Monday, 11 August 2014

వినియోగదారుల సలహా సంఘం, విజయవాడ సెమినార్‌ పత్రం

‘‘మిరప, పసుపు పంటలు - వ్యాపార సంబంధాలు’’
    మిరప, పసుపు పంటలను సుగంధ ద్రవ్యాలుగా పరిగణిస్తారు. రాష్ట్రంలో 53 రకాల సుగంధ ద్రవ్యాలను ఉత్పత్తి చేస్తున్నారు. మిరప మూడో స్థానం, పసుపు ఐదో స్థానాన్ని ఆక్రమించాయి. ఈ రెండు పంటలకు చాలా విషయాలలో సామ్యం వుంది. వీటి పంట కాలం ఎనిమిది మాసాలు కాగా, పెట్టుబడి ఎకరానికి దాదాపు సమానంగా రు. 40- 50వేల మధ్య వుంటుంది. రెండు పంటలకూ ఎక్కువ శ్రమను వినియోగించాల్సి వుంటుంది.
దేశంలో 60 లక్షల ఎకరాల్లో సుగంధ ద్రవ్యాల సాగు జరుగుతున్నది. 2003-04లో 30 లక్షల టన్నులు ఉత్పత్తికాగా, నేడది 44 లక్షల టన్నులకు పెరిగింది. ప్రధానంగా ఈ పంటలు దాదాపుగా ఎగుమతులు చేయాల్సివుంది. 2003-04లో ఈ ఎగుమతుల ద్వారా 336 మిలియన్‌ డాలర్లు, 2004-05లో 399 మిలియన్‌ డాలర్లు, 2005-06లో 239 మిలియన్‌ డాలర్ల ఎగుమతులు జరిగాయి. మొత్తం ఎగుమతులలో 4.5శాతంగా వుంది.
సుగంధ ద్రవ్యాల వ్యాపార లావాదేవీలు మరియు ఉత్పత్తిని సమీక్షించడానికి దేశీయంగా ‘‘ స్పైషస్‌ బోర్డు’’ను ఏర్పరిచారు. ఈ బోర్డు కేరళ కేంద్రంగా పనిచేస్తున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎగుమతులకు గల అవకాశాలను పరిశీలించడం గానీ, ఉత్పాదకతను పెంచడానికి గానీ యీ బోర్డు చేపట్టిన చర్యలేమీలేవు. ఫలితంగా, అంతర్జాతీయ మార్కెట్‌ ధరల ఎగుడుదిగుడులకు యీ సరుకులు ఎక్కువ లోనవుతున్నాయి.
ముఖ్యంగా మిరప, పసుపు పంటల ఉత్పత్తి నుండి మార్కెటింగ్‌ వరకు గల సమస్యలను రైతులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పై రెండు పంటలకు సంబంధించిన పరిశోధనలు కానీ, మార్కెంటింగ్‌ విధానాలను మెరుగుపర్చడంగానీ, అంతర్జాతీయ మార్కెట్‌లలో ఎగుమతులకు  గల అవకాశాలు చూడడానికి శ్రద్ధ చూపడంలేదు. రైతులను అంతర్జాతీయ మార్కెట్‌ దయాదాక్షిణ్యాలకు వదిలివేశారు.  ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తులు, దిగుబడులు యిలా వున్నాయి.


    పై పట్టికను పరిశీలించినప్పుడు గత దశాబ్ధకాలంగా విస్తీర్ణంలో ఎలాంటి పెరుగుదల లేదు. ఉత్పాదకతలో ఎగుడుదిగుడులు వున్నాయి. 2000-01లో 2.38 లక్షల హెక్టార్లు మిరప వేయగా, 5.26 లక్షల టన్నులు ఉత్పత్తి జరిగింది. 2005-06లో 1.23 లక్షల హెక్టార్లు వేయగా, 3.08 లక్షల టన్నులు మాత్రమే దిగుబడి వచ్చింది. అలాగే, పసుపు విస్తీర్ణంలో కూడా పెరుగుదల లేకున్నా, దిగుబడులలో వ్యత్యాసాలు వున్నాయి.
