Tuesday, 12 August 2014

వ్యవసాయ వృద్ధి అవసరాన్ని గుర్తించిన ఆర్థిక మంత్రి

‘‘దేశంలో రెండంకెల స్థాయిలో కొనసాగుతున్న ఆహార ద్రవ్యోల్బణం కట్టడి చేయడానికి వ్యవసాయోత్పత్తుల అభివృధ్ధే మార్గం.’’ ` (ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జి 17.10.2011)
 భారత్‌ ఎడిబి రజతోత్సవాలలో ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ నివేదికను విడుదల చేస్తూ దేశంలో ద్రవ్యోల్బణం తగ్గించడానికి వ్యవసాయ ఉత్పత్తులు పెంచాలని హితవు పలికారు. ద్రవ్యోల్బణం తగ్గింపుపై సంవత్సరాల తరబడి ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. వినియోగదారునికి ఆహార ధాన్యాల ధరలు చుక్కలనంటుతున్నాయి. కాని ఉత్పత్తి దారునికి ఉత్పత్తి వ్యయం కూడా రావడం లేదు. మధ్యదళారీలు, పెట్టుబడిదారులకు లాభాలు చేకూర్చి పెట్టడానికి ధరల పెరుగుదల ఒక కారణం. మరోకారణం రూపాయి విలువ తగ్గిపు. ఈ రెండు కారణాల వల్ల మధ్యదళారీలు వేల కోట్లు సంపాదించడమే కాక మరోవైపున ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నది. భారత స్థూల జాతీయోత్పత్తి 8.5 శాతం నుండి 9 శాతానికి పెంచడానికి కేంద్రప్రభుత్వం పిల్లిమొగ్గలు వేస్తున్నది. 12వ ప్రణాళికా కాలం అనగా 2012`17 సంవత్పరాలకు మౌలిక వసతుల అభివృద్ధికి ట్రిలియన్‌ డాలర్ల పెట్టుబడుల ప్రణాళిక రూపొందిస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించడం. ఆచరణ రిత్యా నమ్మశక్యం కాని ప్రకటనగా ఉంది. దేశంలో దినదినం వ్యవసాయ ఉత్పత్తుల క్షీణత కొనసాగుతున్నది. పెట్టుబడులు తగ్గుతున్నాయి. సాగు విస్తీర్ణం కూడా తగ్గుతున్నది. ఆహారధాన్యాల దిగుమతులు 2007`08లో మొత్తం దిగుమతులలో 2.3 శాతం ఉండగా 2009`10లో 3.5 శాతానికి పెరిగాయి. వంట నూనెల దిగుమతులు 1 శాతం నుండి 2 శాతానికి పెరిగాయి.
సాగు విస్తీర్ణం 2006`07లో 123.7 మిలియన్‌ హెక్టార్లు కాగా 2009`10 నాటికి 121.3 మిలియన్‌ హెక్లార్లుకు తగ్గింది. ఇదే కాలంలో ఉత్పత్తి 21.73 కోట్ల టన్నుల నుండి 2008`09లో 23.44 కోట్ల టన్నులకు పెరిగి తిరిగి 21.82 కోట్ల టన్నులకు తగ్గింది. హెక్టారుకు 1756 కిలోల ఉత్పాదకత హెచ్చుతగ్గులకు గురైంది. తలసరి రోజువారీ ఆహారధాన్యాల వినియోగం 412.8 గ్రాముల నుండి 407 గ్రాములకు తగ్గింది. పై గణాంకాలను పరిశీలిస్తే వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు పెరగలేదు. పైగా తలసరి వినియోగం కూడా తగ్గుతున్నది.
వ్యవసాయ రంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరళీకృత విధానాలు అమలు చేస్తున్నాయి. ఆ విధానాల ఫలితమే వ్యవసాయోత్పత్తుల తగ్గుదలతో పాటు క్రమంగా ప్రభుత్వ పెట్టుబడులు తగ్గి బహుళ జాతి సంస్థల పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఇప్పటికే విత్తన రంగంపై 80 శాతం ఆధిక్యతను బహుళ జాతి సంస్థలు కలిగి ఉన్నాయి. 2004`05లో దేశీయ స్థూల ఉత్పత్తి( జిడిపి)కి వ్యవసాయ మరియు అనుబంధ రంగాల నుండి 19 శాతం జత చేయగా 2009`10లో 14.6 శాతానికి తగ్గింది ఒక్క వ్యవసాయ రంగాన్ని పరిశీలిస్తే జిడిపికి 12.3 శాతం మాత్రమే జత చేసింది. ప్రభుత్వ పెట్టుబడులు పరిశీలిస్తే 2004`05లో 2.56 శాతం బడ్జెట్‌ కేటాయించగా
