Wednesday, 13 August 2014

త్రాగునీరు ` సాగునీటి కల్పనే రాష్ట్రాభివృధ్ధికి కీలకం

    రాష్ట్రంలో తగినన్ని జలవనరులున్నప్పటికీ ఆరు దశాబ్దాలు గడిచినా నేటికీ 40శాతానికి మించి సాగు నీటి వనరులు కల్పించలేకపోయాం. ఉమ్మడి రాష్ట్రంలో యేటా 400`500 మండలాలు వర్షాభావ పరిస్థితుల వల్ల కరువుకు గురవుతున్నాయి. మరొక 200 మండలాల వరకు వరదలకు గురవుతున్నాయి. యేటా 500 కోట్ల రూపాయల పంటలకు నష్టం వాటిల్లుతున్నది. గత 12 ఫిబ్రవరి 2014న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటన ప్రకారం 2013 సంవత్సరంలోనే ప్రకృతి వైపరీత్యాల వల్ల రు.6500 కోట్ల విలువగల పంటలకు నష్టం వాటిల్లినట్లు, 40 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు ప్రకటించారు. జలయజ్ఞంలో తెలంగాణా ప్రాంతంలో 2005`13 జనవరి వరకు రు.28,703 కోట్లు భారీ ప్రాజెక్టుల కొరకు రు.1,597.4 కోట్లు మధ్యతరహా ప్రాజెక్టులకు వ్యయం చేశారు. ఇవి కాక మరొక రు.100 కోట్లు మైనర్‌ ఇరిగేషన్‌ల కొరకు వ్యయం చేసినట్లు గణాంకాలు చెప్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుండి ఎఐబిపి నిధులు కేటాయించినప్పటికీ సక్రమైన వ్యయం చేయలేకపోతున్నాం. 2009`10 నుండి ఏటా 4000 కోట్లు రాష్ట్రానికి కేటాయించగా 1500 కోట్లు మాత్రమే వ్యయం చేసారు. ఇది కాక విదేశీ సహయక నిధులు మొదటి విడతగా మైనర్‌ ఇరిగేషన్‌కు 950 కోట్లు, మరియు 450.60 కోట్లు ప్రపంచబ్యాంకు నుండి మంజూరి అయ్యాయి. వీటిని 2010 డిశంబర్‌ నాటికి వ్యయం చేయాలి. రెండవ విడుతగా 3000 చెరువుల నిర్మాణానికి (2.5 లక్షల హెక్టార్లకు) 31.12.2012 నాటికి పూర్తి చేయడానికి ప్రపంచబ్యాంకు 217.8 మిలియన్‌ డాలర్లు మరియు 189 మిలియన్‌ డాలర్లు ఐబిఆర్‌డి మరియు ఐడిఏ క్రింద మంజూరి ఇచ్చారు. అయినా విదేశీ నిధులు వ్యయం చేసి మైనర్‌ ఇరిగేషన్‌ను రిపేరు చేయలేకపోయారు. ఇటు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన ఎఐబిపి నిధులు గాని, అటు విదేశాల నుండి వచ్చిన సహాయం గాని సక్రమ వినియోగం చేయకపోవడం వలన ఇరిగేషన్‌ వ్యవస్థ ‘‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’’ అన్న చందంగా ఉంది. అదనంగా ఒక ఎకరాకు కూడా నీటి గ్యారంటీ లభ్యత కలగలేదు. తెలంగాణాలో సాగుభూమి 45.99 లక్షల ఎకరాలు 30%, సీమాంధ్రలో 39.29 లక్షల ఎకరాలు నికర సాగు ఉండగా ఇందులో 40శాతం మాత్రమే వివిధ జలవనరుల ద్వారా సాగవుతున్నది.