పెట్టుబడులు - ఉత్పత్తులు : పసుపు పంట ఎకరా పండిరచడానికి రు. 40వేల నుండి 50వేలు వ్యయమవుతాయి. సగటున 25-30 క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది. ఈ పంట ఎనిమిది మాసాల కాలం వుంటుంది. సంవత్సరంలో ఈ పంట వేసిన చోట రెండో పంట వేయడానికి అవకాశంలేదు. రెండు పంటలు పండే భూముల్లోనే ఈ పంట వేయాలి. అనగా రెండు పంటల ఆదాయం ఒక్క పంటలోనే రైతుకు రావాలి. క్వింటాల్‌ ధర పంటల కోతకాలంలో రు. 2000 నుండి 2600 వరకు వుంటుంది. ఎకరా ఆదాయం రు. 10-15వేల వరకే వస్తుంది. (అదీ ప్రకృతివైపరీత్యాలు అనుకూలంగా వున్నప్పుడు) సహజంగా పసుపు పంట  0.5 ఎకరాలు లేదా 1 ఎకరం మాత్రం మాత్రమే వేస్తారు. ఈ పంట కోతకాలంలో పంటను త్రవ్వి ఉడకబెట్టాలి.  ఇందుకు కర్ర మరియు తగు పరికరాలు స్వంతంగా ఏర్పాటు చేసుకోవాలి. 4 క్వింటాళ్ళ పచ్చి పసుపును ఉడకబెట్టగా ఒక క్వింటాల్‌ ఎండు పసుపు దిగుబడి వస్తోంది.
మిరప పంట రాష్ట్రంలో రెండున్నర లక్షల హెక్టార్లు వేస్తున్నారు. ఎకరాకు పెట్టుబడి రు. 40వేల నుండి 50వేల రూపాయలు అవుతుంది. రైతుల ఉత్సాహాన్ని గమనించి విత్తనాల ధరలను అపరిమితంగా పెంచారు. ‘‘ఢల్లీిహాట్‌’’ విత్తనం కిలో ధర రు. లక్ష నుండి 1.5 లక్షల వరకు అమ్మారు. ఈ పంట వేసినా దిగుబడిలో పెద్దమార్పు రాలేదు. కానీ విత్తనాల రూపంలో రైతులనుండి పెద్దయెత్తున కంపెనీలు లాభాలు గడిరచాయి. దిగుబడి రు. 25-30 క్వింటాళ్ళు సగటున వస్తుంది. మెట్టప్రాంతాలలో నీటియెద్దడి ఏర్పడినప్పుడు ఎకరాకు రు. 10వేల వరకు నీటి కొరకు వ్యయం చేయాల్సివుంటుంది.  ఈ పంట వేసిన విస్తీర్ణంలో ఏడాదిలో మరో పంట వేయడానికి వీలుకాదు. ఎనిమిది మాసాలకు పైగా పంట కాలం వుంది. ఈ పంటల ఉత్పత్తి ధరలు పూర్తి అనిశ్చితంగా వుంటాయి. క్వింటాల్‌ రు. 2000 నుండి 3500ల మధ్య వుంటుంది.
నాణ్యతలేని విత్తనాల వలన కాయ-పూత లేకుండా వేలాది ఎకరాల పంటలకు నష్టం వాటిల్లినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వుంది. రైతులే యీ నష్టాలను భరిస్తున్నారు.
మిరప పంట ధరలపై విశ్లేషణ : దశాబ్ధ కాలం ధరలను పరిశీలిస్తే ఎంత అనిశ్చితంగా వుంటాయో అర్థమవుతుంది. ఈ పంటలకు ప్రభుత్వాలచే మద్దతు ధరల నిర్ణయంలేదు. వ్యాపారుల దయాదాక్షిణ్యాలే ధరలను నిర్ణయిస్తాయి. ఈ దిగువ పట్టిక గమనించండి.
                     

భారత్‌ నుండి ఎగుమతి అయిన ఎస్‌-4 మిరప కిలో ధర అక్టోబర్‌ 2007న రు. 87.12 లకు మరియు చైనీస్‌ చిన్నరకం  ధర కిలో రు. 148.16లకు అంతర్జాతీయ మార్కెట్‌ (అమెరికా)లో అమ్మకాలు జరిగాయి.
అలాగే పసుపు ధరలు అమెరికాలో కిలో అక్టోబర్‌ 2007లో రు. 68.75లకు మరియు నవంబర్‌ 2007న రు. 65.08లకు అమ్మకాలు సాగాయి. ఆంధ్రప్రదేశ్‌ నుండి ఎగుమతుల వల్ల వ్యాపారస్తులకు విపరీతమైన లాభాలు వచ్చాయి. 2005-06లో ఆసియాకు 13 వేల మెట్రిక్‌ టన్నుల మిరప ఎగుమతి చేయగా, రు. 99 కోట్లు మరియు 2006-07లో బంగ్లాదేశ్‌, శ్రీలంకలకు ఎగుమతి చేయగా 147.81 కోట్లు  ఆదాయం వచ్చింది.
