Wednesday, 13 August 2014

బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పును పున: సమీక్షించాలి

 కృష్ణా జలాల రెండవ ట్రిబ్యునల్‌ నవంబర్‌ 29న తుది తీర్పును. ప్రకటించింది. మధ్యంతరతీర్పు కేటాయింపులకు అదనంగా ఆంధ్రప్రదేశ్‌కు నాలుగు టిఎంసీలు, రాజోలిబండ మళ్లింపు పథకం కుడి కాలువకు కేటాయిస్తూ తీర్పులో చేర్చింది. ఈ ఒక్క మార్పు తప్ప, గతంలో మధ్యంతరంలో ఇచ్చిన తీర్పును ఉన్నదున్నట్లు పునరుద్ఘాటించింది. మధ్యంత తీర్పుపై ఆంధ్రప్రదేశ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించి తీర్పును పున:పరిశీలించాల్సిందిగా కోరింది. సుప్రీంకోర్టు తిరిగి ట్రిబ్యునల్‌ను పున:సమీక్ష జరపాల్సిందిగా ఆదేశించింది. పున: సమీక్షను సుప్రీంకోర్టు అంగీకరించేవరకు కేంద్ర ప్రభుత్వం గెజెట్‌లో ప్రకటించకూడదని ‘‘స్టే’’ విధించింది. ఈ తుది తీర్పును సుప్రీంకోర్టు పరిశీలించి నిర్ణయం ప్రకటించాలి. ట్రిబ్యునల్‌ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వు కోర్టు స్టే మూలంగా అమలులోకి రాలేదు. తుది తీర్పును గజెట్‌లో ప్రచురిస్తే 2050 సంవత్సరం వరకు రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని సవరించుకోవడం కూడా సాధ్యంకాదు.
గత మధ్యంతర తీర్పునే తుది తీర్పుగా ప్రకటించడం వలన ఆంధ్రప్రదేశ్‌కు అదనంగా కలిగిన ప్రయోజనమేమీ లేదు. ట్రిబ్యునల్‌ కర్నాటకకు ఆల్మట్టి ఎత్తును 519.6 మీటర్ల నుండి 524.25 మీటర్లుకు పెంచుకోవడానికి అవకాశం కల్పించింది. ఆల్మట్టి ఎత్తు పెంపుద్వారా 303 టిఎంసీల నిల్వశక్తి పెరుగుతుంది. గతం కన్నా 130 టిఎంసీలు ఎక్కువ. జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు నీటిరాక తగ్గుతుంది. నాగార్జునసాగర్‌ ఆయకట్టు, కృష్ణాడెల్టాకు నీటి కొరత ఏర్పడుతుంది. హైదరాబాదుకు త్రాగునీటి సమస్య వస్తుంది. రాష్ట్రంలో కరువు, వెనకబడిన ప్రాంతాల్లో చేపట్టిన ప్రాజెక్టులకు కేటాయింపుల గురించి కమిషన్‌ ప్రస్తావన కూడా  చేయలేదు. కృష్ణా బేసిన్‌లో గల మహబూబ్‌నగర్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని కరువు ప్రాంతాలను కమిషన్‌ దృష్టికి తేవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. 30వేల కోట్లు వెచ్చించి కృష్ణా జలాల ఆధారంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుల గురించి కమిషన్‌ దృష్టికి తెచ్చినప్పుడు ‘‘మిగులు జలాల ఆధారంగా ప్రాజెక్టులు నిర్మించడం లేదని’’ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అఫిడవిట్‌ వేసింది. తిరిగి అఖిలపక్షం ఆందోళనల ఫలితంగా అఫిడవిట్‌ను తిరిగి ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. ఆ విధంగా మిగులు జలాల ఆధారంగా నిర్మించిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు రాలేదు. మిగులు జలాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్‌కు గల హక్కును ఈ ట్రిబ్యునల్‌ రద్దు పరచింది. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన వ్యయం వృధా అవుతున్నది. ఇంతే కాక మిగులు జలాల ఆధారితంగా ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించబడిన హంద్రీనివా (40 టిఎంసీలు), వెలిగొండ (43.50 టిఎంసీలు), కల్వకుర్తి (25 టిఎంసీలు), గాలేరునగరి (38 టిఎంసీలు), ఎస్‌ఎల్‌బిసి (26.22 టిఎంసీలు), నెట్టెంపాడు (22 టిఎంసీలు) ప్రాజెక్టులకు నీటి లభ్యత ఉండదు. ట్రిబ్యునల్‌ తీసుకున్న ఇటువంటి నిర్ణయాల మూలంగా ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం జరిగింది. నల్గొండ, మహబూబ్‌నగర్‌, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, రంగారెడ్డి జిల్లాలలోని కరువు ప్రాంతాలకు శాశ్వతంగా నీటి వనరులకు దూరమవుతారు. ఇప్పటికే కరువుకు గురై ఈ జిల్లాల నుండి ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వలసలు వెళ్తున్నారు. వలసలు వెళ్లినవారు అక్కడే ప్రాణాలు కోల్పోతున్నారు. కృష్ణానది 577 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్‌లో ప్రవహిస్తున్నా ఆ నీటిని వినియోగించుకునే అవకాశం ట్రిబ్యునల్‌ కల్పించలేదు. 
