Tuesday, 12 August 2014

ధాన్యం (బియ్యం) పంట వృద్ది పథకం ` ప్రభుత్వాల విధానాలు

భారతదేశంలో 70కోట్ల మంది బియ్యాన్ని ఆహారంగా వాడుతుండగా 43కోట్ల మంది గోధుమలు ప్రధాన ఆహారంగా తీసుకుంటున్నారు. దేశ జనాభాలో ఐదింట మూడు వంతులు బియ్యాన్ని ఆహారంగా వినియోగిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలు ఉప్పుడు బియ్యాన్ని ప్రధాన ఆహారంగా తీసుకుంటున్నారు. 2008-09లో దేశంలో 99.37మిలియన్‌ టన్నుల బియ్యం ఉత్పత్తి కాగా 77.63మిలియన్‌ టన్నుల గోధుమలు ఉత్పత్తి అయ్యాయి.  1965 నుండి 1980వరకు జరిగిన మొదటి హరిత విప్లవకాలంలో భారత ప్రభుత్వం బియ్యం, గోధుమల ఉత్పత్తిపై ప్రధానంగా కేంద్రీకరించింది. 1947లో భారత దేశ జనాభా 35కోట్లు కాగా 5కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు మాత్రమే ఉత్పత్తి అయ్యాయి. నాడు ఆహార ధాన్యాల దిగుమతి తప్పనిసరిగా జరిగింది. 1965 హరిత విప్లవం కాలంలో ఆహారధాన్యాల ఉత్పత్తి నాలుగు రెట్లు పెరగ్గా జనాభా మూడు రెట్లు పెరిగింది. నేడు ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్దంగా వుంది. నేటికీ భారత ప్రభుత్వం బియ్యం, గోధుమల ఉత్పత్తి పెంపుదలపై కేంద్రీకరించాల్సినంతగా నిధుల కేటాయింపులో కాని, పరిశోధనల్లో గాని శ్రద్ద చూపడంలేదు.
పూర్వ రంగం :
1965లో బియ్యం ఉత్పత్తి పెంచడానికి థాయ్‌లాండ్‌ నుండి అధికోత్పత్తి వంగడాలను దిగుమతి చేసుకున్నాం. అంతకు ముందు సాధారణ వంగడాలు వినియోగించడంవల్ల ఉత్పాదకత హెక్టారుకు 2-3 టన్నుల మధ్య దిగుబడి వచ్చింది. విత్తనంలో మార్పుతేకుండా ఉత్పాదకత పెరగదని గ్రహించిన భారత వ్యవసాయ శాఖ అధికోత్పత్తి వంగడాలను, హైబ్రిడ్‌ వంగడాలను రూపొందించి ఉత్పత్తిని పెంచింది. మొట్టమొదట తైచుంగ్‌ -1 మరియు ఐ.ఆర్‌.-8 విత్తనాలను దిగుమతి చేసుకొని దేశీయ వరి విత్తనాలతో సంకరపరచి ఉత్పత్తి పెంపుదలకు దోహదం చేశారు. ఉత్పాదకత హెక్టారుకు 7 టన్నుల వరకు ఉత్పత్తి పెరిగింది. హరిత విప్లవ కాలంలో సాగునీటి వనరులున్న డెల్టా ప్రాంతాల్లో ప్రధాన కేంద్రీకరణ జరిగింది. వ్యవసాయ శాఖ ప్రతి గ్రామం వెళ్ళి సకాలంలో సలహాలు ఇచ్చి ఉత్పత్తి పెంపుదలకు తోడ్పడిరది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిని 1980 నుండి పెంచలేకపోతున్నాము. 2001-08లో జనాభా 1.9శాతం పెరగ్గా ఆహార ధాన్యాల ఉత్పత్తి 1.1 శాతంగా వుంది. 2007-08లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 5%గా వుంది. కాని నేడు ఉత్పత్తి, ఉత్పాదకత తగ్గుతుంది.
ఆహరదాన్యాల ఉత్పత్తి :
దేశంలో ఆహర దాన్యాల ఉత్పత్తి నిలకడగా కొనసాగుతున్నది.
భారత దేశంలో         బియ్యం,         గోధుమలు     ఉత్పత్తులు     ఈ విధంగా వున్నాయి.
