Tuesday, 12 August 2014

వీర తెలంగాణా సాయుద పోరాట చరిత్రలో వాస్తవాలు

తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతున్న కాలంలో ఆ ఉద్యమాన్ని అణచడానికి  ‘‘ఆపరేషన్‌ పోలో’’ పేరుతో మిలటరీ గవర్నర్‌ జనరల్‌ జె.ఎస్‌.చౌదరి నాయకత్వాన 1948 సెప్టెంబర్‌ 13వ తేదీన యూనియన్‌ సైన్యాలు నిజాంపై దాడికి వచ్చాయి. ఏ ప్రతిఘటన లేకుండానే నైజాం తన సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేస్తున్నట్లు సెప్టెంబర్‌ 17న ప్రకటించారు. ఆదే రోజు సికింద్రాబాద్‌లోని బోల్లారంలో త్రివర్ణపతాకాన్ని ఎగురవేశారు. సెప్టెంబర్‌ 18వ తేదీలో దాడి ప్రక్రియ శాంతియుతంగానే ముగిసింది. ఆరోజు ప్రధాని నెహ్రు, మౌలానా అబ్దుల్‌ కలాం ఆజాద్‌ మరియు నిజాం కలిశారు. నిజాంనే రాజ్‌ ప్రముఖ్‌గా నియమించి, నైజాం ఏడల కాంగ్రెస్‌ గల మిత్రత్వాన్ని చాటుకున్నారు.  నైజాం సంస్థానం యూనియన్‌లో కలుపుకున్న తరువాత 1949 డిసెంబర్‌ `1 నుండి హైదరాబాద్‌లో ఎం.కె.వెల్లోడిని ముఖ్యమంత్రిగా నియమిస్తూ మిలటరీ పాలనకు స్వస్తిపలికారు. ఆ తరువాత 1952లో ఎన్నికలు జరుపగా బూర్గుల రామకృష్ణారావు మొదటి హైదరాబాద్‌ సంస్థాన ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఈ చరిత్రకు అనేక మంది విముక్తి పోరాటమని కొందరు, నైజాం పాలన నుండి హిందువులు విముక్తి పొందారని బిజెపి వారు ఉత్సవాలు జరుపుకుంటున్నారు. వాస్తవాలను మరుగు పరుస్తున్నారు. ఒకసారి చరిత్రను పరిశీలిస్తే వీరు సాగిస్తున్న చరిత్ర వక్రీకరణలను గుర్తించవచ్చు.     
    నైజాం పాలన 83వేల చదరపు మైళ్ళు వ్యాపించి వుంది. నేటి తెలంగాణా జిల్లాలైన మెదక్‌, హైదరాబాద్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ, వరంగల్‌, కరీంనగర్‌లతో పాటుగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌, బీర్‌, నాందేడ్‌ పర్బిని, ఉస్మానాబాద్‌, కర్నాటక రాష్ట్రంలోని గుల్బర్గా, బీదర్‌ మరియు రాయిచూర్‌ జిల్లా నైజాం పాలనలోనున్నాయి. 1951 గణాంకాల ప్రకారం 90 లక్షల తెలుగు మాట్లాడేవారు. 45 లక్షలు మరాఠీ, 20 లక్షలు కన్నడం, 21 లక్షలు ఉర్దూ భాష మాట్లేడేవారు వున్నారు. నాటి ముస్లిం జనాభా 12 శాతం మాత్రమే. నేడు కూడా దాదాపుగా అంతేవుంది. కాని నైజాం పాలనలో ఉన్నతోద్యోగాలలో 90 శాతం ముస్లింలే వున్నారు. నిజాం పాలన కింద వున్న 5.03 కోట్ల ఎకరాలలో 3కోట్ల ఎకరాలు శిస్తు చెల్లింపు కిందను, 1.5 కోట్ల ఎకరాలు జాగీర్‌దారీ వ్యవస్థ కిందవుంది. 