మిరప పంట నిల్వలకు కోల్డ్‌స్టోరేజీలు అవసరం. ఒక టిక్కీ (40 కిలోలు) ఆరు మాసాలు నిల్వచేయాలంటే రు. 100ల వరకు చెల్లించుకోవాలి. కోల్డ్‌ స్టోరేజీలలో పెట్టిన ఉత్పత్తులపై బ్యాంకులు రుణాలు యివ్వాలి. కానీ యింతవరకు కోల్డ్‌ స్టోరేజీలలో నిల్వచేసుకున్న రైతులు పెద్దయెత్తున నష్టపోయారు. ప్రమాదాలు సంభవించినప్పుడు దీమా లభించక రైతులు దివాళా తీశారు.
మిరప చిల్లర ధర : జనవరి 2007న కిలో రు. 100, మార్చి 2007న రు. 103.50లు మరియు జూన్‌ 2007న రు. 93.60లకు చిల్లర అమ్మకాలు సాగాయి. ఆ సంవత్సరం రైతుకు మాత్రం క్వింటాల్‌కు రు. 5000లకు మించి ధర రాలేదు.
మిరప, పసుపు ఎగుమతిదారులకు మరియు వ్యాపారులకు సగానికి సగం లాభాలు తెచ్చిపెడుతున్నాయి. కానీ, ఉత్పత్తిచేసే రైతులకు మాత్రం గిట్టుబాటుకావడంలేదు. ధరల గ్యారెంటీ వుండదు. ఒకే నాణ్యమైన సరుకును రెండు భాగాలుగా మార్కెట్‌లో పెడితే ఒక్కో సరుకుకు ఒక్కో ధర నిర్ణయించబడుతుంది. ముఖ్యంగా గమనించాల్సిందేమిటంటే ధరల తేడా నాణ్యత ఆధారంగా నిర్ణయిస్తామని చెప్పినా మొదటి రకం ధరకు, చివరి ధరకు మధ్య రు. 1000ల వరకు తేడా వుంటుంది.  ధరల నిర్ణయానికి మార్కెట్‌లలో నాణ్యతా ప్రమాణాలు నిర్ణయించే అధికారులు వుండరు. వ్యాపారస్తులే నాణ్యతా ప్రమాణాలు నిర్ణయిస్తారు.
పరిశోధనలు - అధిక దిగుబడులు : మిరప, పసుపు సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిని పెంచడానికి వ్యవసాయ విశ్వవిద్యాలయాలు గానీ, స్పైషస్‌ బోర్డు గానీ ఎలాంటి పరిశోధనలు యీ పంటలపై జరపలేదు. సుగంధ ద్రవ్యాల జాబితాలోని పై రెండు పంటలేగాక ఉల్లి, వెల్లుల్లి, మిరియాలు కూడా అత్యంత కీలకమైనవే. ఈ పంటల ఉత్పాదకతను పెంచడానికి విదేశాలలో కొన్ని పరిశోధనలు జరుగుతున్నాయి. కనీసం ఆ వెలుగులో యిక్కడ దేశీయంగా గానీ, రాష్ట్రంలో గానీ పరిశోధనలు లేకపోవడం వలన యీ ఉత్పత్తులు సాధించే రైతులు ‘‘ దైవాదీనంగా’’ పంటలు పండిస్తున్నారు. గత దశాబ్ధ కాలంగా ఉత్పత్తిలోను, ఉత్పాదకతలోను ఎలాంటి పెరుగుదల లేదు. అందుకుతగిన ప్రయత్నం కూడా జరగలేదు.
కేంద్రప్రభుత్వం ప్రత్తి, నూనెగింజలు, పండ్ల తోటల పరిశోధనలకు రాష్ట్ర వ్యవసాయరంగానికి గ్రాంట్లు యిస్తుంది. కానీ, మిరప, పసుపు పంటలకు మాత్రం యింతవరకు ఏనాడూ గ్రాంట్లు మంజూరీ చేయలేదు. కావాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా కోరలేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా యీ పంటలకు ఏవిధమైన బడ్జెట్‌ను కేటాయించలేదు. అందువల్ల ఈ పంటలు రైతుల ఇష్టాయిష్టాలపైన, ప్రకృతివైపరీత్యాల పైన ఆధారపడి పండిస్తున్నారు. ఈ పంటల ఉత్పత్తికి ఎలాంటి ప్రణాళిక లేదు. ఒకవిధంగా ధరలు బాగా వచ్చిన మరుసటి సంవత్సరం విస్తీర్ణం కొంత పెరగడం, ధరలు హీన స్థాయికి పడిపోయినప్పుడు విస్తీర్ణం తగ్గడంలాంటి అరాచక ఉత్పత్తి విధానం కొనసాగుతున్నది. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ పంటలపై పరిశోధనలకు బడ్జెట్‌ కేటాయింపులు చేయాలి.
