Tuesday, 12 August 2014

రైతులకు శుష్క ప్రియాలు ` శూన్య హస్తాలు

2010 ఖరీఫ్‌లో పంటలు నష్టపోయిన రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని, ఏ ఒక్క రైతుకూ నష్టం జరగకుండా చూస్తామని రాష్ట్ర మంత్రులు పదేపదే వాగ్ధానాలు చేస్తున్నారు. ఏకంగా శాసనసభలో ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌ రెడ్డి పంటల నష్టంపై జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ నష్టపోయిన పంటలకు ఎకరాకు 1800 నుండి 2400 రూపాయలకు పెంచారు. నష్టపోయిన పంటలకు 600 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీగాను, రైతుల రుణాల వడ్డీ మాఫీకి 300 కోట్లు అవుతుందని, ఇతర వర్గాల ప్రజలకు పరిహారం క్రింద 10 కోట్లు చెల్లిస్తామని చెప్పారు.  పంటల పరిహారం పెంపుదల డిశంబర్‌లో అధిక వర్షాల వలన జరిగిన నష్టాలకే తప్ప, మే నుండి నవంబర్‌ వరకు జరిగిన నష్టాలకు వర్తించదు. అప్పుడు నష్టపోయిన పంటలకు ఎకరాకు 1800 మాత్రమే చెల్లిస్తారు. మే నుండి నవంబర్‌ 2010 నాటికే 12 వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేసారు. డిశంబర్‌లో జరిగిన నష్టం మరో 10 వేల కోట్లు ఉంటుందని ప్రాథమిక అంచనాలు తెలుపుతున్నాయి. కానీ, ప్రభుత్వం 910 కోట్లు పరిహారంగా చెల్లిస్తానని ప్రకటించింది. రంగు మారినా లేదా మొలకెత్తిన ధాన్యం 4% ఉంటే ఎఫ్‌సిఐ కొనుగోలు చేయాలని ఉన్న నిబంధనను 8%నికి సడలించాలని కేంద్రాన్ని కోరుతానన్నారు. కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తేనే ఎఫ్‌సిఐ కొనుగోలు చేస్తోంది.
ముఖ్యమంత్రిగారి ప్రకటన రైతులకు జరిగిన నష్టాన్ని పరిష్కరించేదిగా లేదు. కనీసం నష్టపోయిన పంటలో 10వ వంతు కూడా రైతుకు అందే పరిస్థితి కనపడదు. దీనికి తోడు ఐదెకరాలకు పైబడినవారికి పరిహారం చెల్లించకూడదని గతంలో ఉన్న నిబంధనను తొలగించిందీ, లేనిది ముఖ్యమంత్రి ప్రకటనలో లేదు. ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించిన పరిహారం రైతుల నష్టాన్ని ఏ విధంగానూ పూడ్చలేదు. ఆహార ధాన్యాలకు ఎకరాకు 10 వేల రూపాయలు, తోటలకు 15 వేల రూపాయలు చొప్పున ఇవ్వాలని రైతాంగం ఆందోళనలు చేస్తున్నారు. వీరి ఆందోళనలు ఏవీ ప్రభుత్వం చెవికెక్కినట్టు లేదు. రబీ పంటకు తిరిగి విత్తనాలు పూర్తి రాయితీపై ఇవ్వాలని రైతాంగం కోరుతున్నది. ఎఫ్‌సిఐ కొనుగోలు చేయకున్నా రాష్ట్ర సివిల్‌ సప్లయ్స్‌, మార్క్‌ఫెడ్‌ సంస్థలు 10శాతనికి పైగా రంగు వెలిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. కానీ, కేంద్ర ప్రభుత్వంపైకి తోసి రాష్ట్ర ముఖ్యమంత్రి సమస్య నుండి తప్పుకోచూడడం క్షంతవ్యం కాదు. ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం 200 రూపాయలు బోనస్‌ను కలిపి 1230 రూపాయలకు క్వింటాల్‌ కొనుగోలు చేయాలి. ప్రక్క రాష్ట్రాలలో ఈ విధానం అమలు జరుగుతున్నది. ప్రత్తి క్వింటాల్‌కు 4500 రూపాయలు, ఆయిల్‌ఫాంకు 7500 రూపాయలకు కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నాం. వీరి కోరికను పరిశీలించడానికి రాష్ట్ర స్థాయిలో ధరల నిర్ణాయక సంఘాన్ని ఏర్పాటు చేసి ఉత్పత్తి, వ్యయాన్ని లెక్కగట్టి పై ధరలు నిర్ణయించి అమలు జరపాలి.
