Monday, 11 August 2014

ప్రజా హృదయాలలో నిలిచిన నాయకుడు కా॥ కొరటాల

                                                                                                                                 తేది :30.06.2011
    ప్రజా హృదయాలలో కొందరు నాయకులు మాత్రమే స్థిరంగా ఉంటారు. పుట్టిన ప్రతి ప్రాణి ఎప్పుడో ఒకప్పుడు జీవితాన్ని చాలించినా, కొందరు మాత్రం ప్రజలలో జీవించి ఉంటారు. అలాంటి నాయకులలో కా॥ కొరటాల ఒకరు. ఆంధ్రప్రదేశ్‌లో అనేక ఉద్యమాలకు ప్రత్యక్ష నాయకత్వం వహించడమే కాక,పరోక్షంగా కూడా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచారు. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు నాయకుడుగా 1942 నుండి అమరుడయ్యేవరకు (01.07.2006) ప్రజాపోరాటాలలో పనిచేశారు. కమ్యూనిస్టు నాయకుడైనప్పటికీ అన్ని వర్గాల, అన్ని రాజకీయ పార్టీల గౌరవం పొందిన వ్యక్తి. ఎదుటి వ్యక్తి ఎంత ఆందోళనలో ఉన్నా ‘‘ ఏరా బాబూ ’’ అంటూ ఆప్యాయంగా పలకరించి ఎంతటి క్లిష్ట తరమైన సమస్యకైనా సూటిగా సలహాలు, సూచనలు ఇచ్చేవారు. నిరాశా నిస్పృహలకు గురైన కార్యకర్తలకు ఓపికతో సలహాలిచ్చి, ఉత్సాహ పరిచి కార్యరంగంలోకి వెళ్లే విధంగా ప్రోత్సహించే వారు. అంతటి మహానయకుని 5వ వర్థంతిని జూలై 1,2011న జరుపుకుంటున్నాం.
    1984 జూన్‌ 6,7 తేదిలలో ఒంగోలులో జరిగిన రాష్ట్రరైతు 11వ మహాసభలో ప్రధాన కార్యదర్శిగా ఎంపికై 1992 మే 8`10 తేదిలలో మధిరలో జరిగిన 14వ మహాసభలకు రైతాంగ ఉద్యమాలలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఆ కాలంలో అఖిల భారత కిసాన్‌సభ ఉపాధ్యక్షునిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.పొగాకు రైతుల సంక్షోభం, మిర్చికి గిట్టుబాటు ధర, తదితర సమస్యలపైన కృషి చేశారు. రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి సమస్యల్ని తెలుసుకొనేవారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు అక్కడి ప్రజల పరిస్థితిని, రైతాంగ పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించి అధ్యయనం చేసేవారు. కోస్తా జిల్లాల్లో కౌలుదార్ల సమస్యలపై మొట్టమొదటిసారి కామ్రేడ్‌ కొరటాల ఉద్యమం ప్రారంభించారు. ఆ ఉద్యమమే నేటికీ కొనసాగుతున్నది. రాష్ట్ర్రంలో వున్న 25 లక్షలమంది కౌలుదార్లకు హక్కులు కల్పించబడాలని, వారి ఉత్పత్తులకు న్యాయమైన ధరలు చెల్లించాలని, ప్రకృతివైపరీత్యాలేర్పడినప్పుడు పరిహారం వారికే యివ్వాలంటూ మొట్టమొదటిసారిగా నినాదాలు రూపొందించి వారిని చైతన్యపర్చడంలో భాగస్వాములైనారు. ముఖ్యంగా కోస్తాలో తుపాన్‌వల్ల నష్టాలు జరిగినప్పుడల్లా అక్కడ ప్రత్యక్షమయ్యేవారు. బాధితులతో స్వయంగా చర్చించి వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో సఫలీకృతులయ్యారు. వారికి తక్షణ సహాయంతో పాటు పరిహారాల చెల్లింపు జరిగేవరకు ఆందోళనలు సాగించారు. ఆపద్బాంధవుడుగా తన హస్తాన్ని ఎప్పుడూ బాధితులకందించేవాడు. 1982లో మొట్టమొదటిసారి ప్రకాశం, గుంటూరు జిల్లాలలో పత్తి రైతుల ఆత్మహత్యలు జరిగినపుడు మొట్టమొదటగా స్పందించి, పరిశీలనకు పార్లమెంటు బృందాన్ని తీసుకు రావడమేకాక కేంద్రప్రభుత్వంతో సంప్రదించి, కేంద్రప్రభుత్వ కార్యదర్శి ఓజా నాయకత్వాన కమిటీని వేయించాడు. ఆకమిటీ చేసిన సూచనలను అమలు జరపాలని రైతుల పోరాటాలు నిర్వహించారు. రాష్ట్రంలో రైతాంగ ఆత్మహత్యలు ఉధృతిగా కొనసాగుతున్నప్పుడు 13 సంఘాలతో అఖిలపక్ష కమిటీనేర్పర్చారు.  ఆత్మహత్యలపై సమగ్ర సర్వే జరపాలని ప్రభుత్వాన్ని కోరగా, అందుకు ప్రభుత్వం నిరాకరించింది. తానే స్వయంగా చొరవతీసుకొని జస్టిస్‌ పి.ఏ చౌదరి అధ్యక్షలుగా కమిషన్‌ను ఏర్పాటుచేసి సమగ్రమైన సర్వే నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడంలో కామ్రేడ్‌ కొరటాల పాత్ర అత్యంత కీలకం.