10శాతం నైజాం స్వంత భూములున్నాయి. వీటిని సర్ఫేఖాస్‌ భూములు అంటారు. సర్పేఖాస్‌ మరియు ప్రజల నుండి కొల్లగొట్టిన ధనం ఏటా 2 కోట్లు నైజాం కుటుంబ వ్యయానికి వినియోగించేవారు. నైజాం పాలన కింద రైతులు బానిసలుగా బతికేవారు. చేతివృత్తుల వారు, చాకలి, మంగలి, వడ్రంగం, కమ్మరి, దళితులు, రాజుగారి ఆజ్ఞలకు లోబడి భూస్వాములకు వెట్టిచాకిరి చేస్తుండేవారు. ఈ వెట్టి చాకిరి అత్యంత వికృత రూపాల్లో వుండేది. ప్రతి ఇంటి నుండి ఒక మనిషిని పటేల్‌ పట్వారీ, మాలీ పటేల్‌ లేదా దేశ్‌ముఖ్‌ల ఇండ్లల్లో గృహ సంబంధ పనులు చేయడం, పోలీస్‌ స్టేషన్లకు ఇతర కార్యాలయాలకు రిపోర్టుల మోసుకుపోవడం, గ్రామ చావిడిలో పడుకోవడం, గ్రామాన్ని కాపలా కాయడం చేసేవారు. చర్మకారులు, తోళ్లను తమ స్వంత డబ్బుతో తెచ్చి చెప్పులు మరియు వ్యవసాయానికి ఉపయోగపడే పనిముట్లను తయారు చేసి భూ స్వాములకు ఉచితంగా ఇచ్చేవారు. రజకులు, బెస్తలు, బోయలు భూసాములు స్త్రీలను పల్లకీలలో మోసేవారు. వరంగల్‌ జిల్లా వడ్డేపల్లి దేశ్‌ముఖ్‌ పింగిలి దొరలు తెలంగాణా మొత్తాన్ని తానే కల్లు కాంట్రాక్ట్‌ తీసుకొని గ్రామాలపై పూర్తి హక్కు కలిగిఉండేవారు. గీత కార్మికులంతా ఇతను నిర్ణయించిన పన్ను చెల్లించి మాత్రమే కల్లుగీత వృత్తిలో ప్రవేశించాలి.      ఏ మాత్రం పన్ను చెల్లింపులో జాప్యం జరిగినా ఎర్రటి ఎండలో బట్టలు తీసివేసి, కాలుతున్న బండలపై పడుకోబెట్టేవారు. భూస్వాముల ఇండ్లల్లో వారి కూతుళ్ళ వివాహాలు జరిగినప్పుడు చేతివృత్తుల కులాల్లోని బాలికలను వారి అమ్మాయికి బానిసలుగా వారి వెంట పంపేవారు. వీరు కూడా కట్నంలో ఒక భాగమే. వారి కుటుంబాలలో జరిగే వివాహాలన్నింటికీ సరుకులు, మాంసం, పదార్థాలు వగైరా ఉచితంగా సరఫరా చేయాలి. రైతులు భూస్వాముల భూముల ను దున్నిపంటలు వేశాకనే తమ భూములను సాగుచేసుకొనేవారు. ఇంతటి నికృష్టమైన బానిస విధానం కొనసాగుతున్న పరిస్థితులు నైజాం సంస్థానంలో వున్నాయి. ఎక్కడ ఎవరు ఎదురు తిరిగినా  వారిని చంపివేసేవారు. 1938లో జాతీయ గీతమైన వందేమాతరం గానాన్ని నైజాం నిషేదించారు. 1934లో కోస్తాలో ప్రారంభమైన కమ్యూనిస్టు ఉద్యమం క్రమంగా తెలంగాణాకు వ్యాపించింది. 1940 నాటికి ఆంధ్రమహాసభలోని అతివాదులను కమ్యూనిస్టులు ఆకర్షించారు. ఈ పరిస్థితుల్లో ఇరుప్రాంత ఉద్యమాలను సమన్వయం చేయ ప్రారంభించారు. 1946లోనే కమ్యూనిస్టులు విశాలాంధ్రకు పిలుపునిచ్చారు. కా॥పుచ్చలపల్లి సుందరయ్యగారు 1946లోనే ‘‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’’ పుస్తకాన్ని ప్రచురించారు. ఇది సాతంత్య్రానికి పూర్వం జరిగిన చరిత్ర. ఆ విధంగా తెలంగాణా ఉద్యమంతో కమ్యూనిస్టులకు సంబంధాలు ఏర్పడ్డాయి.
