Wednesday, 13 August 2014

రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలు పరిష్కరించాలి

రాష్ట్ర ప్రభుత్వం 2013 మార్చి 12 నుండి ఏప్రిల్‌ 10 వరకు అన్ని గ్రామపంచాయితీల్లో మరియు రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రచారం ప్రారంభించింది. ఈ సదస్సుల్లో 1) భూ తగాదాల పరిష్కారం, 2) సన్న`చిన్నకారు రైతుల భూ సమస్యలకు సహాయం, 3) పివోటీ చట్టం 1977 మరియు ఎపిఎల్‌సీ యాక్ట్‌ 2011పై తెలియపరచుట, 4) గ్రామ రెవెన్యూ మ్యాప్‌/ అడంగల్‌/ పహాణీ/ ప్రభుత్వ భూముల ప్రకటన 5) పట్టాదార్‌పాస్‌ పుస్తకాలు, 6) కౌలుదారులకు గుర్తింపు కార్డులు 7) పట్టా చేయాల్సిన ప్రభుత్వ భూములు 8) ఏడవ విడత భూపంపిణీకి ప్రభుత్వ భూముల గుర్తింపు, 9) భూ పట్టా మార్పిడి తదితర సమస్యలను పరిష్కరించడానికి దీనిని ఉద్దేశించారు. ఈ సదస్సుల్లో రెవెన్యూ సిబ్బంధితో పాటు అటవీశాఖ, ఇరిగేషన్‌ శాఖ బాధ్యులు పాల్గొంటారు.
గత రెవెన్యూ సదస్సుల్లో6.40 లక్షల దరఖాస్తులు రాగా, 15వేలు మినహా అన్ని సమస్యలు పరిష్కరించామని రెవెన్యూమంత్రి అఖిలపక్ష సమావేశంలో తెలిపారు. త్రోసిపుచ్చబడిన దరఖాస్తులు మరియు ఆమోదం పొందకుండా పెండిరగ్‌లో పెట్టిన దరఖాస్తులను సైతం లెక్కించారు. కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వాలని గతంలో నిర్ణయించారు. కానీ అవేవీ అమలు జరగలేదు. ఇంతకు ముందు 2012 జనవరి 18 నుండి మార్చి వరకు నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో దళిత, గిరిజన భూములకు సంబంధించిన తగాదాల పరిష్కారం, అసైన్డ్‌, పోరంబోకు భూముల వివరాలను ప్రకటించడం, కౌలురైతులకు గుర్తింపుకార్డులు సదస్సు ముగిసేలోపు ఇవ్వడం, ఆరోవిడత భూపంపిణీకి భూములను గుర్తించడం, గతంలో పంపిణీ చేసిన భూములు లబ్ధిదారులకు స్వాధీనపర్చడం, దేవాదాయ, వక్ఫ్‌ భూములను పరిశీలించడం, అటవీహక్కుల చట్టం క్రింద భూముల పంపిణీ, గ్రామ సభల్లో దరఖాస్తులను పరిశీలించడం వంటి సమస్యలను పరిశీలిస్తామని నిర్వహించారు. 2005 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం ఏప్రిల్‌, మే నెలలో చైతన్యయాత్రలు జరుగుతూనే ఉన్నాయి. 2012 ఏప్రిల్‌లో కూడా రెవెన్యూ సదస్సులు జరిగాయి. అయినా గ్రామాల్లో భూసమస్యలు పెండిరగ్‌లోనే ఉంటున్నాయి. వేలాది మంది దళిత, గిరిజన పేదరైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ, కోర్టుల చుట్టూ ప్రతిరోజు తిరుగుతూనే ఉన్నారు. కానీ వారి సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు.
