Monday, 11 August 2014

రాష్ట్రంలో చిన్ననీటివనరుల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలి

    2009-10 బడ్జెట్‌లో చిన్ననీటి వనరుల అభివృద్ధికి రు. 1681.50 కోట్లు ప్రణాళిక మరియు ప్రణాళికేతర బడ్జెట్‌కు కేటాయించారు. ఇది అతి స్వల్పం. ఈ వనరుల క్రింద 42.48 లక్షల ఎకరాలు సాగవుతున్నది. ఈ ఆయకట్టుకు సాగునీటి నిర్వహణ కల్పించడానికి 1. చిన్నతరహా సాగునీటి వనరుల శాఖ 2. భూగర్భ జలశాఖ 3. ఆంధ్రప్రదేశ్‌ ఇరిగేషన్‌ అభివృద్ధి శాఖ (ఐడిసి)లు పనిచేస్తున్నాయి. 5వేల ఎకరాల లోపు ఆయకట్టు కల్గిన నీటి వనరులు యీ శాఖ క్రిందికి వస్తాయి. 500 సంవత్సరాల నుండి చెరువుల నిర్మాణాలు చేపట్టారు. ప్రధానంగా నాటి రాజులు చెరువులను నిర్మించి వాటిని ప్రజలకు ధానం చేసేవారు. కాకతీయుల కాలంలో క్రీ.శ 1312లో వరంగల్‌ జిల్లాలో రామప్ప, లక్నావరం మరియు పాకాల చెర్వులను నిర్మించి ప్రజలకు హక్కుకల్పించారు. అనంతపురంలో బుక్కరాయ సముద్రం, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం చెరువులాంటి అనేక వేలాది చెరువులను నిర్మాణం చేశారు. స్వాతంత్య్రానికి ముందు, స్వాతంత్య్రానంతరం కూడా చెరువుల నిర్మాణాలు చేపట్టారు. కానీ రానురానూ చెరువుల నిర్వహణ తగ్గడంతో ఆయకట్టుకూడా తగ్గింది.
సంవత్సరం    చెరువుల ఆయకట్టు    బావుల ఆయట్టు
-    (లక్షల హెక్టార్లలో)    (లక్షల హెక్టార్లలో)
1955-56    10.68    2.84
1960-61    10.51    3.28
1970-71    11.12    5.10
1980-81    9.00    7.76
1990-91    9.69    13.04
2000-01    7.27    19.54
2004-05    4.77    19.03
2006-07    6.02    20.73
    పై పట్టికను పరిశీలిస్తే చెరువుల ఆయకట్టు తగ్గినట్లు, బావుల ఆయకట్టు పెరిగినట్టు తెలుస్తున్నది. సాగునీటివనరుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌ కేటాయింపులలో నిర్లక్ష్యం చేస్తుండటంతో రైతులు 1980-81 నుండి నేటివరకు రు. 10వేల కోట్లు స్వంత డబ్బు వ్యయంచేసి 26లక్షల బావులను త్రవ్వుకొని 40లక్షల ఎకరాలకు సాగునీటి వనరులు కల్పించుకొన్నారు.ఈ వనరులకు ప్రభుత్వం విద్యుత్‌ సరఫరా చేయడానికి అనేక ఆటంకాలు కల్పిస్తున్నది. 16 గం॥లు విద్యుత్‌ సరఫరా చేస్తామని 1980-81లో ప్రభుత్వాలు ప్రకటించాయి. గత సంవత్సరం సరఫరా కాలాన్ని 7గం॥లకు తగ్గించారు. 01-06-2009 నుండి తిరిగి రోజుకు 9గం॥ల విద్యుత్‌ సరఫరాచేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. బావుల సేద్యం గ్యారెంటీ లేని సేద్యంగా మారింది. చిన్న వనరుల శాఖను మూడు భాగాలుగా విభజించారు.
1. చిన్నతరహా సాగునీటివనరుల శాఖ       
2. భూగర్భ జల శాఖ    3.  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఇరిగేషన్‌ అభివృద్ధి శాఖ (ఎ పి ఎస్‌ ఐ డి సి)లుగా విభజించారు.
