Wednesday, 13 August 2014

ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రపంచీకరణ విధానాలు

    1997 అనంతరం రాష్ట్రంలో వ్యవసాయ సంస్కరణలు ప్రారంభమయ్యాయి. ‘‘ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పున:నిర్మాణ కార్యక్రమం’’ క్రింద ప్రపంచబ్యాంకు ఆదేశిత సంస్కరణలు ప్రారంభమయ్యాయి. ఈ సంస్కరణల ఫలితంగా వ్యవసాయ రంగంలో అనేక మార్పులు తెస్తున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం సంస్కరణల పేరుతో ప్రారంభించిన ఈ కార్యక్రమం సన్న,చిన్నకారు రైతులకు, పేదలకు అత్యంత ప్రమాదకరంగా దాపురించింది. దీనికి అనుగుణంగా మొదటి దశ సంస్కరణలను ప్రవేశపెట్టారు.
    ప్రపంచబ్యాంకు విధిస్తున్న షరతులు, ప్రపంచ వాణిజ్య సంస్థ అమలు చేస్తున్న ఆదేశాలు ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఆ సంస్కరణల అమలుకు చేపట్టిన చర్యలు ఈ విధంగా ఉన్నాయి -
మొదటి తరం సంస్కరణలు :
(1)    ప్రభుత్వ సంఘాలు ఏర్పాటు : నీటి సంఘాలు, వన సంరక్షణ సమితులు - వాటర్‌ షెడ్డు కమిటీలు, మదర్స్‌ కమిటీ - విద్యా కమిటీ - రైతు క్లబ్బులు, పంటల సలహా కమిటీలు - డ్వాక్రా - స్వయం సహాయ గ్రూపులు - రైతు మిత్ర గ్రూపులు - వగైరా.
(2)    సంస్థాగత మార్పులు (నిల్వలపై ఆంక్షల తొలగింపు చట్టాల మార్పులు, విద్యుత్‌, బోరు బావులు, త్రవ్వకానికి చట్టాలు, విత్తనం, మార్కెట్‌ చట్టాలను బహుళ జాతి సంస్థలకు అనుకూలంగా మార్చడం)
(3)    ప్రణాళికేతర వ్యయం పెంపు  (టూరిజం - రోడ్లు, అనుత్పాదక రంగంపై పెట్టుబడి)
(4)    ధరల పెంపుదల (విత్తనాల ధరలు, క్రిమి సంహారక మందులు, ఇతర ఇన్‌పుట్స్‌ ధరల పెంపు - నీటితీరువా పెంపు)
(5)    వ్యవసాయ విస్తరణ ఉద్యోగాల తగ్గింపు
(6)    విత్తనాలు ప్రైవేట్‌ రంగంలో ఉత్పత్తి - పంపిణీ
(7)     దిగుమతుల సరళీకరణ (దిగుమతి టారిఫ్‌ తగ్గింపు - అవసరం లేకున్నా దిగుమతి)
    వీటిని అమలులోకి తెచ్చిన తరువాత సంస్కరణలు మరింత వేగవంతం చేయడానికి రెండవ తరం సంస్కరణ చేపట్టారు.
రెండవ తరం సంస్కరణలు :
    (1) వ్యవసాయ రుణాల తగ్గింపు (2) కాంట్రాక్టు వ్యవసాయం (కుప్పంతో సహా, ప్రకాశంలో సుబాబుల్‌ పంట)  (3) యంత్రాల ప్రవేశం (4) ఎగుమతి కొరకు ఉత్పత్తి  (5) ముతక ధాన్యాల తగ్గింపు (పంటల మార్పిడి) (6) సాంప్రదాయ ఎరువుల - విత్తనాల వాడకంకు స్వస్తి (మోనోశాంటో - డూపాంట్‌ వారి విత్తనాలు, క్రిమిసంహారక మందులు) (7) బ్యాంకుల ప్రైవేటీకరణ (వాణిజ్య బ్యాంకులు వ్యవసాయ రుణాల తగ్గింపు) (8) రైతుల సంఖ్య తగ్గింపు  (9) ప్రపంచ మార్కెట్‌తో పోటీ  (10) కార్పొరేట్‌ వ్యవసాయం.
