Monday, 11 August 2014

నిరంతర అధ్యయనశీలి కామ్రేడ్‌ కొరటాల

    ‘‘ ఏరా బాబూ’’ అంటూ ఆప్యాయంగా పలకరించే మార్క్సిస్టు మహానాయకుడు కామ్రేడ్‌ కొరటాల వర్థంతి అప్పుడే మూడో సంవత్సరం పూర్తిచేసుకుంది. అనేక ఆటుపోటులలో కూడా నిశ్చలంగా ఆలోచిస్తూ మార్క్సిజాన్ని విస్తృతపర్చడానికి రాష్ట్రంలో ఉద్యమ నిర్మాణంలో కీలకపాత్ర వహించిన కామ్రేడ్‌ కొరటాల మనల్ని వీడినా అతని జ్ఞాపకాలు, ఆదర్శాలు మనన వెన్నంటే వున్నాయి. జూలై 1కి మూడో వర్థంతిని జరుపుకుంటున్నాం. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన కొరటాల వ్యక్తిత్వం అందరికీ ఆదర్శప్రాయంగా వుంది. రైతు, వ్యవసాయ కార్మిక రంగాలకేగాక యువజన, విద్యార్థి రంగాలకు మరియు మహిళారంగం అభివృద్ధికి కూడా వారి సలహాలు, సూచనలు ఎంతగానో దోహదపడ్డాయి. తన దగ్గరికి వచ్చినవారికి ఓపికతో సలహాలిచ్చి ఉత్సాహపర్చి కార్యరంగంలోకి వెళ్ళేవిధంగా తోడ్పాటునిచ్చేవాడు.
    గుంటూరు జిల్లా అమృతలూరు మండలం, ప్యాపర్రు గ్రామంలో 1923 సెప్టెంబర్‌ 24న కామ్రేడ్‌ కొరటాల గారు జన్మించారు. 1942లోనే కమ్యూనిస్టు పార్టీ సభ్యులయ్యారు. విద్యార్థి దశలోనే ఆయన పోరాట పటిమను కనబర్చారు. గుంటూరు జిల్లాలో రొంపేరు బంజరు, లంక భూముల వేలం, పేదల భూములు కాపాడటంలో కీలకపాత్ర వహించారు. 1962లో తొలిసారి వేమూరు శాసనసభ నుండి గెలిచారు. ఆ తర్వాత 1978లో రేపల్లె నుండి రెండోసారి శాసనసభ్యునిగా గెలిచారు. భూమిశిస్తు, చేనేతరంగం, నీటివనరుల సమస్య మొదలైన వాటిపై శాసనసభలో నిర్మాణయుతమైన చర్చను సాగించారు. ‘‘సోషలిజం  ఓనమాలు’’ అనే ఎమిలీ బరన్స్‌ పుస్తకాన్ని, చైనా గురించి ఎడ్గార్‌ స్నో రచించిన పుస్తకాలను తెలుగులోకి అనువదించారు. 1969 నుండి 1981 వరకు గుంటూరు జిల్లా కార్యదర్శిగా, 1982 నుండి కేంద్ర కమిటీ సభ్యులుగాను, 2002 నుండి పోలిట్‌బ్యూరో సభ్యులుగా పనిచేశారు. సోషలిస్టు దేశాలైన చైనా, బల్గేరియాలలో పర్యటించారు.