18.05.2010 నుండి 8`12`2010 వరకు వచ్చిన మూడు తుఫాన్‌లు, రెండు అధిక వర్షాల ద్వారా రాష్ట్రంలో 44 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా నష్టపోయాయి. వరి, పత్తి, పొగాకు, కంది, మినుము, మిరప, కూరగాయలు, తోటలు ఈ నష్టానికి గురయ్యాయి. 106 మంది చనిపోయారు. 25 వేల ఇండ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వేలాది పశువులు మరణించాయి. 20 లక్షల మంది నిరాశ్రేయులయ్యారు. తొలకరి నుండి డిశంబర్‌ 15 వరకు అదే పనిగా కురిసిన వర్షాల వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 81.04 కోట్లు మాత్రమే రాష్ట్రానికి సహాయం అందించింది. రాష్ట్ర ప్రభుత్వం 2010`11 బడ్జెట్‌లో 432.62 కోట్లు కేటాయించింది. కానీ, 1001.70 కోట్లు వరదల సహాయం క్రింద మంజూరు చేస్తున్నట్లు ప్రకటన వెలువరించింది. సహాయం చేసింది మాత్రం 6,592.42 మెట్రిక్‌ టన్నుల బియ్యం, 1,856.38 కిలో లీటర్ల కిరసనాయిల్‌ మాత్రమే పంపిణీ చేసారు. అయినా శాసనసభను ప్రక్కదోవ పట్టించే విధంగా భారీ ఎత్తున రైతాంగానికి సహకరిస్తున్నట్లు ప్రకటించారు. 08.11.2010న కేంద్రాన్ని 1585.53 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కోరింది. గత అనుభవం పరిశీలిస్తే 2005`10 మధ్య వచ్చిన తుఫాన్‌ల నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం అడిగింది 28 వేల కోట్లు కాగా, కేంద్రం ఇచ్చింది 1790.80 కోట్లు మాత్రమే. 2009లో జరిగిన భారీ నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి 1000 కోట్లు సహాయం చేస్తున్నట్లు తెలిపారు. కానీ ఈ రోజుకు కేంద్రం ఇచ్చింది ఆ పంట నష్టాలకు 620 కోట్లు మాత్రమే. గత అనుభవాన్ని బట్టి చూస్తే రాష్ట్రం కోరినదాంట్లో కేంద్రం 10 శాతం మాత్రమే ఆనవాయితీగా ఇస్తున్నది.
డిశంబర్‌ 17,18 తేదీల్లో కేంద్ర బృందం ఆర్‌ఆర్‌రaా హోంశాఖ సహాయ కార్యదర్శి నాయకత్వాన 8 మంది బృందం వచ్చి రెండు టీములుగా పంటల నష్టం పరిశీలన చేస్తారని ప్రభుత్వం తెలిపింది. ప్రకృతి వైఫరిత్యాలు సంభవించిన ప్రతి సందర్భంలో కేంద్ర బృందాలు రావడం, రాష్ట్రం కేంద్ర బృందానికి నివేదికలివ్వడం, వాటిని కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరుకు కృషి చేస్తామని చెప్పడం ఆనవాయితీగా వస్తున్నది. ఇంత వరకు జరిగిన నష్టాలను పరిశీలిస్తే ప్రతి సందర్భంలోనూ రైతులకు పంట నష్టాల క్రింద పరిహారం ఇవ్వడంలో కేంద్ర`రాష్ట్ర ఫ్రభుత్వాలు పూర్తిగా మొండిచేయి చూపుతున్నాయి. ఇప్పుడూ అదే జరగబోతోంది. ఎకరాకు 15 వేల నుండి 25 వేల పెట్టుబడి పెట్టి నష్టపోయిన రైతుకు ప్రభుత్వం ఎకరాకు 1800 రూపాయలు ఇస్తోంది. ఈ పరిహారంతో రైతు ఆర్థికంగా కోలుకుంటాడా?