    పంచాయితీ రాజ్‌ వ్యవస్థ క్రిందనున్న 66, 165 చెరువులను (100 ఎకరాలలోపు ఆయకట్టుగలవి) చిన్న తరహా నీటిపారుదల శాఖకు బదిలీచేస్తూ 13-06-2005న జీవో యంయస్‌ 216 ప్రకారం బదిలీ చేశారు. ఈ చెరువుల క్రింద మొత్తం 14.69 లక్షల ఎకరాల ఆయకట్టువున్నది. 2008-09లో బడ్జెట్‌ యీ క్రిందివిధంగా కేటాయించారు. వంద ఎకరాల నుండి 5వేల ఎకరాల ఆయకట్టు గల చెరువులను ఇరిగేషన్‌ శాఖ నిర్వహణ చేస్తుంది. 
1. కమిషనర్‌ ఆయకట్టు అభివృద్ధి శాఖ 314.86 కోట్లు
2. చిన్నతరహా నీటివనరుల శాఖ 714.14 కోట్లు
3.  ఆంధ్రప్రదేశ్‌ ఇరిగేషన్‌ అభివృద్ధి శాఖ (ఐడిసి) 577.67 కోట్లు
4. భూగర్భ జలశాఖ 42.82 కోట్లు
మొత్తం 1681.49 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో సిబ్బంది వేతనాలు, నిర్వహణ వ్యయంతో పాటు 1. కొత్త చెరువుల నిర్మాణాలు 2. పునరుజ్జీవన - పునరుదర్ధరణ- స్థిరీకరణలకు కేటాయింపులు చేశారు. ముఖ్యంగా ఉత్తర కోస్తాలో ఆరేడు లక్షల ఎకరాల సామర్థ్యానికి అవకాశం వున్నట్లు అంచనావేశారు. నేటికీ అంచనాలుగానే వున్నాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో చిన్ననీటి వనరుల అభివృద్ధికి మంచి అవకాశాలు వున్నాయి. ఆరు దశాబ్ధాలు గడచినా యీ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేదు. చిన్ననీటినవరులను అభివృద్ధి చేయడం ద్వారా యీ దిగువ ప్రయోజనాలువున్నాయి. 1. భూగర్భ జలాల పెంపు 2. పర్యావరణ సమతుల్యత 3. పచ్చదనం - అభివృద్ధి 4. గాలిలో తేమ అభివృద్ధి 5. వర్షపాతం - పాడిఅభివృద్ధి మరియు పశు, గొర్రెలు, మేకల అభివృద్ధి తదితర సౌకర్యాలతో పాటు పేద ప్రజలకు యీ వనరులు మంచి ఆదాయ వనరులుగా వున్నాయి. వీటి అభివృద్ధికి ప్రభుత్వం అనేక పథకాలను ప్రకటించింది.
1. రాష్ట్ర బడ్జెట్‌ నిధులు 2. నాబార్డు నిధులు 3. జె.బి.సి.ఐ నిధులు (జపాన్‌బ్యాంకు) 4. ఎ ఐ బి పి ( కేంద్ర ప్రభుత్వ సహాయం) 5. ప్రధాని ప్యాకేజీల క్రింద నిధులు వ్యయం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించే నిధులు ఒక భాగంకాగా, నాబార్డు సహాయంతో చేసే పథకాలు మరికొన్ని.  నాబార్డు పథకాలకు అన్ని విధాలా అనుమతులు వున్నప్పుడే యీ పనులు చేపడతారు. జె బి సి ఐ (జపాన్‌బ్యాంకు) ద్వారా రు. 951.31 కోట్లు సహాయం రాగా, దానికి రాష్ట్ర ప్రభుత్వం రు. 186.43 కోట్లు మ్యాచింగ్‌ గ్రాంట్‌గా యివ్వాలి. ఈవిధంగా రు. 1137.74 కోట్లతో 59 చెరువులను ఆరు సంవత్సరాల్లో అనగా 2007 ఏప్రిల్‌ నుండి 2013 మార్చినాటికి పూర్తిచేయాలి.