    1946లో ఇత్తేహాదుల్‌ ముస్లిమీన్‌ సంస్థ కాశిం రజ్వీనాయకత్వాన ఏర్పాటు చేశారు. ఇతను మహారాష్ట్రంలోని లాధూర్‌కు చెందిన న్యాయవాది. 4లక్షల మంది (రజాకారులు) వాలంటీర్లను తయారు చేశారు. 56 కేంద్రాలు నడిపాడు. ఈ సంస్థ భూస్వాములతో మిలాఖతై ప్రజలపై పెద్ద ఎత్తున నిర్బంధకాండ సాగించారు. వీరికి నైజాం సైన్యం కూడా తోడ్పాటునందించింది. వెట్టి చాకిరికి వ్యతిరేకంగా ‘‘మీ బాంచన్‌ కాల్‌మొక్కుతా’’ అనే బానిస విధానానికి వ్యతిరేకంగా ప్రజల్లో పెద్దయెత్తున అసంతృప్తి జ్వాలలు లేచాయి. ఈ సందర్భంగా స్టేట్‌ కాంగ్రెస్‌ పేరుతో యున్నవారు ఈ ప్రజా ఉద్యమానికి సహకరించారు. (కాని వీరు ‘‘ఆపరేషన్‌ పోలో’’ తరువాత యూనియన్‌ కాంగ్రెస్‌లో చేరారు).
వరంగల్‌ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని చిట్టేటి (చాకలి) అయిలమ్మ, భూములలోని పంటను కాజేయడానికి పక్కనే వున్న దేశ్‌ముఖ్‌ విసునూరు రామచంద్రారెడ్డి మనుష్యులు దౌర్జన్యంగా పంటకోయడానికి వచ్చారు. ఈ సందర్భంగా  అయిలమ్మ నాయకత్వాన స్థానిక ప్రజలు తిప్పికొట్టారు. భూస్వామి చర్యకు నిరసనగా దొడ్డి కొమురయ్య నాయకత్వాన ఊరేగింపు జరిపారు. ఊరేగింపు విసునూరు గ్రామం చేరగానే చాటునుండి నైజాం పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో దొడ్డి కొమరయ్య అక్కడిక్కడే మరణించారు. అతని అన్న మల్లయ్య గాయాల పాలైనాడు. దాంతో ఉద్రిక్తులైన ప్రజలు  దేవ్‌ముఖ్‌ కోటపై దాడి చేశారు. పోలీసుల, గూండాల చేతుల్లోని తూపాకులు లాక్కున్నారు. ఈ ఘటన 1946 జులై 4న జరిగింది. దొడ్డి కొమురయ్య మరణంపై కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర వ్యాపితంగా విస్తృతంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. ఆ ప్రదర్శనలను నైజాం సైన్యంతో పాటు భూస్వామ్య గుండాలు ఎదురించడంతో ప్రజలు తిరుగుబాటు చేసి సాయుదులు అయ్యారు. అ విధంగా సాయుధ పోరాటం ప్రారంభమైంది.
