Wednesday, 13 August 2014

కరువుల నష్టాన్ని తగ్గించలేమా?

    జూన్‌తో మొదలైన వర్షాకాలం జూలై మధ్యవరకు పరిశీలిస్తే రాష్ట్రంలో ఈ సంవత్సరం కూడా కరువు ఛాయలు కనపడుతున్నాయి. భారత వ్యవసాయశాఖా మాత్యులు శరద్‌పవార్‌, షిండే లాంటివారు రానున్న 15 రోజులలో వర్షాలు వస్తాయని చేస్తున్న ప్రచారాన్ని, ప్రకటనలు రైతులు, ప్రజలు నమ్మడం లేదు. గత రెండు దశాబ్దాల అనుభవం కండ్ల ముందు ఉంది. క్రమానుగతంగా విస్తరిస్తున్న గ్లోబల్‌ వార్మింగ్‌ ఫలితంగా ఋతువుల కాలగతి మారిపోయింది. ఎప్పుడు వర్షాలు వస్తాయో తెలియని అయోమయ స్థితి నెలకొని ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1.25 కోట్ల ఎకరాలలో మెట్టపంటలు వేయాల్సి ఉండగా నేటి వరకు 50 లక్షల ఎకరాలలో మాత్రమే పంటలు వేశారు. వర్షాభావ పరిస్థితుల వలన 50శాతం విత్తులు నాటినా మొలకలు దెబ్బతిన్నాయి. కొన్ని జిల్లాలలో రెండు సార్లు విత్తులునాటి రైతులు నష్టపోయారు. మూడవసారికి విత్తనానికి రైతులకు పెట్టుబడిలోటుతోపాటు మార్కెట్లో విత్తనాల కొరత ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితిని గమనించి ప్రైవేటు విత్తన వ్యాపారులు అత్యధిక ధరలకు అమ్ముతున్నారు. బ్లాక్‌మార్కెట్‌ కొనసాగుతున్నది. అనేక గ్రామాలలో త్రాగునీటి ఇబ్బంది తొలగిపోలేదు. కరువు పరిస్థితులు రాష్ట్రంలో పదేపదే పునరావృతమవుతున్నా రాష్ట్రప్రభుత్వం శాస్త్రీయ దృక్ఫధంలో కరువుల నివారణకు, కనీసం కరువు నష్టాన్ని తగ్గించడానికి ఎలాంటి ప్రయత్నాలు ప్రభుత్వం చేయడం లేదు. వ్యవసాయాన్నేకాక రాష్ట్రప్రజలను ప్రకృతి వైపరిత్యాలకు బలిపెట్టే విధంగా ప్రాప్తకాలజ్ఞతగా ప్రభుత్వం కొనసాగుతున్నది. మంచి వర్షాలు పడి ఉత్పత్తి పెరిగినప్పుడు తమ గొప్పతనంగా, ప్రకృతి వైపరిత్యాలేర్పడి నష్టాలేర్పడినప్పుడు అది ప్రకృతి పైకి తోసి ప్రభుత్వం తప్పుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. రాష్ట్రంలో మనకున్న వనరులను సద్వినియోగంలోకి తెస్తే 70 శాతం కరువు నష్టాన్ని నివారించే అవకాశాలున్నాయి. ఇందుకు నిపుణులతో, అనుభవజ్ఞులతో ప్రభుత్వం సమావేశాలు జరిపి విధానాలు రూపొందించాలి. మేఘమధనం పేరుతో నేటికి చేసిన కోట్ల వ్యయం నిరుపయోగమైంది.
