Wednesday, 13 August 2014

సహకార రంగం ప్రభుత్వం- నాబార్డు ఒప్పందం

    రాష్ట్ర ప్రభుత్వం -  నాబార్డు (జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు)తో 2006 ఆగస్టు 29న చేసుకొన్న ఒప్పందంలో సహకార రంగాన్ని ప్రక్షాళనచేసి అభివృద్ధి పథంలో నడపాలని నిర్ణయించింది. సహకార రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిన దశలో వైద్యనాధన్‌ కమిటీ సిఫారసులను యథాతథంగా అమలుచేస్తానని అంగీకరించింది.  ఒప్పందం అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం రు. 1500 కోట్లు గ్రాంట్‌గాను, రాష్ట్ర ప్రభుత్వం రు. 600కోట్లు సర్దుబాటుచేసి సంక్షోభాన్ని నివారిస్తాయి. దివాళా తీసిన సహకార సొసైటీలను యితర సొసైటీలలో విలీనం చేయడంతోపాటు సహకార సంఘాలకు పూర్తిస్థాయి స్వయంప్రతిపత్తి యిస్తారు. రాష్ట్ర సహకార బ్యాంకు, జిల్లా సహకార బ్యాంకుల నిర్వహణ పూర్తిగా నాబార్డు చేతుల్లోకి వెళ్తుంది. ఈ సంఘాలకు సి.ఇ.ఓలుగా వృత్తినిపుణులను నిర్ణయిస్తారు. సొసైటీలు సభ్యులదగ్గర డిపాజిట్లు సేకరించాలని, జిల్లా, రాష్ట్ర సహకార బ్యాంకులు ఎక్కడైనా డిపాజిట్లు సేకరించాలని ఈ ఒప్పందంలో వుంది. ఇకపై సహకార సంఘాల ఆడిట్‌ చార్టర్‌ - అకౌంటెంట్ల ద్వారా స్వయంగా నిర్వహించుకోవాలి.
    రాష్ట్ర ప్రభుత్వం-నాబార్డు ఒప్పందం ప్రకారం వైద్యనాథన్‌కమిటీ సిఫార్సులను  యథాతాథంగా ఆమోదించాలి.అవి
1.    ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పిఎసిస్‌) 50 శాతం వసూళ్ళు చేసినవాటికే తిరిగి రుణ సౌకర్యం కల్పించాలి.
2.    50-30శాతం మధ్య వసూలు చేసిన పిఎసిస్‌లకు ఎంత అసలు మొత్తం వసూలు చేస్తే తిరిగి అంతే రుణం ఇవ్వాలి.
3.    30 శాతం లోపు వసూలు చేసిన వారికి రుణాలు ఇవ్వబడవు.
4.    సహకార సొసైటీలు తాజా ఆడిట్‌ లెక్కలు (అప్‌డేట్‌) ధృవీకరించబడితేనే అ సొసైటీకి నాబార్డు రుణ సౌకర్యం అనుమతిఇస్తుంది.
5.     సహకార సొసైటీలు, సహకార బ్యాంకులు ఏ సంస్థ లేదా వ్యక్తుల నుండి అయినా డిపాజిట్‌లు సేకరించవచ్చు. వారే రుణాలు మంజురు చేయవచ్చు. చార్టర్డ్‌ అకౌంటెంట్‌ ద్వారా ఆడిట్‌ చేయించుకోవాలి.
6.     ప్రతి మండలానికి 1 లేదా 2 సొసైటీలు మాత్రమే ఉంటాయి.దివాళా తీసిన సొసైటీలు లాభాలార్జిస్తున్న సొసైటీలో కలపాలి.
    ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఒప్పందం ప్రకారం సహకార రంగం నుండి  ప్రభుత్వం పాత్ర పూర్తిగా తొలగించబడుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు ఆమోదించిన1995 చట్టం వున్నదున్నట్టుగా అమలుజరపడమే దీని లక్ష్యం. ఇకనుండి సహకార రంగం సేవా దృక్పథంతో కాకుండా లాభదృక్పథంతో పనిచేయాలి.
