Tuesday, 12 August 2014

ప్రభుత్వ కమిషన్‌లు` రైతులను రక్షిస్తాయా?

మోహన కందా కమీషన్‌ పంట సెలవు ప్రాంతాలైన కోనసీమ పర్యటించి నివేదిక ఇవ్వగానే కోనసీమ రైతుల సమస్యను పరిష్కరిస్తాను ` కిరణ్‌కుమార్‌రెడ్డి, ముఖ్యమంత్రి ( 16.08.2011)
కోనసీమ రైతులు 80 వేల ఎకరాలలో ‘‘పంట వరామం’’ ప్రకటించారు. దీనితో ఆందోళన చెందిన రాష్ట్రప్రభుత్వం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాయకత్వాన ఎం.వి.రావు( ఎన్‌జిరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ మాజీ వైస్‌ ఛాన్సలర్‌), రాష్ట్ర వ్యవసాయ కమీషనర్‌ ఉషారాణి సభ్యులుగా కమీషన్‌ వేసింది.ఈ కమీషన్‌ ఆగస్టు 20న పంట విరామ ప్రాంతాలను పర్యటించింది. రైతులతో సమావేశం జరిపింది. ఈ కమీషన్‌కు ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘంతో సహా అనేక సంఘాలు మెమోరాండాలు ఇచ్చాయి. 26 ఆగస్టున అఖిలపక్ష పార్లమెంటరీ కమిటీ ఆ ప్రాంతాలలో పర్యటన జరిపింది. ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆ ప్రాంతాలను పర్యటించింది. పరిశీలన కొరకు వేసిన మోహన్‌కందా కమిటీ నివేదిక కొరకు మరియు తమ సమస్యల పరిష్కారానికి రైతులు, ప్రజలు ఎదురు చూస్తున్నారు. కోన సీమ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైనప్పటికీ పంట వరామం ఖమ్మం, కడప జిల్లాలకు విస్తరిస్తున్నది. నల్లగొండ జిల్లాలో బత్తాయి తోటల రైతులు పంట విరామం ప్రకటించలేక పోతున్నామని వాపోతున్నారు. వాస్తవ సాగు రైతుల, కౌలు రైతులు వ్యవసాయానికి దూరమవుతున్నారు.
రాష్ట్రంలో వ్యవసాయరంగంలో వస్తున్న మాంద్యం, రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభ నివారణకు రాష్ట్రప్రభుత్వం అనేక కమిషన్‌లు వేసింది. ఆ కమిషన్లు ఇచ్చిన నివేదికలను  రాష్ట్రప్రభుత్వం ఆమోదిస్తున్నట్లు ప్రకటించడం ఆనవాయితీగా ఉంది. కానీ అమలు మాత్రం పూజ్యం.
1. రాష్ట్రప్రభుత్వం జివోఎంఎస్‌నం. 977 తేది 01.12.2004 మరియు జివోఎంఎస్‌నం.109 తేది 23.12.2004 ద్వారా క్యాబినెట్‌ మంత్రి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు కోనేరు రంగారావు అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ 2006లో నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది. ప్రభుత్వ భూముల యాజమాన్యం, హక్కుల రికార్డు, కౌలు, భూ సంస్కరణలు, నివేశసన స్థలాలు, భూమి