రాష్ట్రప్రభుత్వం వ్యవసాయ మరియు సహకార శాఖల తరపున 12.08.2011న డా॥మోహన్‌కందా చైర్మన్‌గానూ, డా॥ ఎం.వి.రావు ఎంఎల్‌సి వైస్‌చైర్మన్‌గానూ, సభ్యులుగా సి. మురళీధర్ ఇన్జనీర్-ఇన్- ఛీప్ డా॥ కె.ప్రతాప్‌రెడ్డి, డా॥ ఆర్ సుధాకర్‌రావు, మెంబర్ సెక్రటరీగా వ్యవసాయ కమీషనర్ ఇ. ఉషారాణి గార్లతో కమీషన్ వేసింది. వారికి ఐదు అంశాలను పరిశీలించాలని లక్ష్యంగా నిర్ణయించారు.
సారంపల్లి మల్లారెడ్డి
1. క్రాప్ హాలిడే ప్రకటనకు కారణాలు,
2. గతం పునరావృతం కాకుండా చర్యలు
3. పంటల విధానం మరియు మార్కెట్ పరిస్థితి.
4. గోదావరి డెల్టాలో నీటి వినియోగ సామర్థ్యం పెంపుదల
5. వరిపంట అభివృద్ధికి చర్యలు
పై సమస్యలను పరిశీలించిన కమీషన్ సూచనలలో కౌలు రైతుల సమస్యను పూర్తిగా గమనంలోకి తీసుకోలేదు. పంటల రుణ పరిమితి( స్కేల్ ఆఫ్ ఫైనాన్స్) మద్దతు ధరపై బోనస్సు, పాల ఉత్పత్తి, సేకరణ, సమస్యలను కమీషన్ గమనంలోకి తీసుకోలేదు. దీనికి తోడు 07.06.2011న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ‘‘ఎపి భూమి లైసెన్స్‌డ్ సాగుదారుల ఆర్గినెన్స్- 2011 (నెం.17 తేది.08.06.2011’’ప్రకారం కైలు రైతులకు ‘‘ రుణ గుర్తింపు కార్డులు ఇవ్వాలన్న దానిపై స్పష్టమైన సూచనలు చేయలేదు. కాగితాలకే పరిమితమవుతున్న కమిషన్ నివేదికల జాబితాలోకి ఈ నివేదిక కూడా చేరిపోయింది. కౌలు రేటు ఎకరా రెండు పంటలకు కలిపి 25 బస్తాలు కౌలు తీసుకుంటున్నారు. కౌలు రైతుకు రెండుపంటలపై 40 బస్తాలు మిగులుతాయి. రెండుపంటల పెట్బుడి రు. 32 వేలు కాగా 40 బస్తాలకు రు.28 వేలు మాత్రమే వస్తాయి. కౌలు రైతుకు రు. 4వేలు నష్టం వస్తున్నది. ఈ వాస్తవం కమిషన్ గుర్తించలేదా? పాల సేకరణ కేంద్రాలు లేకపోవడం వలన అతితక్కువ ధరకు పాలు అమ్ముకుని కౌలు రైతులు నష్టపోతున్నారు. ఇది కూడా కమీషన్ దృష్టికి రాలేదు. 90 శాతంగా కౌలుదారులున్న తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో కౌలుదారుల సమస్యను నిర్లక్ష్యం చేయడం అత్యంత దారుణం. సంఘటిత భూయజమానులున్న కోనసీమలో కౌలురైతుల దోపిడి యధేచ్ఛగా కొనసాగుతున్నది. సంస్కరణల ఫలితంగా విస్తరిస్తున్న కౌలు సమస్య కమీషన్ దృష్టికి కొన్ని సంస్థలు బలంగా దృష్గికి తెచ్చినప్పటికీ ఎందుకు నిర్లక్ష్యం చేయబడిరదో ఊహించవచ్చు. సాగు చేయని భూయజమానుల పక్షాన ప్రబుత్వం ఉన్నట్లు విదితమవుతున్నది. ఈ సమస్య ఒక తూర్పుగోదావరి జిల్లా కోనసీమకే పరిమితం చేయడం సరికాదు. గత చట్టాలేమి చెప్పాయి?
