Wednesday, 13 August 2014

క్యాబినెట్‌ ప్రజాసమస్యలు చర్చించదా?

    ఆగస్టు 31న జరిగిన మంత్రివర్గ క్యాబినెట్‌ సమావేశం 16 సమస్యలపై నిర్ణయాలు చేసినట్లు మంత్రి డికె అరుణగారు పత్రికలకు వెల్లడిరచారు. వీటిలో ప్రస్తుతం వివిధ వర్గాల ప్రజలెదుర్కొంటున్న సమస్యలు లేవు. ఆరుమాసాలలో అతి అరుదుగా జరిగిన మంత్రుల భేటీలో ప్రజా సమస్యల చర్చకు ఎజెండా ఉండడం లేదు. ఆగస్టు 31న క్యాబినెట్‌లో భూ కేటాయింపులకు సంబంధించి మూడు తీర్మానాలు, 12,864 ఖాళీ ఉద్యోగాల నియామకం, ప్రజల నుండి రు. 4వేల కోట్ల విద్యుత్‌ బాండు రుణ సేకరణ, 7 చక్కెర కర్మాగారాలకు రుణం సమస్యలున్నాయి. ప్రాణహిత`చేవెళ్ళపై మహారాష్ట్ర ప్రభుత్వం కుదిరిన ఒప్పందానికి ఓకే చేయడంతో మంత్రివర్గ సమావేశం ముగిసింది. చేసిన నిర్ణయాలలో కూడా గోదావరి జలాలపై మహారాష్ట్రతో 1975లోనే ఒప్పందం కుదిరింది. ఆమోదం తెలపాల్సిన ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికను తిరిగి శాఖలకు పంపాలని పరోక్షంగా పెండిరగ్‌లో పెట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంలో 12,864 ఖాళీలలో ఉపాధ్యాయ, డాక్టర్లు, ఇంజనీర్లు, ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులను మాత్రమే భర్తీ చేయాలని నిర్ణయించారు. ప్రజారోగ్యశాఖలో గల 18,797 పోస్టులకు 9,226 పోస్టులు చాలాకాలంగా ఖాళీలుగా ఉన్నాయి. శిశుమరణాలు, మలేరియాతో మరణాలు పెద్దఎత్తున సంభవిసుస్తున్నాయి. ఆసుపత్రులు, ప్రైమరీహెల్త్‌సెంటర్స్‌లో గల ఖాళీలను భర్తీ చేయాలన్న ఆలోచన మంత్రివర్గ సమావేశంలో చోటు చేసుకోలేదు. రాష్ట్రంలో 1.20 కోట్ల కుటుంబాలుండగా, 43.2శాతం కుటుంబాలకు రక్షిత మంచినీటి సౌకర్యంలేదు. అందులో 20శాతం కుటుంబాలకు త్రాగునీరు లేదు. ఒకే గదిలో 41.2శాతం కుటుంబాలు జీవిస్తున్నాయని జనాభా గణాంకాలు తెలిపాయి. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ఏ ఒక్క సమస్యా చర్చకు రాలేదు. గ్రామరెవెన్యూ సదస్సులు(18.1.12 నుండి 17.3.12 వరకు), చైతన్య యాత్రలు, ప్రజాపథం(15,4.12 నుండి 5.5.12 వరకు), రచ్చబండతో పాటు ఈ మధ్య చేపట్టిన ఇందిరమ్మబాట ఫలితాలేవీ చర్చించలేదు. వీటి వల్ల ప్రజాధనం వ్యయం జరిగిందేతప్ప ప్రజలకు లభించింది పూజ్యం. ఈ యాత్రలకు విధివిధానాలు రూపొందించడానికి క్యాబినెట్‌ మంత్రులు కన్నా లక్ష్మినారాయణ, ఆనంరాంనారాయణరెడ్డి, రఘువీరారెడ్డిలతో ఉప సంఘాన్ని వేశారు. ఈ ఉపసంఘం నిర్ణయించిన సమస్యలేవీ పరిష్కారానికి నోచుకోలేదు. ఈ మధ్య కొత్తగా యంత్రలక్ష్మీ పథకాన్ని ప్రవేశపెడుతూ రు.600 కోట్ల సబ్సిడీ ప్రకటించారు. ఇందులో 70శాతం భారీ యంత్రాలకు, 30శాతం చిన్న యంత్రాలకు కేటాయించడం ద్వారా వ్యవసాన్ని