రాష్ట్రంలో గల 71,421 జనవాసాల్లో ఏనాడూ నిర్ధేశించిన లక్ష్యం నెరవేరలేదు. 2008`09లో 50,083 గ్రామాల్లో 2009`10లో 31,867 గ్రామాల్లో, 2010`11లో 36,757 గ్రామాల్లో, 2011`12లో 30,000 గ్రామాల్లో మాత్రమే సదస్సులు నిర్వహించినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఒక్కోరోజు నాల్గు గ్రామాలు పర్యటించి సదస్సులు జరిపామని అనిపించుకున్నారు. వచ్చిన దరఖాస్తులకు చాలా మందికి రశీదులు ఇవ్వలేదు. తీసుకున్న దరఖాస్తులకు తర్వాత జరిగిన పరిష్కారాన్ని వారికి వివరించలేదు. ఈ రెవెన్యూ సదస్సుల్లో  ప్రకృతి వైఫరిత్యాల పరిహారాన్ని చెల్లిస్తామని చెప్పినప్పటికీ గత రెండు సంవత్సరాలుగా పెండిరగ్‌లోనే కొనసాగుతున్నాయి. ఆరు విడతలుగా 7.15 లక్షల ఎకరాల భూమి పంపిణీ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి వేలాది మందికి అసైన్డ్‌ సర్టిఫికేట్స్‌ ఇచ్చారే తప్ప భూమి చూపలేదు. భూమి చూపినవారికి సాగుకు తేవడానికి ఇందిరప్రభ, ఇందిర జలప్రభ పథకాలను అమలు జరిపి వారికి ఆదాయవనరులు కల్పిస్తామన్నారు. ఒకవిధంగా పేదలకు అసైన్డ్‌ చేసిన భూములను తిరిగి లాక్కోవడానికి 9/77 అను రెవెన్యూ చట్టాన్ని మరియు సెక్షన్‌ 14 సీలింగ్‌ భూముల చట్టాన్ని సవరణ తెచ్చారు. పై చట్టాల ప్రకారం ధనికులవద్ద నున్న ప్రభుత్వ భూములను వారికే దక్కునట్లు ఈ సవరణలు ఉపయోగపడుతున్నాయి. మరోవైపున దళితపేదలకు అసైన్డ్‌ చేసిన భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి అవకాశం కల్పించబడిరది. అటవీ హక్కుల చట్టం క్రింద 10 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేస్తామని నేటికీ 35శాతం కూడా పంపిణీ చేయలేదు.
2005 నుండి జరుగుతున్న రెవెన్యూ సదస్సులు, రైతు చైతన్యయాత్రలు నామకా జరుగుతున్నాయి. ఎంత సమర్ధులైన అధికారులు ఉన్నప్పటికీ ఒకరోజు రెండుమూడు గ్రామాలు పర్యటించి, వారి సమస్యలను వినడానికే సమయం చాలదు. అలాంటి కార్యక్రమాలు రూపొందించి గ్రామానికి రెవెన్యూ అధికారులు వచ్చివెళ్లారని చెప్పడానికే ఉపయోగపడుతది. ప్రతి గ్రామంలో వేలాది భూముల తగాదాలు ఉన్నాయి.
