Monday, 11 August 2014

సహకార వ్యవసాయ క్షేత్రాల ముసాయిదా - సూచనలు


తేది: 29.06.09
హైదరాబాద్‌.
శ్రీయుత డా. వైయస్‌ రాజశేఖర రెడ్డిగారు
రాష్ట్ర ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం
హైద్రాబాద్‌.

ఆర్యా,
      విషయం : సహకార వ్యవసాయ క్షేత్రాల ముసాయిదా - సూచనలు

       సహకార వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లు రాష్ట్ర గవర్నర్‌ జూన్‌ 8న ఉభయ సభల సమావేశాలలో '' ప్రభుత్వ, వాణిజ్య బ్యాంకుల క్రియాశీల మద్దతుతో స్వచ్ఛంద సహకార ప్రాతిపదికన సేద్యం చేయడానికి ఒక సమీకృత విధానం కోసం ప్రతి జిల్లాకు ఒకటి లేదా రెండు గ్రామాలను ప్రయోగాత్మక ప్రాతిపదికన ఎంపిక చేయాలని ప్రతిపాదించడమైంది. ఇందులో పాల్గొనాల్సిందిగా ఏ గ్రామానికీ నిర్బంధం వుండదు. ప్రభుత్వం అట్టి సహకార సేద్యం ద్వారా పొందగల్గే ప్రయోజనాలను అధ్యయనం చేయాలని ఆశిస్తున్నది. ఇందులో పశుగణ సంపద, మత్స్య సంపద కూడా చేరివున్నాయి'' అని  ప్రసంగిస్తూ తెలిపారు. వ్యవసాయోత్పత్తిని, ఉత్పాదకతను పెంచాలన్న లక్ష్యంతో సహకార వ్యవసాయ క్షేత్రాల ప్రయోగాన్ని చేపడుతున్నట్టు ప్రభుత్వం ముసాయిదాలో తెలిపింది.
గతంలో ''రైతు కేంద్రంగా'' ఏర్పాటు చేసిన ''సహకార వ్యవసాయ క్షేత్రాలు''కు బదులుగా నేడు ఏర్పాటుచేయబోయే వ్యవసాయ సహకార క్షేత్రాలు  ''కంపెనీ కేంద్రంగా'' వున్నాయి.
ఇప్పటికే వ్యవసాయ రంగంలో విత్తన రంగం పూర్తిగా బహుళజాతి సంస్థలపరమైంది. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం పూర్తిగా తగ్గింది. వ్యవసాయ శాఖ విస్తరణ రైతులకు అందుబాటులో లేదు. వ్యవసాయ శాఖాధికారులను తగ్గించి ఆదర్శ రైతులంటూ కొత్త వ్యవస్థను ముందుకు తెచ్చారు. ఉపకరణాల సరఫరా, మార్కెటింగ్‌ రంగాలలో బహుళ జాతి సంస్థల ఆధిపత్యం కొనసాగుతున్నది. రాష్ట్రంలో 120.44 లక్షల కమతాలు వుండగా, అందులో 83.5 శాతం కమతాలు ఐదెకరాల లోపుకల్గినవి వున్నాయి. వీరివద్ద 70.17 లక్షల హెక్టార్ల భూమి వుంది (2005-06).
ప్రభుత్వం సహకార క్షేత్రాల యేర్పాటుకు బాధ్యతను తీసుకోనున్నట్లు ముసాయిదాలో లేదు. పైగా, సొసైటీ / కంపెనీ యీ క్షేత్రాలను నిర్వహిస్తుందనడంలోనే అనుమానాలు రేకెత్తేవిధంగా వున్నాయి. ఒకవైపున వ్యవసాయరంగ బాధ్యతల నుండి ప్రభుత్వం పూర్తిగా తప్పుకొనే ప్రయత్నం చేస్తున్నది. అలాంటప్పుడు యీ క్షేత్రాలను సొసైటీలకు కాకుండా కంపెనీలకు అప్పగించే ఆలోచన ప్రభుత్వానికి వున్నట్లు తెలుస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం విడుదలచేసిన ముసాయిదాలో అందుకు అనుగుణంగా కొన్ని అంశాలు వున్నాయి.
1. సహకార క్షేత్రాల ఏర్పాటు నిర్వహణను సొసైటీ/ కంపెనీ చేస్తుంది.
2. రెండు, మూడు గ్రామాలకు కలిపి ఒక సహకార క్షేత్రాన్ని ఏర్పాటు చేయాలి.  ఆ గ్రామాలలోని రైతులు తమ భూములను ఆ సొసైటీ / కంపెనీకి అన్ని అధికారాలతో దఖలు పర్చాలి. అట్టి భూములకు ధర నిర్ణయించబడుతుంది. ఆ ధరను వాటాలుగా పరిగణిస్తారు.
3. సహకార క్షేత్రం నుండి వెళ్ళిపోదల్చుకొన్న రైతు తన వాటాలను మరొకరికి అమ్ముకోవాలి. సభ్యులలో ఎవరూ కొనుగోలు చేయనప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.