వివరం            1960-61    1990-91    2000-2001    2008-09
బియ్యం            34.6        74.3        85.0        99.37 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల్లో
విస్తీర్ణం            34.1        42.2        44.7        45.6 మిలియన్‌ హెక్టార్లలో
ఉత్పాదక        1013        1740        1901        2177 హెక్టారుకు/ కిలోలు
గోధుమలు         11        55.1        69.7        77.6 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల్లో
విస్తీర్ణం            12.9        24.2        25.7        27.7 మిలియన్‌ హెక్టార్లలో
ఉత్పాదక        851        2281        2708        2806 హెక్టారుకు/ కిలోలు
    వరి, గోధుమలు పంటలలో విస్తీర్నం, ఉత్పాదకతలో పెరుగుదలలు వినియోగం మాత్రం పెరుగుతూనే వుంది.
వినియోగం :
తలసరి ఆహారధాన్యాల వినియోగం తగ్గుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వ్యక్తి ప్రతిరోజు 2400 కేలరీ శక్తిగల ఆహారం,  పట్టణ ప్రాంతాల్లో 2100 కేలరీల శక్తిగల ఆహారం తీసుకోవాలి. కాని నేడు 1500-1700 కేలరీలమధ్య ఆహారాన్ని మాత్రమే తీసుకుంటున్నారు.  113కోట్ల భారత జనాభాలో 40కోట్ల మంది గ్రామీణ ప్రాంతాల్లో, మురికివాడల్లో నివసించేవారు రోజుకు ఒకపూట భోజనం మాత్రమే చేస్తున్నారు. వీరి ఆదాయం రోజుకు రూ. 20 లకన్నా తక్కువ వుంది.2003-04 ఆహార నివేదికలో దేశంలో 27శాతం దారిద్య్రరేఖకు దిగువన వున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇదే సంఖ్యను టెండూల్కర్‌ కమిటీ 37శాతాంగా ప్రకటించింది. అనంతరం సక్సేనా కమిటీ 50శాతంగాను, చివరిగా అర్జున్‌సేన్‌ గుప్తా కమీషన్‌ 77శాతంగాను దారిద్య్రరేఖకు దిగువన వున్నట్లు నివేదిక లిచ్చారు. రోజుకు రూ.ల20 లకు మించిఖర్చుచేయనివారిని ఒక కమిటీ పరిగణనలోకి తీసుకుంటే మరో కమిటి రోజు ఒకకుటుంబం రూ. 100లమించి ఖర్చుచేయనివారిని దారిద్య్రరేఖకు దిగువన వున్నట్లు సూచించింది. ఏది ఏమైనా 113కోట్ల జనాభాలో 40కోట్ల మంది ఆహార కోరతతో ఇబ్బందులు పడుతున్నారు.  ఆహారమే అందుబాటులో లేనప్పుడు పౌష్టికాహారం గురించి ఆలోచించగలమా?  నేడు అనేక మంది యువతీ, యువకులు రక్తహీనతకుగురై రోగనిరోధక శక్తి కోల్పోయి జీవచ్చవాలుగా వుంటున్నారు.  వీరికి ఆహార భద్రత చట్టం అత్యంత అవసరం. కాని బహుళ జాతి సంస్థల ప్రయోజనాలు కాంక్షిస్తున్న ప్రభుత్వం వీరికి ఆహార భద్రతను కల్పించగలదా?  అయినా కేంద్ర ప్రభుత్వం నిరంతరం ఆహార భద్రత గురించి, పార్లమెంట్‌లో చట్టం తేవడం గురించిపదే పదే ప్రచారం చేసుకుంటున్నది.
తలసరి రోజువారీ వాడకం (గ్రాముల్లో) ఈ విధంగా వుంది
సంవత్సరం    ఆహారధాన్యాలు     పప్పులు        మొత్తం
1951        334.2గ్రా    60.7గ్రా        394.2
1970        403.1        51.9        455.0
1990        435.3        41.1        476.4
2007        407.4        35.5        442.8
నోట్‌ : 2002లో 458.7 గ్రాముల తలసరి ఆహార ధాన్యాలు (పప్పుధాన్యాలు మినహా) ఆహారాన్ని వినియోగించారు.