    నేడు రెండవ తరం సంస్కరణలు వేగవంతంగా అమలు జరుగుతున్నాయి. అంతిమంగా వ్యవసాయరంగాన్ని కార్పొరేటీకరించడం లక్ష్యంగా విధానాలు సాగుతున్నాయి. వ్యవసాయ రంగం నుండి ప్రభుత్వ జోక్యం పూర్తిగా ఉపసంహరించబడుతుంది.
    మొదటి తరం సంస్కరణల ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు ఆర్భాటంగా ఏర్పాటు చేసిన సంఘాలు నేడు కాగితాలకే పరిమితమైనాయి. ప్రజల జోక్యం - చొరవ పెంచుతున్నామంటూనే గతంలోనూ రైతుల జోక్యాన్ని కూడా తగ్గించారు. ఈ సంఘాలన్ని పాలక వర్గ శక్తులతోనే నిండిపోయి వారు కాంట్రాక్టర్లుగా మారడానికి సుగమం చేసింది. నిల్వలపై ఆంక్షల తొలగింపు కారణంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు విపరీతంగా తగ్గాయి. రైతు తను స్వంత నిధులతో సాగునీటి కల్పనకు ఆటంకాలేర్పడినాయి. ఒకవైపున వ్యవసాయ ఉపకరణాల ధరలు నాలుగు నుండి పదిరెట్లు పెరిగాయి. మరోవైపు దిగుమతుల ప్రభావంతో వ్యవసాయ పంటల ధరలు తగ్గాయి. వ్యవసాయ శాఖ కుదించబడిరది. ప్రైవేట్‌ ‘‘క్లినిక్‌’’లు ప్రారంభించే ప్రయత్నాలు సాగాయి. సాగునీటికి మీటర్లు వచ్చాయి. ఇవన్నీ రైతులపై ముఖ్యంగా సన్న, చిన్నకారు, మధ్యతరగతి రైతులపై తీవ్ర ప్రచారాన్ని చూపాయి.
    డాక్టర్‌ వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా అధికారం స్వీకరించారు. అధికారానికి రావటానికి ముందు రైతులకు అనేక హామీలిచ్చారు. ఉచిత విద్యుత్‌ సరఫరా మెరుగుపరిచారు. తగినంత రుణం - వ్యవసాయ శాఖను బలవత్తరం చేయటం, మార్కెట్లో కనీస మద్దతు ధరలకు లభ్యత కల్పించడం, ఆత్మహత్యలకు పాల్పడిన వారికి ఎక్స్‌గ్రేషియా - సాగునీటి కల్పనకు హామీలిచ్చారు. భూపంపిణీ చేస్తామన్నారు. రైతు సంఘాలు నిర్వహించిన సెమినార్లు, సమావేశాలలో పాల్గని రైతు సంక్షేమం కొరకు తమ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రకటించారు.
అధికారానికి రాగానే :
(1)     ఉచిత విద్యుత్‌  - రు. 1200 కోట్ల విద్యుత్‌ బకాయిలు రద్దు చేశారు.
(2)    ఆత్మహత్యలకు పాల్పడినవారికి రు.1.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
(3)    హెల్ప్‌ లైన్‌ ఏర్పాటు చేశారు.
(4)     రెండు సార్లు భూపంపిణీ చేశారు.
(5)    పల్లెబాట - ఇందిర ప్రభ (రూ.499కోట్లు నాబార్డు రుణం ద్వారా) రెవెన్యూ సదస్సులు నిర్వహించారు.