యాంత్రీకరణకు ఉద్దేశించింది. చెరుకు కటింగ్‌ యంత్రానికి రు.1.2 కోట్ల యంత్రానికి 50శాతం సబ్సిడీ ఇస్తారు. రైతు పెట్టుబడి ఏ మధ్యతరగతి రైతు పెట్టగలడు. ఈపథకం కింద ప్రభుత్వంచే ఎంపికైన కంపెనీలు వాటికి ఇష్టం వచ్చిన ధర మరియు నాణ్యత పాటిస్తారు. ఈ మధ్య ముఖ్యమంత్రి యంత్రం ద్వారా నాటువేసి పత్రికల్లో ప్రకటన చేశారు. కానీ ఆచరణలో మధ్యతరగతి రైతులకు మాత్రం ప్రభుత్వ రాయితీ అందుబాటులో లేదు. గత సంవత్సరం ఈ సంవత్సరం ప్రభుత్వం ఇచ్చిన విత్తన సబ్సిడీ రు.800 కోట్లు మధ్యదళారీలకే చేరినట్లు వాస్తవాలు తెలుపుతున్నాయి. త్రాగునీరు, విద్యుత్తు సమస్యలు కాలంగడిచిన లోటెన్షన్‌ విద్యుత్‌ తీగతల బదిలీ చేపట్టలేదు. ఫలితంగా విద్యుత్‌ నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి.49.13 లక్షల రైతులకు గత సంవత్సరం కరువు నష్టానికి సంబంధించిన ఇన్‌పుట్‌ సబ్సిడీ రు.1,830 కోట్లు పంపిణీ చేస్తామని నేటికీ రు.1,240 కోట్లు మాత్రమే పంపిణీ చేసినట్లు వ్యవసాయ మంత్రి కన్నా లక్ష్యీనారాయణ ప్రకటించారు. నాలుగు మాసాలు గడిచినా పంపిణీ చేయలేని ప్రభుత్వం ఇంకెప్పుడు పంపిణీ పూర్తిచేస్తారో తెలియదు.
    యూరియా కొరకు రైతులు కుటుంబాలతో సహా దుకాణాల ముందు రోజులు తరబడి పడిగాపులు ఉంటున్నారు. సెప్టెంబర్‌లో రావల్సిన 6 లక్షల టన్నుల ఎరువులను తెప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటిస్తున్నారు. కానీ ఆగస్టులో రావల్సిన కోటా ప్రకారం 2 లక్షల టన్నులు రాలేదు. ఏ పార్లమెంటు సభ్యుడు దీనిపై కేంద్రం వద్ద స్పందించలేదు. మరోవైపున కేంద్ర ప్రభుత్వం ఎరువుల సబ్సిడీ ఎత్తివేత ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రైతులపై రు.1,800 కోట్లభారం వేసింది. రు.480 ఉన్న డిఎపి బస్తా రు.1,260కి మరియు రు.230ఉన్న పోటాష్‌ బస్తా రు.880కి నాలుగు మాసాలలోనే పెంచారు. ప్రస్తుతం యూరియా బస్తా ధర 280 ఉన్నప్పటికీ బ్లాక్‌ మార్కెట్‌లో రు.350`450 మధ్య అమ్మకాలు సాగుతున్నాయి. ప్రణాళిక ప్రకారం ఎరువులను సిద్దం చేసినప్పటికీ అవి రైతులకు చేరకుండా ఎటువెళ్ళాయని వ్యవసాయ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ జిల్లా వ్యవసాయశాఖ జాయింట్‌ డైరెక్టర్ల సమావేశంలో నిన్నటి రోజున ఆశ్చర్యం వెలిబుచ్చారు. అధికారులు ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్లువార్త. ఈ ఆగ్రహాలు ఎలా ఉన్నా ఎరువులు బ్లాక్‌ మార్కెట్‌కే కాక మిక్సింగ్‌ ప్లాంట్లకు దారి మళ్ళాయి. నేడు రాష్ట్రంలో విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, రుణాలు తదితర వ్యవసాయోపకరణాలు బ్లాక్‌ మార్కెటీర్ల చేతుల్లోకి వెళ్ళాయి. రుణం కావాలంటే లంచాలివ్వాల్సిందే.