  నేడు ఈ వినియోగం మరింత తగ్గుతున్నది.అదే సందర్భంలో జాతీయ తలసరి ఉత్పత్తి  పెరుగుదల అనే రెట్లు వుంది. 1950-51 మధ్య తలసరి ఉత్పత్తి రూ. 225లు కాగా , 2007-08లో రూ. 33,283లు గా వుంది.  జాతీయ ఉత్పత్తి అనేక రెట్లు పెరిగినా ఆహార ధాన్యాల వినియోగం మాత్రం పెరగలేదు. 1985 నుండి వరి ధాన్యం ఉత్పత్తి, ఉత్పాదకత దాదాపుగా నిలిచిపోయింది.
సాగునీటి వసతి :
దేశంలో సాగునీటి వసతిపై కేంద్రీకరణ అంతగా లేదు. దేశంలో 1640 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నీటి నిలువలు ఉండగా వాటిని పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నాము. ఇప్పటికీ బంగాళాఖాతంలోకి ఏటా గంగా, బ్రహ్మపుత్ర, కృష్ణా, గోదావరి, కావేరి మహానదుల నుండి వేలాది టిఎంసిల నీరు చేరుతుంది. ఈ నీటిని వినియోగించుకోవడానికి తగిన కట్టడాలు నిర్మాణం చేయాలన్న లక్ష్యం కేంద్ర రాష్ట్ర  ప్రభుత్వాలకు లేదు.
మిలియన్‌ హెక్టారుల్లో సాగునీటి వనరులు ఈ విధంగా వున్నాయి.
పంట            1970-71    2000-01    2006-07
బియ్యం (వరి)        14.34        24.34        24.87 మి. హెక్టార్లు
నీటివినియోగంలో        38.4%        54.4%        56.7%
గోధుమలు        9.92        22.80        25.54 మి. హెక్టార్లు
నీటివినియోగంలో        54.3%        88.4%        90.2%
పై పట్టికను పరిశీలిస్తే వరి ఉత్పత్తిలో లభ్యతగల నీటిలో సగానికి మాత్రమే వినియోగిస్తున్నాము.
సాగునీటి సంస్కరణలు:-    జీవో 37 ద్వారా నీటి సంస్కరణలను ప్రభుత్వం కొనసాగిస్తున్నది. నీటిని వ్యాపారంగా మార్చే ప్రక్రియ చేపట్టింది. సాగునీటి మీటర్లు పెడుతున్నారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ పార్మర్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ ఇరిగేషన్‌ యాక్ట్‌’’ను తెచ్చారు. బోరు, బావులు వేయకుండా ఆంధ్రప్రదేశ్‌ నీరు, భూమి, చెట్టు యాక్ట్‌ను 2002లో తెచ్చారు.  ‘‘2007 జూన్‌లో జివో 95 ద్వారా’’ నీటి యాజమాన్య కమిటీ ద్వారా’’ నీటి యాజమాన్య కమిటీ’’ ఏర్పాటు చేశారు. రాష్ట్ర నీటి విధానాన్ని 2008లో రూపొందించింది. 2009 నవంబరు 21న 108 కోట్ల వ్యయంతో సాగునీటి మీటర్లు బిగించడానికి టెండర్లు పిలిచారు. నీటిని వ్యాపార సరుకుగా మార్చారు.
ప్రైవేటీకరణ, వాణిజ్యీకరణ ద్వారా సాగునీటిని వ్యాపార సరుకుగా మార్చివేస్తున్నారు. 
శ్రీవరి సేద్యం: నూతన టెక్నాలజీ ద్వారా ‘‘ వరి ఉత్పత్తిలో నూతన విధానం’’ అను టెక్నాలజీని శ్రీలంకా నుండి భారత వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టారు. ఈ విధానం వలన వరి ఉత్పదక పెరుగుతుంది. కాని నీరు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఉపయోగపడుతుంది. వాతావరణ పరిస్థితులు అనుకులంగా ఉండాలి. ఎరువులు, క్రిమిసంహరక మందుల వాడకం శాస్త్రీయంగా ఉండాలి. కొందరికి ఫలితాలు బాగా వచ్చినప్పటికి దీనికి విస్తృతమైన ప్రచారం లేదు. మెట్ట భూమిలో వరిసేధ్యం చేయడానికి గల అవకాశాలను పరిశీలించడంలో ప్రభుత్వాలు చొరవ చూపడం లేదు.