రాష్ట్రంలో 25 లక్షల మంది కౌలుదారులు ఉన్నట్టు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ అంచనా వేసింది. వీరు అంతా మూజువాణీ ఒప్పందం ద్వారానే కౌలు సాగు చేస్తున్నారు. కౌలు చట్టం ప్రకారం ప్రతి కౌలుదారు రెవిన్యూ రికార్డులో నమోదు కావాలి. కాని ప్రభుత్వం చట్టం అమలు చేయనిరాకరిస్తున్నది. కౌలు చట్టాలను అమలు చేయాలని అనేక సంవత్సరాలుగా రైతులు ఆందోళనలు చేస్తునే ఉన్నారు. 1956 ఆంధ్రప్రదేశ్ (ఆంధ్ర ఏరియా) కౌలుదారీ చట్టం వచ్చింది. 1956 సెప్టెంబరు 9 తేదీని రాష్ట్రపతి ఆమోదం పొంది సెప్టెంబరు 13న దీనిని గెజిట్‌లో ప్రకటించారు. తిరిగి 1974 నవంబరు 21 న అనేక మార్పులతో రాష్ట్రప్రతి అమోదం పొంది నవంబరు 27 ఆంధ్రప్రదేశ్ గెజిట్‌లో ప్రకటించారు. ఈ సవరణలు అన్ని 1-7-1980 నుండి అమలులోకి వచ్చాయి.
ఈ చట్టం ప్రకారం హైకోర్టు సలహాతో రాష్ట్రంలో స్పెషల్ ఆఫీసరును నియమించాలి. అట్టి స్పెషల్ ఆఫీసరు కౌలు సమస్యలు అన్నింటిని పరిష్కరించాలి. కౌలు రెేట్ల విషయంలో గాని, తొలగింపుల విషయంలోగాని, కౌలు మార్పిడి విషయంలో గాని తగాదాలు వచ్చినప్పుడు స్పెషల్ ఆఫీసరు పరిష్కార కర్తగా వుంటాడు.
చట్టం ప్రకారం కౌలు రేటు మాగాణీ అయినచో పండిన పంటలో 33శాతం, మెట్ట అయినచో 24శాతం ఉండాలి. వ్యవసాయ ఖర్చులు కౌలు రైతులు భరించాలి ప్రభుత్వ పన్నులు భూస్వామి భరించాలి. కౌలు రైతు ధాన్యం రూపంలోనే కాకుండా నగదు రూపంలో కూడ చెల్లించేందుకు కౌలు రైతు - భూస్వామి ఒప్పందం చేసుకోవచ్చును, అట్లు చేసుకొన్న ఒప్పందం మార్పు చేయరాదు. నాయ్యమైన కౌలు రేటు కొరకు స్పెషల్ ఆఫీసరు నిర్ణయించే శిస్తు చట్టానికి లోబడి ఉండాలి. ప్రకృతి వైపరీత్యాలు వచ్చి పంట నష్టం జరిగినచో స్పెషల్ ఆఫీసర్‌కు దరఖాస్తు చేసుకున్నచో పరిశీలించి నష్టం జరిగినచో తగ్గింపుకు ఆర్డరు వేయాలి. పంటకోయడానికి 15 రోజులముందుగా రైతు దరఖాస్తు చేసుకోవాలి. 1974 తర్వాత నుండి కౌలు కాలపరిమితి 6 సంవత్సరాలు ఉండాలి. కౌలు రాత పూర్వకంగా ఉండాలి. కౌలు రైతు తనకు రుణం కావలసి వచ్చినప్పుడు కౌలు భూమిలో తనకు గల హక్కులును తనఖా పెట్టి అప్పు తీసుకోనవచ్చును.కౌలు రైతు బాకీ తీర్చని పక్షంలో బ్యాంకులు కౌలు రైతుకు భూమి యందు ఉన్న హక్కును వేలం వేసి రాబట్టుకోవాలి. కౌలు రైతుకు ఉన్న హక్కులు అన్నీ అతనికి మాత్రం కాక అతని వారసులకు మాత్రమే సంక్రమించగలవు? కాని భూస్వాములు చట్టాన్ని ఉల్లంఘించి 75శాతం పంట లేదా పంట విలువను కౌలుగా తీసుకుంటున్నారు. పేదల భూములను భూస్వాములు కౌలుకు తీసుకుని అతి తక్కువ రేట్లు చెల్లిస్తున్నారు.