    ప్రధాని రాష్ట్రంలోని 16 జిల్లాలకు ‘‘ఆత్మహత్యల నివారణా పథకం’’ క్రింద చిన్న నీటివనరుల ప్యాకేజీని ప్రకటించారు. 1.28 లక్షల కొత్త ఆయకట్టును సాగులోకి తెచ్చేవిధంగా రు. 1331 కోట్లతో 1.28 లక్షల ఎకరాల ఆయకట్టు అభివృద్ధికి యీ పథకాన్ని నిర్థేశించారు. 2008-09లో ఈ పథకం క్రింద రు. 150 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇప్పటికీ యీ పథకం నిర్థేశించిన లక్ష్యాల ప్రకారం పనిచేయడంలేదు.  కేంద్ర ప్రభుత్వం ఎ ఐ బి పి (ఆగ్జలరీ ఇరిగేటెడ్‌ బెనిఫిట్‌ ఫండ్‌) క్రింద 2006-07లో రు. 168 కోట్లతో 61 పథకాలు చేపట్టింది. ఈ పథకాలకు 2007-08లో రు. 30 కోట్లు.  2008-09లో మరో రు. 60 కోట్లు కేటాయించారు. పనులు మాత్రం పూర్తికావడంలేదు.
ప్రపంచబ్యాంకు రుణం :
    1000 ఎకరాల ఆయకట్టుకు పైబడిన మూడు వేల చెరువులను 21 జిల్లాల్లో అభివృద్ధిపర్చుటకు రుణ మంజూరీచేసింది. 499 మండలాల్లో 2.5లక్షల హెక్టార్ల అభివృద్ధికి యీ పథకం నిర్థేశించబడిరది. నిధులు యీ క్రిందివిధంగా సమకూర్చుకోవాలి.
- రు. 1044.30 కోట్లు ప్రపంచబ్యాంకు రుణం
- రు. 906.70 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ గ్రాంటు
- రు. 104.43 కోట్లు లబ్ధిదార్లనుండి విరాళం
- మొత్తం రు. 2055.43 కోట్లు. ఈ పనులు ప్రారంభమయ్యాయి. ‘‘ఇందిరమ్మ చెరువుల అభివృద్ధి పథకం’’ పేరుతో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం యీ పథకాన్ని అమలుచేస్తున్నది. రాష్ట్రంలోని చిన్న,పెద్ద చెరువులు కలిపి 74వేలు వుండగా, అందులో 14వేల చెరువులు శిథిలావస్థలో వుండగా మూడు వేల చెరువులకు మాత్రమే అభివృద్ధి పనులు చేపట్టడం ఆశ్చర్యకరమైన విషయం.
ఎత్తిపోతల ( ఐ డి సి) :
     ఆంధ్రప్రదేశ్‌ ఇరిగేషన్‌ అభివృద్ధి (ఐడిసి) పథకం 07-09-1974లో ఏర్పాటుచేశారు. ఈ పథకం క్రింద నేటివరకు ఎత్తిపోతలు, బోర్లు వేశారు. బోర్లు సామూహిక బావులుగా పనిచేస్తున్నాయి.
    రు. 622.27 కోట్ల వ్యయంతో 1473 ఎత్తిపోతలతో 6.24 లక్షల ఎకరాలకు సాగునీటివనరులు కల్పించారు.