పేటెంట్‌ హక్కు - పంటల అవసరాలు : పసుపు పంటపై అమెరికా ప్రభుత్వం పేటెంట్‌ హక్కును పొందింది. భారత ప్రజల ఆందోళనల మేరకు  హేగ్‌లోని ప్రపంచ న్యాయస్థానంలో మన వారసత్వాన్ని రుజువు చేసుకొని అమెరికా పేటెంట్‌ హక్కును రద్దుచేయించాం. ఈ పంట ఔషధ గుణాలు కల్గివుండటమేగాక సౌందర్య పోషణకు ప్రపంచ వ్యాపితంగా విస్తారంగా వినియోగిస్తున్నారు. ఈ పంట ఉత్పత్తితో ప్రపంచ మార్కెట్‌లో మంచి గిరాకీ వుంటుంది. ఈ పంట ఉత్పత్తిని క్రమబద్ధంగా పెంచి అంతర్జాతీయ ఎగుమతులను అన్వేషించాలి.
మిరప ఉత్పత్తులు ఆహారంగానే గాక రంగులలోను, పేస్ట్‌లు తయారుచేయడానికి వినియోగిస్తారు. ఓడలకు ఈ పేస్ట్‌ పూయడం వల్ల  త్రుప్పును నివారిస్తుంది. అనేక దేశాలలో మిరప పంటకు ప్రత్యామ్నాయంగా ఆహారంలో మిరియాలను వినియోగిస్తున్నారు.
పై రెండు పంటల ఉత్పత్తులను ప్రాసెస్‌చేసి పేస్టులు తయారుచేయడానికి మరియు అంతర్జాతీయ మార్కెట్‌ను వినియోగించుకోవడానికి భారత ప్రభుత్వం మరియు స్పైస్‌బోర్డులు కలిసి కృషి సాగిస్తే ఈ పంటల ఉత్పత్తిదార్లకు అటు వినియోగదారులకు లాభాలు తెచ్చిపెడతాయి.
ఉత్పత్తిదారులు ఎదుర్కొనే సమస్యలు :
1. నాణ్యతగల విత్తనాల లభ్యత లేకపోవడం
2. కొత్త విత్తనాల ఆవిష్కరణ లేకపోవడం
3. వ్యవసాయ శాఖ/ స్పైస్‌ బోర్డు సలహాలు లేకపోవడం
4. ప్రకృతివైపరీత్యాల నుండి రక్షణకు బీమా సౌకర్యం లేకపోవడం
5. మద్దతు ధర నిర్ణయం లేకపోవడం
6. ఎగుమతులకు గల అవకాశాలను ప్రభుత్వాలు పరిశీలించకపోవడం
7. సమగ్ర ఉత్పత్తికి ప్రణాళికల రూపకల్పనలు లేకపోవడం
పరిష్కార మార్గాలు :
1. పంటల ఉత్పత్తిని క్రమబద్దీకరిస్తూ వ్యవసాయ శాఖ/ స్పైస్‌బోర్డు విస్తీర్ణాన్ని భూమి నాణ్యత ఆధారంగా నిర్ణయించాలి.
2. నూతన విత్తనాల పరిశోధన/ రైతులకు సరఫరా బాధ్యతను ప్రభుత్వం నిర్వహించాలి.
3. పంటల కాలంలో సస్యరక్షణకు సంబంధించి నిరంతర సలహాలను పై శాఖల ద్వారా రైతులకు కల్పించాలి.
4. పంటవేసే కాలంలోనే మద్దతు ధరలు నిర్ణయించాలి. వాటిని అమలు జరపడానికి ప్రభుత్వం కొనుగోలు సంస్థలను మార్కెట్‌కు రప్పించాలి.
5.  అంతర్జాతీయంగా ఎగుమతి అవకాశాలను పరిశీలించి తగు చర్యలు చేపట్టాలి.
6. ఈ పంటలను ప్రాసెస్‌ చేయడానికి తగు పరిశ్రమలను ఏర్పాటు చేయాలి.
7. స్థానిక వినియోగాన్ని పెంచాలి.
8. సన్న,చిన్నకారు రైతులకు  స్పైస్‌బోర్డు నుండి సలహాలు, ఆర్థిక గ్రాంట్‌లు యివ్వాలి.




No comments:

Post a Comment