    తెలంగాణాలో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు, కాకతీయ కాలువ రెండవదశ (4.40 లక్షల ఎకరాలు), వరదల కాలువ (2.20 లక్షల ఎకరాలు), దేవాదుల (6.5 లక్షల ఎకరాలు), నెట్టెంపాడు (2 లక్షల ఎకరాలు), కల్వకుర్తి (3.40 లక్షల ఎకరాలు), భీమా ఒకటి`రెండు దశలు (2లక్షల ఎకరాలు) ప్రాజెక్టులు చేపట్టి రెండు దశాబ్ధాలకు పైగా నిర్మాణాలు సాగుతూనే ఉన్నాయి. ఈ భారీ ప్రాజెక్టులకు వ్యయ అంచనా పెరుగుతూనే ఉంది. నేటికీ ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు పూర్తికాలేదు. అలాగే ఎల్లంపల్లి ప్రాజెక్టు (2.20 లక్షల ఎకరాలు), రాజీవ్‌దుమ్ముగూడెం (2లక్షల ఎకరాలు), ఇందిరా దుమ్ముగూడెం (2 లక్షల ఎకరాలు) ప్రాజెక్టులు 2013 జనవరి నాటికి 60 శాతం మాత్రమే పూర్తయ్యాయి. 1983లో శ్రీరాంసాగర్‌, కాకతీయ కాలువ రెండవ దశను, వరద కాల్వను ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటించారు. వాటిని 2005లో ప్రారంభించారు. నేటికీ పూర్తికాలేదు. ప్రస్తుతం అన్ని పనులు నిలిపివేసారు. మొబైల్‌ అడ్వాన్సులు పొందిన కాంట్రాక్టర్లు తమకు ప్రభుత్వం వ్యయ అంచనా పెంచాలని కోరుతున్నారు. నిజామాబాదు జిల్లాలో గోదావరి నదిపై చేపట్టబడ్డ గుత్ప, అలీసాగర్‌ ప్రాజెక్టులకు 520 కోట్లు వ్యయం చేసినా ఇంకా పూర్తి స్థిరీకరణకు (93,792 ఎకరాల స్థిరీకరణ) నోచుకోలేదు. లెండి ప్రాజెక్టుకు 200 కోట్లు వ్యయం జరిపినా పూర్తికాలేదు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల ప్రాజెక్టు అర్ధాంతరంగా నిలిచిపోయింది. పాలమూరు ఎత్తిపోతల పథకం సర్వే దశలోనే ఉంది. ఆదిలాబాదు జిల్లాలో 24 మధ్యతరహా ప్రాజెక్టులు చేపట్టి రెండు దశాబ్ధాలు గడుస్తున్నది. నిర్మాణ వ్యయం పెరగడమే తప్ప, ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తికాలేదు. విచిత్రమేమిటంటే ఈ 24 ప్రాజెక్టులు ఒక్కోటి 100 కోట్లలోపు అంచనా వ్యయం మాత్రమే. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల పరిస్థితి ఇలా ఉండగా, మైనర్‌ ఇరిగేషన్‌ పరిస్థితి మరింత అధ్వానంగా తయారువుతున్నది. చిన్నచిన్న పథకాలు కూడా పెండిరగ్‌లో పెట్టారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మత్తడివాగు, సుద్దవాగు, ర్యాలివాగుకు ఆదిలాబాదు జిల్లాలో నీటిని వదిలారు. కానీ  కాల్వలు లేక, ప్రాజెక్టులు పూర్తికాక ఒక్క ఎకరాకు కూడా నీరు పారలేదు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి  కిరణ్‌కుమార్‌ రెడ్డి 14 జనవరి 2013 భీమా ఎత్తిపోతల, కల్వకుర్తి ఎత్తిపోతల, నెట్టంపాడు ఎత్తిపోతలకు నీటిని వదిలాడు. ఈ రోజుకు పొలాలకు మాత్రం సాగునీరు రాలేదు. నీరు వదిలామన్న సంతృప్తితో ముఖ్యమంత్రులు ఉన్నారే తప్ప, పనులు పూర్తిచేసి పంటకాల్వలు పూర్తిచేయడం, ఎత్తిపోతలకు పంపులను ఏర్పాటు చేయడం వదిలివేస్తున్నారు. నాణ్యతలేని నిర్మాణాల వల్ల