Wednesday, 13 August 2014

రైతును రక్షించండి ` దేశాన్ని కాపాడండి

20వ రాష్ట్ర మహాసభలు ఒంగోలులో జరుగుతున్న సందర్భంగా
ప్రభుత్వాల గణాంకాల ప్రకారం ప్రతి అరగంటకు ఒకరైతు రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 1997 డిశంబర్‌ 15న వరంగల్‌ జిల్లా గీసుగొండ మండలం ఎలుకుర్తి గ్రామంలో నాగరి కిషన్‌ అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఆత్మహత్యతో నేటికీ 39వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్టు రాష్ట్ర క్రైం బ్యూరో ప్రకటించింది. నేడు రైతు సంక్షోభంలో  కొట్టుమిట్టాడుతున్నాడు. 1997 నుండి ప్రారంభమై 2005లో బాగా ఊపందుకున్న సరళీకరణ విధానాలు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. నేడు అన్ని రంగాల్లో బహుళజాతి సంస్థల ప్రవేశం జరిగింది. మరింత విస్తరణకు అవి కృషి చేస్తున్నాయి. గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం బహుళజాతి సంస్థలకు అనుకూలంగా ‘‘పబ్లిక్‌, ప్రయివేట్‌ పార్టనర్‌షీప్‌ `ఇంటిగ్రేటేడ్‌ అగ్రికల్చర్‌ డెవలప్‌మెంట్‌’’ పేర ఒక డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. ఈ విధానం ప్రకారం ప్రతి ఐదువేల మంది రైతులకు ఒక సంఘాన్ని ఏర్పరచి, ఒకొక్కరికి లక్ష రూపాయల వరకు పెట్టుబడి సమకూర్చి, సమిష్టిగా ఒక కంపెనీకే వ్యవసాయం సాగిస్తారు. ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీ విత్తనాలు మొదలు పంట కోత వరకు అన్ని రంగాల్లో సహకరించి పంటను తానే కొనుగోలు చేస్తుంది. భారీ యంత్రాలతో వ్యవసాయం చేయడం వలన రైతుల భూముల గట్లు తీసివేస్తారు. ఏ పంట వేయాలో కంపెనీనే నిర్ణయిస్తుంది. ఇప్పటికే 17 రాష్ట్రాల్లో 34 బహుళజాతి కంపెనీలతో ఒప్పందం కుదిరింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎనిమిది జిల్లాలతో ఐటిసీ కంపెనీకి (ఇండియన్‌ టొబాకో కార్పొరేషన్‌) అను భారీ కంపెనీతో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం బహుళపంటల విధానాలకు బదులు ఏక రకమైన (మోనోక్రాప్‌) పంటలు వేస్తారు. ఆ విధంగా జరుగు పథకం క్రిందికి సన్న,చిన్నకారు రైతులను మాత్రమే సమీకరిస్తారు. అననుకూల వాతావరణంలో పంటలు దెబ్బతిన్నతీరుకు, పెట్టుబడి బాకీ క్రింద కంపెనీ భూములను హస్తగతం చేసుకుంటుంది. ఒప్పందం ప్రకారం రాష్ట్ర శాసనసభ మార్కెట్‌ చట్టాన్ని సవరిస్తూ వ్యవసాయ దారుడు కాంట్రాక్ట్‌ వ్యాపారస్తునితో ధరతో ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించింది. నాణ్యతా ప్రమాణాలకు భిన్నంగా యున్నచో సరుకు ధర నిర్ణయించినదానికన్నా అతి తక్కువకు రైతు అమ్ముకోవాల్సి వస్తోంది. ఏ రూపంలోనైనా రాష్ట్రంలో సన్న,చిన్నకారు రైతులను సగానికిపైగా తగ్గించటానికి, కార్పొరేటీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది.  గతంలో కుప్పంలోనూ, డాక్టర్‌ రాజశేఖరరెడ్డి తెచ్చిన కంపెనీ వ్యవసాయంలోనూ పెద్ద ఎత్తున రైతులు, రైతుసంఘాలు ఆందోళనలు చేయడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. తిరిగి మరలా కేంద్రం 2012 జనవరి నుండి బహుళజాతి సంస్థల ప్రవేశానికి ప్రయత్నాలు ప్రారంభించింది.