భూమిపై భూ యజమాని హక్కు మారినప్పటికీ అంతకుముందున్న కౌలురైతు మనుపటి వలనే తన షరతులతో కౌలుదారుగా కొనసాగాలి. మేనేజ్‌మెంట్ తొలగిపోయినప్పుడు ఆ వ్యవసాయపు సంవత్సరపు చివర కౌలు హక్కు అంతమగును.భూస్వామి కౌలుకిచ్చిన భూమితో తానే వ్యవసాయం చేసుకొనదలిచినప్పుడు ఆరేండ్ల గడువుతో నిమిత్తం కౌలు రైతు వద్ద నుండి స్వాధీనం చేసుకోవచ్చును. అయితే 1973 సంవత్సరపు సీలింగు చట్టం ప్రకారం వుండదగిన విస్తీర్ణంలో మూడిరట రెండు వంతులకు మించరాదు. కౌలు రైతు స్వాధీనంలో వున్న భూమి మొత్తంలో తన స్వంత సాగుకై తీసుకొంటున్న భూమి కౌలుదారి భూములో సగానికి మించరాదు.
భూమిని స్వాధీనం చేసుకోదలచినప్పుడు
కౌల్దారీ సవరణ చట్టం (1974) ఆరంభించబడిన తర్వాత ఆరు మాసాలలోపున భూస్వామి స్పెషల్ ఆఫీసరుకు దరఖాస్తు పెట్టుకోవాలి, కౌలు మొదటి దఫా అయినచో ఆరేండ్ల పరిమితి చివరగానీ, దఫదఫాలుగా కౌలు అయిన యెడల నాలుగు మాసాల ముందుగా భూస్వామి స్పెషల్ ఆఫీసర్‌కు, రైతుకు నోటీసులు పంపాలి.
భూస్వాములుగా ఉన్న 1, మైనర్లు, 2. శారీరకంగా, మానసికంగా రోగగ్రస్తులు, 3. మిలిటరీ సర్వీసులలో వున్నవారు, 4. వితంతువులు కౌలు రైతులనుండి భూమి స్వాధీనం చేసుకోదలచినచో ఈ దిగువ నిబంధనలు పాటించాలి. 1. మైనర్ తనకు మెజారిటీ వచ్చిన తర్వాత ఆరు మాసాలలోపు, 2. రోగి అయిన భూస్వామి జబ్బు కుదిరిన ఆరు మాసాలలోపు, 3. మిలిటరీ సర్వీసులలో వున్న భూస్వామి సర్వీసునుండి విడుదలైన ఆరు మాసాలలోపు, 4. వితంతువు భూస్వామి అయినచో ఆమె తిరిగి వివాహం చేసుకొనిన ఆరు మాసాలలలోపు స్పెషల్ ఆఫీసరుకు దరఖాస్తు చేసుకోవాలి
భూస్వామి స్వాధీనపరచుకొన్న భూమిని స్వాధీనమైన తేదీ నుండి సంవత్సరం లోపు స్వంతసాగు ప్రారంభించని పక్షంలో గానీ, ఆరు సంవత్సరాల లోపున యే ఒక్క సంవత్సరమైననూ స్వంతసాగు మానివేసిన పక్షంలో ఆ భూమిని పాత కౌలుదారుకు తిరిగి యివ్వాలి. దీనికి స్పెషల్ ఆఫీసరుకు దరఖాస్తు పెట్టుకోవాలి.