పాలెంవాగు, గుండ్లకమ్మ, కొమరంభీం ప్రాజెక్టులు మధ్యలోనే కొట్టుకుపోయాయి. ఖమ్మం జిల్లా బయ్యారంలో కాకతీయుల కాలం నాటి చెరువుకు గండిపడగా రెండుసార్లు రిపేర్లకు నిధులు వ్యయం చేసినా గండి మాత్రం తాత్కాలికంగానే పూడ్చారు. ఎక్కడ చూసినా నాణ్యతలేని నిర్మాణాలు సాగుతున్నాయి. ఇంజనీర్లచే సోషల్‌ ఆడిట్‌ చేయిస్తామని చెప్పారు. ఆడిట్‌మాట దేవుడెరుగు. కనీసం కాంట్రక్టర్లకు చెల్లించిన అడ్వాన్సులు కూడా తిరిగి చెల్లించకుండా కావాలనే ప్రాజెక్టులకు కాలయాపన చేస్తున్నారు. 2014 జూన్‌ 2 తర్వాత ప్రమాణ స్వీకారం చేయబోయే కొత్త ప్రభుత్వాలు జలయజ్ఞం నిధుల వ్యయంపై నిఖరమైన చర్యలు చేపట్టకపోతే కాంట్రాక్టర్లకు లబ్దికలిగించినవారే అవుతారే తప్ప, రైతులకు మాత్రం సాగునీటి వనరులు కల్పించలేరు. ప్రజలకు త్రాగునీటిని అందించలేరు.
    తెలంగాణా రాష్ట్రంలో 35,432 చెరువుల క్రింద 16,75,735 ఎకరాలు సాగుకావాలి. 2011`12 రికార్డుల ప్రకారం పరిశీలిస్తే 4,51,273 ఎకరాలు మాత్రమే సాగయ్యింది. 27% మాత్రమే. ఆంధ్రా ప్రాంతంలో 36,700 చెరువుల క్రింద 18,55,068 ఎకరాలు సాగు కావాల్సి ఉండగా, 2011`12లో 9,06,184 ఎకరాలు మాత్రమే సాగయ్యింది. 49% మాత్రమే. మైనర్‌ ఇరిగేషన్‌ చెర్వులు చాలా వరకు కట్టలు తెగిపోయి నీరు నిల్వలేకుండా చేసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు హస్తగతం చేసుకున్నారు. ఒక్క హైదరాబాదులోనే గతంలో 84 చెరువులు ఉండగా, నేడు 14 చెరువులకు తగ్గింది.
    లిఫ్ట్‌ పథకాలు మహబూబ్‌నగర్‌ జిల్లాలో తొమ్మిది ఉన్నాయి. వీటి క్రింద 20వేల ఎకరాలు సాగుకావాలి. నల్లగొండ జిల్లాలో 42 లిఫ్ట్‌ పథకాల క్రింద 86వేల ఎకరాల స్థిరీకరణకు ప్రకటించగా 50శాతం లోపే సాగవుతున్నది. లిఫ్ట్‌ పథకాలకు 16 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తామని 7 గంటలే సరఫరా చేయడం వలన పంటలు పండని పరిస్థితి ఏర్పడిరది. నల్గొండ జిల్లాలో బునాదిగాని కాలువ (భువనగరి`ఆలేరు), బొల్లేపల్లికాలువ (భువనగిరి), పిలాయపల్లి కాలువ (మునుగోడు` నకిరేకల్‌), ధర్మారెడ్డి కాలువ (నకిరేకల్‌) నిర్మాణాలు చేపట్టి దశాబ్ధాలు గడిచినా ఒక్కటి కూడా పూర్తికాలేదు. ప్రస్తుతం పనులు నిలిపివేసారు. మండలాల్లో నిరంతరం ఆందోళనలు సాగుతున్నాయి. నల్గొండ జిల్లా పడమటివైపు 700 గ్రామాల్లో ఫ్లోరైడ్‌ నీరు తాగడం వలన ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. మెట్ట భూముల్లో వేసిన పండ్లతోటలు దెబ్బతినడం వలన 15 సంవత్సరాల వయస్సు గలిన వేలాది ఎకరాల నారింజ తోటలను నరికివేస్తున్నారు. వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌, నర్సంపేట, ఘనపురం డివిజన్లలో త్రాగు`సాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 5,961  చెర్వుల క్రింద 2,28,749 ఎకరాలు ఆయకట్టు సాగుకావాల్సి ఉండగా ఏనాడు 25శాతానికి మించిన ఆయకట్టు సాగుకాలేదు.