    రు. 245 కోట్ల వ్యయంతో 20115 బోరు బావులు వేసి 3.36లక్షల ఎకరాలకు నీటివనరులు కల్పించారు. ఈ పథకంక్రింద 10వేల ఎకరాలు లోపు ఆయకట్టుకల్గిన ఎత్తిపోతలను మాత్రమే తీసుకుంటారు. వీటికి ఉచిత విద్యుత్‌తో పాటు ఒక్కో పంప్‌సెట్‌ 75 హెచ్‌.పి పైనవుండి ప్రత్యేక విద్యుత్‌ లైన్‌లద్వారా 16గం॥ల విద్యుత్‌ సరఫరా చేస్తారు.  పనిచేయనివాటిని పునరుద్ధరణచేసి రైతులకు అప్పగిస్తారు. నాగార్జునసాగర్‌ ఎడమకాల్వలో వున్న 40 లిఫ్టులను బాగుచేసి రైతులకు అప్పగించడం జరిగింది. రైతులకు అప్పగించాక తిరిగి పంప్‌సెట్లు కాలిపోయినా, మరేకారణంతో లిఫ్టు పనిచేయకున్నా వాటిని రైతులు బాగుచేసుకోలేకపోయారు. ఆవిధంగా అవన్నీ మూతపడిపోయాయి.
భూగర్భ జలశాఖ :
    1971లో యీ శాఖను ఏర్పాటుచేశారు. జల పరీక్షలు జరిపడం, నీరు లభించే ప్రాంతాలను గుర్తించి బోర్లు వేయడం యీ శాఖ పని. 2002లో ఆంధ్రప్రదేశ్‌ నీరు, భూమి, చెట్ల సంరక్షణా చట్టం వచ్చిన తర్వాత బోర్లు వేయడం నిల్పివేశారు. భూగర్భ జలాలు దెబ్బతింటున్నాయని రెండు బావుల మధ్య 500 మీటర్లు వుండాలని నిబంధనపెట్టి బోర్లు వేయడాన్ని క్రమబద్దీకరించారు. ఆవిధంగా ప్రస్తుతం బోర్లు వేయడం నిషేధించబడిరది. రైతు బోరు వేయాలనుకొంటే యీ చట్ట ప్రకారం ఎమ్మార్వో  అనుమతి పొంది వేసుకోవాలి.
    పై పథకాలెన్ని వున్నప్పటికీ మైనర్‌ ఇరిగేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంచేస్తూనే వుంది. మేజర్‌, మీడియం ఇరిగేషన్‌ అభివృద్ధి పేరుతో తక్షణ ప్రయోజనం కల్గించే మైనర్‌ ఇరిగేషన్‌ను నిర్లక్ష్యం చేయడం జరుగుతున్నది. ప్రస్తుత ఆయకట్టును స్థిరీకరించుకోకుండా కొత్త ఆయకట్టుకు పరుగులు పెట్టడం ప్రభుత్వవిధానంగా వుంది. పాత ఆయకట్టు క్రమానుగతంగా గ్యాప్‌ ఆయకట్టుగా (నీరురాని ఆయకట్టుగా) మారిపోతున్నది. దీనిని నివారించాలి. ఆయకట్టు ప్రాతిపదికగా బడ్జెట్‌ను కేటాయించాలి. 50లక్షల ఎకరాలకు పైగాఆయకట్టు కల్గిన మైనర్‌ ఇరిగేషన్‌ అభివృద్ధికి గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూనే వస్తున్నాయి. నీటి సంఘాలనేర్పాటుచేశారు. 1700 మేజర్‌, 411 మీడియం, 8181 మైనర్‌ వనరుల సంఘాలను మొత్తం 10292 సంఘాలనేర్పాటుచేసి వాటికే నీటినిర్వహణ బాధ్యతనప్పగించి ప్రభుత్వం తప్పుకోజూడటం అంటే నీటి నిర్వహణను నిర్లక్ష్యం చేసినట్లే ! నీటి సంఘాలనేర్పర్చిన సంవత్సరం పూర్తి నిర్వహణకు కావాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చుతుందని రిపేర్లు నీటి సంఘాలు శ్రద్ధతో చేసుకోవాలని చెప్పారు. రెండో సంవత్సరం 15శాతం నిధులను నీటి సంఘాలు భరించాలని అన్నారు. మూడో సంవత్సరం 50శాతం విరాళంగా ప్రజలు భరించాలని చెప్పారు. ఆతర్వాత సంవత్సరం పూర్తి శ్రమదానం ద్వారా రైతులే కాల్వలు, చెర్వులు రిపేర్లు చేసుకోవాలని సెలవిచ్చారు. క్రమంగా మైనర్‌ ఇరిగేషన్‌ రిపేర్లకయ్యే ఖర్చును రైతులపైకి నెట్టివేశారు. నీరు- మీరు పేరుతో చెరువుల పూడిక తీస్తామంటూ రు. 2500 కోట్లు ఖర్చుచేశారు. అశాస్త్రీయమైన పూడికతీత విధానం వలన కాంట్రాక్టర్లకు లాభం జరిగిందే తప్ప చెరువుల రిపేర్లుమాత్రం జరగలేదు. ఎక్కడో కొన్నింటికి మాత్రం కట్టలపై మట్టి పోశారు.