కౌలురేటును గడువుదాటిన నెలలోపున చెల్లించని పక్షంలో, గడువు నిర్ణయించుకోని పక్షంలో ఆ ప్రాంతంలో వున్న రివాజు ప్రకారం చెల్లించాల్సిన సమయం నెలరోజులు లోపున చెల్లించని పక్షంలో, పంట దినుసులలో భాగమైనచో పంట తయారైన తరుణంలో అట్టిభాగం చెల్లించకపోయిననూ, భూమికి నష్టం కల్గించే పని చేసినా - పంటకు అనువైన పని చేయక అశ్రద్ధ చేసిననూ, కౌలు భూమి సబ్ -లీజుకిచ్చిననూ, కౌలు పత్రంలో నిర్ణయించిన పంటలు కాక వేరే పంటలు వేసిననూ, కౌలు భూమిపై భూస్వామికి గల హక్కును గూర్చి పేచీ పెట్టినప్పుడు, స్పెషల్ ఆఫీసరు గానీ, జిల్లా జడ్జ్‌గానీ వేసిన ఆర్డరు పాటించకపోయినప్పుడు, గడుపు లోపల కౌలు రేటు చెల్లించకుండా గడుపు తర్వాత చెల్లించినచో కౌలు నుండి తొలగించవచ్చును.
అప్పగింత పెట్టదలచుకొన్నప్పుడు వ్యవసాయ సంవత్సరం ఆఖరయ్యేలోపున మూడు మాసాల ముందు భూస్వామికి, స్పెషల్ ఆఫీసర్‌కు నోటీసులు పంపాలి. స్పెషల్ ఆఫీసరు ఆమోదించిన తర్వాతనే ఆ భూస్వామికి అప్పగింత చేయబడును. కౌలు రైతులు జాయింటుగా గానీ, కుటుంబ సభ్యులుగానీ కలిసి చేసినప్పుడు ఆ రైతులలో ఒకరు నోటీసు పంపినచో దానికి విలువ లేదు. కౌలు భూమిని పూర్తిగా వదిలేయాలి తప్ప కొంత భాగాన్ని వదిలేయకూడదు. భూస్వామి అమ్మదలచిన భూమిని కౌలు రైతుకు ముందు కొనుగోలు అవకాశం యివ్వాలి. ధరపై పరస్పర అంగీకారం కుదిరి అగ్రిమెంట్ ఏర్పడినచో కౌలు రైతుకే అమ్మితీరవలెను. భూమి ధర విషయంలో అభిప్రాయభేదం వచ్చినప్పుడు స్పెషల్ ఆఫీసర్‌కు దరఖాస్తు పెట్టుకోవచ్చు. అతను విచారించి ధర నిర్ణయిస్తాడు. 1974 సవరణ చట్టం తర్వాత భూమి శిస్తుకు 5రెట్లు మించకుండా భూమి ధరను నిర్ణయించాలి. శిస్తు నిర్ణయించబడినచో విక్రయపు తేదీన గల శిస్తుకు 5 రెట్లు మించకూడదు. 10 సాలుసరి వాయిదాల్లో భూస్వామికి చెల్లించవలెను. మొదటి వాయిదా చెల్లించగానే క్రమం అమలులోకి వచ్చినట్లు భావించబడును. పూర్తి వాయిదాలు చెల్లించే వరకు క్రయధనం బాకీకి భూమియే హామీగా వుండును. కౌలు రైతు తన కొనుగోలును స్పష్టంగా చెప్పనప్పుడు లేదా నిర్ణయించిన క్రయధనం మొదటి వాయిదా చెల్లించని పక్షంలో భూస్వామి భూమిని యితరులకు అమ్ముకోవచ్చును. స్పెషల్ ఆఫీసరు తీర్పుపై జిల్లా జడ్జికి అప్పీలు చేసుకోవాలి. జిల్లా జడ్జిదే తుది నిర్ణయం ప్రభుత్వం రూల్స్ తయారు చేసి గెజిట్‌లో ప్రకటించాలి.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోనేరు రంగారావు భూ కమిటీ కౌలుదారుల ఎడల ఈ దిగువ సూచనలు ప్రభుత్వానికి చేసింది. ఈ సూచనలను అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పడమే కాని ఇంతవరకు అమలు చేయలేదు.
‘‘కౌలుదార్లు తమ సాగునుండి మంచి ఫలితాలను పొందటానికి గాను సంస్థాగత రుణాలు పొందడానికి రుణ అర్హత కార్డులను మంజూరు చేయాలి. అదే సమయంలో కౌలు నమోదైతే తన భూమిని కోల్పోవలసి వస్తుందనే భయాన్ని యజమానులు వదులుకోవాలి. భూయజమాని కుటుంబం కలిగి వున్న భూ విస్తీర్ణంతో సంబంధం లేకుండా, తెలంగాణా ప్రాంతంలో రక్షిత కౌలుదార్లుగా గుర్తింపు పొంది భూమిని స్వాధీనం కలిగి వున్న వారందరికి 38-ఇ సర్టిఫికేట్స్ మంజూరు చేయాలి.’’
రైతుమిత్ర గూపులు
గత తెలుగుదేశం ప్రభుత్వం 2.03 లక్షల గ్రూపులను ఏర్పాటు చేసింది.(15 మంది సన్నచిన్నకారు రైతులు) కాంగ్రెస్ ప్రభుత్వం మే 2004లో అధికారానికి వచ్చిన తర్వాత మరొక లక్ష గ్రూపులను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. రాష్ట్రంలో 24 లక్షల కౌలుదారులు ఉన్నారు. వారికి రుణాలు ఇస్తామని పదే, పదే ప్రకటించడం తప్ప చివరకు కొనేరు రంగారావు కమిషన్ రికమండేషన్ ప్రకారం రుణ గుర్తింపు కార్డులు కూడా ఇవ్వలేదు. జివో విడుదల చేసి అమలు చేయలేదు. రైతు మిత్ర గ్రూపులు జయప్రదం కాలేదని ‘‘జాయింట్ లయబిలిటీ’’ గ్రూపులను (ఐదుగురు చొప్పున) కౌలు రైతులతో గ్రూపులు ఏర్పాటు చేశారు. దీనిని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలన్న లక్ష్యం ఉన్నప్పటికి అమలు కావటం లేదు. ఏర్పాటు చేసిన గ్రూపులకు రుణ సౌకర్యం లేదు.
జయతీఘోష్ కమీషన్ నివేదిక
భూసంబంధ అంశాలు ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత సంక్లిష్టంగా వున్నాయి. రాష్ట్రంలోని వాస్తవ సాగుదారులు ఎదుర్కొంటున్న సమస్యలకు కారణమవుతున్నాయి. రిజస్టరు కాని సాగుదారులు, గిరిజన సాగుదారులు, సంస్థాగత పరపతిని పొందటంలోను, భూమి పట్టాలు కలిగిన రైతులకు లభించే ఇతర సౌకర్యాలను పొందటంలోనూ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
కౌలుదార్లు, మహిళా కౌలుదార్లతోపాటు వాస్తవ సాగుదార్లను రిజిస్టరు చేసి రికార్డు చేయటానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం. వారికి పాసుపుస్తకాలు సమకూర్చడం. వారికి సంస్థాగత పరపతి, ఇతర ఉత్పాదకాలను అందుబాటులో వుంచటానికి శ్రద్ధ వహించడం, అధికారులు మూడు నెలలకు ఒకసారి క్రమం ప్రకారంగా పరిశీలన జరపడం, అట్టి రిజస్ట్రేషనులో, కౌలుదారు కౌలును నిరూపించుకునే బాధ్యతను ఆమె/అతనిపై లేకుండా, భూమి యజమాని కాదని నిరూపించుకునే విధంగా దృష్టి సారించాలి. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల భూమి హక్కును పరిరక్షించాలి.
నూతన చట్టం
ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సు ఆరు మాసాలలోపు శాసన సభలో చట్టంగా రూపొందాలి. లేని తీరుకు ఆర్డినెన్సు రద్దవుతుంది. ఆర్డినెన్సు ప్రకారం వ్యవసాయశాఖ కౌలుదారులందరికీ రుణ గుర్తింపుకార్డులివ్వడానికి చర్యలు తీసుకోవాలి.ఈ కార్డు ఒక సంవత్సరం మాత్రమే అమలులో ఉంటుంది. ప్రతిసంవత్సరం ఏప్రిల్‌లో కౌలుదారు కొత్త కార్డు పొందుతూనే ఉండాలి. నేడు భూస్వామ్య వర్గాలు ఈ ఆర్డినెన్సును ఎలాగైనా తొలగించాలని అనేక కుయుక్తులు చేస్తున్నారు. కౌలుదారుకు రక్షణలు కల్పించినచో తమ చేతినుండి కౌలుదారు జారి పోతాడన్న భయంతో ఈ వర్గాలు చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి. కానీ బయటపడకుండా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ఏదో రూపంలో చట్టం అమలుకు తూట్లు పొడుస్తున్నారు. అందుకే బ్యాంకులు రుణాలివ్వడంలేదు. ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా జరుగు నష్టాలకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం మరియు భీమా పరిహారం భూ యజమానులే పొందుతున్నారు. బ్యాంకు నుండి పంటరుణాలు పొందిన భూ యజమానులు నాలుగు రెట్లు అదనపు వడ్డీకి కౌలురైతుకిచ్చి లాభాలు గడిస్తున్నారు. కౌలుదారుకు భూమిపై ఎలాంటి యాజమాన్యపు హక్కు ఉండదని తెలిసినప్పటికీ అమలుకు వ్యతిరేకించడంలోని మూలం ఇదే.
ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు
ప్రస్తుత రెవిన్యూ చట్టాల ప్రకారం యాజమాన్యపు హక్కును గుర్తించాలి. వాస్తవ సాగుదారు పేరు రెవిన్యూ రికార్డుల్లో నమోదు చేయాలి. కౌలుదారుడైనా, సాగుదారుడైనా సాగు హక్కు కల్పిస్తూ పాస్ పుస్తకాలు ఇవ్వాలి. ఈ పుస్తకాలలో ప్రతి ఏటా నూతన సమాచారాన్ని నమోదు చేయాలి. చట్టాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. భూ యాజమానులు ఇష్టం వచ్చినప్పుడు సాగుదారులను తొలగించే విధానానికి స్వస్తి చెప్పాలి. ప్రభుత్వ భూములపై విడుదలకు మాత్రమే హక్కు కల్పించి స్వాధీనపరచాలి.
కౌలుదారులకు చట్టబద్ధత కల్పించాలి. రెవిన్యూ రికార్డులో నమోదు చేయాలి. పాస్‌పుస్తకాలు ఇవ్వాలి. సాగుదారుకు కల్పించే అన్ని పథకాలను వీరికి ఇవ్వాలి. కౌలు రేట్లు తగ్గింపు చెయ్యాలి. భూమి కొనుగోలుకు కౌలుదారుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవాలయ భూములు, వక్ఫ్‌భూములు, దేవాదాయ, ధర్మదాయభూములు, పేద రైతులకు మాత్రమే ఇవ్వాలి. కౌలు రేటు పండిన పంటలో మూడోవంతుకు మించరాదు. సాగుభూమికి నీటితో పాటు, భూమి అభివృద్ధి, నీటితీరువా, భూ యాజమాని చెల్లించాలి. ప్రతి సందర్భంలో రెవిన్యూ రికార్డు నమోదు చేసి పాస్‌పుస్తకాలు ఇవ్వాలి.
చట్టాన్ని అమలు చేయడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని నియమించడమే కాక మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అఖిల పక్ష సమావేశాలు వేసి సమీక్షించాలి.
సారంపల్లి మల్లారెడ్డి
No comments:
Post a Comment