    పంటలు పండకపోవడం వలన పెద్దఎత్తున వలసలు పోతున్నారు. చివరికి రుణభారం పెరిగి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వీటన్నింటికి సాగునీటి సౌకర్యంలేకపోవడమే కారణం.

రాష్ట్ర జల విధానం రూపొందించాలి:
    రాష్ట్రం నుండి కృష్ణా, గోదావరి నదుల ద్వారా ఏటా 4`5వేల టిఎంసీల నీరు వినియోగించుకోకపోవడం ఫలితంగా సముద్రంపాలవుతుంది. బేసిన్‌ ప్రాంతం నుండి వర్షపు నీరు దిగువకు వచ్చి నదిలో కలిసిన తర్వాత తిరిగి ఆ నీటికి లిప్టులు పెట్టి ఎగువకు సాగునీటికి వినియోగించడం వ్యయంతో కూడినపని. వర్షపు నీటిని వినియోగించుకోవడానికి వీలుగా మైనర్‌ ఇరిగేషన్‌ను (చెరువులను) రిపేర్లు చేసి నీటిని నిలువ పెట్టుటకు వీలుగా మార్చాలి. భారీ`మధ్యతరహా ప్రాజెక్టుల్లోకి 80 శాతం నీరు రాగానే తూములు, కాల్వల ద్వారా నీటిని వదిలి చెరువులను నింపాలి. ఆ విధంగా నదిలో వృధాగా పోయే నీటిని వినియోగించుకోవడానికి వీలుంటుంది. ప్రస్తుతం చెరువులు ఎండిపోవడం వలన భూగర్భజల నీటిని అదే సందర్భంలో ఎక్కువ వినియోగించడం వల్ల వాతావరణం వేడెక్కి పర్యావరణ సమస్యలు వస్తున్నాయి. భూగర్భ జలాలను నిర్ధిష్ట పరిధిలో నిల్వ ఉంచినప్పుడు పర్యావరణం కూడా అనుకూలంగా మారుతుంది. సాగునీటి వినియోగం కల్పించడానికి మరియు త్రాగునీటి సౌకర్యం కల్పించడానికి లభ్యత గల నీటిని సధ్వినియోగం చేసుకునే వనరులను నిర్మించాలి. తద్వారా వర్షాభావ పరిస్థితుల వల్ల ఏర్పడే కరువులు నివారించబడతాయి. మరోవైపు ఏ యేటికాయేడు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చడం ద్వారా (పూడికతీత) వరదనీటిని వెంటనే సముద్రంలోకి పంపే అవకాశం ఉంటుంది. వరద నష్టాలను తగ్గించవచ్చు. కరువుల నివారణ, వరద నష్టాల తగ్గింపు వలన వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత పెరుగుతుంది. అందుకు తగిన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించాలని అనేక సంవత్సరాలుగా సిపిఐ(యం) మరియు రైతుసంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేయడమే కాక, ఆందోళనలు కూడా చేసారు. అయినా ప్రభుత్వం రాష్ట్ర జల విధాన రూపకల్పనకు సిద్ధంగా లేదు. పనిభారం పెరుగుతుందని ఇరిగేషన్‌ శాఖ సిబ్బంది జల విధాన రూపకల్పనకు అభ్యంతరం చెబుతున్నారు. అదనపు సిబ్బందిని జల విధానం రూపొందించి, అమలు జరపడం ద్వారా సాగునీరు, త్రాగునీరు ప్రజలకు అందుబాటులోకి తేవచ్చు. తద్వారా ఉపాధి పెరుగుతుంది.  గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ది జరుగుతుంది. సాగునీరు, త్రాగునీరు, ఉపాధి మరియు విద్యాభివృద్ది ద్వారా సమాజంలో నాగరికత అభివృద్ది అవుతుంది. నాగరిక సమాజంగా మారుతుంది.
