Tuesday, 12 August 2014

వ్యవసాయ రాయితీలను ఎత్తివేయాలంటున్న ప్రణాళికా సంఘం

వ్యవసాయ ఉచిత విద్యుత్తు పథకాన్ని రద్దు చేయమని రాష్ట్రాలకు సలహా ఇస్తూనే, కేంద్రం కూడా తాను రాష్ట్రాలకిచ్చే ఎఐబిపి నిధులను రద్దు చేసే అంశం ఆలోచనలో ఉందనీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు మాంటెక్‌సింగ్‌ ఆహ్లువాలియా ప్రకటించారు. ప్లానింగ్‌ కమీషన్‌ చైర్మన్‌ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఆధ్యక్షతన ఏప్రిల్‌ 21న జరిగిన ప్రణాళికా సంఘ సమావేశ అనంతరం ఈ ప్రకటన వచ్చింది. రాష్ట్రాలన్నీ తప్పనిసరిగా నీటి రెగ్యులేటరీ కమీషన్లు ఏర్పాటు చేయాలి. ఆ కమీషన్లు త్రాగు నీరు, సాగుకు నీరు, పరిశ్రమలకు నీరు ఎప్పుడు ఎంత కేటాయించాలన్నది నిర్ణయిస్తారు. ఆ నిర్ణయం మేరకే వినియోగించు కోవాలి. సంస్కరణలను పెద్ద ఎత్తున అమలు జరపాలని సూచించారు. దేశ వార్షిక ఉత్పత్తి 11వ పంచవర్షిక ప్రణాళిక(2007`12)లో 8.2 శాతం ఉండగా దానిని 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో 9శాతం నుండి 9.5 శాతానికి పెంచుతామని నిర్ణయం చేశారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుని ప్రకటనలోని సంస్కరణలు అమలు జరిపితే ప్రస్తుతమున్న వ్యవసాయ ఉత్పత్తి తగ్గుదల మరింత తగ్గుతుందే తప్ప పెరగదు. వారు చెప్పే సంస్కరణలు ప్రపంచ బ్యాంకు సూచించినవే. ముఖ్యంగా వ్యవసాయ రంగం మౌలిక వసతుల రంగంమరియు సేవా రంగాలలో మరిన్ని సంస్కరణలు తీసుకు రావడమంటే ప్రస్తుతం ఉత్పత్తిరంగంలో అంతంత మాత్రంగా ఉన్న పబ్లిక్‌ రంగాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని చెప్పడమే. గత ఐదు సంవత్సరాలుగా వ్యవసాయ రంగ అభివృద్ధి లక్ష్యం 4 శాతంగా నిర్ణయించినప్పటికీ ఏనాడూ ఆ దరిదాపులకు కూడా పెరుగుదల లేదు. అయినా గత సంవత్సరం మైనస్‌ 1.2 శాతంగా నమోదు చేసుకుంది.
ప్రస్తుతం 9.93 కోట్ల టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతుండగా గోదుమలు 7.70 కోట్ల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభా 121 కోట్లకు చేరింది. వీరికి రెండు పూటలా ఆహారం అందించాలంటే సగటున 20 కోట్ల టన్నుల బియ్యం గోదుమల ఉత్పత్తి కావాలి. అదేవిధంగా పప్పుధాన్యాలు, నూనే గింజల ఉత్పత్తులు పెరగాలి. దేశంలో సంస్కరణలు అమలు జరిపినప్పటినుండి(1.1.1995నుండి) తలసరి ఆహార ధాన్యాల వినియోగం తగ్గుతూనే ఉంది. 1990లో తలసరి రోజువారి వినియోగం 435.3 గ్రాములు కాగా 2007లో 407 గ్రాములకు పడిపోయింది. పప్పుధాన్యాల వినియోగం 41.1గ్రాము కాగా అవి 35 గ్రాములకు తగ్గాయి. దేశంలో దారిద్య్రపు పెరుగుదల ఒకవైపున పెరుగుతుండగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునికి తగ్గుతున్నట్లుగా కనబడుతున్నది. దారిద్య్ర గణాంకాలు సేకరించిన టెండూల్కర్‌ కమిటీ దేశంలో 37.2 శాతం గానూ, సక్సేనా కమిటీ 50 శాతం గానూ మరియు అర్జున్‌ సేన్‌ గుప్తా కమిటీ 77 శాతంగా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్లు ప్రకటించాయి. కానీ ఆహ్లువాలియా మాత్రం 2009`10 నాటికీ 32 శాతానికి తగ్గించి నట్లు ప్రకటించారు. రెండు రోజుల క్రితం సుప్రీం కోర్టు ఆకలి చావులపై స్పందిస్తూ కేంద్రాన్ని అందరికీ ఆహారం సరఫరా చేయాలని మందలించింది. ఇవేవి పట్టని ప్రణాళికా సంఘం ప్రపంచ బ్యాంకు సంస్కరణలను అమలు చేస్తానంటున్నది.
ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌, తమిళనాడుమరియు కేరళ ప్రభుత్వాలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు పథకాలు అమలు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం బావుల నుండి తానే సాగు నీటిని సరఫరా చేస్తూ రైతుల నుండి నీటి తీరువాను వసూలు చేస్తున్నది. ఉచిత విద్యుత్తు అమలు ఫలితంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. దేశంలో పశ్చిమ బెంగాల్‌, ఆంధ్ర ప్రదేశ్‌ మరియు పంజాబ్‌లు ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ప్రథమ,ద్వితీయ, తృతీయ స్థానాలలో ఉన్నాయి. సత్వర ప్రాజెక్టుల అభివృద్థి(ఎఐబిపి) పథకం కింద రాష్ట్రాలకు కేంద్రం సాగు నీటి ప్రాజెక్టులకు, మౌలిక వసతుల కల్పనకు వేల కోట్లు గ్రాంటుగా ఇస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌కు 2011`12లో ఈ పథకం కింద సాగు నీటి ప్రాజెక్టులకు రు.2 వేల కోట్లు గ్రాంటుగా కేటాయించింది. 2010`11లో ఇదే పథకం కింద రు.4 వేల కోట్లు కేటాయించి రివైజ్‌డ్‌ బడ్జెట్‌లో రు. 2 వేల కోట్లకు కుదించారు. ఆర్థికంగా కేంద్రం గ్రాంటుగా ఇవ్వడం ఫలితంగా కోన్ని ప్రాజెక్టులైనా పూర్తై ఉత్పత్తిని పెంచుతున్నాయి. సంస్కరణలను అమలు చేసే లక్ష్యంతో ఉచిత పథకాలకు ఎగనామం పెట్టాలని చూస్తున్నారు.అందులో భాగంగానే ఎఐబిపి గ్రాంట్లు కోత పెడుతున్నారు. దీని వలన ఫలితాలు ధారుణంగా ఉంటాయి. ఉత్పత్తిపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. పైగా నీటి రెగ్యులేటరీ అధారిటీ ఏర్పాటు చేయడం వలన వారు నీటి వేలం పాటలో ఎక్కువ రేటు చెల్లించిన పారిశ్రామిక రంగానికి ప్రధాన కేటాయింపులు చేస్తారు. ఆ విధంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గుదల పై ప్రభావం కనబడుతుంది. దేశీయ ఆహార ధాన్యాల ఉత్పత్తిని తగ్గించి ధనిక దేశాల దిగుమతులపై ఆధార పడాలన్న ప్రపంచ బ్యాంకు విధానానికి అనుగుణంగానే వ్యవసాయ రంగంలో ఆత్మహత్యా సదృష్యమైన సంస్కరణలను అమలు చేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం 2005లోనే నీటి రెగ్యులేటరీ అధారిటీ చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం కింద 53 టిఎంసిల నీటిని పరిశ్రమలకు మళ్ళించడంతో రైతులు పెద్దఎత్తున ఆందోళన సాగిస్తున్నారు. వార్ధా ప్రాజెక్టుల నుండి నీటిని మళ్ళించడానికి 65 మంది దరఖాస్తు చేసుకున్నారంటే సంస్కరణల వేగం ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా కేంద్రం రాష్ట్రాలకు సహకరించాల్సిన బాధ్యత ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 2010`11 సంవత్సరం ఖరీఫ్‌లో 12 లక్షల ఎకరాలు, రబీలో 5 లక్షల ఎకరాల్లోని పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వరితో పాటు పండ్ల తోటలు, వాణిజ్య పంటలకు విపరీతమైన నష్టం వాటిల్లింది. ఈ ఒక్క సంవత్సరమే దాదాపుగా రు. 10వేల కోట్ల పంట నష్టం వాటిల్లింది. 160 మంది మరణించారు. 