2011`12లో 2.97 శాతం మాత్రమే కేటాయించారు. కానీ ఈ కాలంలో వ్యవసాయ ఉపకరణాల ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రస్తుత ఖరీఫ్‌లో ఎరువుల ధరలు 87 శాతం, విత్తనాల ధరలు 35 శాతం, క్రిమిసంహారక మందుల ధరలు 40 శాతం ప్రభుత్వమే పెంచింది. పత్తి విత్తనాలను నిత్యావసర సరుకుల చట్టం కిందకు తెచ్చి ధరలు పెంచడం జరిగింది. కాలం గతించినా బిటి టెక్నాలజీకి ధర తగ్గించడానికి బదులు పెంచడం చూస్తే బహుళ జాతి సంస్థలకు ప్రభుత్వాలు ఎలా తలొగ్గుతున్నాయన్న వాస్తవం విధితమవుతుంది. అదే సందర్భంలో వ్యవసాయోత్పత్తుల ధరలు 8శాతం మాత్రమే పెంచి కనీస మద్దతు ధరలు నిర్ణయించారు. నేషనల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ మిషన్‌ను 2007`08లో 476 జిల్లాలో (17 రాష్ట్రాలలో) వరి, గోదుమ, పప్పుధాన్యాల ఉత్పత్తులను వరుసగా 10, 8,2 శాతం పెంచాలన్న లక్ష్యం కాగాతాలకే పరిమితమైంది. 2001 జనాభా లెక్కల ప్రకారం 58 శాతం ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న సంస్థగా ఈ రంగం పనిచేస్తున్నది. ఈ రంగాన్ని పునాదిగా ‘‘ ఆహార భద్రతా చట్టం’’ రానున్నది. 2010`11లో 5.4 శాతం వృద్ధి రేటు సాధించాలన్న లక్ష్యం నిర్ణయించారు. 2009`10లో 0.4 శాతం మాత్రమే పెరుగుదల రేటు ఉంది. వ్యవసాయోపకరణాల ధరలు పెరిగి వ్యవసాయోత్పత్తుల ధరలు తగ్గుతున్న పరిస్థితుల్లో సంక్షోభంలోకి వెళుతున్న రైతులు ఉత్సాహంగా ఉత్పత్తి పెంచగలరా?
ప్రభుత్వ విధానం ఏమిటి?
వ్యవసాయ రంగం రాజ్యాంగం రీత్యా రాష్ట్రాల జాబితాలో ఉంది. కేంద్రం పరిమితంగానే సహకరించాలి. ముఖ్యంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు గ్రాంటు, నూతన విత్తన పరిశోధనలకు నిధుల కేటాయింపు, ఎగుమతి, దిగుమతుల అనుమతులకు కేంద్రం బాధ్యతగా ఉండాలి. మిగిలిన అన్ని వ్యవసాయ చర్యలకు అనగా భూ చట్టాలు చేయడం, విత్తన ఉత్పత్తి, పంపిణి, సరఫరా, ధరల నిర్ణయం, చట్టం చేయడం, ఇరిగేషన్‌, రుణాలు, మార్కెట్టు, వ్యవసాయోత్పత్తుల ధరల నిర్ణయం, సేకరణ, స్థానికంగా పంపిణి మరియు వ్యవసాయ రాయితీలు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా ఉంది. కానీ రాష్ట్ర బాధ్యతలన్ని కేంద్రానికి దఖలు పరిచి రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగం నుండి దూరమవుతున్నాయి. విత్తన చట్టం తెస్తానని కేంద్రం 2004లో చట్టముసాయిదాను పార్లమెంటులో ప్రవేశ పెట్టింది. 2011 వచ్చినా నేటికీ బిల్లు చట్టంగా రూపొందలేదు. విత్తన చట్టం లేని దేశంలో బహుళ జాతి సంస్థల వల్ల రైతులు నాణ్యత లేని విత్తనాల వల్ల, ధరల పెంపు వల్ల వేలకోట్లు నష్టపోతున్నారు.1991`92 లో 8.11 కోట్ల హెక్టార్లు సాగునీటి వనరులు కల్పించగా, మార్చి 2010 నాటికీ 10.82 కోట్ల హెక్టార్లకు మాత్రమే సాగునీటి సౌకర్యం కల్పించబడిరది. దశాబ్ద కాలంలో 2.5 కోట్ల హెక్టార్లకు మాత్రమే సాగు నీటి వనరుల కల్పన ప్రభుత్వాల యొక్క వ్యవసాయ విధానాలను తేటతెల్లం చేస్తున్నాయి. పంటలకు భీమా విధానంలో మార్పులు తెచ్చినా రైతుల ప్రయోజనాన్ని కాకుండా కంపెనీలు ప్రీమియం వసూలు చేసుకోవడానికే ప్రయోజనకరంగా ఉంది. కరువులు, వరదలు మరియు ఇతర ప్రకృతి వైపరీత్యాల వలన ఏటా కోట్లాది ఎకరాలు నష్టపోతున్న వారికి ఎలాంటి పరిహారం అందడం లేదు. అందుకే రుణగ్రస్తులైన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