రికార్డులు, దేవాలయ భూములు, తెలంగాణ ప్రాంతంలో పరిష్కారం కాని ఇనాంభూములు, ఆదివాసి సమస్యలు, భూవ్యాజ్యాలు, రెవెన్యూ యంత్రాంగం పనివిధానం మరియు పేదలకు భూమిని పంపిణీకి గల అవకాశాలపై సవివరమైన నివేదిక ప్రభుత్వానికి ఇచ్చింది. రాష్ట్రంలో మిగులు భూములు,  ప్రభుత్వ భూములు పంచవలసినవి లక్షల ఎకరాలలో ఉన్నట్లు తేల్చింది. కౌలుదారుల రక్షణకు రుణ గుర్తింపు కార్డులివ్వాలని సూచించింది. భూస్వాములచే ఆక్రమణకు గురైన అసైండ్‌ భూములను, ప్రభుత్వ భూములను, అటవీభూములను వెంటనే ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి తిరిగి పేదలకు పంచడానికి చర్యలు చేపట్టాలని కోరింది. కానీ ఇంత వరకు ఏ ఒక్క చర్యను ప్రభుత్వం చిత్తశుద్దితో అమలు జరపలేదు. చివరకు దళిత, గిరిజన భూములు దురాక్రమణకు గురైనా( ముఖ్యమంత్రి మొదలు, మంత్రి వర్గసభ్యుల ఆధీనంలో అక్రమంగా ఉన్నప్పటికీ) వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. పైగా వారికి రక్షణ కల్పించడానికి 1973 భూ సంస్కరణల చట్టంలోని సెక్షన్‌ 14 ` సబ్‌ సెక్షన్‌ 6 లోని క్లాజ్‌ 3కు మరియు అసైన్డ్‌ భూముల చట్టానికి 9/77 సవరణలు తెచ్చింది. ఈ సవరణలతో దురాక్రమణదారులకు రక్షణ కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం ఐదు విడుతలుగా 7.15 లక్షల ఎకరాలు గత ఐదు సంవత్సరాలలో పేదలకు పట్టాలిచ్చినట్లు ప్రకటించింది. ఆ భూముల బాగుచేతకు 19.11.2004న గుంటూరు జిల్లా సత్తెనపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి ఇందిరప్రభ పథకం రు. 499 కోట్లతో కేటాయించారు. మూడు సంవత్సరాల్లో ఈ పథకం పూర్తి కావాలి. దాదాపు రు.300 కోట్లు వ్యవయమైనా ఇంతవరకు లక్షలాధి ఎకరాలు బీడు భూములుగానే ఉన్నాయి. పట్టాలిచ్చిన వారికి నేటికీ భూములు చూపలేదు. పార్లమెంట్‌ ఆమోదించిన అటవీహక్కుల చట్టం ప్రకారం గిరిజనులకు రాష్ట్రంలో 25 లక్షల ఎకరాలు పంపిణీ చేయాల్సి ఉండగా (కుటుంబానికి 10 ఎకరాలు)  నాలుగు లక్షల ఎకరాలు పంపిణీ చేసినట్లు రికార్డులు తెలుపుతున్నాయి. రాష్ట్రంలో 24 లక్షల మంది కౌలుదారులున్నట్లు కోనేటి రంగారావు కమిటీ అంచనా వేసింది.  ఈ కమిటీ ప్రభుత్వానికి 12 అధ్యాయాలతో, 104 సిఫార్సులతో 17.11.2006న నివేదిక సమర్పించింది. నివేదిక అమలుకావడానికి మంత్రివర్గ ఉపసంఘ సమావేశం అనేక సార్లు జరిగింది. వాస్తవ సాగుదారుకు భూమిపై హక్కులు మాత్రం నేటికీ లభించలేదు.
