Tuesday, 12 August 2014

స్వాతంత్య్ర పోరాట లక్ష్యం నెరవేరుతుందా!

            ఆహార ధాన్యాలు, నిత్యావసర వస్తువుల ఉత్పత్తిలో స్వయంసమృద్ధం కావాలని దిగుమతులు లేని దేశంగా ఉండాలని, అధికోత్పత్తులు చేసి ఎగుమతులు లక్ష్యంగా వ్యవసాయరంగాన్ని అభివృద్ధి పర్చాలని నాడు స్వాతంత్య్ర పోరాటం కొనసాగింది.  స్వాతంత్య్రం సిద్ధించి ఆరు దశాబ్దాలు పూర్తైంది. నేడు అమలవుతున్న సంస్కరణలు వ్యవసాయరంగాన్ని ఏదిశకు తీసుకు వెళుతున్నాయి. సంస్కరణల ఫలితాలు దేశ ప్రజల అవసరాలు తీర్చేవిగా ఉన్నాయా? లేక దిగుమతులపై ఆధారపడే పరిస్థితి ఉందా? అన్నది పరిశీలించాలి. 1951లో 36.32 కోట్ల భారతదేశ జనాబాకు ఆహారధాన్యాల ఉత్పత్తి 4.81కోట్ల టన్నులుగా ఉంది. 48లక్షల టన్నులు దిగుమతుల దిగుమతుల ద్వారా మన ఆహార సమస్యను పరిష్కరించుకున్నాం. నాడు పప్పు ధాన్యాలు దేశంలో 80లక్షల టన్నుల ఉత్పత్తి ఉంది. రోజుకు ఆహారధాన్యాల తలసరి వినియోగం 334.2 గ్రాములు కాగా, పప్పుధాన్యాల వినియోగం 60.7 గ్రాములుగా ఉంది. 35 కోట్ల ఎకరాలు దేశంలో సాగు చేస్తున్నారు. నాటికీ నేటికి సాగు విస్తీర్ణం పెరగకున్నా ఆహారధాన్యాలు ఉత్పత్తి 23 కోట్ల టన్నులకు, దేశీయ జనాభా 121 కోట్లకు చేరింది. ఆహార ధాన్యలు ఉత్పత్తి 4.5 రెట్లు పెరిగింది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం 1965`85 సంవత్సరాలలో సాగిన హరిత విప్లవం. 1985 నుండి ఉత్పత్తి పెరుగుదల నిలిచిపోయింది. జనాభా మాత్రం 1.9 శాతం ఏటా పెరుగుతూనే ఉంది. 1980లో తలసరి ఆహార ధాన్యాల వాడకం 480 గ్రాములకు, నేడు 421 గ్రాములకు తగ్గిపోయింది. పప్పుధాన్యాలు 35 గ్రాముల వినియోగంలోకి పడిపోయాయి.
స్వాతంత్య్రానికి పూర్వం వ్యవసాయ సమస్యపై అనేక ఉద్యమాలు సాయుధరూపం తీసుకున్నాయి. కమ్యూనిస్టులు, అఖిల భారత కిసాన్‌సభ రైతులను సంఘటిత పర్చి ఉద్యమాలు సాగించింది. త్రిపుర ఘణముక్తి పరిషత్‌ పోరాటం`1948, కేరళ పొన్నప్రవాయిలార్‌ పోరాటం`1946, బెంగాల్‌లో తెబాగా పోరాటం`(1932లో 15 వేల మంది కౌలు దారులతో ఉద్యమం సాగింది), సుర్మావాలీలో నంకర్‌ పోరాటం`1936`39, పంజాబ్‌ అభివృద్ధి పన్ను వ్యతిరేక పోరాటం`1952, తెలంగాణ సాయుధపోరాటం`1946`51 ఉద్యమాలు అభిలభారత కిసాన్‌ సభ నాయకత్వాన పెద్దఎత్తున సాగాయి. భూస్వామ్య విధానం రద్దు కావాలని, విదేశీయులు వెళ్లి పోవాలని 1936 ఏప్రిల్‌ 11న లక్నోలో మొదటి కిసాన్‌ మహాసభ జరిగింది. అనేక పోరాటాల ఫలితంగా ఆంగ్లేయులు దేశం విడిచి వెళ్లారు.