(6)    జలయజ్ఞం చేపట్టారు. రూ. 46వేల కోట్లతో 28 ప్రాజెక్టుల ద్వారా 56 లక్షల ఎకరాలకు సాగునీటి కల్పన చేస్తామన్నారు.
    కాంగ్రెస్‌ పాలన చేపట్టి సంవత్సరం గడిచాక ఇచ్చిన హామీలను విశ్లేషిస్తే ఒక్కొక్కటే  ఉద్వాసన దిశగా పయనించాయి. అధికారానికి రాకముందు ప్రపంచ బ్యాంకు ప్రవేశాన్ని నిరసించిన కాంగ్రెస్‌  అధికారానికి వచ్చిన సంవత్సరం తర్వాత క్రమక్రమంగా ప్రపంచ బ్యాంకు విధానాలను అమలు చేయపూనుకుంది. రానురాను ఈ విధానాలను మరింత వేగవంతంగా అమలు ప్రారంభించింది.
    ఉచిత విద్యుత్‌కు ఎగనామం వేసే విధానాలు చేపట్టింది. అందరికి ఉచిత విద్యుత్‌ అన్న ప్రభుత్వం ఉచిత విద్యుత్‌కు ఆంక్షలు పెట్టింది. మూడు పంపుసెట్లు పై పడిన వారికి, ఆయకట్టుగా 2.5 ఎకరాలున్న వారికి, పన్నులు చెల్లించేవారికి ఉచిత విద్యుత్‌ మినహాయింపు చేసింది. 2006 జూన్‌ నాటికి కెపాసిటర్లు పెట్టనివారికి, 2008 మార్చి నాటికి ఐ.ఎస్‌.ఐ. మోటార్లు పెట్టని వారికి ఉచితం నుండి మినహాయింపు అంది. ఆర్థిక భారమైనా కెపాసిటర్లు బిగించుకోక తప్పలేదు. పంపుసెట్లకు మీటర్లు పెట్టడానికి కొత్త పంపుసెట్ల పథకం ముందుకు తెచ్చింది. పెండిరగ్‌ కనెక్షన్లకు యూనిట్‌కు రూ. 20 పైసలు లేదా శ్లాబ్‌ రేటు విధిస్తానంటున్నది. తన మంత్రి వర్గం ఏర్పడేనాటికి తప్ప ఆ తర్వాత కనెక్షన్‌ను పొందిన పంపుసెట్లకు ‘‘ఉచితం’’ వర్తించదని చెప్పుచున్నది. పంపు సెట్ల కింద ఆహార ధాన్యాలు పండిరచకూడదన్న నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇది ప్రపంచ బ్యాంకు విధానంలో భాగమే.
    రాష్ట్ర ప్రభుత్వం రూ. 1300 కోట్లు మునిసిపాలిటీల అభివృద్ధికి ప్రపంచబ్యాంకు నుండి  తెచ్చిన రుణాలలో కూడా మొదటి షరతు పంపుసెట్లకు ‘‘ఉచితం’’ ఎత్తివేయాలని ఉంది. నేడు 23 లక్షల పంపుసెట్ల కింద 40 లక్షల ఎకరాల సాగు ఉంది. పంపు సెట్ల నుండి సాగును దూరం చేయడానికి రోజుకు 7 గంటలకు కుదించి, ఆచరణలో 3, 4 గంటలే సరఫరా చేస్తున్నారు. ఉచితం కదా మరి! ఉచితమంటే సరఫరా నిలిపి వేయడంగా మారింది. పెండిరగ్‌ కనెక్షన్లు ఆమోదించినా వారికి మెటీరియల్‌ లేదంటున్నారు. 
    పాత ప్రభుత్వం ఆచరించి పోరాటాల ఫలితంగా విరమించుకున్న సాగునీటి మీటర్ల పథకం ఈ ప్రాచుర్యం పునరుద్ధరించి, వేగవంతం చేసింది.