    వ్యవసాయశాఖ మంత్రిగారు రాష్ట్రవ్యాపితంగా 98శాతం పంటలు సాగులోకి వచ్చాయని 7 గంటలు విద్యుత్తు సరఫరా అవుతుందని ఆదర్శ రైతుల నిబంధనల్లో మార్పులు చేస్తున్నామని, రాష్ట్రప్రభుత్వం కొత్త విత్తన చట్టం తేవడానికి సద్దంగా ఉన్నామని ప్రకటించడం వాస్తవవిరుద్ధంగా ఉంది. కర్నాటక ఆల్మట్టి నుండి 10 టిఎంసిల నీటిని తేవడానికి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని ఎక్కడా పంటలకు డోకా లేదని సెప్టెంబర్‌ 15 వరకు వరి నాట్లు వేసుకోవచ్చని అనంతపురంలో వేరుశనగ పంట బాగా ఉందని ప్రకటించారు. పై వ్యవసాయశాఖా మాత్యులుగా వారి శాఖ ప్రతివారం విడుదల చేస్తున్న సీజనల్‌ రిపోర్టులో మొత్తం 80.29 లక్షల హెక్టార్లు కాగా వాస్తవంగా 68.53 లక్షల హెక్టార్ల విస్తీర్ణం మాత్రమే సాగైనట్లు తెలుపుతున్నది. వరిసాగు సాధారణ విస్తీర్ణం కన్నా 10.22 లక్షల హెక్టార్లు నేటికీ నాట్లు పడలేదు. అక్టోబర్‌లో వరి కోతలు కోసే కాలం. అప్పుడు నాట్లు వేస్తే అది రెండవ పంట అవుతుందేతప్ప మొదటి పంటకాదు. రెండవ పంటకు నీటి గ్యారంటీ ఉండాలి. ఏ ప్రాజెక్టులోకి డెడ్‌ స్టోరేజీకి మించి నీరు రాలేదు. రాష్ట్రంలోని 74 వేల చెరువుల్లో 50 వేల వరకు నీరు రాలేదు. రోజుకు మూడు గంటలు కూడా విద్యుత్తు సరఫరా లేకపోవడంతో పంపుసెట్లకింద 40 లక్షల ఎకరాలకు బదులు 10 లక్షల ఎకరాలే సాగవుతున్నది. రాష్ట్రంలో 16 వేల మెగావాట్ల స్థాపిత శక్తి ఉండగా  3వేల మెగావాట్ల హైడల్‌ ఉత్పత్తి, మరో 1600 మెగావాట్ల గ్యాస్‌ ఉత్పత్తి కావడంలేదు. రోజుకు 280 మిలియన్‌ యూనిట్లు అవసరం కాగా నేడు 200 మిలియన్‌ యూనిట్లు మాత్రమే సరఫరా ఉంది. ఇంత లోటును భర్తీ చేయడానికి క్యాబినెట్‌ చర్చించిందా? రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌.ఎస్‌.ఎ పేరుతో రు.12వేల కోట్టు డిస్కాంలకు చెల్లించాలి. దీనిని చర్చించారా? కరెంటు కోతను అధిగమించే చర్యలేవీ చర్చకు రాకపోవడం గమనించాలి. వేరుశనగ మొత్తం సాగు 12.83 లక్షల హెక్టార్లు కాగా, ప్రస్తుతం 10.16 లక్షల హెక్టార్లు మాత్రమే సాగైంది. ఇంత స్పష్టమైన వాస్తవాలు వారి శాఖ నివేదికలలోనే స్పష్టం చేస్తుండగా అందుకు విరుద్ధంగా ప్రకటించి ఏ రైతులను సంతృప్తి పరుస్తారు. గత సంవత్సరం 878 మండలాలు కరువుకు గురి కాగా కనీసం 400 మండలాల్లో పంటలు లేని పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 2012`13లో ఆహార ఉత్పత్తులు 229 లక్షల టన్నులుగా అంచనా వేశారు. రబ్బీ పంటలు బాగా వచ్చినప్పటికీ ప్రభుత్వ లక్ష్యంలో 30శాతం లోటు వుంటుందనేది వ్యవసాయ నిపుణుల అంచనా.