    లంక భూముల పోరాటాలతో పాటు ప్రభుత్వ భూములను పేదలకు పంపిణీ చేయడంలో అనేక ఉద్యమాలు సాగించారు. 1983లో చల్లపల్లి రాజా భూపోరాటం మే 16 నుండి 26 వరకు 11 రోజులపాటు సిపిఐ, సిపిఐ(ఎం) మరియు ప్రజా సంఘాల వారితో 125 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. కామ్రేడ్‌ లావు బాలగంగాధరరావు, పాటూరు రామయ్య, దాసరి నారాయణరావు, పుట్టగుంట సుబ్బారావులు పాల్గన్నారు. కౌలుదార్లు ప్రవేశించరాదని జూన్‌ 17న బందరులో మూడు వేల మందితో జరిగిన ప్రదర్శనకు కొరటాలతోపాటు దాసరి నాగభూషణరావు పాల్గన్నారు. 1984 మే 4న చల్లపల్లిలో అఖిలపక్షం జరిపిన బహిరంగ సభలో సిపిఐ ప్రధాన కార్యదర్శి చండ్ర రాజేశ్వరరావుతో పాటు సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా కామ్రేడ్‌ కొరటాల పాల్గన్నారు.  ఈ ఆందోళన ఫలితంగా ‘‘ తెలుగు మాగాణి సమారాధన’’ పేరుతో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు భూ పంపిణీ చేసి పట్టాలిచ్చారు. చల్లపల్లి భూ పోరాటంలో 42 మంది అమరవీరులయ్యారు. చంద్రబాబు పాలనాకాలంలో ఏర్పర్చిన కర్షక పరిషత్‌లో సభ్యులుగా వున్నారు. రాష్ట్రంలోని మార్కెట్లనన్నింటినీ పరిశీలించి రైతులకు ప్రయోజనం కల్గే విధంగా ప్రభుత్వానికి సలహాలిచ్చారు. ప్రకృతివైపరీత్యాలేర్పడినప్పుడు అక్కడ ప్రత్యక్షమై బాధితుల్ని పరామర్శించి తగు సూచనలు చేయడమేగాక వాటిని సాధించేవరకు కృషి చేశారు. ప్రకాశం జిల్లాలో పత్తిరైతుల ఆత్మహత్యలు జరిగినప్పుడు ముందుగా స్పందించి, ఆ ప్రాంతంలో పర్యటించి సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో సఫలీకృతమయ్యారు. ఆ సందర్భంగా కేంద్రప్రభుత్వం ‘‘ఓజా’’ కమిటీ వేసింది. రాష్ట్రంలో రైతాంగ ఆత్మహత్యలు ఉధృతిగా కొనసాగుతున్నప్పుడు 13 సంఘాలతో అఖిలపక్ష కమిటీనేర్పర్చారు.  ఆత్మహత్యలపై సమగ్ర సర్వే జరపాలని ప్రభుత్వాన్ని కోరగా, అందుకు ప్రభుత్వం నిరాకరించింది. తానే స్వయంగా చొరవతీసుకొని జస్టిస్‌ పి.ఏ చౌదరి అధ్యక్షలుగా కమిషన్‌ను ఏర్పాటుచేసి సమగ్రమైన సర్వే నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడంలో కామ్రేడ్‌ కొరటాల పాత్ర అత్యంత కీలకం.
    పొగాకు రైతుల సంక్షోభం, మిర్చికి గిట్టుబాటు ధర, తదితర సమస్యలపైన కృషి చేశారు. రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి సమస్యల్ని తెలుసుకొనేవారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు అక్కడి ప్రజల పరిస్థితిని, రైతాంగ పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించి అధ్యయనం చేసేవారు. కోస్తా జిల్లాల్లో కౌలుదార్ల సమస్యలపై మొట్టమొదటిసారి కామ్రేడ్‌ కొరటాల ఉద్యమం ప్రారంభించారు. ఆ ఉద్యమమే నేటికీ కొనసాగుతున్నది. రాష్ట్ర్రంలో వున్న 25 లక్షలమంది కౌలుదార్లకు హక్కులు కల్పించబడాలని, వారి ఉత్పత్తులకు న్యాయమైన ధరలు చెల్లించాలని, ప్రకృతివైపరీత్యాలేర్పడినప్పుడు పరిహారం వారికే యివ్వాలంటూ మొట్టమొదటిసారిగా నినాదాలు రూపొందించి వారిని చైతన్యపర్చడంలో భాగస్వాములైనారు. ముఖ్యంగా కోస్తాలో తుపాన్‌వల్ల నష్టాలు జరిగినప్పుడల్లా అక్కడ ప్రత్యక్షమయ్యేవారు. బాధితులతో స్వయంగా చర్చించి వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో సఫలీకృతులయ్యారు. వారికి తక్షణ సహాయంతో పాటు పరిహారాల చెల్లింపు జరిగేవరకు ఆందోళనలు సాగించారు. ఆపద్బాంధవుడుగా తన హస్తాన్ని ఎప్పుడూ బాధితులకందించేవాడు.
    నేత కార్మికుల సమస్యలపై పూర్తి అవగాహన కల్గిన నాయకుడిగా వారి సమస్యల పరిష్కారానికి పూనుకొన్నారు. సిరిసిల్లలో చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడినప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వారికి పరిహారం యిప్పించారు. రాష్ట్రంలో చేనేతరంగాన్ని అభివృద్ధిపర్చడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సూచనలు చేయడమేగాక చేనేత కార్మికులను సమీకరించి ఆందోళనలు సాగించారు. అన్నిపద్ధతుల నిరసనలలో స్వయంగా పాల్గన్నారు. చేతివృత్తిదార్లు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసి చేతివృత్తుల రక్షణకు కృషి చేశారు.
    మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఆకలిచావుల వార్తలచ్చినప్పుడు ప్రత్యేక బృందాలను యేర్పాటుచేసి అంబలి కేంద్రాలను కొనసాగించారు. ఈ అంబలి కేంద్రాలు చూసి నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కూడా స్పందించారు. ఆయన మార్గదర్శకత్వంలో సహాయ శిబిరాలను ఏర్పాటుచేశారు.
    1948లో కొరటాలపై అరెస్టు వారెంట్‌ వున్నప్పటికీ 10 వేల మందితో జరిగిన వ్యవసాయకార్మిక బహిరంగ సభలో ప్రసంగించారు.  1949 ఏప్రిల్‌లో అరెస్టుచేసి బళ్ళారి జైళ్ళో పెట్టారు. ఆ తర్వాత కడలూరు జైలుకు పంపారు. అక్కడ ఎ.కె గోపాలన్‌, మోటూరు హనుమంతరావు తదితర నాయకులతో కలిసి వున్నారు.
నిరంతర అధ్యయనం : జాతీయ,అంతర్జాతీయంగా వస్తున్న సమస్యలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేయడంలో అందరికన్నా ముందున్నారు. విషయాన్ని సేకరించడానికి, దానిని యితరులతో చర్చించి ధృవపర్చుకొన్నతర్వాతనే నిర్ణయానికి వచ్చేవారు. జాతీయంగా వ్యవసాయరంగంలోను, యితర రంగాల్లో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అధ్యయనంచేసి సూచనలిచ్చేవారు. ప్రపంచబ్యాంకు ప్రభావాన్ని గుర్తించి ఏయే రంగంపై ఏవిధంగా పడుతున్నది? దాని పర్యవసానాలు ఎలా వున్నవి? వాటి పరిష్కారమార్గాలేంటి? అంటూ అన్ని రంగాల ప్రజలకు సూచనలు చేశారు. విజయాలు వచ్చినప్పుడే గాక అపజయాలు ఎదురైనప్పుడు కూడా నిశ్చలంగా కార్యకర్తలకు తగు సూచనలిచ్చి కార్యోన్ముఖుల్ని చేశారు. 
    1991లో సోవియట్‌ వ్యవస్థకు ఎదురు దెబ్బలు తగిలినప్పుడు కార్యకర్తలకు మార్క్సిజంపై అవగాహన కల్పించి కార్యకర్తల్ని కార్యోన్ముఖులుగా చేశారు. అనేకమంది కార్యకర్తలను మార్క్సిస్టు పార్టీలో అభివృద్ధిపర్చారు. వారి కృషితో అభివృద్ధి అయినవారు నేడు పార్టీలో అనేకస్థాయిలలో వున్నారు. గెలుపు- ఓటమిలను సమదృష్టితో చూడటం అందరికీ సాధ్యమయ్యే పనికాదు. గెలుపు సంభవించినప్పుడు ఉత్సాహపడటం, ఓటమి సంభవించినప్పుడు నిరుత్సాహానికి గురికావడం మానవ సహజం.  అందుకు వ్యతిరేకంగా కామ్రేడ్‌ కొరటాల నిశ్చలమైన, స్థిరమైన నాయకునిగా గెలుపు - ఓటమిలను చవిచూశారు. ఏనాటికైనా పెట్టుబడిదారీ సమాజం పోయి సోషలిజం రావాలన్న లక్ష్యంతో పనిచేశారు. నేటి ప్రపంచబ్యాంకు, ప్రపంచవాణిజ్య సంస్థ, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలాంటివి నేడు మన దేశ ఆర్థిక, రాజకీయ పరిస్థితిని అస్థిరత్వం చేస్తున్నాయి. వీటికి వ్యతిరేకంగా బాధిత ప్రజలను ఏకతాటిపై సమీకరించి ఉద్యమాలు సాగించాలి. నేటి పరిస్థితులలో కామ్రేడ్‌ కొరటాల ఉద్భోధించిన సిద్ధాంతాలకు అంకితమై పోరాటాలు సాగించడమే మన ముందున్న కర్తవ్యం.
                                            - సారంపల్లి

No comments:

Post a Comment