రాష్ట్రంలో 1801 నుండి 1976 వరకు 38 కరువులు సంభవించగా, 1977 నుండి 2010 వరకు 32 తుఫాన్‌లు వచ్చాయి. వేలాది మంది మరణించారు. వేలాది చెరువులకు గండ్లు పడ్డాయి.  లక్షలాది ఇండ్లు కూలిపోగా ` లక్షలాది పశువులు చనిపోయాయి. తుఫాన్‌ అనంతరం అనేక జబ్బులు సోకి పంటలు దెబ్బతిన్నాయి. కరువులు, వరదలకు తోడు వడగండ్ల వర్షాల వల్ల లక్షలాది ఎకరాల పంటలకు నష్టం వాటిల్లింది. కరువులు`వరదలు రాష్ట్రానికి ప్రతి యేటా కనీసం 300 మండలాలకు తగ్గకుండా వస్తూనే ఉన్నాయి. అయినా, ఈ నష్టాలు పూడ్చడానికి తీసుకున్న చర్చలేమీ లేవు. సాధారణ వర్షపాతానికి 19% లోపు వర్షపాతం పడినచో ఆ మండలాన్ని కరువు మండలంగా ప్రకటిస్తారు. కానీ కరువు సహాయక చర్యలు మాత్రం చేపట్టరు. అలాగే వరదల తాకిడికి గురైన ప్రాంతాల్లో వ్యవసాయ శాఖ అధికారులు వారి కంటిచూపుతో అంచనా వేసి, 50 శాతంలోపు పంట నష్టం జరిగినచో వారి పేరు నమోదు చేస్తారు. పరిశీలనకు వచ్చిన అధికారులు చేలోకి దిగకుండానే గట్టుపైనే ఉండి చూసి, అంచనా వేసి నష్టపోయిన పంటను నష్టపోలేదని నిర్ణయించిన ఘటనలు కోకొల్లలు. ఏ శాస్త్రీయత లేకుండా ఈ విధమైన అంచనాలకు రావడం వలన వాస్తవంగా కరువు, వరదలకు పంటలు నష్టపోయిన రైతులకు సహాయం అందక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న వారికి జివో 421 ` తేదీ 01.04.2006 (రెవెన్యూశాఖ) ప్రకారం కుటుంబానికి లక్షా 50 వేల రూపాయలు ఎక్సిగ్రేషియో ఇస్తామని, ఈ ఎక్సిగ్రేషియోలో 50 వేల రూపాయలతో అన్ని ప్రయివేటు బాకీలను దామాషా పద్దతిలో తీరుస్తామని, మిగతా లక్ష రూపాయలు బ్యాంకులో వేసి దానిపై వచ్చే వడ్డీతో ఆ కుటుంబం జీవనం సాగించాలని జీవో విడుదల చేసారు. బ్యాంకు రుణాలకు ఈ మాఫి వర్తించదు. ఈ పథకం ఆత్మహత్యకు గురైన కుటుంబాన్ని రక్షిస్తుందా? ప్రభుత్వ వివరణ ప్రకారం 14మే2004 నుండి 09.02.2007 వరకు 2744 మంది ఆత్మహత్యలు చేసుకోగా, ఇందులో 1680 మాత్రమే అర్హమైనవని ప్రభుత్వం నిర్ధారించింది. మిగిలినవి అర్హమైనవి కావని తేల్చింది. 2007 తర్వాత ఎక్‌గ్రేషియో ఇవ్వడం దాదాపు నిలిపివేసారు. ఆత్మహత్యలకు పాల్పడిన కుటుంబాల పిల్లల చదువులకిచ్చే సహాయం కూడా నిల్పివేసారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వైఫరిత్యాల పథకం పేరును పదేపదే మార్పులు చేసారు. గతంలో ఎన్‌సిఆర్‌ఎఫ్‌గా ఉన్న దానిని తర్వాత ఎన్‌సిసిఎఫ్‌గానూ ఆ తర్వాత నేడు ఎన్‌డిఆర్‌ఎఫ్‌గానూ పేరు మార్పిడీలు చేసారు. కానీ ఏ పేరు మార్చినా నష్టపోయిన రైతులకు ఒరిగిందేమీ లేదు. 