    వైద్యనాధన్‌ టాస్క్‌ఫోర్స్‌కు ముందు జగదీష్‌ కపూర్‌ కమిటీ, వ్యాస్‌ కమిటీ, వికె  పాటిల్‌ కమిటీలు కూడా సహకార రంగం ప్రక్షాళనపై నివేదికలిచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం నాబార్డు మాజీ ఛైర్మన్‌ పి.వి.ఎ రామారావు నాయకత్వాన కమిషన్‌ నిర్ణయించగా ఆ కమిషన్‌ 2004 జూన్‌ 23న ఒక నివేదికను సమర్పించింది. అన్ని నివేదికల లక్ష్యాలు సహకార రంగాన్ని కుదించేవైపు దారులు సూచించినవే. మార్కెట్‌ ఎకానమీని ప్రోత్సహించారు.
    సహకార వ్యవస్థ దివాళా తీసిందని, సంక్షోభంలోకి కూరుకుపోతుందని ప్రభుత్వం పదేపదే ప్రకటనలు చేస్తున్నది. ఈ సంక్షోభ కారణాలను పరిశీలించకుండా లేదా కారణాలు తెలిసి కూడా మభ్యపుచ్చడానికి ప్రయత్నిస్తున్నది.  నేడు సహకార రంగాన్ని వాణిజ్య సంస్థగా మార్చడంవల్ల ఏ లక్ష్యం కొరకు సహకార రంగం స్థాపించామో ఆ లక్ష్యం పూర్తిగా దెబ్బతింటున్నది. రాష్ట్ర సహకార రంగం దివాళాకు పాలకవర్గాలు అమలుజరిపిన విధానాలే ప్రధాన కారణం. రాష్ట్ర సహకార రంగం రు. 6వేల కోట్ల వ్యాపారధనంతో పనిచేస్తున్నది. యిందులో రు. 1500 కోట్లు ఉద్దేశ్యపూర్వక బకాయిలు, రు. 700 కోట్లు ఇంబ్యాలెన్స్‌లు, రు. 500 కోట్లు తిరిగిరాని వ్యవసాయేతర రుణాలు, రు.400కోట్లు జిల్లాల బ్యాంకుల నష్టాలు వున్నాయి. ఈ నిధులు రాబట్టడానికి అటు ప్రభుత్వంగాని, ఇటు సహకారరంగంగానీ ఎటువంటి ప్రయత్నాలు చేయడంలేదు. ఉద్దేశ్యపూర్వక బాకీలలో సింహభాగం భూస్వాములవే. వ్యవసాయేతర రుణాలుగా యిచ్చిన రు. 500 కోట్లు వసూలుకు అవకాశంలేదు. ప్రభుత్వం ప్రకటించిన రాయితీలు       (వేతన స్కేలు, వడ్డీరాయితీ, కరువు-వరదల సందర్భంగా రుణాల వాయిదా, వడ్డీ మాఫీ) ప్రభుత్వం తన బడ్జెట్‌నుండి ఈ రంగానికి చెల్లించాలి. కాని రాష్ట్ర ప్రభుత్వం యింతవరకు రాయితీలు ప్రకటించడమే తప్ప తిరిగి చెల్లించిన దాఖలాల్లేవు. వడ్డీ మాఫీ రాయితీని ప్రభుత్వం చెల్లించినా సకాలంలో చెల్లించలేదు. గతంలో రద్దుచేసిన రుణాల మొత్తాలు బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం రెండు దశాబ్దాల వరకు చెల్లిస్తూనే వచ్చింది. ఆ కాలానికి చెందిన వడ్డీకి సహకార రంగం నష్టపోయింది. ఈ విధంగా ముఖ్యమైన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఉదాసీనత చూపింది. రాష్ట్రంలో 11 జిల్లాల సహకార బ్యాంకులు రిజర్వు బ్యాంకు నిబంధన 11 కిందకు చేరాయి. అనగా ఆ జిల్లాలు వ్యాపార లావాదేవీలు నిర్వహించకూడదు. తక్షణం వాటిని గట్టెక్కించడానికి రాష్ట్ర ప్రభుత్వం రు. 200 కోట్ల వరకు గ్రాంట్‌గా యిచ్చి తాత్కాలికంగా గట్టెక్కించింది. ఈ రంగంలో ప్రభుత్వ విపరీత జోక్యంతో పాటు జిల్లా బ్యాంకుల పాలక వర్గాలు కొనసాగించిన చట్టవిరుద్ధ వ్యయం వల్ల కోట్ల రూపాయల నష్టాల్లోకి కూరుకుపోయాయి.