2004 మే 15న కాంగ్రెస్‌ అధికారానికి రాగానే ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి 11.12.2004న ప్రొఫెసర్‌ జయతీఘోష్‌ కమిషన్‌ను వేశారు. ఈ కమిషన్‌ నాలుగు మాసాల్లో తన నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది. ఈ నివేదికలోని అంశాలను మంత్రివర్గ ఉపసంఘం 2005 అక్టోబర్‌ 8న ఆమోదిస్తూ చర్యల నివేదికను ప్రకటించింది. వారు ఆమోదించిన కౌలుదారులకు రక్షణ, అర్హులందరికీ రుణ సౌకర్యం కల్పించలేదు. ప్రతి మూడు గ్రామాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించాలని చేసిన సూచన ఈరోజుకూ పాటించబడలేదు. తిరిగి రైతుల ఆత్మహత్యల పరిశీలనకు జస్టిస్‌ రామచంద్రారెడ్డి కమిషన్‌ను వేసింది. ఆ కమిషన్‌ తన నివేదికను 8.12.2005న ప్రభుత్వాకి ఇచ్చింది. దీనిపై చర్యలు తీసుకున్నామంటూ ప్రజలను బుకాయిస్తున్నారు. ప్రభుత్వం వేసిన శాసనసభ కమిటీ నిజాం చెక్కర ఫ్యాక్టరీల భవితవ్యంపై 31.8.2006న నివేదికను ఇస్తూ, చెక్కర ఫ్యాక్టరీలను ప్రభుత్వరంగంలో గానీ, సహకార రంగంలో గాని కొనసాగిస్తూ రైతులకు చెఱకుకు గిట్టుబాటు ధర కల్పించాలని అనేక సూచనలు చేసింది. అన్ని నివేదికలలాగా ఈ నివేదికను మూలన పెట్టారు.
కేంద్ర ప్రభుత్వం నియమించిన డాక్టర్‌ ఎం.స్వామినాధన్‌ కమిషన్‌ను రెండు సంవత్సరాల పాటు (19.11.2004న నియామకం) అనేక రాష్ట్రాలు పర్యటించి 2006 అక్టోబర్‌ 4న ఐదు నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ నివేదికల ప్రకారం రాష్ట్రంలో ‘‘భూవినియోగ సలహా సేవా కేంద్రం’’ను ఏర్పాటు చేసి భూమి`నీరు వినియోగంపై రైతులకు సలహాలు ఇవ్వాలని, చిన్న రైతులకు ఆదాయం గ్యారెంటీ ఉండేలా కనీస మద్దతు ధరల విధానం ఉండాలని, పంట పెట్టబడికి అదనంగా 50% కలిపి ధర నిర్ణయించాలని, మొత్తం పంటను ఎఫ్‌సిఐ, ఆయిల్‌ఫెడ్‌, సిసిఐ, నాఫెడ్‌ మరియు రాష్ట్ర సివిల్‌ సప్లయ్‌, మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేసి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు తక్కువ ధరలకు నిత్యావసర సరుకులను అందించాలని సూచించింది. ప్రధాని చైర్మన్‌గా ‘‘ఆహార భద్రత, సార్వభౌమాధికార బోర్డు’’ను ఏర్పాటు చేయాలి. పంటల భీమా పథకాన్ని విస్తృత పరచాలి. ఆరోగ్య రక్షణకు ‘‘పరివార్‌ భీమా పథకం’’ అమలు చేయాలి. విత్తన కంపెనీలచే జన్యుమార్పిడి పంటలకు భీమా పథకం అమలు చేయాలి. రైతులను కాపాడడానికి భారత వాణిజ్య సంస్థ ‘‘జీవన రక్షణ’’ బ్యాంకును ఏర్పాటు చేసి ప్రపంచీకరణ విధానాల నుండి రక్షించాలి. పై కీలక సూచనలను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నామంటూ పదే పదే ప్రకటిస్తున్నాయి. అయినప్పటికీ ప్రతి రైతు ప్రభుత్వాలతో డాక్టర్‌ స్వామినాధన్‌ను సూచనలను అమలు చేయాలంటూ నేటికీ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు అమలు చేసినప్పుడు ఆందోళనలు ఎందుకు చేస్తున్నట్లు? చివరకు కేంద్ర వ్యవసాయ శాఖా మాత్యులు ‘‘జాతీయ రైతుల విధానం ` 2007’’ను ప్రకటించారు. ఆ నివేదిక కాగితాలకే పరిమితమైంది.