    గుంటూరు జిల్లా అమృతలూరు మండలం, ప్యాపర్రు గ్రామంలో 1923 సెప్టెంబర్‌ 24న కామ్రేడ్‌ కొరటాల గారు జన్మించారు. 1942లోనే కమ్యూనిస్టు పార్టీ సభ్యులయ్యారు. విద్యార్థి దశలోనే ఆయన పోరాట పటిమను కనబర్చారు. గుంటూరు జిల్లాలో రొంపేరు బంజరు, లంక భూముల వేలం, పేదల భూములు కాపాడటంలో కీలకపాత్ర వహించారు. 1962లో తొలిసారి వేమూరు శాసనసభ నుండి గెలిచారు. ఆ తర్వాత 1978లో రేపల్లె నుండి రెండోసారి శాసనసభ్యునిగా గెలిచారు. భూమిశిస్తు, చేనేతరంగం, నీటివనరుల సమస్య మొదలైన వాటిపై శాసనసభలో నిర్మాణయుతమైన చర్చను సాగించారు. ‘‘సోషలిజం  ఓనమాలు’’ అనే ఎమిలీ బరన్స్‌ పుస్తకాన్ని, చైనా గురించి ఎడ్గార్‌ స్నో రచించిన పుస్తకాలను తెలుగులోకి అనువదించారు. 1969 నుండి 1981 వరకు గుంటూరు జిల్లా కార్యదర్శిగా, 1982 నుండి కేంద్ర కమిటీ సభ్యులుగాను, 2002 నుండి పోలిట్‌బ్యూరో సభ్యులుగా పనిచేశారు. సోషలిస్టు దేశాలైన చైనా, బల్గేరియాలలో పర్యటించారు. లంక భూముల పోరాటాలతో పాటు ప్రభుత్వ భూములను పేదలకు పంపిణీ చేయడంలో అనేక ఉద్యమాలు సాగించారు. 1948లో కొరటాలపై అరెస్టు వారెంట్‌ వున్నప్పటికీ 10 వేల మందితో జరిగిన వ్యవసాయకార్మిక బహిరంగ సభలో ప్రసంగించారు.  1949 ఏప్రిల్‌లో అరెస్టుచేసి బళ్ళారి జైళ్ళో పెట్టారు. ఆ తర్వాత కడలూరు జైలుకు పంపారు. అక్కడ ఎ.కె గోపాలన్‌, మోటూరు హనుమంతరావు తదితర నాయకులతో కలిసి వున్నారు. 1983లో చల్లపల్లి రాజా భూపోరాటం మే 16 నుండి 26 వరకు 11 రోజులపాటు సిపిఐ, సిపిఐ(ఎం) మరియు ప్రజా సంఘాల వారితో 125 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. కౌలుదార్లు ప్రవేశించరాదని జూన్‌ 17న బందరులో మూడు వేల మందితో జరిగిన ప్రదర్శనకు కొరటాలతోపాటు దాసరి నాగభూషణరావు పాల్గన్నారు.1984 మే 4న చల్లపల్లిలో అఖిలపక్షం జరిపిన బహిరంగ సభలో సిపిఐ ప్రధాన కార్యదర్శి చండ్ర రాజేశ్వరరావుతో పాటు సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా కామ్రేడ్‌ కొరటాల పాల్గన్నారు.  ఈ ఆందోళన ఫలితంగా ‘‘ తెలుగు మాగాణి సమారాధన’’ పేరుతో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు భూ పంపిణీ చేసి పట్టాలిచ్చారు. చల్లపల్లి భూ పోరాటంలో 42 మంది అమరవీరులయ్యారు. చంద్రబాబు పాలనాకాలంలో ఏర్పర్చిన కర్షక పరిషత్‌లో సభ్యులుగా వున్నారు. నేత కార్మికుల సమస్యలపై పూర్తి అవగాహన కల్గిన నాయకుడిగా వారి సమస్యల పరిష్కారానికి పూనుకొన్నారు. సిరిసిల్లలో చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడినప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వారికి పరిహారం యిప్పించారు.