     పెట్టుబడి బ్యాంకు, సహకార శాఖ, సహకార ఆడిట్‌శాఖ మరియు మేనేజ్‌మెంట్‌ (ఎన్నికైన ప్రతినిధులు) మధ్య సహకారం వుండాలి. ఆచరణలో నేడు ఏ రెండు శాఖలమధ్య కూడా సహకారం లేదు. కొన్ని సొసైటీలు, బ్యాంకులు దశాబ్దాలు తరబడి ఆడిట్‌కు నోచకుండా వున్నాయి. 1982లో ఏర్పడిన నాబార్డు గాని, రాష్ట్ర సహకారబ్యాంకు గానీ, సభ్యులకు రుణార్హత మేరకు రుణాలివ్వలేదు. ఫలితంగా  రుణ వ్యాపారం తగ్గడంవల్ల ఆ సంఘాలకు ఆదాయం తగ్గింది. వడ్డీలో వచ్చిన మిగులుతో సంఘాలు, బ్యాంకులు నిర్వహించబడాలి. అందుకు తగినంత రుణ మొత్తాన్ని పెంచి యివ్వడంద్వారానే ఆదాయం వస్తుంది.  అంతేగాకుండా గతంలో సొసైటీలు, జిల్లా మార్కెటింగ్‌ సంఘాలు  సాగించిన వ్యాపారాన్ని ఎత్తివేశారు. ఆదాయాన్ని తెచ్చే  దీర్ఘకాలిక రుణాలను తగ్గించారు.  ఈ విధంగా ఒకవైపున ప్రభుత్వవిధానాలు, రెండోవైపున సొసైటీ మరియు బ్యాంకులు నిర్వహించిన తప్పుడు విధానాల వల్ల సహకార రంగం సంక్షోభంలోకి వెళ్లింది. గత ఏడు సంవత్సరాలుగా సహకార ఎన్నికలు నిర్వహించబడకుండా అధికార యంత్రాంగం పెత్తనం చేసింది. సభ్యుల జనరల్‌ బాడీలు లేకపోవడంవల్ల సొసైటీల, జిల్లా బ్యాంకుల ఆర్థికపరిస్థితిపైన గాని, నిర్వహణపైన గానీ సభ్యులు తమ పట్టును కోల్పోయారు. సభ్యులలో చైతన్యం కల్గించడానికి ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
1964లో రాష్ట్రంలో విస్తృత పరచబడిన గ్రామీణ సహకార వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం ఆనేక ప్రయోగాలు చేసింది.  25 సార్లు చట్టానికి సవరణలు చేశారు. 1985లో మూకుమ్మడిగా సభ్యత్వం చేర్పించే కార్యక్రమం చేపట్టారు.  ప్రాథమిక సహకార సంఘాలను సింగిల్‌ విండోలు గా మార్చారు. 38 లక్షల సభ్యత్వం ఒకసారిగా 140 లక్షలకు  పెరిగింది.  మండలానికి 5,6 సంఘాలకే పరిమితం చేశారు.  వ్యవసాయ సహకార పరపతి సంఘాలు కాక మరో 28 వేల సహకార సంఘాలు వివిధ వృత్తులు, ఉద్యోగ, ఉపాధ్యాయ కాంట్రాక్టు సంఘాలుగా విస్తృత పర్చారు.  అవన్నీ జిల్లా సహకార బ్యాంకులకు అనుసంధానం చేశారు.  ప్రధానంగా జిల్లా సహకార బ్యాంకులు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకే కాక, చేనేత, ఉద్యోగ, కాంట్రాక్టు సంఘాలకు చేతివృత్తుల సంఘాలకు ఆర్థిక సేవలు (రుణాలు)  చేస్తూ వస్తున్నది. 20 జూలై 2000 సంవత్సరం నుండి ఎన్నికలు జరుపకుండా ఇప్పటికి ఎనిమిది సార్లు వాయిదాలు వేశారు.  ప్రజల జోక్యాన్ని నివారించడానికి అధికారులు, ప్రభుత్వం చట్టంలో మార్పులు తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
    ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు క్రమంగా గ్రామీణ పెత్తందార్లు, భూస్వాములకు జేబుసంస్థలుగా మారాయి.  నిధుల దుర్వినియోగం, ఉద్దేశ్యపూర్వకంగా బకాయిలు చెల్లించకపోవడం వలన సొసైటీలు నష్టాల్లోకి వెళ్ళాయి.  తిరిగి రుణ వ్యాపారం చేయలేని స్థితికి నెట్టబడినాయి.  ఋణవసూళ్ళు చేయలేక ‘బుక్‌ అడ్జస్టుమెంటు’ విధానాన్ని పాటించాయి.  ఆ విధంగా రుణవసూళ్ళు కాగితాలపైనే ఉన్నాయి.  దీనికి తోడు సిబ్బంది వేతనాలు రుణ వసూళ్ళ నుండే ఇవ్వడం వలన సొసైటిలు, జిల్లా బ్యాంకులు నష్టాల్లోనే కాక ఇన్‌ బాలెన్స్‌ లోకి వెళ్ళాయి.  సభ్యులు రుణం మొత్తం తీర్చినా సొసైటీ, జిల్లా సహకార బ్యాంకులు రుణ విముక్తం కాలేని ఆర్థిక స్థితి ఏర్పడిరది.  ఈ తప్పుడు పద్ధతి ఆచరించింది పాలకవర్గాలే కావడం వలన  ప్రభుత్వం అవినీతి, నిధుల దుర్వినియోగం చేసినవారిపై చర్యలు తీసుకోలేకపోతున్నది.  గత పాలకవర్గం ఈ స్థితి నుండి గట్టెక్కడానికి ఏకంగా 1964 సహకార చట్టానికి ఉద్వాసన పలికే విధంగా 1995, పరస్పర సహాయ సహకార చట్టం’ తెచ్చింది.  ఈ చట్టం ప్రకారం ప్రభుత్వానికి ఈ వ్యవస్థపై ఎలాంటి హక్కులుండవు. 1964 చట్టప్రకారం సంపాదించిన ఆస్తులను 1995 చట్ట ప్రకారం ఏర్పడిన సంఘాలకు బదలాయించడం జరుగుతుంది.  ప్రజల ఆస్థులు కొద్ది మందికి కైంకర్యం అవుతాయి.  ఒకే గ్రామంలో ఒకే సొసైటీ ఉండాలన్న సింగిల్‌ విండో విధానం పోయి, ఒకే గ్రామంలో ఎన్నైనా సోసైటీలు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించారు.  1995 చట్టం అమలుకు సొసైటీల నుండి వ్యతిరేకత పెరిగిన దృష్ట్యా దీనిని అధ్యయనం చేసి నివేదికను సమర్పించాల్సిందిగా ప్రభుత్వం నిపుణుల కమిటీని వేసింది.  జగదీశ్‌కపూర్‌ కమిటి, పిబిఎ రామారావు (ఎం.డి. నాబార్డు) కమిటీ (జూలై 2003) లను వేసింది.  సహకార వ్యవస్థ పటిష్ఠతకు సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా అందరిని కోరింది. శాసనసభ్యులతో సలహా కమిటీివేసింది. ఇంతలో 14 మే 2004న ప్రభుత్వం మారి కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. జగదీశ్‌కపూర్‌ కమిటీ నివేదికను అమలుకు పూనుకొంది.