    కానీ  ప్రభుత్వాలు సాగునీటితో వ్యాపారం చేసి ప్రయివేటు నీటి వ్యాపారులకు వేల కోట్లు లాభాలు కట్టబెడుతున్నది. రాష్ట్రంలో 3వేల కోట్ల రూపాయల త్రాగునీటి వ్యాపారం సాగుతున్నది. అన్ని గ్రామాలకు సాగునీటి వనరులు కల్పిస్తే వీరి వ్యాపారం దెబ్బతింటుంది. అందుకే త్రాగునీటి వ్యాపారులు శాశ్వత రక్షిత పథకాల నిర్మాణాల జాప్యానికి ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి వేల కోట్లు వ్యయం అవుతాయి. అదే మధ్య తరహా, మైనర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు నిధుల వ్యయం తగ్గడమే కాక తక్కువ కాలంలో నిర్మాణాలు పూర్తిచేయవచ్చు. కానీ గత అనుభవాన్ని బట్టి చూస్తే మధ్య తరహా మైనర్‌ ఇరిగేషన్‌ పథకాల నిర్మాణాలు కూడా దశాబ్ధాల తరబడి ఉద్దేశ్యపూర్వక జాప్యానికి గురవుతున్నాయి. ప్రభుత్వం నీటి తీరువా పెంచడానికి అనుగుణంగా సాగునీటి మీటర్లను ఏర్పాటు చేసింది. ప్రపంచబ్యాంకు ఆదేశితంగా ఏర్పాటు చేసిన ఈ సాగునీటి మీటర్ల వలన రైతులు నీటిని వినియోగించుకోవడానికి డబ్బు అదనంగా వ్యయం చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే మూడు సార్లు నీటి తీరువా పెంచారు. అదే సందర్భంలో ప్రభుత్వం పంట కాల్వల రిపేర్లను నిర్లక్ష్యం చేయడం వలన పూడిక చేరి కాల్వ చివరి భూములకు నీరందడం లేదు. లిఫ్ట్‌ పథకాలకు విద్యుత్‌ సరఫరా సక్రమంగా సరఫరా లేదు. వరంగల్లు, నల్లగొండ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ కాకతీయ ఉపకాలువలన్నీ పూడిపోయాయి.
    భారీ, మధ్యతరహా, మైనర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు మరియు లిష్టు పథకాలకు సవివరమైన ప్రణాళికలు రూపొందించాలి. నిర్ణీత కాలంలో వాటిని పూర్తిచేయాలి. ముఖ్యంగా ఎపిఐడిసీని పటిష్టవంతం చేసి లిప్ట్‌ పథకాలను మరియు మైనర్‌ ఇరిగేషన్‌ బాధ్యతలను వారికి అప్పగించాలి. దీనికి తగినంత మంది సిబ్బంధిని నియమించాలి. మైనర్‌ ఇరిగేషన్‌ వలన భూగర్భజలాలు పెరగడమే కాక, పర్యావరణం సమతుల్యంగా ఉంటుంది. అలాంటి పథకాలకు ప్రభుత్వం రూపకల్పన చేయడానికి ముందు రాష్ట్ర స్థాయిలో అఖిల పక్ష సమావేశాలు ఏర్పాటు చేసి నిర్ణీత ఎజెండాను రూపొందించాలి. బావుల సేద్యానికి భూగర్భ జలాల నిల్వకు గల అనుబంధాన్ని స్థిరంగా ఉంచడానికి మైనర్‌ ఇరిగేషన్‌ తోడ్పాటు అవసరం. ఈ సాగునీటి కల్పన ద్వారా నేడు పంప్‌సెట్లకు వినియోగిస్తున్న విద్యుత్‌లో ఎక్కువ భాగం ఆదా చేయవచ్చు. ప్రస్తుతం 25వేల మిలియన్‌ యూనిట్లు వినియోగిస్తున్నారు. దీనిని సగానికి తగ్గించవచ్చు. తద్వారా విద్యుత్‌ కొరత నివారించబడుతుంది. బహుళ ప్రయోజనాలు కలిగే విధంగా సాగునీటి కల్పనకు ప్రస్తుత వనరుల దృష్య్టా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలి.
సారంపల్లి మల్లారెడ్డి
18.04.2014

No comments:

Post a Comment