తుఫాకులు దించకుండా రైతులు, చేతివృత్తులు వారు, వ్యవసాయ కార్మికులు, సాధారణ ప్రజలు సాయుధ దళాలుగా ఏర్పడి పెద్దయెత్తున భూస్వాముల భూముల అక్రమణకు పాల్పడ్డారు. ఈ సాయుధ దళాల పోరుకు దడిచి భూస్వాములు పట్టణ ప్రాంతాలకు పరుగులు తీశారు. నాటి భూ స్వాములైన విసునూరు దేశ్‌ముఖ్‌ ఒక లక్ష ఎకరాలు, జెన్నారెడ్డి ప్రతాపరెడ్డికి 1.50లక్షల ఎకరాలు, దేవరకొండ మల్లాపురం రంగారెడ్డి, చందంపల్లి దొరలు, మిర్యాలగూడ చెరుకుపల్లి నర్సింహా రెడ్డి, హూజూర్‌నగర్‌ జేతవోల్‌ దొరలకు వేలాది ఎకరాల భూములపై హక్కులున్నాయి. ఇలాంటి వారు నైజాం సంస్థానంలో వేళ్ళమీద లెక్కించగలినంత మంది వున్నారు. సాయుధ పోరాటం ప్రారంభం కాగానే వీరంతా గ్రామాల విడిచి పట్టణాల పైపు కుటుంబాలతో సహా పరుగులు తీశారు. నైజాం రక్షణ కింద పట్టణాల్లో వున్నారు. ఈ సాయుధ పోరాటం 10 లక్షల ఎకరాల భూమిని భూస్వాముల నుండి స్వాధీనం చేసుకుంది. 3వేల గ్రామాల్లో గ్రామ రాజ్యాలను ఏర్పాటు చేసింది. ప్రత్యామ్నాయ పాలన కొనసాగించింది. అంతకు ముందే ఆంధ్ర మహాసభలో సంఘంగా ఏర్పడిసంఘటితపడివున్న పోరాట శక్తులు అప్రతిహతంగా ముందుకు సాగాయి. కమ్యూనిస్టుల నాయకత్వాన పోరాటం సాగించారు. 3`12`1946న కమ్యూనిస్టు పార్టీపై నిషేదం విధించారు. 1947 జూన్‌ తరువాత నిషేదాన్ని కొంత సడలించినా 30 జనవరి 1948న మరల నిషేదం విధించారు. నిషేదంవిదించి వెరవక     ఉద్యమం ముందుకు సాగింది.    
1947 ఆగస్టు 15వ దేశానికి స్వాతంత్య్ర సిద్దించింది. ఆంగ్లేయులు దేశం విడిచి వెళ్లారు. కాని నిజాం పాలనలో ఉన్న నైజాంకు మాత్రం స్వాతంత్య్రం సిద్దించలేదు. భారత యూనియన్‌తో విలీనం చేసుకోలేదు. నాటి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ నైజాంతో రాజీపడి ఈ సంస్థానాన్ని కొనసాగించడానికే అంగీకరించారు. కాని నైజాంలో సాగుతున్న సాయుధ పోరాటం కేంద్రానికి భయాన్ని తెచ్చిపెట్టింది. అంతకుముందు మొదటి ప్రపంచ యుద్దంలో విజయం సాధించి, కమ్యూనిస్టు దేశంగా మారిన రష్యాను చూసి, తెలంగాణా పోరాటం కూడా అదే దారిలో వెళుతుందేమోనని భారతదేశంలో కూడా ఎర్రజెండా పాలన కిందికి వస్తుందెమోనని కేంద్రానికి భయం పట్టుకుంది. నిజాం కమ్యూనిస్టు సాయుధ పోరాటాన్ని అణచగలిగిన స్థితిలో లేడని కేంద్రం గుర్తించింది. అప్పటికే నైజాం సైన్యం, రజాకారులు, భూస్వాములు 1500మంది పోరాట యోధులను పొట్టన పెట్టుకున్నారు. చిత్రహింసలు చేసి కాల్చిచంపారు. అయినా పోరాటం తెలంగాణాలో విస్తరిస్తూనే వుంది.    
ఈ పరిస్థితుల్లో 1948 సెప్టెంబర్‌ 13న యూనియన్‌ సైన్యాలు నైజాంను విలీనం చేసుకోవడానికి వచ్చాయి. ఏ ప్రతిఘటనలు లేకుండా సెప్టెంబర్‌ 17న నిజాం లొంగుబాటు ప్రకటించాడు. సెప్టెంబర్‌ 18న ఆపరేషన్‌ పోలో ముగిసింది. కాని కేంద్ర సైన్యాల ప్రవేశం అనంతరం జరిగిందేమిటి?    