కేంద్ర ` రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతలు :
రాజ్యాంగం రీత్యా వ్యవసాయ రంగం రాష్ట్ర జాబితాలో వుంది. పంటల ఉత్పత్తి, ధరల నిర్ణయం, విత్తనాలు, సాగునీటి వనరుల కల్పనల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలి. సాగునీటి వనరుల కల్పనకు కొన్ని సందర్భాల్లో కేంద్రం ఎఐబిపి నిధుల ద్వారాగాని నేరుగా ఆర్‌.ఐ.డి.ఎఫ్‌. ద్వారా గాని సహకారం అందిస్తుంది.
వ్యవసాయ పరిశోధనలు, ఎగుమతి, దిగుమతుల విధానం, ఉత్పత్తి పెంపుదలకు తీసుకోవాల్సిన చర్యలు, రాజ్యాంగ రీత్యా కేంద్ర జాబితాలో వున్నాయి. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా వుండడం ఫలితంగా సాగునీటి వనరుల నిర్మాణంలో విపరీతమైన జాప్యం జరుగుతుంది.  కేంద్రం అనుమతులు లేక అనేక ప్రాజెక్టులు నిర్మాణం కావడంలేదు. పైగా అంతరాష్ట్ర తగాదాలు ముందుకు వస్తున్నాయి.  దేశంలోని రైతు కమతాలలో 86% కమతాలు 5ఎకరాలకు లోపు కలిగినవారు. ఈ సన్న, చిన్న కారు రైతుల వద్ద 40శాతం సాగుభూమి కేంద్రీకరించబడి వుంది. ఉత్పత్తిలో వీరు 50%పైగా ఉత్పత్తి చేస్తున్నారు. ప్రధానంగా మైనర్‌ ఇరిగేషన్‌ (చెరువులు) బావులు, లిప్టు పథకాల కింద వరిసాగు చేస్తున్నారు. ఇది చాలా వ్యయభారాలతోకూడిన పని.
చైనా 25 కోట్ల ఎకరాలు సాగు చేస్తూ, 50 కోట్ల టన్నుల ఆహార దాన్యాల ఉత్పత్తి చేస్తున్నది. భారతదేశం 40 కోట్ల ఎకరాలు సాగు చేస్తూ, 20`22 కోట్ల టన్నులు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నది. చైనా ఉత్పత్తితో పరిశీలించినప్పుడు మన దేశ ఉత్పత్తి 50శాతంగా ఉన్నది. ప్రస్తుతం మనం సాగు చేస్తున్న భూమితో ఉత్పత్తిని రెండు రెట్లు అనగా, కనీసం 60 కోట్ల టన్నులు ఉత్పత్తి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ ఉత్పాదకత పెరగడానికి కేంద్ర ప్రభుత్వం అదనపు నిధులు కేటాయించి పరిశోధనలు చేయాలి. కానీ, మన దేశంలో సాగుభూమి బీడు భూములుగా ప్రభుత్వ విధానాలు మార్చుతున్నాయి. ఆహార కొరతతో భద్రతకు అతి త్వరలో ప్రమాదం వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి.   
భూ వినియోగం :
దేశంలో సాగుభూములు విస్తరించడానికి నేడు ప్రభుత్వాల విధానాల ఫలితంగా బీడులుగా మారుతున్నాయి. కోట్లాది ఎకరాల భూమి నేడు దేశంలో బీడుగా మారింది. దీనిని సాగులోకి తీసుకురావడానికి ప్రభుత్వాలు  ఎలాంటి పథకాలు రూపొందించడంలేదు. ఈ దిగువ పట్టికలో లక్షల హెక్టార్లలో బీడుగా మారిన వివరాలు చూపబడ్డాయి.
భూ వివరాలు        2001-02        2002-03    2003-04
బీడుగా మారినది   249.27            332.39        260.43
నికర సాగు           1413.83          1327.98      1408.83
సాగునీటి వనరులు    558.53        531.48        551.05
    పై పట్టికను పరిశీలిస్తే సాగు విస్తీర్ణం పెరగలేదు. సాగునీటి విస్తీర్ణంకూడా పెరగలేదు. ఈరెండు పెరగకుండా వరి ధాన్యం ఉత్పత్తి పెంచడం సాధ్యంకాదు.