ప్రభుత్వ కమిషన్ల నివేదికలను ప్రభుత్వాలు బుట్టదాఖలు చేస్తుండగా కనీసం వాస్తవ సమాచారం సేకరించడానికి 13 వామపక్ష రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు జస్టిస్‌ పి.ఏ. చౌదరి నాయకత్వాన కమిషన్‌ వేసాయి. ఈ కమిషన్‌ 2002లో తన నివేదికను ఇచ్చింది. ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి, శాసనసభ్యులకు, పార్లమెంట్‌ సభ్యులకు ఈ సంఘాలు అందజేసాయి. ఆత్మహత్యల నివారణకు, అధిక ఉత్పత్తికి, కనీస మద్దతు ధరల అమలుకు అనేక సూచనలు చేసింది. ఈ సూచనలేవీ పాటించలేదు.
సహకార రంగంలో 1954 నుండి 2004 వరకు అనేక కమిషన్లు వేసారు. జాబితా విడిగా ఇవ్వబడిరది. చివరి కమిషన్‌ అయిన వైద్యనాధన్‌ కమిటీ సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి, ఆ సిఫార్సుల సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం, నాబార్డ్‌ మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిసి 29.08.2006న త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నారు. ఈ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం నష్టాల్లో ఉన్న సహకార సంఘాలను లాభాల్లో ఉన్న సంఘాల్లో కలపాలి. 30శాతం లోపు వసూలైన సంఘాలకు రుణాలు ఇవ్వకూడదు. 30`50 శాతం మధ్య వసూలు చేసినవారికి ఎంత అసలు మొత్తం వసూలు చేస్తే తిరిగి అంతే రుణం ఇవ్వాలి. 50శాతం పైబడి వసూలు చేసిన వారికి కొద్దిగా పెంచి రుణం ఇవ్వాలి. ఈ విధానం వలన ప్రతి మండలానికి ఒకటి లేదా రెండు సొసైటీలు మాత్రమే ఉంటాయి. ఈ నిబంధనలు అమలు జరిపినందుకు కేంద్ర ప్రభుత్వం 1500 కోట్లు గ్రాంటుగానూ, రాష్ట్ర ప్రభుత్వం 600 కోట్లు సర్దుబాటు చేసి గతంలో అవినీతి వలన, అధిక వ్యయం వలన దివాళా తీసిన సహకార సంఘాల నష్టాలను పూడ్చాలి.  వైద్యనాధన్‌ సిఫార్సుల అమలు వలన 4464 సహకార సొసైటీలను 2940 సొసైటీలకు కుదించారు. కోటి 38 లక్షల సభ్యత్వాన్ని 27 లక్షలకు కుదించారు. అయినా అర్హులకు నేటికీ రుణాలు అందడం లేదు. రైతు మిత్ర గ్రూపులు, జాయింట్‌ లయబులిటీ గ్రూపులు ఏర్పాటు చేసి రుణాలు ఇస్తామన్నారు. తెలుగుదేశం హయాంలో ఏర్పాటు చేసిన 2.03 లక్షల రైతుమిత్ర గ్రూపులను రద్దు చేసి కాంగ్రెస్‌ ప్రభుత్వం లక్ష జాయింట్‌ లయబులిటీ గ్రూపులను ఏర్పాటు చేసింది. ఇందులో 10 శాతం గ్రూపులకే అప్పులు ఇచ్చారు. తిరిగి రుణ కౌలుదారులకు గుర్తింపు కార్డులు ఇస్తామని ప్రకటించి 24 లక్షల కౌలుదారులు ఉండగా, 6.25 లక్షల మందిని గుర్తించారు. ఇందులో కొందరికి గుర్తింపు కార్డులు ఇచ్చినా రుణం మాత్రం ఇవ్వలేదు. దీర్ఘకాలిక రుణాలు (మైనర్‌ ఇరిగేషన్‌, పంప్‌సెట్ల కొనుగోలు, పశువుల పాకల నిర్మాణం, పశువుల కొనుగోలు, డస్టర్‌, పవర్‌స్పెయర్‌ కొనుగోళ్లకు) ఇవ్వడం గత 5 సంవత్సరాలుగా తగ్గించారు. నేడు పూర్తిగా ఇవ్వడం లేదు. మొత్తం 30 సార్లు సహకార చట్టం సవరణలకు గురైంది. ఏ మంత్రి కొత్తగా సహకార శాఖ చేపట్టినా అతను మొట్టమదలు చేసే పని చట్టానికి సవరణలు చేయడమే జరుగుతున్నది.