కేంద్రం సైన్యాలు వచ్చే నాటికి గ్రామాల్లో ప్రజాపాలన సాగుతున్నది. తాము సాగుచేస్తున్న భూములపై తామేహక్కులు కలిగివున్నారు. ఎవరికీ పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. వ్యవసాయ పనులు, ఇతర వృత్తులు చేసుకుంటున్నారు. వెట్టిచాకిరి లేదు. నిర్బంధం లేదు. ఇలాంటి స్వేచ్చను ఈ ప్రజలు ఎప్పుడూ ఎరుగరు. అలాంటి పరిస్థితుల్లో కేంద్ర సైన్యాలు నైజాం ప్రాంతాల్ని విలీనం చేసుకున్న తరువాత నైజీంలోనే తిష్ఠవేసి కమ్యూనిస్టు దళాలను, నాయకులను అణచటానికి నిర్బంధ కార్యక్రమం కొనసాగించారు. ఒకవైపు నిజాంను ఆపద్దర్మ ప్రభుత్వంగా ప్రకటించి మరోవైపు ప్రజలకై కేంద్ర సైన్యం దాడులకు పూనుకుంది. పట్టణాలకు వెళ్లిన భూస్వాములు తిరిగి మెల్లగా గ్రామాలకు చేరి అంతకు ముందు తాము కోల్పోయిన భూములను సైన్యం అండదండలతో హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నించారు. తిరిగి భూస్వాములను ఆస్తి పరులను చేయడంతో పాటు అధికార పీఠం మీద కూర్చోపెట్టడానికి కేంద్ర సైన్యాలు ఉపక్రమించారు. విముక్తి అంటే తిరిగి భూస్వాములను, జమిందారులను, దేశ్‌ముఖ్‌లను మరియు సర్‌దేశ్‌ముఖ్‌లను తిరిగి రప్పించి వారికి ప్రజలకు బానిసలుగా చేయడమా? ఈ కోణం నుండి ఏనాడైనా చరిత్రను ఆలోచించారా? యూనియన్‌ సైన్యాలపై ప్రజలకున్న భ్రమలు తొలగిపోయాయి. సైన్యం ప్రవేశంతో తిరిగి భూస్వాములు తమ భూములను ఆక్రమించుకోవడమేకాక ప్రజలపై తీవ్రనిర్భంధాన్ని కొసాగించారు. కాన్‌సెంట్రేషన్‌ (చిత్రహింసల) క్యాంపులు ఏర్పాటు చేశారు. పోరాట నాయకులను దిగంబరంగా చేసి వారిని తలకిందికి, కాళ్ళుపైకి వేలాడదీసి ఊపుతూ పచ్చటి బరిగెలతో వాతలు వచ్చే వరకు కొట్టేవారు. అరికాళ్లపై తోలు చిట్లేవిధంగా లాఠీలతో బాదారు. వేలిగోళ్ళల్లో గుండుసూదులు గుచ్చేవారు. ఆసనాలల్లో కారంపెట్టారు. మహిళలపై అఘాయిత్యాలు చేసారు. భర్తల ముందే స్త్రీలను చెరిచారు. ఇదీ మన కేంద్ర సైన్యం కొనసాగించిన క్రూర నిర్భంధ విధానం. సైన్యం ఆసరాతో భూస్వాములు, గుండాలు, రజాకార్లు, తిరిగి విజృంభించి ఉద్యమాన్ని, ప్రజలచైతన్య శక్తిని నిర్మూలించ పూనుకున్నారు. చిత్రహింసల ముఖ్యోద్దేశం తిరిగి భూస్వాముల భూములు వారికి అప్పగించడం, భూస్వాముల వద్ద బానిసలుగా బ్రతకడం లక్ష్యంగా సాగించారు.