        1936 ఏప్రిల్‌ 11న లక్నోలో అఖిల భారత కిసాన్‌సభ రెండు లక్ష్యాలతో ఏర్పడిరది. (1) భారతదేశానికి స్వాతంత్య్రం సంపాదించడం  (2) భూస్వామ్య విధానం రద్దు చేయడం. 1947 ఆగష్టు 15తో ఆంగ్లేయులు వెళ్లిపోవడంతో భారతదేశం స్వాతంత్య్రం ప్రకటించుకుంది. కానీ, రెండవ లక్ష్యం నేటికీ కొనసాగుతూనే ఉంది. భూస్వామ్య విధానం రద్దు అనగా వాస్తవ సాగుదారుకు భూమిపై అన్ని విధాలైన హక్కులు కల్పించడం జరగాలి. కానీ, నేటికీ సాగుదార్లలో 45నుండి 50 శాతం మంది రైతులు ఎలాంటి హక్కులు లేకుండానే భూములు సాగుచేస్తున్నారు. పంటలకు నష్టం వాటిళ్లినా, ఉత్పత్తుల ధర తగ్గినా వీరు నష్టపోతున్నారు. రుణభారం పెరిగి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నాటి నుండి నేటికీ భూస్వామ్య విధానం రద్దుకావాలని, దున్నేవాడికి భూమిపై హక్కులు కల్పించబడాలని పోరాటాలు సాగుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడక ముందే ఆంధ్ర రాష్ట్రంలో 1928 ఆగష్టు 1న గుంటూరులో రైతుసంఘం ఆవిర్భవించింది.  1922 ఫిబ్రవరి 14న నైజాం ప్రాంతంలో ఆంధ్రజనసంఘం నాయకత్వాన రైతుసంఘం ఉద్యమాలు కొనసాగించింది. ఈ రెండు స్రవంతులు 1956 నవంబర్‌లో విజయవాడలో ‘‘ఆంధ్రప్రదేశ్‌ రైతు మహాసభ’’ నిర్వహించి, పోరాటాలు కొనసాగిస్తూ వస్తున్నది. ఆ తర్వాత రైతుసంఘంలో వచ్చిన చీలిక వల్ల 1968లో గోకినేపల్లిలో జరిగిన రైతు సదస్సులో కామ్రేడ్‌ ఉద్దరాజురామంగారు అధ్యక్షులుగా, బోడేపూడి వెంకటేశ్వరరావుగారు కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం నేటికీ రైతాంగ సమస్యలపై ఉద్యమిస్తూ 2013 జూన్‌ 9`11 తేదీల్లో తన 20వ మహాసభను జరుపుకుంటున్నది. సరళీకరణకృత విధానాల ఫలితంగా కౌలు సమస్య అత్యంత వేగవంతంగా విస్తరించింది.
కౌలు ఉద్యమం:
రాష్ట్ర వ్యాపితంగా కౌలు ఉద్యమం బాగా విస్తరించింది. సరళీకృత ఆర్థిక విధానాల అమలుతో భూస్వాములు స్వయంగా సాగు చేయకుండా తమ భూములను కౌలుకిచ్చి ఇతర ఆదాయ వనరులు చేపట్టారు. రాష్ట్ర వ్యాపితంగా కౌలు ఉద్యమ నిర్మాణంలో గత మూడు సంవత్సరాలుగా తీవ్రమైన కృషి జరిగింది. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ అంచనా ప్రకారం 25 లక్షల మంది కౌలుదారులున్నారని ప్రకటించగా, రైతుసంఘం తన సర్వేలో 40 లక్షల మంది కౌలుదారులున్నట్లు అంచనా వేసింది. కైలు రైతులకు ఎలాంటి రక్షణ లేదు. రెవెన్యూ రికార్డుల్లో నమోదు లేదు. కౌలుదారుల పేర్లు రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలని, వారికి పంట రుణాలు ఇవ్వాలని గత దశాబ్ద కాలంగా పెద్ద ఎత్తున ఆందోళన సాగింది. రెవెన్యూ కార్యాలయాలను ముట్టడిరచారు. బ్యాంకుల పని స్థంభింపజేసారు. ఫలితంగా ‘‘లైసెన్స్‌డ్‌ కల్టివేటర్‌ యాక్ట్‌ ` 2011’’ వచ్చింది.  కౌలుదారులకు రుణాలు, భీమా సౌకర్యం, ప్రభుత్వ పథకాలతో పాటు ప్రకృతి వైఫరిత్యాల పరిహారాన్ని ఈ చట్టం క్రింద కార్డుపొందినవారికి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 2011లో ఆరు లక్షల మందికి కార్డులిచ్చారు. 350 కోట్లు పంట రుణాలు ఇవ్వడం జరిగింది. 2012`13లో నాల్గు లక్షల మందికి కార్డులివ్వగా, అందులో లక్ష మందికి 221 కోట్లు రుణ సౌకర్యం కల్పించారు. రైతుల సంఘటిత శక్తి వలన చట్టం వచ్చినప్పటికీ బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో ఏటా బ్యాంకుల ముందు పెద్ద ఎత్తున ఆందోళనలు సాగుతున్నాయి.