            నేటికీ భూస్వామ్య విధానం రద్దుకాకాపోగా మరింత బలంగా వేళ్ళూనుకున్నది. రైతుల ఉద్యమ ఫలితంగా దేశంలో 73.36 లక్షల ఎకరాల భూమి  భూసంస్కరణల అమలు సందర్భంగా గుర్తించి ఆగస్టు 2005 నాటికి 54.02 లక్షల ఎకరాలు మాత్రమే పంపిణి చేశారు. స్వాధీనం చేసుకున్న భూమిని కూడా పంపిణీ చేయలేదు. ఈ భూ సంస్కరణల్ని వమ్ము చేసే విధంగా 1995 జనవరిలో ఏర్పడిన ప్రపంచ వాణిజ్య సంస్థ ఆదేశాలు మేరకు తిరిగి పేదలకు పంచిన భూములను పరిశ్రమల పేరుతో, ప్రజాప్రయోజనాల పేరుతో లాక్కుంటున్నారు. దీనికి పేదలు బలవుతున్నారు. గిరిజన ప్రాంతాలు కూడా బహుళజాతి సంస్థల ఆధీనంలోకి వెళుతున్నాయి. నాడు దేశ ప్రజలంతా ప్రపంచవాణిజ్య సంస్థలో భాగస్వామ్యం కాకూడదని ఉద్యమం సాగించినప్పటికీ కాంగ్రేస్‌ పాలకులు ఒప్పందంపై సంతకం చేసి సంస్కరణల అమలుకు పూనుకున్నారు. ఈ సంస్థకు ప్రపంచబ్యాంకు తోడైంది. ఈ రెండు సంస్థల చాటున అమెరికా తదితర ధనిక దేశాల బహుళజాతి సంస్థలు దేశీయ వ్యవసాయరంగాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. రాజ్యాంగంరీత్యా వ్యవసాయ రంగం రాష్ట్రాల జాబితాలో ఉన్నప్పటికీ సవరించిన చట్టాలతో కేంద్రం ఈ రంగంపై ఆధిపత్యాన్ని కలిగి ఉంది. రాష్ట్రాలు చేయాల్సిన చట్టాలను కేంద్రం చేస్తున్నది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు బహుళజాతి సంస్థలకు వ్యవసాయ రంగాన్ని దారాదత్తం చేశాయి. ఈ సంస్థలు దేశీయ విత్తన రంగంపై ఆధిపత్యం సంపాదించాయి. ఫలితంగా విత్తనాల ధరలు పది రెట్లకు పైగా పెరగడమే కాక కృత్రిమ కొరత సృష్టించి నాణ్యతలేని విత్తనాలను, కల్తీ విత్తనాలు రైతులకు అంటగట్టి ఏటా లక్షలాధి ఎకరాల దిగుబడులకు నష్టం వాటిల్ల చేస్తున్నారు. కేంద్రం 2004లో రూపొందించిన ముసాయిదా విత్తన చట్టం 2011 సంవత్సరం పూర్తి కావస్తున్నా ఇంతవరకు పార్లమెంట్‌ ఆమోదం పొందలేదు. చట్టం పూర్తిగా బహుళజాతి సంస్థల లాభాలకు అనుకూలంగా రూపొందించారు.  దేశ అవసరాలకు నత్రజని 150, భాస్వరం 65, పొటాషియం 30 లక్షల టన్నుల మూలకాలు అవసరం కాగా, దేశంలో 120 లక్షల టన్నుల నత్రజని, 44 లక్షల టన్నుల భాస్వరం మాత్రమే ఉత్పత్తి జరుగుతున్నది. పొటాషియం మొత్తం దిగుమతులపైననే ఆధారపడుతున్నాం. 2008`09లో 40 లక్షల టన్నుల నత్రజని, 30 లక్షల టన్నుల భాస్వరం, 34 లక్షల టన్నుల పొటాషియం దేశంలో దిగుమతి చేసుకున్నాం. స్వయం పోషకత్వంలో ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే వైఫల్యం చెందింది. రామగుండం, గోరక్‌పూర్‌, దుర్గాపూర్‌, ట్రాంబే, కొచ్చిన్‌, టాల్చేర్‌, సింద్రి, బరోని, నైవేలీలలోని 28.46 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి సమర్థ్యం గల ఫ్యాక్టరీలను 1999 నుండి 2002 మార్చి మధ్య మూసివేసారు. దీనితో దిగుమతులు తప్పనిసరి అయ్యాయి. ‘‘ మూలకాల ఆధారిత సబ్సిడీ విధానాన్ని’’ అమలు జరిపి ఎరువుల ధరలు పెంచి వేశారు. 2008`09లో కేంద్ర ప్రభుత్వం 73 వేల కోట్లు ఎరువుల సబ్సిడీ చెల్లించగా, నూతన విధానం వలన 2011`12లో సబ్సిడీ 50 వేలకోట్లకు తగ్గి రైతులు 23 వేల కోట్ల భారానికి గురైనారు. 