పై కమిటీలు ఈ దిగువ రికమండేషన్లు చేశాయి :
1. ప్రస్తుతమున్న 3 అంతస్థుల విధానం కొనసాగాలి.  (సొసైటి - జిల్లా బ్యాంకు - రాష్ట్ర బ్యాంకు విధానం)
2. దివాళాతీసిన సొసైటి/జిల్లా బ్యాంకులను లాభాల్లోనున్న సొసైటి/ జిల్లా బ్యాంకులలో కలపాలి.
3. సొసైటి, జిల్లా సహకార బ్యాంకు రాష్ట్ర సహకార బ్యాంకు నష్టాల్లోంచి బైటపడటానికి కేంద్ర ప్రభుత్వం రూ.2,350 కోట్లు ఆర్థిక సహకారం చేయాలి.
4. వాటాధనాన్ని రు. 300/లకు పెంచాలి.  ఏటా రూ. 200 లు త్రిప్టు డిపాజిట్లు సేకరించాలి.
5. రుణం పొందని సభ్యులను తొలగించాలి.
6. బకాయిదారులకు ఓటు హక్కు ఉండరాదు.
7. మండలానికి ఒక సొసైటి మాత్రమే ఉండాలి.
8. 2/94 చట్ట ప్రకారం సొసైటీకి వ్యాపార లాభం ఉంటేనే ఉద్యోగస్థులు వేతనం తీసుకోవాలి. లేదా 116( సి) చట్టప్రకారం వారిని తొలగించాలి. (8 వేల మంది పదవులు రద్దువుతాయి. 3,500 సొసైటీలు, 200 జిల్లా బ్యాంకుబ్రాంచీలు రద్దు అవుతాయి.
9. నూతన చట్టంచే ఎన్నికలు జరపాలి.
    స్థూలంగా పై సూచనలు ప్రభుత్వ అమలుకు ప్రయత్నాలు చేస్తున్నది.  అధ్యయనం చేసిన కమిటీలు కొన్ని వాస్తవాలను కావాలనే నిర్లక్ష్యం చేశాయా?  లేక వాటి దృష్టికి రాలేదా?  తెలియదు.  సొసైటి / జిల్లా సహకార బ్యాంకు ల నష్టానికి కారకులెవరు?  దానిని నిర్థారించగల్గితే నష్టాలకు కారణమైన అంశాన్ని  సరిచేసుకోవచ్చు.  పదేండ్ల క్రితం వరకు సవ్యంగా సాగిన ఈ వ్యవస్థకు ఇప్పుడే ఎందుకు ‘చెద’ పట్టింది?  పరిశీలించాలి.  పైన పేర్కొన్న సూచనలు వ్యవస్థ పునరుజ్జీవనానికి ఏమాత్రం ఉపయోగపడవు.
    రాష్ట్రంలో గల 22 జిల్లా సహకార బ్యాంకులలో 9 బ్యాంకులు (శ్రీకాకుళం, విజయనగరం, కడప, కర్నూలు, నెల్లూరు, మహబూబ్‌నగర్‌, మెదక్‌, కరీంనగర్‌, వరంగల్‌,) వ్యాపారాలు నిల్పి వేయాలని రిజర్వు బ్యాంకు రూలు 11 ద్వారా ఆదేశించింది.  జిల్లా బ్యాంకులు 31-3-2004 నాటికి రూ. 502.00 కోట్లు నష్టాల్లోకికూరుకుపోయాయి.
రుణాలకు సూచనలు :
1. స్కేలు ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం రుణాలివ్వాలి - రుణ మొత్తంపై పరిమితి విధించరాదు. పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలు ఇవ్వాలి.
2. వ్యవసాయ కార్మికులకు వినియోగ రుణాలివ్వాలి.
3. సొసైటీలు వ్యవసాయేతర వ్యాపారం చేయడానికి వీలుగా సొసైటీ వాటాధనంతో పాటుగా బ్యాంకులు రుణ సదుపాయం చేయాలి. ఎరువులు, క్రిమిసంహారక మందులు, వ్యవసాయ పనిముట్లు అద్దెకు, అందించాలి.చౌకదుకాణాలు నిర్వహించాలి. అన్ని నిత్యావసర వస్తువులు అమ్మించాలి. విత్తనాలు కూడా అమ్మాలి.