    ప్రపంచబ్యాంకు, ప్రపంచ వాణిజ్య సంస్థల ఆదేశాల మేరకు దేశంలోనూ, రాష్ట్రంలోను అమలు జరుపుతున్న సంస్కరణల అమలును అందరికన్నా ముందు అధ్యయనం చేసి తగు సూచనలు ఇచ్చారు. వయస్సు పైబడినా నిత్యనూతనంగా వస్తున్న సమస్యలను అధ్యయనం చేయడంలో ఆయనకు అయనే సాటి. అనేక గెలుపు ఓటములను చవిచూశారు. సోవియట్‌ వ్యవస్థ పతనమైనపుడు జిల్లాలు పర్యటించి‘‘ దోపిడీ ఉన్నంత వరకు ప్రజల తిరుగుబాటు అనివార్యం’’ ఆ తిరుగుబాటుకు నాయకత్వం వహించి ప్రజలకు ముందు పీఠిన నిలబడాలని మార్క్సిస్టు పార్టీ కార్యకర్తలకే కాక ప్రజా నాయకులందరినీ ఉత్సాహపరిచినారు. 70 సంవత్సరాల సోవియట్‌ సోషలిస్టు ప్రయోగం విఫలం కావడానికి గల కారణాలను పరిశీలించి  ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేశారు. పార్లమెంటరీ రంగంలో ఓటమి సంభవించినా ప్రజాతంత్ర ఉద్యమం విస్తరించింది. పటిష్ట పడుతున్నది. పోరాటాల ఫలితంగా అనేక వర్గాలు సెక్షన్లు మార్క్సిస్టు పార్టీ నాయకత్వాన ఉద్యమాలు సాగించి విజయాలు సాధిస్తున్నారు. ఈ విజయాలను మసిపూసి, మార్క్సిజం ఈ కాలానికి తగదని, పెట్టుబడిదారీ విధానం శాశ్వతమని చెప్పే కుహానా మేధావులకు ప్రజాపోరాటాల ఫలితాలను చూడ నిరాకరిస్తున్నారు. మార్క్సిస్టు పార్టీని బలహీన పర్చాలని అన్ని రాజకీయ పార్టీలు తమ సిద్ధాంతాలను వదిలివేసి ఏకమై కృషి చేస్తున్నాయి. వీటికి సామ్రాజ్యవాదం తోడుగా ఉంది. ఉద్యమాలపై పెద్దఎత్తున నిర్భందాలు సాగుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో ప్రజాతంత్ర ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి అర్థఫాసిస్టు విధానం కొనసాగుతున్నది. 2011 ఎన్నికలలో కేరళ, బెంగాల్‌లో మార్క్సిస్టు పార్టీ నాయకత్వాన గల ప్రభుత్వాలను ఓడిరచగలిగామని పెట్టుబడిదారులు కులుకుతున్నారు. ప్రభుత్వలో లేకున్నా పీడిత ప్రజల మనస్సుల్లో మార్క్సిస్టు పార్టీ బలమైన శక్తిగా ఉన్నది. పైగా విస్తరిస్తున్నది. పార్టీ ఏర్పడిన 1920 నుండి నిర్భంధాలకు గురౌతూనే ప్రజలకు నాయకుడుగా ఉంటున్నది. అలాంటి మార్క్సిస్టు పార్టీకి నాయకుడుగా కొరటాల చూపిన మార్గదర్శకత్వంలో ముందుకు సాగి శ్రమజీవులందరినీ ఏకం చేసి ప్రజాతంత్ర ఉద్యమాన్ని విస్తరింప చేద్దాం. అధోగతికి చేర్చే సంస్కరణల విధానానికి స్వస్థి పలుకుదాం. ఇదే కొరటాలకు సమర్పించే నివాళి.
                                        సారంపల్లి

No comments:

Post a Comment