2005లో డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ (ప్రకృతి వైఫరీత్యాల ఉపద్రవ చట్టం 2005) తెచ్చారు. ఈ చట్టం క్రింద కూడా రాష్ట్ర రైతాంగానికి ఎలాంటి సహాయం అందలేదు. చివరకు 2009 జూలై 20న 13వ ఫైనాన్స్‌ కమిషన్‌ రాష్ట్రానికి వచ్చి ప్రకృతి వైఫరీత్యాల నష్టానికి కొన్ని సూచనలు చేసింది. రాష్ట్రంలో ప్రధాన కార్యదర్శి, జిల్లాలో కలెక్టర్‌, డివిజన్‌లో ఆర్‌డివో లేదా సబ్‌ కలెక్టర్‌, మండలంలో తహసీల్‌దార్‌ మరియు గ్రామ స్థాయిలో గ్రామ పంచాయితీ సర్పంచులు చైర్మన్లుగా ప్రస్తుతం కమిటీలు ఉన్నట్టు కమిషన్‌ తెలిపింది. కానీ ఈ కమిటీలు ఎక్కడా కనిపించవు. నష్టపరిహారాలపై ఇవి నివేదికలు తయారు చేస్తున్నట్లు ప్రజలకు తెలియదు. నిరంతరం వరదలకు గురయ్యే ప్రాంతాలుగా కోస్తా 9 జిల్లాలు, ఖమ్మం, కరీంనగర్‌, వరంగల్‌, ఆదిలాబాదు, కడప, హైదరాబాదు జిల్లాలు గుర్తించారు. 1030 కిలోమీటర్ల తీరంలో 2.87 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో 2482 గ్రామాల్లోని 54 లక్షల మంది ప్రజలు వరదలకు నిరంతరం గురవుతున్నారని 13వ ఫైనాన్స్‌ కమిషన్‌ తెలిపింది. అదే విధంగా 296 మండలాల్లో సాధారణ వర్షపాతం 750 మిల్లీమీటర్లకు లోపు కురుస్తున్న ప్రకాశం, కడప, కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, మెదక్‌, నల్గొండ జిల్లాలను కరువు ప్రాంతాలుగా నిర్ధారించింది. వరదల నివారణకు కేంద్ర ప్రభుత్వం 1956 నుండి 2004 వరకు 20 కమిషన్లు వేసింది. ఈ కమిషన్లు ఇచ్చిన సూచనలను కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించుకోలేదు. తిరిగి 13వ ఆర్థిక కమిషన్‌ కొత్త సూచనలు చేసింది.
నష్టాలను బట్టి పరిహారం నిర్ణయించాలని, ప్రస్తుతం రాష్ట్రాలు భరిస్తున్న 25 శాతం పరిహారాన్ని 10 శాతానికి తగ్గించాలని, అదే విధంగా రాష్ట్రాలు అదనంగా ప్రకృతి వైఫరిత్యాల కొరకు ఏమి వ్యయం చేస్తే కేంద్రం 90 శాతం, రాష్ట్రం 10 శాతం భరించాలని సూచించింది. రాష్ట్రాలు ఎక్కువ నిధులు కేటాయించాలని, ఈ నిధులను ప్రస్తుతం ఏప్రిల్‌/ అక్టోబర్‌లో ఇస్తున్నారు. అలా కాకుండా జూన్‌/ డిశంబర్‌లో ఇవ్వాలని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వైఫరిత్యాల కార్పస్‌ ఫండ్‌ను పెంచాలి. రాష్ట్రాలు వ్యయం చేసిన నిధులను సమీక్షించడంతోపాటు, లెక్కలు సరిచూడాలి. వడదెబ్బ వల్ల నష్టపోయిన లేదా చనిపోయిన వారిని ఈ పథకం క్రిందికి తేవాలి. మానవ సృష్టి ద్వారా రసాయన`అణు`జాతి వ్యతిరేక దాడుల వలన జరిగిన నష్టాన్ని  కూడా ప్రకృతి వైఫరీత్యాల క్రింద పరిగణించాలని సూచించింది. ఈ సూచనలను కేంద్ర`రాష్ట్ర ప్రభుత్వాలు నేటికీ పాటించలేదు.
రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం రాజకీయ లబ్దికొరకు అశాస్త్రీయంగా కరువు ప్రాంతాలను ప్రకటన చేయడం, ఆ తర్వాత సహాయం చేయడం నుండి తప్పుకోవడం జరుగుతున్నది. వరదలు వచ్చిన సందర్భంలో హంగామా చేస్తూ ప్రకటనలు చేయడం తప్ప, రైతాంగానికి ఇచ్చిందేమీ లేదు. ప్రకృతి వైఫరిత్యాల నష్టాలను తగ్గించడానికి గల అవకాశాలను ప్రభుత్వాలు గుర్తించడం లేదు. డెల్టా ప్రాంతంలో డ్రయినేజి వ్యవస్థను ఎప్పటికప్పుడు మెరుగుపర్చడం, మెట్ట ప్రాంతాల్లో ప్రాజెక్టుల నిర్మాణం ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయడం ద్వారా వరదల`కరువుల నివారణను చాలా వరకు తగ్గించే అవకాశం ఉంది. బట్టిప్రోలు మండలంలో అద్దెపల్లి గ్రామంలో బాడవపొలాలు 4200 ఎకరాలు యేటా వరదల నష్టానికి గురవుతున్నాయి. 2,3 కోట్లతో అక్కడి డ్రయినేజి బాగు చేసినచో ఈ నష్టాన్ని పూర్తిగా అధిగమించవచ్చు. నల్లమడ డ్రయినేజి అలాగే కృష్ణా జిల్లాలోని డ్రయినేజీ వ్యవస్థను బాగు చేయడానికి నిరంతర కృషి జరపాలి. ప్రాజెక్టులను పూర్తిచేయడం ద్వారా కరువులను నివారించవచ్చు. ఇవి శాశ్విత పరిష్కారాలు.
తాత్కాలిక సహాయంగా పంటలు నష్టపోయిన లేదా ప్రకృతి వైఫరిత్యాలకు గురైన ప్రజల నష్టాల గణాంకాలను సేకరించి వారికి జరిగిన నష్టాన్ని పూర్తిగా చెల్లించాలి. బియ్యం, కిరోసిన్‌ పంపిణీ చేసి చేతులు దులుపుకోవడం, ఉపకరణాలు రాయితీ కొంత ఇచ్చి పరిహారం చెల్లించామని చెప్పుకోవడం వలన నష్టపోయిన రైతుకు సమస్య పరిష్కారం కాదు. రాష్ట్ర, జిల్లా, మండల మరియు గ్రామ స్థాయి కమిటీలు సక్రమంగా పని చేయడం ద్వారా ఈ నష్టాన్ని నుంచి నివారించవచ్చు. అదే విధంగా నేడు రాష్ట్ర వ్యాపితంగా విస్తరిస్తున్న కౌలు వ్యవస్థను పరిగణనలోకి తీసుకుని గ్రామ సభల ద్వారా కౌలుదారులను గుర్తించి వారికి ‘‘గుర్తింపు కార్డులు’’ ఇవ్వాలి. ఈ కార్డుల ఆధారంగా పరిహారం వారికే ఇవ్వాలి. నష్టపోయిన రైతులకు రెండో పంట వేయడానికి తగు ఉపకరణాలు పూర్తి సబ్సిడీపై సరఫరా చేయాలి. మొదటి పంట నష్టపోయినా రెండో పంట ద్వారానైనా వారు కోలుకునే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా వ్యవసాయ శాఖ, రెవెన్యూశాఖలు ఈ పనిలో బాధ్యత వహించాలి. అంతేకాని, ఉత్తుత్తి వాగ్ధానాలు చేసి రైతాంగాన్ని మభ్యపెట్టడం సరైన చర్య కాదు. గత శతాబ్ధాల అనుభవాన్ని బట్టి చూస్తే ఏనాడూ నష్టపోయిన రైతుకు కనీస పరిహారం చెల్లించిన పాపాన పోలేదు. నేడూ అదే జరగబోతున్నది. రైతాంగం సమైక్యంగా  ఉద్యమించి, న్యాయమైన హక్కులను సాధించుకోవాలి.
తేది:17.12.2010 సారంపల్లి మల్లారెడ్డి

No comments:

Post a Comment