రాష్ట్ర జలవిధానాన్ని రూపొందించాలి
    రాష్ట్రంలో 64వేల చెరువులు, 29లక్షల బావులు, 550 లిప్టుఫతకాల కింద 1.20 కోట్ల ఎకరాల ఆయకట్టు సాగవుతున్నది. ఈ నీటివనరులు వర్షాధారంపై ఆధారపడి ఉన్నాయి. వీటికి నీటి గ్యారంటీ ఏర్పాటు చేస్తే ఒక పంట పండడంతోపాటు భూగర్భ జలాలు వృద్ధి అవుతాయి. తర్వాత సంవత్సరానికి భగర్భ జలాలలను వినియోగించవచ్చు. శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం 777 టిఎంసిల భూగర్భ జలాలలో రాష్ట్రం 440టిఎంసిలు వినియోగిస్తున్నది. ఒక సంవత్సరం వర్షాభావ పరిస్థితులేర్పడితే భూగర్భ జలాల రీచార్జీ లేక రాష్ట్రం వినియోగించే నీటి లభ్యత తగ్గుతున్నది. బావులు, చెరువులు ఎండిపోతున్నాయి. మైనర్‌ ఇరిగేషన్‌ పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురిఅవుతున్నది. ఈ నష్టాన్ని నివారించడానికి ప్రాజెక్టులతో మైనర్‌ ఇరిగేషన్‌ను అనుసంధానం చేయాలి. దీనికి ఒక విధానాన్ని రూపొందించాలి. ప్రాజెక్టులలోకి 80శాతం నీరు రాగానే తూముల ద్వారా, ఇతర మార్గాల ద్వారా వీలైనన్ని చెరువుల నింపే విధంగా ప్రణాళిక రూపొందించాలి. చెరువులు నింపడం ద్వారా భూగర్భజలాలు పెరగడంతోపాటు బావుల సేద్యానికి నీటి గ్యారంటీ ఏర్పడుతుంది. పాడిపరిశ్రమకు గ్యారంటీ ఏర్పడుతుంది. గాలిలో తేమ అధికంగా ఉండటం మూలంగా వర్షాలు పడేఅవకాశాలుంటాయి. భూగర్భజలాలు సమృద్ధిగా ఉన్నప్పుడు వాతావరణంలోనే అనుకూల మార్పులు ఉంటాయి. బహుళ ప్రయోజనాలు కలిగిన ప్రాజెక్టులు`మైనర్‌ఇరిగేషన్‌ అనుసంధానం అత్యంత కీలకం. దీనికి ప్రభుత్వం పెద్దగా నిధులు వ్యయం చేయాల్సిన అవసరం లేదు. అవసమైన చోట చెరువుల అనుసంధానానికి కాలువల నిర్మాణం చేయాలి. ప్రస్తుతం కృష్ణా, గోదావరి తదితర 40నదుల ద్వారా రాష్ట్రంలో జలవనరులు ప్రవహిస్తున్నాయి. మనం వినియోగించని నీరు సముద్రంపాలవుతుందే తప్ప మరొక రాష్ట్రానికి ఉపయోగం లేదు. గత సంవత్సరం 878 మండలాల్లో వర్షాభావం వల్ల కరువు పరిస్థితులేర్పడినప్పటికీ ఈ నదుల ద్వారా 3000 టిఎంసిల నీరు సముద్రంపాలు కావడం గమనించాలి. యేటా 5000`2000 టిఎంసిల మధ్య కనీసంగా సముద్రంపాలవుతున్నాయి. ఆ నీటిని నిలువ చేసుకోవడానికి ఎలాంటి ప్రాజెక్టులు లేవు. ప్రస్తుతం జలయజ్ఞంలో చేపట్టబడిన 75శాతం ప్రాజెక్టులు లిప్టుపథకాలే కావడం గమనించాలి. మీడియం ఇరిగేషన్‌, మైనర్‌ ఇరిగేషన్‌ వనరులకు నీటి లభ్యతకు ప్రస్తుతమున్న ప్రధాన ఆధారం వర్షాలు మాత్రమే. ప్రత్యేక ప్రణాళిక తయారు చేసి వృధాఅయ్యేనీటిని వినియోగించే విధంగా జలవనరుల అనుసంధానం చేపట్టాలి. కాలగతి మారి వచ్చిన వర్షపు నీటిని వినియోగించాలి. కొంత మంది చెపుతున్నట్లు వర్షాకాలం ప్రాజెక్టులతోపాటు, మైనర్‌ ఇరిగేషన్‌వనరులలోకి కూడా నీరు వస్తుందని చెప్పడం వాస్తవం కాదు. ఒకే మండలంలో ఒక ప్రాంతంలో వర్షం మరొక ప్రాంతంలో వర్షాభావం ఉండడం చూస్తున్నాం.