రాష్ట్రంలో 3.80 లక్షల ఎకరాల దేవాలయ భూములు ఉన్నాయి. వీటిని వేలం వేసి బ్యాంకులో డిపాజిట్‌ చేసి దేవాలయాలను నిర్వహించాలన్న ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఉద్యమించి దేవాలయ భూములు పేదలు కౌలుకు చేసుకునే విధంగా ప్రభుత్వాన్ని ఆమోదింపచేసారు. నేటికీ కొంత మంది దేవాలాయ భూములు భూస్వాముల స్వాధీనంలోనే ఉన్నాయి. వాటిని పేదలకు కౌలుకివ్వాలని ఆందోళనలు సాగుతున్నాయి. 
రుణాలు :
యేటా రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశమై వ్యవసాయ పంటల రుణ ప్రణాళికను ప్రకటిస్తున్నాయి. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఉన్నప్పటికీ దానిని అమలు  జరపలేదు. గత సంవత్సరం 1128 మండలాలకు 1060 మండలాలు కరువుకు గురయ్యాయి. 2012`13 సంవత్సరంలో 234 మండలాలు కరువుకు గురయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే నీలం తుఫాన్‌ వల్ల 10 లక్షల ఎకరాల పంటకు నష్టం వాటిల్లింది. ప్రకృతి వైఫరిత్యాల నష్టం జరిగిన రైతాంగం యొక్క రుణాలను రీషెడ్యూల్డ్‌ చేసి తిరిగి కొత్త రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం మరియు రిజర్వు బ్యాంకు ఆదేశించినప్పటికీ బ్యాంకులు రుణమివ్వడానికి ముందుకు రావడం లేదు. రాష్ట్ర సహకార బ్యాంకు తగినన్ని రుణాలు ఇచ్చే ఆర్థిక స్థోమత కలిగిలేదు. ప్రస్తుతం ఏటా 2500 కోట్లు మాత్రమే సహకారబ్యాంకు రుణాలు ఇస్తుంది. వాణిజ్య బ్యాంకులు ఇచ్చే రుణాలు పెద్ద రైతులకు వ్యాపారం చేసుకోవడానికి, బంగారం కుదువపెట్టి వ్యవసాయం పేరిట తక్కువ వడ్డీకి రుణాలు తీసుకోవడానికి, కోల్డ్‌ స్టోరేజీల నిర్మాణానికి, భారీ యంత్రాల కొనుగోలుకు మరియు మైక్రో ఫైనాన్స్‌ సంస్థలకు బ్యాంకులిచ్చిన రుణాలను లెక్కగట్టి వాటిని వ్యవసాయ రుణాలుగా చూపుతున్నారు. ఈ విధానానికి వ్యతిరేకంగా అన్ని బ్యాంకుల ముందు పెద్ద ఎత్తున ఆందోళనలు, ఉద్యమాలు జరిగాయి. ఉద్యమం జరిగినచోట కొంత మేరకైనా రుణాలు ఇచ్చారు.