    ఆత్మహత్యలకు పాల్పడిన రైతులు వ్యవసాయ రుణాల వలన మరణించారా? ఇతర కారణాలున్నాయా? అంటూ ఎక్స్‌గ్రేషియాకు ఎగనామం పెడ్తున్నది. తెచ్చిన రుణాలు వ్యవసాయానికి మాత్రమే పెట్టి ఆత్మహత్యకు పాల్పడిన వారికి ఎక్స్‌గ్రేషియా ఇప్పిస్తామంటున్నారు.  హెల్ప్‌ లైన్‌ కార్యక్రమం విరమించారు. ఆ కార్యక్రమానికి పెట్టిన దరఖాస్తులు అతీ గతీ లేవు. ఆరు మాసాల పాటు ప్రకటించి రుణాల మారిటోరియం ప్రైవేట్‌ రుణాలకే పరిమితమైంది. ఆ తర్వాత ప్రైవేట్‌ వారు, బ్యాంకులు రుణ వసూళ్ళకు ఒత్తిడి ప్రారంభించడంతో గతం కన్నా అధిక సంఖ్యలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడినారు. ఇంకా ఆత్మహత్యలు కొనసాగుతూనే వున్నాయి.
రుణ విధానం :
     తెలుగుదేశం శాసనసభ్యుల సహకారంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం శాసనసభలో 2/94 సహకార సవరణ చట్టం తెచ్చింది. ఉద్యోగాల తగ్గింపుకు పూనుకుంది.
    4610 సొసైటీలను 2940కి తగ్గించింది. సభ్యులను 1.40 కోట్ల నుండి 29.70 లక్షలకు తగ్గించి, ఆ ప్రాతిపదికపై 2005 అక్టోబరులో ఎన్నికలు జరిపింది. గత ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్‌ తిరస్కరించిన 1995 చట్టాన్ని పునరుద్ధరించింది. ఏకంగా ‘‘నాబార్డు - ప్రభుత్వం’’ ఒప్పందంలో 1995 చట్టాన్ని అమలు చేస్తున్నది. ఈ రంగం నుండి ప్రభుత్వం పూర్తిగా విరమించుకుంటున్నది. వైద్యనాథన్‌ కమిటీ సిఫార్సులు అమలు చేస్తున్నానంటూ సహకార రంగం గొంతు నులిమివేస్తున్నారు. గతంలో ప్రైవేటీకరించిన సహకార చెరకు ఫ్యాక్టరీలను, పాల సొసైటీలను తిరిగి సహకార రంగంలోనే కొనసాగిస్తానని చేసిన వాగ్దానానికి భిన్నంగా మొత్తం ఈ రంగాలను ప్రైవేట్‌పరం చేస్తున్నది. మైక్రో ఫైనాన్స్‌ సంస్థలపై ఆధారపడి  రైతులు రుణాలు పొందుతున్నారు. రుణాల తగ్గింపు కొనసాగుతూనే వుంది.
    తెలుగుదేశం ఏర్పాటు చేసిన 2.03 లక్షల రైతు మిత్ర సంఘాలు పనికిరావని, హెమోజీనియస్‌ సంఘాలు (ఏక వర్గ సంఘాలు)గా ఉండాలని కొత్తగా 1.03 లక్షల సంఘాలు ఏర్పాటుకు ఆదేశించింది. నేటికి 32వేల రైతు మిత్ర గ్రూపులను ఏర్పాటు చేశారు. 12 వేల సంఘాలకు రుణాలు ఇచ్చారు.సంఘం రిజిష్టర్‌ అయినాక 15 రోజులుగా రుణాలిస్తామన్నారు. ఇంతవరకు రిజిష్టర్‌ అయిన సంఘాల వారు బ్యాంకుల చుట్టూ తిరగడంతోనే సరిపోతున్నది. వ్యవసాయ రుణాల లభ్యత అనేది తీవ్ర సమస్యగా రైతులు ఎదుర్కొంటున్నారు.