నీటి వినియోగంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు
    రాష్ట్రంలో నీటిద్వారా 4000మెగావాట్ల విద్యుత్తు హైడల్‌స్థాపితశక్తి ఉంది. రాష్ట్ర ఉత్పత్తిలో 25శాతం హైడల్‌ ఉత్పత్తి కావడం విశేషం. గ్యాస్‌ద్వారా మరో 3000మెగావాట్ల స్థాపితశక్తి ఉంది. మరో 9000మెగావాట్లు ధర్మల్‌ విద్యుత్తు(బొగ్గుద్వారా) ఉత్పత్తి అగుచున్నది. విద్యుత్తుశాఖ ప్రధానంగా హైడల్‌ విద్యుత్తుపై కేంద్రీకరణపెట్టింది. ప్రాజెక్టులలో నీరు నిండి దిగువకు పంపవలసిన పరిస్థితుల సందర్భంగా మాత్రమే హైడల్‌ ఉత్పత్తి చేయాలి. పంటలకు నీరిస్తున్నప్పుడు ఆనీటిద్వారా విద్యుతు ఉత్పత్తి చేయాలి. కానీ పంటలులేనప్పుడు ప్రాజెక్టుల నీటిద్వారా విద్యుత్తు ఉత్పత్తిని చేయరాదు. ఆవిధంగా చేసినప్పుడు విద్యుత్తుకు ఉత్పత్తికి వినియోగించిన నీరు సముద్రంపాలవుతుంది. గత సంవత్సరం కృష్ణా, గోదావరి డెల్టా ఆధునీకీకరణ పేరుతో రబ్బీపంటలు వేయకపోవడం వలన నీటి వినియోగం అవసరం రాలేదు. కానీ విద్యుత్తు వినియోగానికి దాదాపు 70 టిఎంసిల నీటిని వినియోగించారు. పంటలు లేనప్పుడు ప్రాజెక్టు నీటిని దిగువకు వదలడం చేయరాదు. అపుడు ధర్మల్‌, గ్యాస్‌ ద్వారా విద్యుత్తు ఉత్పత్తిని చేసి లోటును పూడ్చుకోవాలి. కానీ తేలికగా లభ్యమయ్యే హైడల్‌పైననే జన్‌కో దృష్టి ఉంది. ఈ విద్యుత్తు ఉత్పత్తికి నీరు దుర్వినియోగం కాకుండా విధానాలు రూపొందించాలి.
వర్షాభావ సందర్భంగా ఉన్న నీటి వినియోగం
    వర్షాభావ పరిస్థితులున్నప్పటికి మన నదులలో నీటి లభ్యత ఉంది. ఈ లభ్యత ఆధారంగా అనేక లిప్టు పథకాలు పనిచేస్తున్నాయి. ప్రస్తుతమున్న 550 లిప్టులు మరియు 20వేల కమ్యూనిటీ బావుల కింద ఎపిఐడిసి (ఆంధ్రప్రదేశ్‌ ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌) పరిధిలో 13.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి వనరులు కల్పించారు. ప్రభుత్వ శాఖనుండి ఈ పథకాలను రైతుల యాజమాన్యం క్రిందకు మార్చడంతో సగం పథకాలు మూలపడడమే కాక, పనిచేస్తున్న పథకాలకు కేటాయించిన భూమిలో సగం మాత్రమే సాగవుతున్నది. ఈ విధానాన్ని మార్చాలి. ప్రస్తుతం నదులలో ఉన్న నీటిని లిప్టుల ద్వారా సక్రమంగా వినియోగించినచో నిర్ధారించిన ఆయకట్టు 13.5 లక్షల ఎకరాలు కాక మెట్ట ప్రాంతాలలోని అనేక చెరువులను నింపవచ్చు. తద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయి. ఐడిసి శాఖ రైతుల నుండి వసూలు చేసే నీటి తీరువాతో ప్రభుత్వంపై భారం పడకుండా మొత్తం ఆయకట్టుకు సాగునీరిచ్చే విధంగా పంపుసెట్ల నిర్వహణ చేస్తుంది. సరళీకరణ విధానాల ఫలితంగా ప్రభుత్వ సేవల ఉపసంహరణతో, టెక్నాలజీ తెలియని రైతుల నిర్వహణలో లిప్టుపథకాలు మూలపడుతున్నాయి. నిరంతర కరువులకు గేరయ్యే మహబూబ్‌నగర్‌ జిల్లాలో 30వేల ఎకరాలకు సాగునీటి వనరులు కల్పించాల్సిన లిప్టుపథకాలు ఒక్కటికూడా పనిచేయడంలేదు. కృష్ణ జిల్లాలో 115 లిప్టుపథకాల కింద 85 వేల ఎకరాలు సాగుకావల్సి ఉండగా ప్రస్తుతం 40 వేల ఎకరాలే సాగవుతున్నాయి. ఆదిలాబాదు జిల్లాలోని పథకాలన్నీ మూతపడ్డాయి. ఈ పరిస్థితిని చక్కదిద్ది ఆయకట్టుకు  నీరందించే విధంగా లిప్టుపథకాలను ప్రభుత్వమే నిర్వహించాలి. కొత్తగా రూపొందించిన నిబంధన ప్రకారం ఈపథకాలకు 7గంటలు ఉచితంగాను, ఆ తర్వాత వినియోగించే విద్యుత్తుకు యూనిట్‌కు రు.3.20గా టారిఫ్‌ నిర్ణయించడం రద్దు చేయాలి.