వాస్తవ సాగుదారుపేరు నమోదు చేయాలనే ల్యాండ్‌ రెవెన్యూ యాక్ట్‌ సెక్షన్‌ 91 మరియు 98 ప్రకారం ఉన్నప్పటికీ, సదరు సాగుదారుకు పాస్‌పుస్తకం కూడా ఇవ్వాలని చట్టాలు చెబుతున్నా ఆ ప్రాథమిక చట్టాన్ని అమలు చేయకపోవడం దురదృష్టకరం. 2012 ఏప్రిల్‌ 15 నుండి నిర్వహించిన ప్రజాపథం కార్యక్రమంలో కూడా పై విషయాలనే పరిష్కరిస్తామని చెప్పారు. పట్టా మార్పిడి, ప్రభుత్వభూముల, దేవాలయ భూముల, వక్ఫ్‌భూముల సేకరణ, పట్టాదారుపాస్‌పుస్తకాలకు అర్జీలు స్వీకరించడం, దళిత, గిరిజన వర్గాలకు అసైన్డ్‌మెంట్‌ భూముల పరిష్కారం, కౌలురైతులకు కార్డులు ఆ సమావేశాల్లో పరిష్కరిస్తామని చెప్పారు. మార్చి 17 వరకు జరిగిన ఈ రెండు మాసాల కాలంలో లక్ష్యంలో 10 శాతం కూడా సాధించలేదు. రెవెన్యూ కార్యాలయాల్లో అడంగల్‌/ పహాణి ప్రస్తుత సంవత్సర కాపీలను ఒకరోజులో, గత సంవత్సరాల నకళ్లను ఏడు రోజుల్లో, కుల, ఆదాయ ధృవీకరణపత్రాలు మూడు రోజుల్లో, భూమిని సబ్‌డివిజన్‌ చేయడానికి 30 రోజులు, పట్టా మార్పిడికి 45 రోజుల్లో పూర్తిచేయాలని జీవో ఎంఎస్‌నం. 509, రెవెన్యూ (ఎల్‌ఆర్‌) శాఖ తేది 17.06.1997లో స్పష్టంగా వివరించారు. దీనిని అమలు చేస్తారని స్వయంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఏ ఎంఆర్‌వో కార్యాలయం లేదా కలెక్టర్‌ కార్యాలయం ఏరోజు పర్యటించినా వందలాది మంది కార్యాలయాల చెట్లముందు పడిగాపులుపడి ఉన్న దృశ్యాలు కనపడతాయి. ప్రజాప్రతినిధులను తీసుకువెళ్లితే తప్ప కాగితం కదలదు. జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో సమావేశాలు జరిపి చైతన్యపర్చడానికి బదులు సమస్యలు అడిగినవారిని విదిరించి కొట్టడం జరిగుతున్నది. దీనికి తోడు ప్రతికార్యాలయం ముందు దళారీలు పెద్దఎత్తున డబ్బులు వసూళ్లుచేసి అధికారులకు, లాభోక్తులకు మధ్య పనిచేస్తున్నారు. ఇది బహిరంగ రహస్యమే.
రెవెన్యూ సదస్సులు జయప్రదం కావాలని ప్రభుత్వం ఆశించినప్పుడు ఒక్కోగ్రామానికి రెండు రోజుల సమయం కేటాయించాలి. ముఖ్యంగా దళిత, వెనకబడిన వర్గాల కాలనీల్లో ఈ సదస్సులు నిర్వహించాలి. గ్రామసభను పిలవాలి. పర్యటనకు వారం రోజుల ముందు ఆ గ్రామంలో ప్రచారం చేయాలి. సేకరించి అర్జీలను పరిష్కారం అక్కడే చూపాలి. ప్రభుత్వ రెవెన్యూ రికార్డులను అందరికీ అందుబాటులో ఉంచాలి.  గత సంవత్సరం ఐదు లక్షల మంది కౌలుదారులకు రుణగుర్తింపు కార్డులు ఇవ్వగా, ఈ సంవత్సరం అందులో 50శాతం మందికే ఇచ్చారు. వాస్తవానికి రాష్ట్రంలో 40 లక్షల మంది కౌలుదారులు ఉన్నారు.    చెరువుపడకలు రియల్‌ఎస్టేట్‌ వ్వాపారుల స్వాధీనంలోకి వెళుతున్నాయి.పేదలు వేసుకున్న ఇళ్ళను కూల్చివేస్తున్నారు.వాస్తవానికి నీరుండని చెరువుపడకలను  ఏక్‌సాల్‌ పట్టాలివ్వడాన్ని నిలుపుదల చేసారు.1948లో వచ్చిన ఈనాం రద్దు చట్టం ఈనాటికీ పూర్తిగా అమలుకాలేదు.