400 మంది కౌలు రైతుల ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ప్రతి సందర్భంలో కేంద్ర బృందాలు రావడం, పరిశీలించి వెళ్ళడమే తప్ప సహాయం చేసింది నామ మాత్రమే.2010 మేలో లైలాతూఫాను నష్టానికి రాష్ట్రప్రభుత్వంరు.1357 కోట్లు కేంద్రాన్ని కోరగా ఇచ్చింది రు.188 కోట్లు మాత్రమే. 2005 నుండి 2010 వరకు రాష్ట్రప్రభుత్వం రు42,553.49 కోట్లు అర్థించగా కేంద్రం చేసిన సహాయం రు.1,994.31 కోట్లు మాత్రమే సహాయం చేశారు. జాతీయ విపత్తుల సహాయనిధుల ద్వారా పెద్దఎత్తున రైతాంగానికి కేంద్రం సహకరిస్తుందంటూ డాంబికాలు పలకడమే తప్ప ఆచరణలో జరిగిన నష్టంలో 10 శాతం కూడా సహాయమందించ లేదు. పైగా పంటల భీమా పథకాన్నీ ఉపయోగానికి రాని పథకంగా మార్చింది. ఏటా రైతు ప్రయోజనాన్ని రక్షించే విధంగా సవరిస్తాననడమే తప్ప, సవరించే ఉద్దేశం ఉన్నట్లు లేదు. గతంలో ఉన్న నిబంధనలను మార్చి సన్న, చిన్నకారు రైతుల ప్రీమియం చెల్లింపునకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎగనామం వేశాయి. పంటలు కోసి చేలోనే నష్టం జరిగితే పరిహారానికి అనర్హత ప్రకటించింది. కనీసం రంగు మారిన వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి కేంద్ర` రాష్ట్రప్రభుత్వాల కొనుగోలు సంస్థలు ఎఫ్‌సిఐ, సివిల్‌సప్లై సంస్థలను మార్కెట్‌కు వచ్చిన రైతులనుండి కొనుగోలు చేయడంలేదు. వ్యాపారులు, మిల్లర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి కనీస మద్దతు ధరల కన్నా తక్కువ ధరలకు అమ్ముకోవల్సిన స్థితికి రైతులు నెట్టబడుతున్నారు.
పంటల కోత కాలంలో రైతుల నుండి తక్కువ ధరలకు సేకరించి ప్రాసెస్‌ చేసిన అనంతరం ఎక్కువ ధరలకు అమ్మడం వలన ఏటా మధ్య దళారీలు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. ఉత్పత్తి దారున్ని, వినియోగదారున్ని దోపిడీ చేస్తున్నారు. రుణ భారం పెరిగిన రైతులు గత దశాబ్ద కాలంలో దేశంలో 2 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్నారంటే వ్యవసాయ రంగ సంస్కరణల ఫలితాలను గమనించవచ్చు. సంస్కరణల అమలు చర్యలలో బాగంగా వ్యవసాయ రాయితీల ఎత్తివేతతోపాటుగా మైక్రోఫైనాన్స్‌ సంస్థలను ప్రోత్సహించి వారిద్వారా రుణాలు, వ్యవసాయశాఖను కుదించడం, భారత ఆహార సంస్థను ఎత్తివేసే దిశగా అడుగులు వేయడం, విత్తన రంగాన్ని బహుళ జాతి సంస్థల పరం చేయడం జరిగింది. అన్ని దేశాలలో ప్రభుత్వాల అండదండలతోనే వ్యవసాయ రంగం కొనసాగుతున్నది. కాని మన పాలకులు పూర్తి భిన్నమైన విధానాలను అమలు చేస్తున్నారు. కేంద్రంలో ప్రపంచ బ్యాంకుకు నమ్మిన వారుగా ఉన్న వారిని కీలక బాధ్యతల్లో నియమించారు. కేంద్ర వ్యవసాయ శాఖామాత్యులుగా శరద్‌పవార్‌, ధరల నిర్ణయాక సంఘానికి చైర్మన్‌గా అశోక్‌ గులాటి, ప్రణాళిక బోర్డులో సభ్యులుగా నియమించబడిన వారు గతంలో ప్రపంచ బ్యాంకు విధానాలను బుజానికి ఎత్తుకున్నవారే. సేచ్చాయుత పోటి, స్వేచ్చావ్యాపారం పేరుతో వేల కోట్లు ప్రభుత్వాల నుండి రాయితీలు పొందుతున్న దేశాలతో మన రంగాలను పోటీలోకి దింపడమంటే వారికి మన రంగాలను అంటగట్టడమే. అదే తీరులో రాష్ట్రప్రభుత్వం తన వ్యవసాయ విధానాలు కొనసాగిస్తున్నది.