    యూనియన్‌ సైన్యాలు రాకపూర్వం 1500మందిని నైజాం సైన్యాలు హతమారిస్తే, యూనియన్‌ (కేంద్రం) సైన్యాలు వచ్చాక 2500మందిని హతమార్చారు. వారంతా ప్రజానురాగం పొందిన నాయకులే. యూనియన్‌ సైన్యాలు జరిపిన చిత్రవధలను నైజాం సైన్యంకూడా జరపలేకపోయింది. కేంద్ర ప్రభుత్వం కూడా కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించింది. చాలా వరకు భూములను పేదల నుండి లాక్కొన్నారు. గ్రామాలకు గ్రామాలే ఖాళీ చేయించారు. ఈ పరిస్థితుల్లో గతంలో సాధించుకున్న భూములను రక్షించుకోవాలని, స్వేచ్ఛను కాపాడుకోవాలని, వెట్టి చాకిరిని నిర్మూలించాలని సాయుధ పోరాటం కొనసాగించారు. సాయుధ పోరాటాన్ని అణిచివేస్తామని ప్రగల్భాలు పలికిన కేంద్రం రెండు సంవత్సరాలు గడిచినా పొరాటాన్ని అణలేకపోయింది. పైగా పోరాటం కొత్త ప్రాంతాలకు దాదాపు 8,9 జిల్లాలకు  ఈ పోరాటం పెద్దయెత్తున విస్తరించింది. ఈ పరిస్థితిని గమనించిన కేంద్రం భూస్వాముల భూములపై 1951వ సంవత్సరం ఎవరు సాగులో వుంటే వారికే భూపట్టాహక్కు కల్పిస్తామని చరిత్రాత్మకమైన రక్షిత కౌటుదారీ చట్టం 38ఇ ని ప్రకటించింది. ఈ చట్టంపై సుప్రీంకోర్టుకు కూడా అప్పీలు వెళ్లడానికి వీలు లేకుండా కట్టుదిట్టం చేశారు. కమ్యూనిస్టుపార్టీపై నిషేదం ఎత్తివేయడానికి అంగీకరించారు. సాయుధ పోరాట విరమణ ప్రకటనను కమ్యూనిస్టు పార్టీ 1951 అక్టోబరు 21న చేసింది.
    పోరాట విరమణ తరువాత కేంద్ర ప్రభుత్వం భూచట్టాన్ని కొంత వరకే అమలు చేసింది. తిరిగి భూస్వాములు కాంగ్రెస్‌ పాలకవర్గాల నేతల రూపంలో గ్రామాల్లో పెత్తనం చేజిక్కించున్నారు. శాసన సభ్యులుగా, పార్లమెంట్‌ సభ్యులుగా, మంత్రులుగా దర్శనమిచ్చారు. రక్షిత కౌలుదారీ చట్టాన్ని అమలుకాకుండా అడ్డుపడ్డారు. అమాయకులు, నిరాక్షస్యులైన రైతులతో తాము సాగుచేసుకుంటున్న భూములపై తమ హక్కులు రాజీనామా చేస్తున్నట్లు సంబంధింత అధికారుల ముందు సంతకాలు పెట్టించారు. నేటికీ రక్షిత కౌలుదారీ చట్టం కింద హక్కు కలిగిన వారికి భూములు ఇవ్వకుండా ప్రభుత్వం నిరాకరిస్తున్నది.
    04`07`1946లో ప్రారంభమైన పోరాటం 1948 సెప్టెంబరు 18 వరకు మొదటి దశగా, 1948 సెప్టెంబర్‌ 19 నుండి 1951 అక్టోబర్‌ 21 వరకు యూనియన్‌ సైన్యాల ద్వారా సాగిన పోరాటాన్ని రెండో దశగా చూడవచ్చు. నైజాం కాలంలో సాగిన పోరాటం మొదటి దశకాగా, యూనియన్‌ సైన్యాల ద్వారా సాగిన పోరాటాన్ని రెండో దశగా చూడవచ్చు. మొదటిదశ పోరాటంలో హక్కులు సాధించుకోగా, రెండవ దశలో సాధించుకున్న హక్కుల కొరకు పోరాటం చేశారు. అందువల్ల ఆపరేషన్‌ పోలో గురించిన చారిత్రక వాస్తవాలను తెలుసుకోవడం అవసరం.
సారంపల్లి మల్లారెడ్డి
తేది:07.09.2010

No comments:

Post a Comment