విత్తనాలు ` ఎరువులు :
రాష్ట్రంలో విత్తనాల ఉత్పత్తి పెద్ద ఎత్తున సాగుతున్నది. భారత దేశ విత్తన వినియోగంలో 60శాతం విత్తనాలు ఆంధ్రప్రదేశ్‌ నుండి సరఫరా అవుతున్నాయి. అయినప్పటికీ ఈ రాష్ట్రంలో బహుళజాతి సంస్థలైనా మన్‌శాంటో, డూ`పాయింట్‌, కార్గిల్‌, సింజెంటా లాంటి కంపెనీలు 80 శాతం విత్తన రంగాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. విత్తన ఉత్పత్తి చేసే రైతులకు లాభదాయకం రాకుండా ఈ కంపెనీలు చేస్తూ, మరోవైపు వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసే రైతులకు అత్యధిక ధరలకు అమ్మి యేటా వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. బహుళజాతి సంస్థల జోక్యానికి, విధానానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాపిత రైతు ఉద్యమాలు సాగాయి. ఉద్యమ ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం విత్తనాల ధరలను కొనుగోలుదారులకు తగ్గించారు. అదే సందర్భంలో ఉత్పిత్తిదారులకు ధరలు పెంచారు. రాష్ట్ర వ్యాపిత విత్తన ఉత్పత్తి రైతాంగ ఉద్యమం బలంగా ఉంది. బహుళజాతి సంస్థలను పూర్తిగా కాకున్నా నియంత్రించగల శక్తిగా ఉద్యమం కొనసాగుతున్నది.
ప్రకృతి వైఫరిత్యాలు :
2012`13లో కరువులు, వరదలు తదితర ప్రకృతి వైఫరిత్యాల వల్ల 5000 కోట్ల రూపాయల పంటలకు నష్టం వాటిల్లింది. ముతక దాన్యాలు, పప్పుదాన్యాలు, నూనెగింజల పంటల దిగుబడులు గణనీయంగా తగ్గాయి. ఆహార పంటల దిగుబడి కూడా తగ్గింది. 2011`12లో 144 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి కాగా, 2012`13లో 111.74 లక్షల టన్నులు మాత్రమే బియ్యం దిగుబడి వచ్చింది. భీమా సౌకర్యం లేదు. రాష్ట్ర ప్రభుత్వం రెండు సార్లు ప్రకృతి వైఫరిత్యాల పరిహారం క్రింద 1600 కోట్లు ఇస్తున్నామని జీవోలు తెచ్చినా, నేటికీ రైతులకు పరిహారం ఇవ్వలేదు. ప్రకృతి వైఫరిత్యాల పరిహారం ఎకరాకు 10వేలు చెల్లించాలని, తక్షణమే రైతాంగానికి పరిహారం ఇవ్వాలని మండల కేంద్రాల్లో ఆందోళనలు జరిగాయి. మన ఆందోళనల ఫలితంగా కొన్ని మండలాల్లో పరిహారం ఇచ్చారు. కానీ చాలా వరకు ఇవ్వాల్సి ఉంది. ప్రకృతి వైఫరిత్యాలకు గురైన మండల కేంద్రాల్లో ఆందోళనలు పరంపరగా సాగుతూనే ఉన్నాయి.
బడ్జెట్‌ కేటాయింపులు :
2013`14 రాష్ట్ర బడ్జెట్‌ 1,61,731 కోట్లు కాగా వ్యవసాయ రంగానికి కేటాయించింది 2903.50 కోట్లు మాత్రమే. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ 14వేల కోట్లతో ఏర్పరచాలని రైతుసంఘాలు చేసిన ఆందోళనను పెడచెవిన పెట్టిన ప్రభుత్వం 15 వ్యవసాయ అనుబంధ శాఖలకు చెందిన బడ్జెట్లను ఒకచోట చేర్చి 25,962 కోట్లుగా వ్యవసాయ బడ్జెట్‌ను ప్రకటించి రైతాంగాన్ని మోసం చేస్తున్నది. ఒక వైపున వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెడుతూనే, మరోవైపున వ్యవసాయ సాధారణ బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టింది. సాధారణ బడ్జెట్‌లో ప్రణాళిక క్రింద 3092.44 కోట్లు కాగా, ప్రణాళికేతర పద్దు క్రింద 968.36 కోట్లు కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం ఇదే కాలానికి తన బడ్జెట్‌ 16,65,297 కోట్లు కాగా, వ్యవసాయ రంగానికి 21,933 కోట్లు కేటాయించింది. వ్యవసాయ పరిశోధనలకు 5,729 కోట్లు మాత్రమే కేటాయించింది. దీనిని బట్టి కేంద్ర`రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యవసాయభివృద్దిపై గల చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు.