సరళీకృత ఆర్థిక విధానాలు :
సరళీకరణ ఆర్థిక విధానాల ఫలితంగా వరి పండే పొలాలను ‘‘స్పెషల్‌ ఎకానిమిక్‌ జోన్స్‌’’ కింద లక్షలాది ఎకరాలు సేకరిస్తున్నారు. దీనివల్ల వరి ధాన్యం ఉత్పత్తి పెరుగుదలకు ఆటంకం ఏర్పడిరది. దీనికితోడు పంటల మార్పిడి విధానాన్ని ప్రవేశపెట్టడంతో వరిధాన్యం విస్తీర్ణం నిలకడగా వుంటుంది. విత్తన రంగం బహుళజాతి సంస్థల ఆధీనంలోకి వెళ్లడంతో విత్తన ధరలు విపరీతంగా పెరిగాయి. వరిధాన్యంలోకి కొత్త జీన్స్‌ (విటమిన్స్‌) ప్రవేశపెట్టడం ద్వారా వరి రోగనిరోధక శక్తి తోపాటు ప్రజలకు ఆరోగ్యకరంగా వుంటుందని బహుళజాతి సంస్థలు చెపుతున్నాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వరి పరిశోధనలను - టెక్నాలజీ అభివృద్ధి పరచడాన్ని విరమించుకున్నాయి. కనీస మద్దతు ధరలు పెంచకపోవడం ఫలితంగా వరి పండిరచాలన్న ఉత్సాహం రైతుల్లో సన్నగిల్లుతుంది.
కనీస మద్దతు ధరలు ఈ విధంగా వున్నాయి. (క్వింటాలుకు రూపాయల్లో)
వివరణ        1988-89        1998-99        2004-05        2010-11
ఎ గ్రేడ్‌ ధాన్యం    170            470            560        1030 క్వింటాలు రూపాయల్లో
ఉత్పత్తి వ్యయం    200            500            725        800 క్వింటాలు రూపాయల్లో
    కేంద్ర ప్రభుత్వం నియమించిన డా॥ ఎం.ఎస్‌. స్వామినాథన్‌ కమీషన్‌ మార్కెట్‌ ధరలు పెంచాలని సూచించింది. ఉత్పత్తి వ్యయానికి 50% కలిపి కనీస మద్దతు ధర నిర్వహించాలని సూచించింది. రాష్ట్రాల సిఫార్సులను, ధరల నిర్ణాయక సంఘం సిఫార్సులను  భారత వ్యవసాయ శాఖ పెడచెవిన బెట్టి ఏటా గత సంవత్సరంపై రూ. 20 నుండి 30లు పెంచి ప్రకటిస్తుంది. మరొకవైపున వరిపంటకు వినియోగించే ఉపకరణాల ధరలు (విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారకమందులు, మార్కెట్‌) ధరలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. అందుకు తగినట్లు కనీస మద్దతు ధరలు పెంచడానికి ప్రభుత్వం సుముఖంగా లేదు. అదే సందర్భంలో రాష్ట్రాలు కనీస మద్దతుధరలు నిర్ణయించి అమలుజరిపే బాధ్యత వుంది. కాని ఆ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలు పాటించడంలేదు.
కొనుగోలుదారులు పాత్ర :
ధాన్యం కొనుగోలులో మధ్యదళారీల పాత్ర కీలకమైనది. భారత ఆహార సంస్థ తన బాధ్యతను పూర్తిగా విస్మరించడం ఫలితంగా రైతులు విధిగా ధాన్యాన్ని మధ్య దళారీలకు, వారు కోరిన ధరకు అమ్ముకోవాల్సి వస్తుంది. నేడు భారత ఆహార సంస్థ (ఎప్‌సిఐ), ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌లలో 69.7 శాతం వరి ధాన్యాన్ని సేకరిస్తున్నాయి. బఫర్‌ స్టాక్స్‌ పేరుతో 12.2మిలియన్‌ టన్నుల బియ్యం 4 మిలియన్‌ టన్నుల గోధుమలు మాత్రమే నిల్వ పెట్టాలి. కనీస నిల్వలు 16.2 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు వుండాలి. ఎఫ్‌సిఐ సేకరణ ఈ విధంగా వుంది. (మిలియన్‌ టన్నుల్లో) 2004-05సం.లో - 24, 2005-06 సం.లో - 26.7, 2006-07సం.లో - 26.3, 2007-08 సంలో - 26.3, 2008-09సం.లో- 32 మిలియన్‌ టన్నులు సేకరించింది.