    దేవాలయభూములు,వక్ఫ్‌ భూములు పెద్దల అక్రమ స్వాధీనంలో వున్నాయి. కానీ పేదలను తొలగిస్తున్నారే తప్ప వారికున్న హక్కుకు రక్షణకల్పించలేదు.సుప్రీంతీర్పు ప్రకారం 2.5 ఎకరాలున్న దేవదాయ భూముల కౌలుదారులను తొలగించరాదు.వారుకొనుగోలు చేయదలిచినచో ఆరు సమాన వాయిదాలలో వారికే ఇవ్వాలి.కౌలురేటుగానీ, భూమిధరగానీ మార్కెట్‌రేటులో మూడిరట రెండువంతులు మాత్రమే వుండాలి.ఇళ్ళ స్థలాలకు అనువైన దేవాలయ,వక్ఫ్‌ భూములను ప్రభుత్వం సేకరించి,ఇళ్ళ నిర్మాణం చేపట్టాలి.ఇప్పటికే వేసుకున్న ఇళ్ళున్నచో ప్రభుత్వం ఆశాఖలకు పరిహారం చెల్లించి పేదలకు పట్టాలివ్వాలి.దేవాలయ భూములను భూమిలేని దళితులకు కౌలుకివ్వాలి. సీలింగ్‌ భూములచట్టానికి సవరణ తెచ్చి పేదలకు ఇచ్చిన భూములను ఎస్‌ఇజెడ్‌ లకు తీసుకున్నారు. లైసెన్స్‌ రైతులు(కౌలు) సాగుచేస్తున్న భూములను రెవిన్యూ అధికారులు స్వయంగా సర్వేచేసి వారిపేర్లు రికార్డుల్లో నమోదుచేయాలి.గ్రామ,రెవిన్యూ అధికార్లు ప్రతి సంవత్సరం వాస్తవ సాగుదారుల పేర్లు నమోదు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.ఆ భాద్యతను గ్రామ రెవిన్యూ అధికార్లపై పెట్టాలి.కౌలుదార్లందరికీ రుణగుర్తింపు కార్డులివ్వాలి. ఎస్‌ఇజెడ్‌ ల పేర్లతో సేకరించిన భూములు సంవత్సరాలు గడిచినా కేటాయింపుపొందిన వారు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టలేదు.ఆ విధంగా కేటాయించి నిరుపయోగంగా పడివున్న భూములను ప్రభుత్వం తిరిగి తీసుకొని పేదలకుపంచాలి.ప్రభుత్వం ఎస్‌ఇజెడ్‌లకు భూములు కేటాయిస్తూ 26 జీఓలన ఇచ్చింది.వాటిని రద్దు చేస్తూ తిరిగి పేదలకు లేదా అర్హత కల్గిన లబ్ధిదారులకు అప్పగించాలి.పోలవరం తదితర ప్రాజెక్టులకొరకు ప్రభుత్వం తీసుకున్న భూములను ధనికులు సాగుచేసుకుంటున్నారు.వారిని తొలగించి అక్కడున్న గిరిజన,దళితులకు సాగుకివ్వాలి.
    భూదాన భూముల సమస్య ఇంతవరకూ పరిష్కరించబడలేదు.ఇప్పటికీ పదివేల ఎకరాల భూమి పంపిణీ చేయాల్సివున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి.ఈ పథకం క్రింద 2 లక్షల ఎకరాల భూమిని సేకరించారు.చాలాభూములు భూస్వాముల స్వాధీనంలో వున్నాయి.సర్వేచేసి ఈ భూములను అర్హత కల్గిన వారికి ఇళ్ళ స్థలాలలకు సాగుకు పట్టాలివ్వాలి. డేల్టా ప్రాంతాల్లో కాల్వగట్లు, ఏటిగట్లు, ఆర్‌Êబి, పంచాయితీ రోడ్లు, దళితుల శ్మశానాలు, మరియు ఇతర ప్రభుత్వ స్థలాల్లో ఉన్న కొబ్బరిచెట్లను దళిత కుటుంబానికి 10 చెట్లచొప్పున కేటాయించాలి. ధనవంతులకిచ్చిన 30`99సంవత్సరాల లీజును రద్దు చేయాలి. కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సుల్లో ప్రభుత్వం తిరస్కరించిన 12సిఫార్సుల్లో గిరిజనులకు ప్రత్యక్షంగా ఉపయోగపడే వాటిని ఆమోదించాలి. భూముల వివాదాల తక్షణ పరిష్కారానికి హైకోర్టులో ప్రత్యేక బెంచ్‌ ఏర్పాటుచేయాలి.
రానున్న రెవెన్యూ సదస్సుల్లో రైతులు పాల్గొని తమ సమస్యలను పరిష్కరించుకొనుటకు గల అవకాశాలను వినియోగించుకోవాలి. ప్రభుత్వం మరియు అధికారులు కూడా ఆ గ్రామ భూ సమస్యలను వాయిదా వేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా త్వరతగతిన పరిష్కారం చేసే విధంగా కార్యక్రమాలను అమలుచేసినప్పుడు రెవెన్యూ సదస్సులు జయప్రదం అవుతాయి. లేనితీరుకు రాష్ట్ర ప్రభుత్వాల నిధులు అనవసరంగా వ్యయం అవుతాయి.  ఎన్నికల కొరకు నిర్వహించిన కార్యక్రమంగా ప్రజలు భావించాల్సి వస్తుంది.
 12.03.2013
సారంపల్లి  మల్లారెడ్డి

No comments:

Post a Comment