    1951కి పూర్వం 35 లక్షల ఎకరాలకు యీ వనరుల క్రింద సాగునీటి సౌకర్యం కల్పించారు. స్వాతంత్య్రానంతరం యీ వనరుల క్రింద 1951 తర్వాత సాగునీటి వనరు కల్పించింది 15 లక్షల ఎకరాలకు మాత్రమే. ఇదీ మన చిన్ననీటి వనరుల అభివృద్ధి చరిత్ర. ఈ వనరుల అభివృద్ధికి ప్రస్తుత ప్రభుత్వం కనీసం అన్ని వనరుల క్రింద రిపేర్లు చేయడానికి తగిన బడ్జెట్‌ కేటాయించాలి.
ప్రభుత్వ విధానం : రాష్ట్ర ప్రభుత్వం మైనర్‌ ఇరిగేషన్‌ పథకాల రిపేర్లకు ఒక్కో జిల్లాను ఒక డివిజన్‌గా యేర్పాటు చేసింది. నెల్లూరు జిల్లాలో రెండు డివిజన్లున్నాయి. ఒక డివిజన్‌ను ఐదు భాగాలుగాచేసి యేటా ఒక భాగంలోని మైనర్‌ ఇరిగేషన్‌ను రిపేర్‌ చేస్తున్నారు. అందుకు తగిన పూర్తి నిధులు యివ్వకుండా బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లో కొంత భాగాన్ని ఈ రిపేర్లకు కేటాయిస్తున్నారు. ప్రతి జిల్లాలోని మండలాల్లోని మైనర్‌ ఇరిగేషన్‌ చెరువులలో ఐదో వంతు చెరువులు మాత్రమే యేటా రిపేర్లకు నోచుకుంటాయి. ఐదు సంవత్సరాలు వచ్చే వరకు చెరువుల రిపేర్లు జరగవు. మధ్యలో అతివృష్టి వల్ల చెరువులు తెగిపోయినచో తాత్కాలిక రింగ్‌బండ్‌ వేస్తారు.తన వంతు దశ వచ్చినప్పుడే రిపేర్‌కు నిధులు కేటాయిస్తున్నారు. చెరువులలో ‘‘మత్తళ్ళు- తూములు’’ లేనివాటిని అన్‌రెస్టోర్డ్‌ చెరువులుగా గుర్తించారు. వీటిని రెస్టోర్‌ చేయడానికి అనగా తూములు - మత్తళ్ళు (అలుగు) నిర్మాణం చేయడానికి గతంలో నిధులు కేటాయించారు. సర్వేయర్లు లేరనేపేరుతో ఆ చెరువులను రెస్టోర్‌ చేయలేదు. నేటికీ చాలా చెరువులు అన్‌ రెస్టోర్డ్‌గానే వున్నాయి. వెంటనే అన్ని చెరువు కుంటలకు అలుగులు - తూములు యేర్పాటుచేయడానికి ప్రత్యేక సిబ్బందిని నియమించి నిధులు కేటాయించాలి. చెరువు కుంటల ఆయకట్టుకు గ్యారెంటీ యివ్వాలి.
  - సారంపల్లి


No comments:

Post a Comment