రాష్ట్రంలో గత రెండు సంవత్సరాలుగా కరువులూ, వరదల వల్ల రైతులు తీవ్రంగా నష్టాలకు గురైనారు. 2009`10లో కరువుల వల్ల వ్యవసాయ ఉత్పత్తిలో 26 శాతం లోటు వచ్చింది. 2010`11లో వరదల వల్ల 65 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. వడ్డీలు మాపీ చేసి, అసలును రీ షెడ్యూలు చేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వులు అమలు లేవు. 640 మండలాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. 40 లక్షల మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులిస్తానన్న ప్రభుత్వం శాసనసభలో బిల్లు పెట్టి వెనకడుగు వేసింది. 2011ఖరీఫ్‌కు ఇప్పుడే విత్తనాల కొరత సృష్టించారు. మరోవైపున విత్తనాల కంపెనీలు, బహుళజాతి సంస్థలు విత్తన ధరలను 30`40 శాతం పెంచాలని ఒత్తిడి తెస్తున్నారు. ప్రభుత్వం అందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తున్నది. విత్తనాలు, రుణాలు అందుబాటులో లేనపుడు రైతులు వ్యవసాయం ఎలా చేస్తారు ? సాగు చేస్తున్న రైతుకు ఏ హక్కులు లేనప్పుడు ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచడానికి ముందుకు వస్తాడా? పుండుపై కారం చల్లినట్లు ప్రణాళికా సంఘం తీర్మాణాలు, ప్రకటనలు రైతును మరింత కుంగతీస్తాయి. జనాభా ఉత్పత్తి రేటుకన్నా, ఆహారధాన్యాల ఉత్పత్తి రేటు తగ్గుతున్నట్టు తెలిసి కూడా కేంద్ర , రాష్ట్రప్రభుత్వాలు అధోదిశలోకి తీసుకెళ్ళే సంస్కరణలను అమలు చేస్తున్నారు. సాగు విస్తీర్ణం తగ్గిపోతున్నది. లక్షల ఎకరాల సాగు భూములను పరిశ్రమల పేరుతో బీళ్ళుగా మారుస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటున్నదని ఉచిత విద్యుత్తుకు పంగనామాలు పెట్టబోతున్నారు. అదే సందర్భంలో వేళ్ళమీద లెక్కించ గల్గిన పారిశ్రామిక వేత్తలకు వేల కోట్ల రూపాయల పన్నులు తగ్గించడమే కాక, వారికి ఉచితంగా మౌలిక వసతులు కల్పిస్తున్నారు.ఈ విధానాల అమలుకు కేంద్రప్రభుత్వం ఆశీర్వదాలున్నాయి.
విధానాలు మారకుండా ప్రస్తుతం వ్యవసాయ రంగంలో నెలకొన్న మాంద్యం తొలగి పోదు. మాంద్యం తొలగకుండా ఉత్పత్తి, ఉత్పాదకతలో వృద్ధి రాదు. అందుకు ప్రభుత్వాల సహాయ సహకారాలు తప్పనిసరి. వ్యవసాయరంగం అభివృద్ధిపై పారిశ్రామిక, సేవారంగాల అభివృద్ధి ఆధారపడి ఉన్నదనేది ఆర్థిక వేత్తలు చెబుతున్న వాస్తవం. దీని ద్వారానే పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ప్రజల ఉపాధి పనులు పెరుగుతాయి. ప్రాథమిక రంగానికిస్తున్న రాయితీల వల్ల అన్ని వైపుల నుండి లాభం, ఉపయోగమే తప్ప నష్టం లేదన్నది ప్రభుత్వాలు గుర్తించాలి. కానీ ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంకు సంస్కరణల అమలుకే కట్టుబడి ఉన్నట్టు ద్యోతకమవుతున్నది. ప్రభుత్వాలు కార్పోరేటీకరణ దిశగా వ్యవసాయ విధానాలు అమలు చేస్తున్నారు. ఈ రంగంలో సన్న, చిన్నకారు రైతులు, కౌలు రైతులు 90 శాతంగా  ఉన్నారు. తమ ఉపాధికి భంగం కలిగే కేంద్ర రాష్ట్రప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఉద్యమించడం తప్ప మరో మార్గం లేదు.ప్రణాళికా సంఘం తన సంస్కరణల ఆలోచనా ధోరణిని విడనాడాలి.
సారంపల్లి మల్లారెడ్డి

No comments:

Post a Comment