోయాయి. రంగారెడ్డి జిల్లాలో వికారాబాదు, పరిగి, తాండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఆముదం, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. మెదక్‌ జిల్లాలో గజ్వేల్‌, నారాయణపేట్‌ ప్రాంతాల్లో 2 నెలలుగా వర్షాలు లేక పంటలు నష్టపోయాయి. నిజామాబాదు జిల్లా జుక్కల్‌లో 33 వేల ఎకరాల పంటలు ఎండిపోయాయి. పత్తి, పెసర పంటలకు నష్టం వాటిల్లింది. బోధన్‌ ఏరియాలో 30 నుండి 60శాతం పంట తగ్గింది. విశాఖ జిల్లాలో చోడవరం, నక్కపల్లి, కశింకోట మరియు మెట్ట ప్రాంతమైన ఏజెన్సీలో వర్షాభావం వల్ల ఖరీఫ్‌ పంటలు ఎండిపోయాయి.కడప జిల్లాలో పంటలకు నష్టం వాటిల్లింది.
రాష్ట్రంలో 2008 రబీకి  (-) 66 శాతం లోపు వర్షపాతం నమోదైంది. 16 జిల్లాల్లో 60 నుండి 99 శాతం లోపు, 6 జిల్లాల్లో 20 నుండి 59 శాతం లోపు, 1 జిల్లాలో 19శాతం లోపు వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం, విజయనగర్‌, ప్రకాశం, నల్లగొండ, ఆదిలాబాదు జిల్లాల్లో సాధారణ రబీసాగు విస్థీర్ణం తగ్గింది. విజయనగరం జిల్లాలో రబీ పంట ఈ రోజుకు 20 వేల ఎకరాలు వేయాల్సి ఉండగా, 17 వందల ఎకరాల్లో మాత్రమే పంటలు వేశారు. వర్షాభావం వల్ల రబీ పంటలపై కూడా రైతులు ఆశలు వదులుకుంటున్నారు.
2006-07లో ప్రభుత్వం 299 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. 2007 ఖరీఫ్‌లో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టుకు నీటికొరత వల్ల నాట్లు వేయలేదు. లక్షలాది ఎకరాలు బీళ్లుగానే వున్నాయి. ప్రకాశం జిల్లాకు గత థాబ్ధకాలంగా కాల్వ చివరి భూములకు నీరు రావడంలేదు. సాగునీటి విడుదలకు ఆందోళనలు చేసిన రైతు నాయకులను అరెస్టు చేసి, బేడీలు వేసి జైళ్ళ పాల్జేశారు. ఒకవైపున కరువులు వెన్నాడుతుండగా, మరోవైపున వరదల వల్ల పెద్దయెత్తున నష్టాలు సంభవిస్తూనే వున్నాయి. 2008 ఖరీఫ్‌లో అనంతపురం జిల్లాలో 16 లక్షల ఎకరాల వేరుశనగ పంటకు నష్టం వాటిల్లింది. దీనికి నాణ్యతలేని విత్తనాలు కూడా కొంత కారణమయ్యాయి. నిజామాబాద్‌ జిల్లాలో అతివృష్టి వల్ల సోయాబీన్‌ పంటలకు నష్టం వాటిల్లింది. వరంగల్‌ జిల్లాలో మహికో కంపెనీ సరఫరా చేసిన నాణ్యతలేని పత్తి విత్తనాల (''బి.టి- నీరజ'') వలన ములుగు, నర్సంపేట డివిజన్‌లలో 40వేల ఎకరాలలో  పంటలు పూత- కాయ లేకుండా పోయాయి. ఒక్కోరైతు ఎకరానికి రు. 10వేల వరకు నష్టపోయారు. 2008 ఆగస్టు 3 నుండి 11 వరకు కురిసిన భారీ వర్షాలకు 15 జిల్లాలలో 4499 గ్రామాలు నష్టాలకు గురయ్యాయి. 130 మంది ప్రాణాలు కోల్పోయారు.  47,147 ఇళ్ళు పూర్తిగాను లేదా పాక్షికంగా నష్టాలకు గురయ్యాయి. 6354 పశువులు మరణించినట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. రు. 300 కోట్లు పంట నష్టం జరిగింది. మొత్తం పరిహారాలకు  సహాయంగా రు. 1100 కోట్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.