4. రుణ వసూళ్ల సందర్భంలో  పంటలను కొనుగోలు చేయుటకు అవకాశం కల్పించాలి. (కొనుగోలు చేసిన పంటను అమ్మి జిల్లా బ్యాంకుకు రుణం చెల్లించాలి.)
5. కేంద్ర - రాష్ట్రాలకు నిధులు (పెన్షన్లు మానవ వనరుల అభివృద్ధి నిధులు, వేతనాలు, ఇతర బడ్జెటు వనరులు) సహకార బ్యాంకులలో డిపాజిటు చేసి, దాని ద్వారా ప్రభుత్వాలు వ్యయం చేయాలి.
6. ఒకే కుటుంబంలో  ఒకరికే రుణం ఇవ్వాలి. (ఎంత భూమి ఉన్నా - ఎంత మొత్తమైనా ఇవ్వాలి).
7. గ్రామంలో డిపాజిట్లు సేకరించాలి.
8. దళిత, గిరిజనులకు మొత్తం రుణంలో ప్రస్తుతం 15 శాతం ఇవ్వాలన్న నిబంధనకు బదులుగా35 శాతం పంట రుణంగా ఇవ్వాలి.
9. సభ్యులుగా నున్న వారందరికి రుణాలివ్వాలి. - బినామి సభ్యత్వం తొలగించాలి.
10. చేతివృత్తుల వారు గాని, ఇతరులు గాని సభ్యులుగా వుంటే రుణం ఇవ్వాలి.
11. ప్రతి వాస్తవసాగుదారు పేరు రెవెన్యూ రికార్డులలో నమోదు చేయాలి - రెవెన్యూ రికార్డుల ప్రకారం రుణ పట్టిక తయారు చేయాలి.
12. వాస్తవ సాగుదారు (కౌలుదారు) పంటరుణం ఇవ్వాలి.
13. వ్యవసాయాధికారులతో  రైతులకు పంటలు పండిరచటంపై శిక్షణ ఇవ్వాలి. ఏ భూమిలో ఏ పంట వేయాలో చెప్పాలి.
14. పాడిపరిశ్రమ - గొఱ్ఱెల, మేకలపెంపకం - కూరగాయల పెంపకం వారికి రుణాలివ్వాలి.
15. చేతివృత్తుల వారికి వారి సంఘాల ద్వారా రుణాలివ్వాలి.
జిల్లా మార్కెటింగ్‌ సహకార సంఘాలు ` వాటి సేవలు
రాష్ట్రంలో గత 22 జిల్లాలకు ‘‘ జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీలు’’ ఉన్నాయి. వీటికి అనుబంధంగా తాలుకా మార్కెటింగ్‌ సహకార సొసైటీలు పనిచేశాయి. ఈ సొసైటీలు రైతులకు, ప్రజలకు చౌకధరలకు ఈ దిగువ సరుకులు అందించాయి.
1. ఎరువులు, క్రిమిసంహారక మందులు,
2. విత్తనాలు,
3. వ్యవసాయ పనిముట్లు(డస్టర్లు, వీడర్లు, పవర్‌స్ప్రేయర్లు వగైరా)
4. బట్టలు
5. 14 రకాల నిత్యావసర సరుకులు(బియ్యం, నూనెలు, సబ్బులు వగైరా)
మార్కెటింగ్‌ సహకార సంఘాలు
    జిల్లా మార్కెటింగ్‌ సొసైటీల నుండి  తాలుకా మార్కెటింగ్‌ సొసైటీలకు వచ్చిన సరుకులు గ్రామ సహకార సొసైటీల ద్వారా ప్రజలకు అందించారు. ఈ సంఘాలు నాణ్యత గల సరుకును రైతులకు అందించేవి. అయినప్పటికీ ఈ వ్యవస్థ లాభాల్లో కొనసాగింది.