గత ట్రిబ్యునల్‌ 75శాతం ప్రతిపాదికగా నికర జలాలను గుర్తించగా, ప్రస్తుత ట్రిబ్యునల్‌ 65శాతం ప్రాతిపదికను తీసుకున్నది. దీనివలన నికర జలాలు పెరిగి, మిగులు జలాలు తగ్గాయి. మిగులు జలాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్‌కు గల హక్కును ఈ ట్రిబ్యునల్‌ రద్దు పరచింది.  రాష్ట్రానికి కేటాయించిన 145 టిఎంసీల మిగులు జలాలు నిలువపెట్టడం వల్ల ఖరీఫ్‌ పంటలకు కూడా కొరత ఏర్పడుతుంది. మిగులు జలాలను సాగర్‌, శ్రీశైలం రిజర్వాయర్లలో ‘క్యారీ ఓవర్‌’ ఉంచాలని నిబంధన పెట్టింది. ఈ నిబంధన వల్ల శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో నికర జలాలను నిల్వపెట్టుకునే హక్కును కోల్పోతాం. డెడ్‌ స్టోరేజ్‌పోగా నాగార్జున సాగర్‌లో 142 టిఎంసీలు, శ్రీశైలంలో 145 టిఎంసీలు మొత్తం 287 టిఎంసీలు మాత్రమే సాగుకు వినియోగపడతాయి. కేటాయింపుల ప్రకారం నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు 280 టిఎంసీలు, కృష్ణా డెల్టాకు 160 టిఎంసీలతో పాటు, శ్రీశైలం కుడి కాలువకు 19 టిఎంసీల నికర జలాలు కావాలి. కానీ క్యారీ ఓవర్‌ పెట్టడం వల్ల నికర జలాలు నిల్వ పెట్టడం తగ్గిపోతుంది. పైగా జనవరి వరకు మొదటి పంట ఉంటుంది. జనవరి తర్వాత ప్రాజెక్టులలోకి నీరు రాదు. ట్రిబ్యునల్‌ క్యారీ ఓవర్‌ నిబంధన విధించడం పూర్తిగా అనుసరణీయం కాదు.
తుంగభద్ర నుండి అనంతపురం జిల్లాకు ప్రస్తుతం గల ఎగువకాలువ పూడిక వలన కేటాయించిన 32.5 టిఎంసీలు రావడం లేదు. అందుకు తుంగభద్ర ప్రాజెక్టు నుండి వరద ప్రవాహ ఎగువ సమాంతర కాలువ త్రవ్వకానికి కూడా ట్రిబ్యునల్‌ అంగీకరించలేదు. ఎగువతుంగ ముందు కర్నాటక అక్రమ నిర్మాణాల తొలగింపు ఈ తీర్పులో లేదు. 
ట్రిబ్యునల్‌ కర్ణాటక అప్పర్‌ భద్రకు 10 టిఎంసీలు, అప్పర్‌ తుంగకు 12 టిఎంసీలు, సింగటలూరుకు 18 టిఎంసీలు (మొత్తం 40 టిఎంసీలు) కెేటాయించారు. అప్పర్‌తుంగ ఎగువన 1 టిఎంసీ లోపు నిల్వ శక్తిగల 11 డ్యాముల అక్రమ నిర్మాణాలను చేపట్టింది. వీటి గురించి కమిషన్‌ పట్టించుకోలేదు. ఒక టిఎంసీలోపు ప్రాజెక్టుల నిర్మాణానికి అనుమతులు అవసరం లేదన్న సాకు చూపి ఈ ప్రాజెక్టుల నిర్మాణం కర్నాటక చేపట్టింది. ఆ ప్రాజెక్టుల వలన ఎగువతుంగ నుండి శ్రీశైలం కు రావాల్సిన 230 టిఎంసీల నీటి వాటా తగ్గింది.