2009`10లో 4.56 లక్షల కోట్ల పన్నులు దేశ ప్రజలపై వేయగా 2011`12లో 6.64లక్షల కోట్ల పన్నులు వేశారు. అనగా 45.5 శాతం పన్నుల భారం ప్రజలపై వేశారు. ఈ భారంలో రైతుల భాగం కూడా ఉంది. వ్యవసాయానికి మౌలిక వసతుల కల్పనలో ఏమాత్రం ద్ద్ర చూపని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఉత్పత్తిని , ఉత్పాదకతను  పెంచి, ద్రవ్యోల్బణాన్ని అరికట్టగలరా?
ఏ దిశగా ప్రభుత్వాల ప్రయాణం?
ఇప్పటికే పారిశ్రామిక మరియు సేవా రంగాలు, విద్యా, వైద్య రంగాలు కార్పోరేటు కబంధ హస్తాలలోకి వెళ్ళి పోయాయి. భారత వ్యవసాయ రంగంపై కార్పోరేట్ల దృష్టి పడిరది. వారికి అనుకూలమైన విధానాలను రూపొందించడానికి, వారి ప్రవేశానికి చట్టాలలో మార్పులు తేవడమే కాక అనేక అవకాశాలు కల్పిస్తున్నాయి.అందులో భాగంగా ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ వ్యాఖ్యల అంతరార్థం గమనిస్తే కార్పోరేటు సంస్థల ద్వారా వ్యవసాయోత్పత్తులు పెంచాలన్న లక్ష్యం కనబడుతున్నది. ఈ లక్ష్య సాదనకు ఆసియా అభివృద్ధి బ్యాంకు నుండి ఆర్థిక సహకారం కోరుతున్నారు. ఇప్పటికే విదేశీ రుణాలు 2009 నాటికి 11.66 లక్షల కోట్లు కు చేరాయి. అనగా మన దేశ బడ్జెట్‌తో సమానమన్న మాట. స్వదేశీ అప్పులు తక్కువేమీ లేవు. కనీస పరిజ్ఞానం ఉన్న పాలకవర్గాలెవరైనా వ్యవసాయాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తారు. కనీస వేతనా నిర్ణయం ఆహార ధాన్యాల ధరలను బట్టి నిర్ణయించబడుతుంది. పైగా వ్యవసాయ ఉత్పత్తులు పరిశ్రమలకు ముడిసరుకులుగా ఉపయోగపడుతాయి. వ్యవసాయ ఉత్పత్తులు తగ్గితే దీని ప్రభావం పారిశ్రామిక రంగంపైనా, సేవారంగం పైన పడి వాటి ఉత్పత్తి రేటు తగ్గుతుందన్నిది చారిత్రక వాస్తవం. నేడు ఆహార ధాన్యాలలో స్వయం సమృద్ధం కాని దేశాలలో జరుగుతున్న ఆందోళనలు చూస్తున్నాం. సోమాలియా, మెక్సికో, మధ్యప్రాశ్చ్య దేశాలలో జరుగుతున్న ఉద్యమాలకు నిత్యావసర సరుకుల కొరతే కారణం.
ఇప్పటికే భారతదేశంలో ఆహార కొరత తీవ్రంగా ఉంది. ప.బెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, హర్యానా, పంజాబ్‌, కర్నాటక రాష్ట్రాలలో కొంత మిగులు ఉత్పత్తి జరిగినప్పటికీ అది దేశీయ అవసరాలకు సరిపడినంతగా లేదు. సరళీకృత ఆర్థిక విధానాలు ప్రారంభించిన 1995 నుండి వ్యవసాయ రంగంపై వాటి ప్రభావం తీవ్రంగా ఉంది. పాలకులు ఆహార ధాన్యాల దిగుమతులపై ఆధారపడవచ్చని భావిస్తున్నారు. ఇది ఆత్మహత్యా సదృష్యమైన చర్య తప్ప మరొకటి కాదు. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, అంతర్జాతీయ వాణిజ్య సంస్థ, అంతర్జాతీయ ద్రవ్య నిధిసంస్థలతో కుదుర్చుకునే ఒప్పందాలన్నీ భారత వ్యవసాయరంగ అభివృద్ధికి ఆటంకాలుగానే ఉన్నాయి. విధానాలు మార్చుకోకుండా నేటి పరిస్థితుల్లో వ్యవసాయాభివృద్ధి జరగదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ ఉత్పత్తులు పెంచాలంటే దేశ అవసరాలనకనుగుణంగా విధానాలను, ప్రణాళికలను రూపొందించాలి. సన్న, చిన్నకారు రైతులు 90 శాతం కలిగిన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చి వారిని వ్యవసాయ రంగం నుండి తరిమి వేసే విధానాలు అనుసరించడం ప్రమాదకరం.

తేది.18.10.2011
సారంపల్లి మల్లారెడ్డి

No comments:

Post a Comment