విత్తనాలు
    గత ప్రభుత్వం విత్తనం చట్టాన్ని తీసివేసి ఎంఒయు విధానాలు తీసుకురాగా, ఈ ప్రభుత్వం ఎం.ఒ.యు.ను రద్దు చేసింది. విత్తన చట్టం శాసనసభ చేత ఆమోదింపచేసి కేంద్రానికి పంపింది. ప్రస్తుతం రాష్ట్రంలో విత్తనాలకు ఏ చట్టం లేని స్థితి ఏర్పడిరది. నేటికి బహుళజాతి సంస్థల ఆధిపత్యంలోనే విత్తన రంగం ఉంది. ప్రమాదకరమైన బి.టి. విత్తనాల అమ్మకాలు ముమ్మరంగా సాగుతున్నాయి. విత్తన ధర తగ్గింపుకు ఈ ప్రభుత్వం కృషి చేయడం హర్షదాయకమే. బి.టి. విత్తనమే మన రాష్ట్ర పరిస్థితులకు అనుకూలమా? కాదా? అన్నది సమీక్షలు జరపలేదు. విత్తనాల కొరత తీవ్రంగా వుంది. నకిలీ, నాణ్యతలేని విత్తనాల బెడద గతంలాగే కొనసాగుతున్నది. లక్షల ఎకరాల పంటలకు ఏటా రైతులు నష్టపోతున్నారు.
ప్రైవేట్‌ మార్కెట్‌ బిల్లు :
     రాష్ట్ర శాసనసభ ప్రైవేట్‌ మార్కెట్లు బిల్లును ఆమోదించింది. ఇక నుండి రైతులకు కనీస మద్దతు ధరలు కూడా లభ్యం కాని స్థితి ఏర్పడిరది. కొనుగోలు కంపెనీల దయాదాక్షిణ్యాలపై ఉత్పత్తులు అమ్ముకోవాలి. ప్రభుత్వ కొనుగోలు సంస్థలు ప్రైవేట్‌ మార్కెట్లలోకి రావు. ఇప్పటికే కనీస మద్దతు ధరలు పొందని రైతులు మరింత తక్కువ ధరలకు తమ ఉత్పత్తులు అమ్ముకోవాలి.
    రాష్ట్ర ప్రభుత్వం పల్లెబాట, రైతుయాత్రలు, రైతు చైతన్య సదస్సులు, ప్రజా పథం,    (పూడిక తీత) చైతన్యయాత్రలు, ఇందిరప్రభ, భూపంపిణీ కార్యక్రమాను ప్రకటించారు రానున్న మూడు సంవత్సరాలులో రు75 వేల కోట్ల పంట రుణాలు ఇస్తామన్నారు. ప్రధాని ప్యాకేజీ క్రింద రు 9650 కోట్లతో వ్యవసాయ సంక్షోభాన్ని నివారిస్తామన్నారు. మార్కెట్లో రైతులు మోస పోకుండా న్యాయ ధరలు ఇప్పిస్తామన్నారు. ఇందులో ఏ ఒక్కటి సంపూర్ణంగా అమలు జరిగిన దాఖలాలు లేవు. గత తెలుగుదేశం విధానాలనే ఈ ప్రభుత్వం అత్యంత వేగవంతంగా కొనసాగిస్తున్నది. ప్రపంచబ్యాంకు విధానాలే నేటి  ప్రభుత్వానికీ అనుసరణీయ విధానాలుగా వున్నాయి. అందువలనే ఆ ఆత్మహత్యలు మరింత ఉధృతంగా కొనసాగుతున్నాయి. ఈ విధానాలను మార్చుకోకుండా వ్యవసాయరంగం అభివృద్ధి కాదు. రైతుల ఆత్మహత్యల నివారణ జరగదు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు సాగించాయి.

No comments:

Post a Comment