ప్రకృతివైపరీత్యాలు జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందాలు పర్యటించవలసినదిగా కోరడం ఆనవాయితీ అయింది. కేంద్ర బృందాలు రావడం, నివేదికలు సేకరించి వెళ్ళడం ఆనవాయితీగా వస్తున్నది. ప్రకృతివైపరీత్యాల నిధి నుండి కేంద్రప్రభుత్వం యేటా కేటాయిస్తున్న నిధులు జరిగిన నష్టంలో ఒక శాతాన్ని కూడా పూడ్చడంలేదు. కేంద్రం నిధులకు రాష్ట్ర ప్రభుత్వం యివ్వాల్సిన మ్యాచింగ్‌ గ్రాంట్‌ సకాలంలో యివ్వకపోవడం వలన పరిహారాల చెల్లింపులు నామమాత్రంగా మారాయి. 2004 నుండి వరదలు, కరువుల వల్ల యేటా రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల పంటలకు నష్టం జరుగుతున్నది. 2005లో 60మంది చనిపోగా, రు. 2700 కోట్ల పంటనష్టం జరిగింది. 2006లో 108 మంది చనిపోగా, రు.1014ల పంటల నష్టం జరిగింది. నష్టపరిహారాన్ని పెంచుతున్నామంటూ ప్రభుత్వం అనేక జీవోలను విడుదల చేసింది. గణాంకాల సేకరణలో వాస్తవంగా నష్టపోయిన వారి పేర్లు కనబడవు. గతంలో వేసిన అనేక కమిషన్లు ప్రకృతివైపరీత్యాల నివారణకు అనేక సూచనలు చేశాయి. ఏ ఒక్క సూచనను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు. ప్రభుత్వాలు ఎన్ని పథకాలు లేదా ప్యాకేజీలు ప్రకటించి రుణ విముక్తి కల్పిస్తున్నా, ప్రకృతివైపరీత్యాల వల్ల జరుగుతున్న నష్టాల వల్ల తిరిగి రైతులపై రుణభారం పెరుగుతూనేవుంది.
''ప్రకృతివైపరీత్యాల నివారణా ప్రాజెక్టు'' పేరుతో సహాయక చర్యలు చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం రు. 11700 కోట్లతో ఐదు సంవత్సరాలలో వ్యయం కాగల పథకాన్ని రూపొందించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాలు 25శాతం భరించాలి. కానీ యింతవరకు ప్రకృతి నష్టాల నివారణా చర్యలకు కేటాయించిందిలేదు.
జలయజ్ఞం చేపట్టి ఐదు సంవత్సరాల పాలనాకాలం పూర్తికావస్తున్నా, నేటికీ రాష్ట్రంలో మూడింట రెండోంతుల సాగుభూమి వర్షాధారంపైననే ఆధారపడి వుంది. వరదల వల్ల వేలాది ఎకరాల పంటలకు నష్టం వాటిల్లుతున్నది. వరదలను నివారించి కరువు ప్రాంతాలకు నీటిని సరఫరా చేయడం ద్వారా రాష్ట్రంలో ప్రకృతివైపరీత్యాలను నివారించే అవకాశాలకు చేసిన సూచనలను ప్రభుత్వం పాటించడానికి నిరాకరిస్తున్నది. కనీసం తాత్కాలిక సహాయంగానైనా పంటలు నష్టపోయినదానికి రైతాంగానికి, గ్రామీణ ప్రజానీకానికి నష్టపరిహారం చెల్లించడంలో వైఫల్యం జరుగుతున్నది. ఒక్కో ఎకరానికి రు. 10వేలకు పైగా పెట్టుబడులు పెట్టి పంట చివరి కాలంలో వర్షాభావం వల్ల నష్టపోయిన వారికి ప్రభుత్వం ఇన్‌పుట్‌ సబ్సిడీ యిస్తామని చెబుతున్నది. నష్టపోయిన వారి జాబితాలను సేకరించడానికే సంవత్సర కాలం తీసుకుంటున్నారు. గణాంకాల సేకరణలో కూడా అనేక అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. పరిహారం పంపిణీలో అవినీతి రాజ్యమేలుతున్నది.
వాస్తవంగా నష్టపోయిన వారి సమాచారాన్ని సేకరించి వారు నష్టపోయిన మేరకు పరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ప్రకృతివైపరీత్యాల పరిహారం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. కేంద్రం చేసిన సహాయం అదనం మాత్రమే. కాని రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను పూర్తిగా విస్మరించి నష్టాన్ని ప్రకృతిపైకో లేదా కేంద్ర ప్రభుత్వంపైకో నెట్టి చేతులు దులుపుకోవడం సరియైన చర్యకాదు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను మరియు అతివృష్టివల్ల నష్టపోయిన పంట వివరాలను, నాణ్యతలేని విత్తనాల వల్ల పంటలు నష్టపోయిన వారికి పూర్తి పరిహారం చెల్లించేవిధంగా చర్యలు చేపట్టాలి.
 - సారంపల్లి మల్లారెడ్డి
---


No comments:

Post a Comment