ఈ సంఘంలో చేరడానికి అర్హతలు`నిర్వహణ తీరు
1. ఎ గ్రూప్‌ సభ్యులుగా చేరడానికి ప్రాథమిక సహకార సంఘాలు రు.1,000 వాటాలు, రు.100 ప్రవేశ రుసుంతో సభ్యత్వం చేరాలి.
2. వ్యక్తిగత సభ్యత్వం (బిగ్రాప్‌) చేరడానికి రు.10 వాటా, రు.1 ప్రవేశరుసం ఉండాలి. వీరికి ఒటింగ్‌ హక్కు ఉండదు. ఓటింగ్‌ హక్కు కావాలంటే వాటాలు రు.100కు పైన ఉండాలి.
3. సంఘానికి బకాయ పడిన వారికి ఓటింగు హక్కు ఉండదు.
4. ప్రతి 5 సంవత్సరాల కొకసారి ఎన్నికలు జరుగుతాయి.
5. ఈ వ్యవస్థకు కేంద్రం ఎన్‌సిడిసి నుంచి ఆర్థిక సౌకర్యంతో పాటు, నాబార్డు ద్వారా/రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకు రుణ సహకారం పొంది వ్యాపారం నిర్వహించారు.
6. వీటికి స్వంత నిధులు ఉన్నాయి.
7. ఈ సంఘాలు రైతుల నుండి వ్యవసాయ ఉత్పత్తులు సేకరించి ప్రాసెస్‌ చేసి వినియోగదారులకు అమ్మకాలు చేశాయి.
8. మధ్య దళారీలు లేకపోవడంతో ఇటు ఉత్పత్తిదారులకు, అటు వినియోగదారులకు కొంత మేరకు న్యాయమైన ధరలకు సరుకులు లభించాయి. ఎరువుల, విత్తనాల బ్లాక్‌మార్కెటింగ్‌ లేదు. నాణ్యత గల సరుకులు లభ్యమైనాయి.
ఇతర సంఘాలు
సహకార వ్యవస్థ ద్వారా ఈ దిగువ సంఘాలు ప్రజలకు సేవలందించాయి.
1. ఎరువులు ఫ్యాక్టరీలు (హిప్కో దీనికి 5 సంవత్సరాలకు ఒక సారి ఎన్నికలు జరిగాయి.)
2. చక్కెర కర్మాగారాలు( రాష్ట్రంలో 18 చక్కెర కర్మాగారాలున్నాయి.)
3. వృత్తి సంఘాలతో పాటు చేనేత ఉత్పత్తికి అమ్మకానికి సహకార సంఘాలు పెద్దఎత్తున పనిచేశాయి.
    1064 చట్ట ప్రకారం పనిచేసిన ఈ సంఘాలకు ప్రభుత్వం/ అధికారులు అకౌంటబిలిటిగా పనిచేశారు. యాజమాన్యాలు కూడా అదేవిధంగా పనిచేశాయి. కచ్చితమైన ఆడిట్‌ ప్రతియేటా జరిగింది. అవినీతి జరిగిన సందర్భంలో క్రిమినల్‌ కేసులు పెట్టారు. అందువల్ల అవి లాభాలలో ఉన్నాయి. 
    1991 నుండి ఈ మార్కెటింగ్‌ సహకార వ్యవస్థను క్రమానుగతంగా మూసివేశారు. ప్రైవేటు వ్యాపారుల దగ్గర పెట్టుబడులు పెరగడంతో తమ లాభాలకు అడ్డంకిగా ఉన్నదని మార్కెటింగ్‌ వ్యవస్థను మూసివేయడానికి ఒత్తిడి తెచ్చి వారు సఫలీకృతులైనారు. ఇప్పటికీ వీటి ఆస్థులు లిక్కిడేషన్‌ కాకుండా ఉన్నాయి. ప్రతిజిల్లాకు ఒక లిక్విడేషన్‌ అధికారిని నియమించారు. ఆ విధంగా వీటికి చరమగీతం పాడారు.
30.01.2012

No comments:

Post a Comment