కేంద్రప్రభుత్వం, పార్లమెంటు ఉభయసభలు, రాష్ట్రప్రభుత్వం, రాష్ట్రలశాసనసభలు అనేక కమిషన్‌లు వేశాయి. ప్రకృతి వైపరిత్యాలపై నేటికీ భారతప్రభుత్వం 26 కమిషన్‌లు వేసింది. వారిచ్చిన నివేదికల ఆధారంగా తగు చట్టాలు చేశారు. కానీ వారందరూ చేసిన సూచనలలో ఇంతవరకు ఏ ఒక్కటీ పాటించలేదు. కరువులు, వరదలు ప్రకృతి వైపరిత్యంగా చూస్తాం. కానీ వీటివలన జరుగు నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంది. ఆ పని ప్రభుత్వాలు చేయాలి. కరువు ప్రాంతాలలోని చెరువులను నింపడం, భూగర్భ జల స్థాయిని పెంచడం, వీలైనంత ఎక్కువ సాగు భూమికి కనీసం మెట్ట పంటకు నీరివ్వడానికైనా చర్యలు తీసుకోవాలి. ప్రాజెక్టుల నుండి నీరు వృధాగా సముద్రం పాలవుతున్నది. శ్రీరాంసాగర్‌, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుల ద్వారా వర్షాకాలంలో అనేక చెరువులను నింపవచ్చు. అందుకు మంత్రులు కానీ, ఇరిగేషన్‌ శాఖ కానీ సుముఖంగా లేదు. వరదలవల్ల జరుగునష్టాన్ని తగ్గించడానికి మురుగు నీటి వ్యవస్థను(డ్రైనేజి) ఎప్పటికప్పుడు బాగు చేయాలి. దశాబ్దాలు గడిచినా పూడిక తీయకపోవడం వలన డ్రైనేజీ కాలువలు, వాగులు పూడిపోవడం, గుర్రపుడెక్క ఆకు విస్తరించడం వలన మురుగు నీరు సకాలంలో సముద్రంలోకి వెళ్లలేక లక్షలాధి ఎకరాల పంటలకు నష్టం వాటిల్లుతున్నది. పారిశ్రామిక పెద్దలు, డ్రైనేజి వ్యవస్థను ఆక్రమించడమో, కలుషితాలను అందులోకి వదలడమో చేయడం వలన ఆ వ్యవస్థ పూర్తిగా అదోగతిలోకి దిగజారుతున్నది. సాగునీటి ప్రాజెక్టు కింద ఏ సర్వే నంబరులో మెట్టపంట వేయాలో, వరి పంట వేయాలో నిర్ణయిస్తూ లోకలైజ్‌ చేస్తారు. కానీ లోకలైజేషన్‌కు విరుద్దంగా పంటలు వేయడం వలన కాలవ దిగువకు నీరు వెళ్లక పంటలు లక్షలాధి ఎకరాలలో ఎండిపోతున్నాయి. ఈ వ్యవస్థపై కమిషన్‌లు ఇచ్చిన సూచనలను ప్రభుత్వాలు పాటించడంలేదు. కమిషన్‌ల దారి కమిషన్‌లదే` ప్రభుత్వందారి ప్రభుత్వందే అన్నట్లు ప్రభుత్వాల విధానాలున్నాయి. ఎన్ని కమిషన్‌లు వేసినా చిత్తశుద్ధి లేని ప్రభుత్వాలు వాటిని పాటిస్తాయా? ప్రజాందోళనల ద్వారానే నివేదికలు అమలు జరిపించుకోవాలి.

 సారంపల్లి మల్లారెడ్డి
ఎ.ఐ.కె.ఎస్‌. ఉపాధ్యక్షలు

No comments:

Post a Comment