    రాజ్యంగం రీత్యా విత్తన చట్టం చేయాల్సిన బాద్యత రాష్ట్రప్రభుత్వానిది. కానీ కేంద్రంపైకి తోసివేసి, బహుళజాతి సంస్థలకు రాష్ట్రంలో తలుపులు బార్లా తెరిచి వారిని ఆహ్వానించి రైతులను బలిపశువులుగా చేస్తున్నారు. 2004 నుండి నేటి వరకు బహుళజాతి సంస్థలు రైతుల నుండి విత్తనాల ధరలు పెంచడం ద్వారా వేల కోట్లు కాజేశాయి. నాణ్యత లేని విత్తనాల వల్ల వేల కోట్ల నష్టం పంటలకు వాటిల్లింది. భారతదేశంలోని 60శాతం పంటలకు రాష్ట్రం నుండి విత్తనాలు సరఫరా చేస్తున్నాం. విత్తనోత్పత్తి రాష్ట్రానికి విత్తన చట్టం చేయాలని రైతులు, రైతు సంఘాలు అనేక సంవత్సరాలు ఘోష పెడుతున్నప్పటికీ పెడ చెవిన పెట్టిన ప్రభుత్వం కేంద్రం చట్టం తెస్తుందని నమ్మికతో ఉంది. క్రితం వారం రాష్ట్రం నుండి వెళ్ళిన అఖిలపక్షానికి రాష్ట్ర మంత్రి ముందే ముఖం వాచే విధంగా కేంద్రం వ్యవసాయశాఖా మంత్రి సమాధానాలిచ్చినట్టు పత్రికల్లో చూసాం.   మరొకసారి తనవద్దకు రావద్దన్నట్లు నిష్కర్షగా చెప్పినట్లు పరోక్షంగా రాష్ట్ర మంత్రిగారే తెలిపారు. తామిచ్చిన సవరణలు ఎన్ని ఆమోదించినా విత్తన ధర నిర్ణయించే కీలక అంశాన్ని మాత్రం బహుళజాతి సంస్థలకే అప్పజెప్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించడం, వారి ఎడల కేంద్ర మంత్రికున్న అవగాహన అర్థం చేసుకోవచ్చు. విత్తన చట్టం, భూసేకరణ చట్టం, బయోటెక్నాలజీ రెగ్యులేటరీ చట్టం మరియు పెస్ట్‌ కంట్రోల్‌ యాక్టులు పార్లమెంటు ముందు సంవత్సరాల తరబడి పెండిరగులో ఉన్నాయి. రాష్ట్ర ప్రయోజనాలను ఆశించే పార్లమెంటు సభ్యులు ఏనాడూ వీటపై పార్లమెంటులో నోరెత్తిన పాపాన పోలేదు. చివరకు రాష్ట్రానికి రావలసిన ఎరువుల కోటా గురించి కూడా పార్లమెంటులో కేంద్రం దృష్టికి తేలేదు. వ్యవసాయ ఉత్పత్తి తగ్గిపోవడం ఫలితంగా దీని ప్రభావంతో పారిశ్రామిక ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. సేవారంగంలో నిరుద్యోగం పెరిగిపోతోంది. ప్రస్తుత రాష్ట్ర స్థూల ఉత్పత్తి తగ్గిపోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
    జలయజ్ఞంలో 2004 నుండి 2012 వరకు రు.72వేల కోట్లు వ్యయం చేసినట్లు గవర్నర్‌గారు శాసనసభ బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. 2012`13లో రు.15 వేల కోట్లు ప్రణాళికా పద్దు కింద కేటాయించారు. కానీ ఎక్కడా పనులు మాత్రం సాగడం లేదు. కనీసం అఖిలపక్షాన్ని పలిచి 70 శాతం పూర్తిఅయిన ప్రాజెక్టులలో ప్రాధాన్యతా క్రమంలో చేపట్టిన ప్రస్తుత తక్కువ వర్షాలకు కొంత ఉపయోగం జరిగేది. ఎన్ని విమర్షలు వచ్చినా ప్రభుత్వం ఈ రంగంని చర్చించడానికి ముందుకు రావడంలేదు. పైగా క్రిష్ణా జలాల రెండవ ట్రిబ్యునల్‌ జస్టిస్‌ బ్రిజేష్‌ కుమార్‌ ముందు మన వాదనలు వినిపించడంలో జరిగిన వైఫల్యం వల్ల ఎంత నష్టపోయామో ప్రభుత్వం సమీక్షించలేదు. వ్యవసాయ మంత్రి చెప్పినట్లు కర్నాటక 10 టిఎంసీలు కాదుకదా చుక్కనీరు కూడా విడుదల చేసే పరిస్థితి లేదు. గత ముఖ్యమంత్రులు నారాచంద్రబాబునాయుడ, డాక్టర్‌ వైఎస్‌. రాజశేఖరరెడ్డి కర్నాటక ప్రభుత్వాన్ని 10 టిఎంసిలు కోరి సాధించలేకపోయారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి కోరినా కర్నాటక నీటిని విడుదల చేస్తుందన్న నమ్మకం లేదు. ట్రిబ్యునల్‌ తీర్పులో ప్రోరేటా(దామాషా) ప్రకారం ఆ నెలలో కురిసిన వర్షాలలో సంబంధిత రాష్ట్రాలు పంచుకోవాలన్న నిబంధన లేకపోవడంతో ప్రస్తుతం ఆల్మట్టి, నారాయణపూర్‌ మరియు తుంగభద్ర ప్రాజెక్టులలో ఉన్న నీరు దిగువకు రాదు. ప్రస్తుతం వర్షాలు తగ్గినచో కర్నాటక వినియోగిచిన నీటిని తిరిగి వస్తున్న వర్షాల ద్వారా తన ప్రాజెక్టుల వరకే పరిమితం చేస్తుంది. రాష్ట్రంలో రాయలసీమలోని కాంగ్రెస్‌వారు రాజీనామాలు చేస్తుండగా కోస్తాలోని కాంగ్రెస్‌వారు వీరికి వ్యతిరేకంగా రోడ్ల దిగ్భంధనాలు చేపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో సామరస్య పరిష్కారానికి గతంలో ఆమోదించిన నిబంధనలు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అమలు చేయడానికి అఖిలపక్ష సమావేశం వేయడానికి రాష్ట్రముఖ్యమంత్రికి సలహా ఇచ్చినట్లు కూడా క్యాబినెట్‌లో చర్చించలేదు. రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలు తమ ఆదాయాలు తగ్గి ఆందోళనలు చెందుతున్నప్పటికీ మంత్రులు మాత్రం తమ వేతనాలను నెలకు రు.66,500 నుండి రు.2.42 లక్షలకు ఏప్రిల్‌ నుండి పెంచుకోవడం జరిగింది. వేతనాలు పెంచుకున్నా మంత్రులు ప్రజా సమస్యలను మాత్రం చర్చించడం లేదు. ఇప్పటికీ రాష్ట్రంలో జరిగిన భూ కేటాయింపులలో మోసాలు, వేలకోట్లలో జరిగిన , జరుగుతున్న అవినీతిపై క్యాబినెట్‌ చర్చించకపోవడం విచారకరం. చివరికి సిబిఐ మంత్రులను నేరస్తులుగా గుర్తించినప్పటికీ వారిని నేటికి మంత్రివర్గంలో కొనసాగించడం రాష్ట్రంలో మేధావులనే కాక సాధరణ ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. ఇప్పటికైనా ప్రజాసంక్షేమం కోరి రాష్ట్రంలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలను చర్చించడానికి మంత్రివర్గ సమావేశాలు, శాసనసభ సమావేశాల కాలాన్ని కేటాయించాలి. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై శాసనసభలో చర్చించి నిధులు దారి మళ్ళకుండా కట్టుదిట్టం చేయాలి తప్ప సమాచార సేకరణ పేరుతో కాలయాపన చేసి ఈ సమస్యను మరుగున పెట్టడం క్ష్యంతవ్యం కాదు. ప్రభుత్వం కేటాయించిన భూములు దుర్వినియోగం జరిగినా లేక వినియోగం జరకున్నా తిరిగి తీసుకొని సంబంధిత పేదలకు పంచాలి. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు చూపాలి. మంత్రలు తమ బాధ్యత గల జిల్లాలోని రైతుల, ప్రజలెదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. ఈ సమస్యలను మంత్రివర్గ సమావేశాలలో చర్చించి అమలు చేయాలి తప్ప ప్రజల నుండి రుణ సేకరణ, గత ఒప్పందాలకు ఆమోదాలు తెలపడం వల్ల రాష్ట్రస్థూల ఉత్పత్తి పెరగదు. సమస్యలు పరిష్కారం కావు.

సారంపల్లి మల్లారెడ్డి
తేది.01.09.2012

No comments:

Post a Comment