1964 నుండి అన్ని రంగాలకు విస్తృతపర్చబడిన సహకార వ్యవస్థను బహుళజాతి సంస్థల ఆదేశాల మేరకు సంస్కరణల పేరుతో మూసివేశారు. మూసివేతకు ముందు అనేక కమిషన్‌లు వేసి మూసివేతకు అనుకూలమైన నివేదికలు తెప్పించుకున్నారు. స్వేచ్ఛా మార్కెట్‌ పేరుతో సాగుతున్న ఈ సంస్కరణలు రైతాంగాన్ని దివాళా తీయించాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ధరల నిర్ణాయక సంఘానికి పంపిస్తున్న పంటల కనీస మద్దతు ధరలను పరిగణనలోకి తీసుకోకుండా, చివరకు ధరల నిర్ణాయక సంఘం రికమండేషన్స్‌ను కూడా గమనించకుండా, కేంద్ర వ్యవసాయ శాఖ కనీస మద్దతు ధరలను నిర్ణయిస్తున్నది. ప్రస్తుతమున్న కనీస మద్దతు ధరలు పంటల ఉత్పత్తి వ్యయం కన్నా తక్కువగా ఉన్నాయి. ఈ తక్కువ ధరలు కూడా అమలు చేయడానికి కేంద్రప్రభుత్వ కొనుగోలు సంస్థలు జోక్యం చేసుకోవడంలేదు.ఆహారధాన్యాల వ్యాపారంలోకి బహుళజాతి సంస్థలు ప్రవేశించాయి. వాటి లాభాలకు ఆటంకం కలుగకుండా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తప్పుకున్నాయి.
            సంస్కరణల ఫలితంగా వస్తున్న పంటల మార్పిడి విధానం ఆహార పంటల ఉత్పత్తికి ప్రమాదకరంగా పరిణమించింది. ఆహారధాన్యాల ఉత్పత్తిపై ఆంక్షలు పెట్టి ఆహారేతర పంటలు పండిరచాలని ప్రభుత్వాలు రైతులకు సలహాలిస్తున్నాయి. ధనిక దేశాల ఒత్తిడికి లొంగి చేపడుతున్న ఈ విధానం వలన దేశీయ అవసరాలకు సరిపడిన ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసుకోలేక పోతున్నాం. వంపిణీ వ్యవస్థను అస్తవ్యస్తం చేయడం ద్వారా 40 కోట్ల మంది ప్రజలు ఆహారధాన్యాల వినియోగం తగ్గించడంతో మిగిలిన బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేయాలని కేంద్రం లక్ష్యం పెట్టుకుంది. పేరుకు ఆహారభద్రత చట్టం తెస్తున్నామంటూనే ప్రజలను ఆర్ధాకలిలోకి నెట్టింది. చివరికిసుప్రీం కోర్టు ఆదేశాలను కూడా అమలు జరప నిరాకరిస్తున్నది. ఎగుమతి`దిగుమతుల విధానం వ్యవసాయ ఉత్పత్తులకు ప్రమాదకరంగా తయారైంది. మన దేశ మిగులు ఉత్పత్తులను( పంచదార, పత్తి, పొగాకు ఉత్పత్తులు, బట్టలు, నూనెలు) దిగుమతులు చేసుకోవడం ద్వారా ఆ పంటలు పండిరచే రైతాంగం ఉత్పత్తి ధర రాక పంటల విస్తీర్ణాన్ని తగ్గించి వేస్తున్నారు. చివరకు ఈ సంస్కరణలు సాగునీటి రంగాన్ని కూడా వదిలిపెట్టలేదు. నీటి రెగ్యులేటరీ కమిషన్స్‌( పన్ను విధింపు వ్యవస్థ) సాగునీటి మీటర్లు, నీటి సంఘాలు ఏర్పాటు చేసి నీటిని వ్యాపార సరుకుగా మార్చివేసింది. సాగునీటిని త్రాగునీటి వ్యాపారం చేసే సంస్థలకు, పరిశ్రమలకు, ఆటలకు, స్విమ్మింగ్‌పూల్స్‌కు కేటాయించింది. భారీ ప్రాజెక్టుల నిర్మాణంపై అలక్ష్యం చేయడం వలన కేటాయించిన నీటిని కూడా వినియోగించుకోలేక పోతున్నాం. సాగునీటి నుండి రైతులను దూరం చేస్తున్నారు. మైనర్‌ ఇరిగేషన్‌, బావుల సేద్యం, లిప్టు పథకాలు మూల పడుతున్నాయి. ప్రభుత్వం ప్రాజెక్టుల కింద సాగునీటి వనరులు కలిపించిన ఆయకట్టుకు సమంగా రైతులు సొంత పెట్టుబడితో మైనర్‌ ఇరిగేషన్‌ అభివృద్ధి చేసుకున్నారు. ఇప్పుడు ఆ వ్యవస్థ నిర్లక్ష్యానికి గురి కావడంతో రైతులు రుణగ్రస్తులైనారు.