    గోదావరి నదిలో ఏటూరునాగారం నుండి దుమ్ముగూడెం వరకు నీరు నిలువ ఉంటుంది. గోదావరి జీవనదిగా సంవత్సరం పోడుగునా ప్రవహిస్తుంది. ఏటూరునాగారం వద్ద కాంతలపల్లి ప్రాజెక్టు నిర్మాణం చేసినచో వరంగల్‌,నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు ఎన్ని వర్షాభావ పరిస్థితులేర్పడినా త్రాగునీరు, సాగునీరు ఇవ్వవచ్చు. ప్రభుత్వం చేయాల్సిందల్లా కాకతీయ కాలువలోకి నీటిని పంపుచేయడం మాత్రమే. అదేవిధంగా కృష్ణ, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల్లోని ఆయకట్టుకు లిప్టుల ద్వారా నీరందించవచ్చు. ఇందుకు విధానం రూపొందించాలి.
    మొత్తంగాను పరిశీలించినప్పుడు వర్షాభావ పరిస్థితులలో కూడా రాష్ట్రంలోని నదులలో లభ్యమయ్యే నీటితో మైనర్‌ఇరిగేషన్‌కు అనుసంధానం చేసినచో భూగర్భ జలాలను పెంచవచ్చు. దీనివలన కనీసం 70శాతం కరువు నష్టాన్ని అధిగమించవచ్చు. అదేవిధంగా శాశ్వత డ్రైనేజీ బోర్డు ఏర్పాటు చేసి యేటా రు.500 కోట్లు కేటాయించి ఎప్పటికప్పుడు వస్తున్న పూడికను, ఇతర ఆటంకాలను తొలగించడం ద్వారా వరదల వల్ల ఏర్పడుతున్న నష్టాన్ని 60శాతం తగ్గించవచ్చు. విశేషమేమిటంటే గత సంవత్సరం భూగర్భ జలాలను వృద్ధి చేస్తే అవి మరుసటి సంవత్సరానికి వినియోగమవుతాయి. ప్రభుత్వం చేయాల్సిందల్లా నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయడమొకటే. దీనివల్ల రైతులు, త్రాగునీటికి ప్రజలు ప్రస్తుతం పడుతున్న ఆందోళనలకు గురికావల్సిన అవసరం ఉండదు. అమెరికా, ఇజ్రాయిల్‌ లాంటి ప్రాంతాలలో అత్యంత ఎత్తు ప్రాంతాకేకాక, ఇసుక ప్రాంతాలకు కూడా సంవత్సరం పోడుగున నీరు అందేలాగా చేసి ఆ దేశాల అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ‘‘ అన్ని ఉన్నా అల్లుని నోట్లో శని ’’ అన్నట్లు  రాష్ట్రంలో ఉన్న వనరులను పూర్ణస్థాయిలో వినియోగించడానికి ఇంత వరకు  రాష్ట్రంలోని ఏప్రభుత్వమూ ముందుకు రాలేదు. కొందరు అధికారంలో తిష్టవేసుకున్న నాయకులు, కీలకపదువుల్లో ఉన్న ఉద్యోగులు అభివృద్ధికి ఆటంకంగా ఉంటున్నారు. రాష్ట్రంలో అన్ని రంగాలలో అభివృద్ధి జరగాలంటే సాగునీరు, త్రాగునీరు, ఉపాధి, విద్య రంగాలు అత్యంత కీలకం. ఈ మూడు రంగాల అభివృద్ధిద్వారానే నాగరికత అభివృద్ధి అవుతుంది. మిగిలిన రంగాలన్నీ రెండో ప్రాధాన్యత గలవే. కొంత మంది పాలకులు రాష్ట్రంలో అసమానతలు పెంచి పోషించడానికి అభివృద్ధికర విధానాలను అమలుజరపకుండా ఆటంకాలు కల్పించడం జరుగుతున్నది. రాష్ట్రంలో ప్రస్తుతమున్న అసమానాభివృద్ధిని తొలగించడానికి రాష్ట్రప్రభుత్వం సదుద్ధేశంతో అఖిలపక్షాలను, నిపుణులను సంప్రదించి విధాన రూపకల్పన చేసినచో ఒక్క శాసనసభాకాలంలోనే రాష్ట్రాన్ని అత్యంత అభివృద్ధిస్థాయికి తీసుకెళ్ళవచ్చు. దేశంలో ఇన్ని వనరులున్న రాష్ట్రం మరొకటి లేదు. వనరులను వినియోగించకుండా కరువులు`కాటకాలు మరియు వరదల పేరుతో రాష్ట్రాభివృద్ధికి అడ్డుగా నిలిచే ప్రభుత్వ విధానాలు మారాలి. ఇప్పటికైనా ప్రభుత్వం రాష్ట్రజల విధానాన్ని సమగ్రంగా రూపొందించాలి. అపుడే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి అవుతుంది.
సారంపల్లి మల్లారెడ్డి

No comments:

Post a Comment