4. సొసైటీ / కంపెనీ  వ్యవసాయోత్పత్తులను నూతన టెక్నాలజీ ద్వారా యంత్రాలను వినియోగించి ఉత్పత్తిచేస్తారు.  అధునాతన టెక్నాలజీని వినియోగిస్తారు. నాణ్యతగల విత్తనాలు, మార్కెట్‌ సౌకర్యం మరియు గోదాం నిల్వ సౌకర్యాలు కల్పిస్తారు. ప్రభుత్వం కొన్ని సొసైటీలకు మొదట మార్జిన్‌ మనీ యిస్తుంది.
 సహకార క్షేత్రాల ద్వారా అధికోత్పత్తి వస్తుందని భారీ యంత్రాల వినియోగంతో ఉత్పత్తి ఖర్చులు తగ్గుతాయని ముసాయిదాలో తెలిపారు. ఇదే ముసాయిదాలో '' గతంలో సహకార వ్యవస్థలో ఏర్పాటుచేసిన సహకార వ్యవసాయ క్షేత్రాల నిర్వహణ విఫలమైందని  ముసాయిదా పేజీ -13లో చెప్పారు.
ములకనూరు, అంకాపూర్‌ సహకార సంఘాల అభివృద్ధిని ముసాయిదాలో ఉదాహరణగా చూపారు. ఈ సంఘాలు సేవా సహకార సంఘాలుగా మాత్రమే పనిచేస్తున్నాయి.
గత అనుభవం
1964 సహకార చట్టం ప్రకారం 22 జిల్లాల్లో 2451 సహకార వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 1.93 లక్షల మంది సభ్యులను చేర్చుకున్నారు. 2.72 లక్షల ఎకరాలను యిందుకు కేటాయించారు. ఈ క్షేత్రాలలో సభ్యులుగా దళిత, గిరిజన, వెనకబడిన వర్గాలేగాక ఆర్థికంగా వెనకబడినవారికి కూడా సభ్యత్వాలు యిచ్చారు. ప్రభుత్వం భూములలో యీ క్షేత్రాలను ఏర్పాటు చేశారు. ఈ క్షేత్రాల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్‌ సహకార జాయింట్‌ ఫార్మింగ్‌ సొసైటీల ఫెడరేషన్‌ 30శాతం (రుణంగా) మరియు జిల్లా గ్రామీణాభివృద్ధి ఏజెన్సీ 50శాతం సబ్సిడీ, జిల్లా దళిత, గిరిజన కార్పొరేషన్‌లు 20శాతం (మార్జిన్‌మనీ) యిచ్చి క్షేత్రాలనేర్పాటు చేశాయి. దీని బాధ్యత నిర్వహణ తాలూక సహకార శాఖాధికారికి కేటాయించారు. పెట్టుబడిపోగా మిగిలిన ఆదాయాన్ని వాటాలుగా అందులోని సభ్యులందరికీ పంపిణీ చేశారు.  రైతు జీవనాదాయాన్ని కేంద్రంగా చేసుకొని గతంలో సహకార క్షేత్రాలు ఏర్పాటుచేశారు. ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకుంది. ''రైతు కేంద్రంగా'' సహకార వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేయాలి.
సూచనలు :
ఈ దిగువ సొసైటీలను ఏర్పాటు చేయడం ప్రయోజనకరంగా వుంటుంది.
1. జాయింట్‌ ఫార్మింగ్‌ సొసైటీలు ( ప్రభుత్వం అసైన్డ్‌ చేసిన భూములలో)
2. రైతు సేవా సహకార సంఘాలు
3. కౌలుదార్ల వ్యవసాయ సహకార సంఘాలు
4. సహకార వ్యవసాయ క్షేత్రాలు ( ప్రభుత్వ భూములలో)
- సహకార వ్యవసాయ క్షేత్రాల నిర్వహణ పూర్తి బాధ్యత ప్రభుత్వం నిర్వహించాలి. కంపెనీలకు, కార్పోరేట్‌ సంస్థలకు బాధ్యతను అప్పగించరాదు.
- సహకార వ్యవసాయ క్షేత్రాల ఏర్పాటులో రైతులు మరియు వ్యవసాయంపై ఆధారపడిన వారికి సభ్యత్వం వుండాలి.
- సహకార బ్యాంకు - వ్యవసాయశాఖ - మార్కెటింగ్‌ శాఖ - హార్టికల్చర్‌ శాఖల సమన్వయంతో కమిటీని ఏర్పాటు చేయాలి. వ్యవసాయ క్షేత్రం సభ్యులు ఎన్నుకొన్న కమిటీకి పై కమిటీ బాధ్యతగా వుండాలి.
- వ్యవసాయ శాస్త్రసాంకేతిక  రంగంలో సభ్యులకు శిక్షణ యిచ్చి ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచాలి.

అభివందనములతో,


( సారంపల్లి మల్లారెడ్డి ) ( టి. రామకృష్ణ )                ( వి. సంజీవరెడ్డి )
ఎఐకెఎస్‌ ఉపాధ్యకక్షులు    రాష్ట్ర ఉపాధ్యకక్షులు రాష్ట్ర సహాయ కార్యదర్శి

No comments:

Post a Comment