         సంస్కరణల అమలుతో ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. వీటి నివారణకు ప్రభుత్వం ఎలాంటి పథకాలూ రూపొందించలేదు. కనీసం గతంలో వేసిన నిపుణుల కమిషన్‌ సూచనలను కూడా పాటించడంలేదు. కార్పోరేట్‌ విధానాల అమలుకే రాష్ట్రప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ విధానాన్ని రెండు విధాలుగా అమలు జరిపే ప్రయత్నం చేస్తున్నది. 1. రైతులను భూమల నుండి వెల్లగొట్టి భూములను కార్పోరేటీకరణ కిందికి తేవడం 2. రైతుల వద్దనే భూములనుంచి కార్పోరేట్‌ విధానంలో పంటలను పండిరచడం. రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా, రైతుల చైతన్యం దృష్ట్యా రెండవ విధానానికే ప్రభుత్వం కార్పోరేట్‌ సంస్థలు మొగ్గు చూపుతున్నాయి. రైతులతో ఘర్షణ వైఖరి రాకుండా కార్పోరేట్‌ విధానాన్ని అమలు జరుపుతున్నారు. ఇప్పటికే వ్యవసాయ ఉపకరణలన్నీ కార్పోరేట్‌ బహుళజాతి సంస్థల చేతుల్లోకి వెళ్లాయి. చివరికి రుణాలు కూడా మైక్రోఫైనాన్స్‌ సంస్థలు ఆధీనంలోకి వచ్చింది. దేశంలో 70 వేల కోట్ల బ్యాంకు రుణాలతో మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు వడ్డీవ్యాపారాలు చేస్తున్నాయి. ఇవి 30 శాతం వడ్డీ వసూలు చేస్తూ స్వయం సహాయక బృందాల ద్వారా రైతులను రుణగ్రస్తులను చేసి భూములనుండి వెళ్ళగొడుతున్నారు. వ్యవసాయంలో ఉత్పత్తులు తగ్గలేదు. అయినా రైతులు మాంధ్యం నుండి సంక్షోభంలోకి నెట్టబడుతున్నారు. పాడిఆవుగా ఉన్న వ్యవసాయాన్ని రైతులకు ఉపాధిలేని రంగంగా మార్చి వేస్తున్నారు. ‘‘ సంస్కరణల ’’ ముద్దు పేరుతో రైతులను వ్యవసాయరంగం నుండి తరిమివేసే విధానాలు అమలవుతున్నాయి.
విదేశీ పాలన నుండి 1947లో దేశం విముక్తి కాక ముందున్న పరిస్థితులు మరింత బలియంగా పునరావృతమైనాయి. వ్యవసాయ రంగం సామ్రాజ్యవాద దేశాల ఆధీనంలోకి వెళుతున్నది. కేంద్ర పాలకులు అమెరికాకు పూర్తిగా లొంగుబాటు చూపడంతో దాని ప్రభావం వ్యవసాయ రంగంపై పడుతున్నది.  ఈ విధానాలకు వ్యతిరేకంగా రైతాంగం సమైక్యతతో ఉద్యమించాల్సిన తరుణం ఆసన్నమైంది.  బహుళజాతి సంస్థలు దేశంలో అమలు జరుపుతున్న సంస్కరణలకు వ్యతిరేకంగా రైతులు సంఘటిత శక్తితో మరో స్వాతంత్య్ర ఉద్యమం కొనసాగించాలి.
వ్యవసాయ రంగం 
తేది : 22.07.2011
సారంపల్లి మల్లారెడ్డి

No comments:

Post a Comment