భారత ఆహార సంస్థ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యాన్ని దేశంలో పంపిణీ చేస్తుంది. 1951లో 3.80 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు, 1990లో 24, 2004 సం.లో - 41.1, 2009సం.లో 45మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు పంపిణీ చేసింది. ఈ పంపిణీ మేరకైనా వరి ధాన్యాన్ని ఎఫ్‌సిఐ సేకరించాలి. కాని గోదాముల్లో నిల్వ శక్తి లేదనే పేరుతో సేకరణను తగ్గిస్తున్నారు. 2009-10లో భారత ప్రభుత్వం ఆహార సబ్సిడీ కింద 9 రాష్ట్రాలకు రూ. 8074కోట్లు కేటాయించింది. ఆహార సబ్సిడీ కేటాయింపుగాని, పంపిణీవిధానంలోగాని శాస్త్రీయత లోపించింది. సబ్సిడీ పథకాన్ని కోతపెడుతూ క్రమంగా ఎత్తివేసే ప్రయత్నం కేంద్రం చేస్తున్నది. ఈ రంగంలోకి బహుళజాతి సంస్థలు వచ్చాయి.
కేంద్ర బడ్జెట్‌ :
2010-11లో వ్యవసాయ రంగానికి ప్రణాళికా బడ్జెట్‌ కింద రూ. 8280 కోట్లు  కేటాయింపు చూపింది. మొత్తం ప్రణాళికా బడ్జెట్‌లో ఇది 2.2 శాతం మాత్రమే. పరిశోధనలకు, యూనివర్సిటీ వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు నిధుల కేటాయింపులో కోతపెట్టింది. బీహార్‌, చత్తీస్‌ఘడ్‌, జార్ఖండ్‌, తూర్పు ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, ఒరిస్సాలకు రెండవ హరిత విప్లవ పథకం కింద రూ. 400కోట్లు మాత్రమే కేటాయించింది. దీనిని బట్టి వరిధాన్యం ఉత్పత్తిలో కేంద్రానికి వున్న శ్రద్ద అర్థమౌతుంది. వ్యవసాయ రంగంలోకి ప్రైవేట్‌ పెట్టుబడులు పెద్దఎత్తున వస్తుండగా పబ్లిక్‌ రంగ పెట్టుబడులను తగ్గిస్తున్నారు. 2008-09 సంవత్సరాన్ని పరిశీలిస్తే పబ్లిక్‌ రంగ పెట్టుబడులు రూ. 24452 కోట్లు (17.6శాతం) కాగా ప్రైవేట్‌ పెట్టుబడి 1,14,145కోట్లు (82.4శాతం) హెచ్చిస్తున్నారు. క్రమంగా వరిధాన్యం పండే ప్రాంతాన్ని కూడా కార్పోరేటీకరించాలని, ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తుంది.
ప్రపంచ ఆహారధాన్యాల వినియోగం :
2008-09లో ప్రపంచ ఆహార ధాన్యాల వినియోగం ఉత్పత్తి ఈ విధంగా వుంది.(మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల్లో) వరాలు    ఉత్పత్తి    వినియోగం
బియ్యం        456        448
గోధుమలు    682        649
మొత్తం        1144        1097
    ప్రపంచంలో 100కోట్ల మంది ప్రజలు వరి ఆహారం కొరత వుందని ప్రపంచ ఆహార సంస్థ తన నివేదికలో వివరించింది. మెక్సికో, సోమాలియా, ఆఫ్రికా దేశాలలో అనేకమంది ప్రజలకు కనీస ఆహార లభ్యత లేదు.  నేడున్నపరిస్థితుల్లో బియ్యం ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం వుంది.