మహారాష్ట్ర  కోయినా హైడల్‌ ప్రాజెక్ట్‌కు గత ట్రిబ్యునల్‌ 67.5 టిఎంసీలు కెేటాయించగా, ప్రస్తుత ట్రిబ్యునల్‌ మరో 25 టిఎంసీల నికర జలాలు  కేటాయించారు. ఈ నీరు ఆరేబియా సముద్రానికి వెళ్ళుతుంది. కానీ మహారాష్ట్ర అక్రమంగా మరొక 30 టిఎంసీలు కలిపి మొత్తం 120 టిఎంసీలు వినియోగిస్తున్నది. ఆల్మట్టి ఎత్తు పెంపు, కోయినా హైడల్‌ ప్రాజెక్టు అక్రమ నీటి వినియోగం వలన జూరాల, శ్రీశైలంకు నీటి వాటా తగ్గింది. తుంగ, కోయినా, ఆల్మట్టి ప్రాజెక్టుల నీటి వినియోగం పెంచడం వలన ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన వాటా తగ్గుతున్నది. గత సంవత్సరం ఆల్మట్టి నిండగానే వర్షాలు తగ్గడంతో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలోకి చుక్క నీరు రాలేదు. ఆవిధంగా ఆ రెండు ప్రాజెక్టుల వెనుక పంటలు వేయలేదు. నాగార్జునసాగర్‌ దిగువన ఖమ్మం, వరంగల్‌, నల్గొండ జిల్లాల్లో పడిన వర్షాలతో కృష్ణాడెల్టా ఆయకట్టు పంటలు పండాయి. సాగర్‌ ఆయకట్టు 22 లక్షల ఎకరాలు, శ్రీశైలం ఆధారిత ప్రాజెక్టులైన తెలుగుగంగ, శ్రీశైలం కుడికాలువ, ఎడమ కాలువ, కేసీకెనాల్‌ ఆయకట్టులు బీళ్ళుగా మారాయి. చివరకు హైదరాబాదు పట్టణానికి మంచినీటి కొతర ఏర్పడిరది.
రాష్ట్ర విభజనలో భాగంగా బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ను మరో రెండు సంవత్సరాల పాటు పొడిగించి, తెలంగాణా`సీమాంధ్రల మధ్య నీటి సమస్యను పరిష్కరించడానికి కేంద్ర క్యాబినెట్‌ బిల్లులో పొందుపరచింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ బ్రిజేష్‌కుమార్‌ తీర్పును పున:సమీక్షించాలని కోరుతున్నది. సుప్రీంకోర్టు స్టే కారణంగా కేంద్రం ప్రస్తుతం గెజెట్‌ల్‌ ప్రకటించడం సాధ్యం కాదు. ఆ స్టేను ఎత్తివేయకుండానే బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌  రెండు సంవత్సరాల పొడగింపులో భాగంగా తెలంగాణా`సీమాంధ్రల మధ్య నీటి సమస్యల పరిష్కారమే కాక, మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య ఇచ్చిన తీర్పును కూడా పున:సమీక్షించాలి. మిగులు జలాలపై ఆంధ్రప్రదేశ్‌కే హక్కు ఉండాలి. దిగువ రాష్ట్రం కరువులు, వరదల నష్టాలకు గురవుతున్నది. ఖరీఫ్‌ మొదటి పంట నమ్మకం లేనిదిగా ఉంది. కనీసం రెండోపంటకైనా గ్యారెంటీ ఉండే విధంగా పరిష్కారం ఉండాలి. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయాలి.
కేంద్ర ప్రభుత్వం చొరవతో సంబంధిత రాష్ట్రాలతో సమావేశం నిర్వహించి రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని సరిదిద్దే విధంగా ఒప్పందాలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై వత్తిడి తెచ్చేందుకు  చొరవ తీసుకోవాలి.

1 comment: