Monday, 11 August 2014

బర్థమాన్‌ (భరద్వాన్‌) జిల్లా పరిషత్‌ నిర్వహణ

జిల్లా పరిషత్‌లో 31 సమితులు వున్నాయి. వీటిక్రింద 277 గ్రామ పంచాయితీలు వున్నాయి. 26మంది శాసనసభ్యులు, నలుగురు పూర్తిస్థాయి పార్లమెంట్‌ సభ్యులు, ఇద్దరు పాక్షిక పార్లమెంట్‌ సభ్యులు వున్నారు. జిల్లా పరిషత్‌కు 67మంది జిల్లా పరిషత్‌ నియోజకవర్గ బాధ్యులను ఎన్నుకొన్నారు. వీరు జిల్లా పరిషత్‌లో ఓటింగ్‌ గల సభ్యులు. 31 సమితుల ఛైర్మన్‌లు ఎక్స్‌ అఫిషియోగా వుంటారు. వీరికి ఓటు హక్కు వుండదు.
ప్రణాళికా సంఘం : జిల్లా ప్రణాళికా సంఘం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌తోపాటు వైస్‌ ఛైర్మన్‌, జిల్లా కలెక్టర్‌, మున్సిపల్‌ ఛైర్మన్‌లు మాత్రమే సభ్యులుగా వుంటారు. వీరు ఐదు సంవత్సరాలకు కావాల్సిన ప్రణాళికను రూపొందిస్తారు. ఏటాప్రారంభంలో ఒక సంవత్సరం బడ్జెట్‌ను అప్రువల్‌ చేస్తారు. బడ్జెట్‌ కేటాయింపుల ప్రకారమే వ్యయం చేస్తారు.
స్థాయి సంఘాలు : 10 స్థాయి సంఘాలు వున్నాయి. పదవ స్థాయి సంఘం ఫైనాన్స్‌ మరియు వివిధ స్థాయి సంఘాల బడ్జెట్‌లను పరిశీలిస్తుంది. ఒక్కోస్థాయి సంఘానికి ఎన్నికలు జరుపుతారు. ఎన్నికైనవారు మాత్రమే స్థాయి సంఘంలో సభ్యులుగా వుండాలి. ఆంధ్రప్రదేశ్‌లో లాగా ఎన్నికయిన జిల్లా పరిషత్‌ సభ్యులందరూ కమిటీలకు ఎన్నిక కారు. ప్రతిపక్ష సభ్యులు ఒక్కరే వున్నచో అన్ని స్థాయి సంఘాలలో పాల్గొంటారు.
జిల్లా పరిషత్‌ పరిధిలో 14,000 స్వయం సహాయక గ్రూపులు వున్నాయి. వీటికి 50శాతం సబ్సిడీపై పనులు కల్పిస్తారు. జిల్లా పరిషత్‌ మొత్తం బడ్జెట్‌లో 70శాతం నిధులను సమితులకు మరియు గ్రామ పంచాయితీలకు కేటాయిస్తారు. 30శాతం మాత్రమే జిల్లా పరిషత్‌ నేరుగా వ్యయం చేస్తుంది.
ఇరిగేషన్‌ : దామోదర్‌వ్యాలీ కార్పొరేషన్‌ క్రింద 60శాతం భూమి సాగవుతున్నది. దీని బాధ్యత జిల్లా పరిషత్‌ చూస్తుంది. 20 లిఫ్టు పథకాలు పనిచేస్తున్నాయి.
బడ్జెట్‌ : 2008-09 సంవత్సరానికి జిల్లా పరిషత్‌ బడ్జెట్‌ రు. 264.44 కోట్లు వుంది. ప్రారంభ నిల్వ రు. 63,22,58,054లు వుంది. ప్రణాళిక కమిటీ ఆమోదించిన బడ్జెట్‌ను తగు సూచనలు చేసి జిల్లా పరిషత్‌ ఆమోదిస్తుంది.  ఆ బడ్జెట్‌ ఆమోదం ప్రకారమే వ్యయం జరగాలి. అక్కడి ఆర్థిక స్థితి పరిశీలనకు గెస్ట్‌హౌస్‌ నిర్వహణను పరిశీలిస్తే  సరిపోతుంది.
ఈ జిల్లా పరిషత్‌ క్రింద ఒక గెస్ట్‌హౌస్‌ వుంది. సహజంగా గెస్ట్‌హౌస్‌కు వ్యయాన్ని మాత్రమే ఆంధ్రప్రదేశ్‌లో చూస్తాం. కానీ, బర్థమాన్‌ గెస్ట్‌హౌస్‌కు 2006-07లో రు. 14,46,013ల ఆదాయం వచ్చింది. 2007-08కి మరియు 2008-09కి రు. 16,00,000లు ఆదాయాన్ని లక్ష్యంగా నిర్ణయించారు.  గెస్ట్‌హౌస్‌ను జిల్లా పరిషత్‌కు వచ్చిన అతిథులకే గాక ప్రయివేటు వ్యక్తులకు సమావేశాలకు, సెమినార్లకు యిస్తారు. దీని నిర్వహణకు ఏర్పడిన సహకార సంఘంలో 23 కుటుంబాలు వున్నాయి. ఈ కుటుంబాలు గెస్ట్‌ హౌస్‌ నిర్వహణతో తమ ఉపాధిని సంపాదించుకోవడమే గాక జిల్లా పరిషత్‌కు ఆదాయాన్ని కూడా చేకూర్చుతున్నారు. అత్యంత పరిశుభ్రంగా దీని నిర్వహణ వుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని గెస్ట్‌హౌస్‌లకు విద్యుత్‌, నీటిసరఫరా బిల్లులు చెల్లించనందుకు కనెక్షన్లు తీసివేసిన ఘటనలు అనేకం. మన గెస్ట్‌హౌస్‌లు అనేక అవకతవకల కార్యక్రమాలకు నిలయాలుగా వుంటాయి.  కొన్నిచోట్ల ఆ గెస్ట్‌హౌస్‌లలో కూర్చోవడానికే భరించలేనంత అపరిశుభ్రంగా వుంటాయి. పనులుచేసి బిల్లుల కొరకు తిరగడం, పనులు చేయకుండానే బిల్లులు రాబట్టడం లాంటి ఘటనలు అక్కడ లేవు. ప్రతిపక్షం కమిటీలో వుండడం వలన ఆ కమిటీకి తెలవకుండా వ్యయం చేయడానికి వీలు వుండదు. పని నాణ్యత కూడా పరిశీలిస్తారు. ముఖ్యంగా, విద్య, ఆరోగ్య రంగాలకు సంబంధించి ఆ రాష్ట్రానికి, మన రాష్ట్రానికి హస్తిమ శకాంతరం కనబడుతుంది.
బర్ధమాన్‌ జిల్లా పరిషత్‌ పరిధిలోని అన్ని ప్రభుత్వ ఆస్తులపై రక్షణ బాధ్యత జిల్లాపరిషత్‌ చూస్తుంది. రోడ్లు వేయాలన్నా గ్రామాభివృద్ధి కమిటీలు లేదా సమితిద్వారానే గ్రామాలలో పనులు చేపడతారు.
స్థానిక సంస్థల నిర్వహణ మెరుగుపర్చడం వలన 1977లో 47శాతంగా వున్న దారిద్య్రరేఖకు దిగువన వున్నవారు నేడు 22శాతానికి తగ్గారు. వ్యవసాయరంగంలో అభివృద్ధి అనూహ్యంగా పెరిగింది. నాడు 70లక్షల టన్నుల ఆహార ధాన్యాలు రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుండగా నేడు అది 170 లక్షల టన్నులకు చేరింది. ఒక రైస్‌ మిల్లులో పరిశీలించగా నేటికీ రు. 16లకే కిలో బియ్యం అమ్ముతున్నారు. మన రాష్ట్రంలో కిలో రు. 28-30లుగా వుంది. రాష్ట్రం నుండి అనేక సందర్భాలలో పశ్చిమబెంగాల్‌లోని స్థానిక స్వపరిపాలన పరిశీలనకు మంత్రి వర్గాలు వెళ్ళి వచ్చినప్పటికీ ఆ విధానాలను యిక్కడ అమలుజరపడానికి ఏ ప్రభుత్వమూ ముందుకు రాకపోవడం గమనించాలి. ప్రతి పనికి మంత్రుల చుట్టూ తిరగడం యిక్కడ ఆనవాయితీగా వుంది. ప్రతిపక్ష పాత్రను నిర్లక్ష్యం చేసి, అధికారాలను కేంద్రీకరించడం వలన అభివృద్ధికి ఆమడ దూరంలో వున్నాం.
పారిశ్రామికవంతంగా రాష్ట్రాన్నిఅభివృద్ధి పరిచి ప్రజలకు మరింత ఉపాధి కల్పించడానికి  పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రతిపక్షాలు అనేక ఆటంకాలు కల్పిస్తున్నాయి. అయినా ఓపికగా ఉపాధిని పెంచే చర్యలను కొనసాగించడం గమనించవచ్చు.గ్రామం, గ్రామ పంచాయితీ, పంచాయితీ సమితి మరియు జిల్లా పరిషత్‌లకు అధికార వికేంద్రీకరణ చేసి అభివృద్ధిలో పాలక, ప్రతిపక్ష సభ్యులకు స్థానం కల్పించడం సాధ్యమైంది.
---

No comments:

Post a Comment