గత దశాబ్ధకాలంగా 4 శాతం వృద్దిరేటును వ్యవసాయరంగంలో తేవాలని అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాలను నిర్వహించుకుంటున్నాయి. ఏనాడు 2 శాతానికి మించలేదు. కొన్ని సంవత్సరాల్లో లోటులోకి వెళ్లింది. సాధారణంగా ఆహారదాన్యాలు 218 లక్షల టన్నులు ఉత్పత్తి కావాల్సి ఉండగా, 2012`13లో 171 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి వచ్చింది. దీనికి ప్రకృతి వైఫరిత్యాలను అడ్డంవేసి ప్రభుత్వం తప్పుకుంటున్నది. రాష్ట్ర జలవిధానం నిర్ణయించి కొనసాగిస్తే ప్రకృతి వైఫరీత్యాల నష్టాన్ని 70శాతం తగ్గించొచ్చు. మైనర్‌ ఇరిగేషన్‌ పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నది. రైతులు 12 వేల కోట్లు వ్యయం చేసి త్రవ్వుకున్న బావులకు నాణ్యతగల ఉచిత విద్యుత్‌ సరఫరా లేక 40 లక్షల ఎకరాలు సాగుకావాల్సిన స్థితి నుండి 15 లక్షల ఎకరాలకు బావుల సేద్యం తగ్గింది. విత్తనాలు మొదలు మార్కెట్‌ వరకు, మరియు ఎగుమతులు`దిగుమతుల అంశంతో సహా రాష్ట్ర `కేంద్ర ప్రభుత్వాలు ఉద్దేశ్యపూర్వకంగా రైతులను రుణగ్రస్తులను చేసే విధానాలను అనుసరిస్తున్నాయి. రాజ్యాంగం రీత్యా వ్యవసాయం రాష్ట్ర జాబితాలో ఉన్నప్పటికీ చివరకు విత్తన చట్టం కూడా తేలేని స్థితిలో రాష్ట్రం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యవసాయ పరిశోధన, ఎరువుల సబ్సిడీ, ఎగుమతి`దిగుమతుల నిర్ణయం, వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు గ్రాంట్లు ఇవ్వడం వరకే పరిమితమైన బాధ్యత ఉంది. కానీ ఈ రోజు రాష్ట్రం నిర్వహించే బాధ్యతలు అన్నింటినీ కేంద్రం నిర్వహిస్తున్నది.
రైతుసంఘాలు ఏర్పాటు చేసినప్పుడు పెట్టుకున్న లక్ష్యాల్లో భూస్వామ్య విధానం రద్ధు లక్ష్యం నెరవేరకపోగా, గతంలో సాధించుకున్న స్వాతంత్య్రం నేడు ప్రమాదంలో పడిరది. అన్ని వైపుల నుండి ధనికదేశాలన్నీ భారతదేశ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీయడానికే ప్రయత్నాలు చేస్తున్నాయి. చిల్లరవ్యాపారం పేరుతో వచ్చి, 30 శాతం ఉత్పత్తులు మాత్రమే ఇక్కడ సేకరించి మిగిలిన 70శాతం ఉత్పత్తులు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవడానికి అవకాశం కల్పించుకునే విధంగా ప్రపంచబ్యాంకు ఆదేశిత విధానాలను అమలు చేయ కేంద్ర ప్రభుత్వం పూనుకున్నది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపుతున్నది. డబ్ల్యుటీవో ఆదేశాల మేరకు ప్రభుత్వాలు స్థానికంగా వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తున్నాయి. పంటల మార్పిడి విధానాన్ని ప్రవేశపెట్టి, ఆహారోత్పత్తులను తగ్గించి తమ దేశాలపై ఆధారపడే స్థితికి తెస్తున్నాయి. ఇప్పటికే వంట నూనెలు పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నాము. సాధించుకున్న స్వాతంత్య్రం కూడా ప్రమాదంలో పడడంతో నేడు రైతాంగం ధనిక దేశాల కుట్రలకు దాసోహమంటున్న కేంద్ర`రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తిరిగి సంఘటిత ఉద్యమం కొనసాగించాల్సిన అవసరం ముందుకొచ్చింది. మహాసభలో ‘‘ప్రస్తుత ప్రభుత్వ విధానాల అమలు ` ఫలితాలు’’పై విస్తృత  చర్చ జరిపి సంఘటిత ఉద్యమం కొనసాగించడానికి కృషి చేయాలి.
సారంపల్లి మల్లారెడ్డి
07.06.2013

No comments:

Post a Comment