1974లో  మొట్టమొదటిసారి ప్రపంచంలో జరిగిన ఆహార సమావేశంలో అమెరికా  కార్యదర్శి హెన్రీ కిసింజర్‌ ప్రకటన చేస్తూ 1984 వరకు అందరికి ఆహార భద్రత కలుగుతుంది అని అన్నారు.  1990లో 8.24కోట్ల మంది  ఆహార కొరత ఎదుర్కొంటుండగా ఈ సంఖ్య 2009 నాటికి 10.20 కోట్లకు చేరింది.  ఆఫ్రికా లోని 15 దేశాల్లో 35% ప్రజలు ఆకలిబారిన పడ్డారు. దక్షిణాసియాలో 46 శాతం మంది చిన్న పిల్లలు బరువు తక్కువగా జన్మిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే 1950లో భారత ప్రజలు తీసుకున్న ఆహారం నేడు తీసుకోవడంలేదు.  
అమెరికా అధ్యక్షుడు భారత ఆహార వ్యవస్థ గురించి మాట్లాడుతూ ‘‘ భారత ప్రజలు ఆహారం ఎక్కువ తీసుకోవడంవల్ల ప్రపంచంలో ఆహార కొరత ఏర్పడిరది’’ అని ప్రకటించారు.  మూడవ ప్రపంచ దేశాల్లో బియ్యం, గోధుమలు, ప్రధాన ఆహారం. అమెరికాలో వృక్షసంబంధమైన ఉత్పత్తులు, పశుసంబధమైన ఉత్పత్తులను ఆహారంగా వినియోగించడంవల్ల వారి ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తున్నారు. వారి ఎగుమతులకు అనుకూలంగా 3వ ప్రపంచ దేశాల్లో వరి ఉత్పత్తిని తగ్గించడానికి డబ్ల్యుటిఓ, ప్రపంచబ్యాంకు, ఐయంఎఫ్‌ సంస్థల ద్వారా ఆదేశాలపై వత్తిడి తెస్తున్నది.
 ఫలితంగా దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిరది. దిగుమతులు ఈ విధంగా వున్నాయి. (మిలియన్‌ టన్నుల్లో)
వివరం        1969-61    2000-01    2008-09
బియ్యం        37.47        3.08        0.34
విలువ కోట్లల్లో    181        182        152
                ఎగుమతులు
బియ్యం        0.32        5.52        19.46
విలువ కోట్లల్లో    5        462        8101
    దేశీయ వినియోగ అవసరాలను గుర్తించకుండా భారత ప్రభుత్వం బియ్యం ఎగుమతులకు అవకాశాలు కల్పిస్తున్నాయి.  వాస్తవానికి భారత దేశంలో ప్రతి వ్యక్తికి ఆహార ధాన్యాల లభ్యత కావాలంటే బియ్యం ఉత్పత్తులు కనీసం 120మిలియన్‌ టన్నులు ఉత్పత్తి కావాలి. అందుకు తగిన అవకాశాలు కూడా వున్నాయి. కాని ఆ అవకాశాన్ని వినియోగించడానికి ప్రభుత్వాలు సుముఖంగా లేవు.
బయోడీజిల్‌ వినియోగం :
పెట్రోల్‌ ధరలు అపరిమితంగా పెరగడంతో అమెరికా ఆహార ధాన్యాలను బయోడీజిల్‌ ఉత్పత్తికి వినియోగిస్తున్నది. వరి పండే ప్రాంతాల్లో జట్‌రోపా లాంటి బయో సీడ్స్‌ను పెంచడానికి భూమిని కేటాయిస్తున్నారు. నేడు ఆహార ధాన్యాలు బయోడీజిల్‌కి వినియోగించడంతో ధరలు విపరీతంగా పెరిగిపోయి, పేదలు బియ్యం కొనలేని స్థితికి చేరుకున్నారు.
సూచనలు  :     (1) వరి, ధాన్యం, ఉత్పత్తి పెంచడానికి నూతన విత్తనాల ఆవిష్కరణలు పెద్ద ఎత్తున జరగాలి. ఇందుకు                     కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించాలి. పరిశోధనలు బహుళజాతి సంస్థల ప్రమేయాన్ని నిషేధించాలి.
        (2) ధాన్యం ఉత్పత్తికి కావాల్సిన ఉపకరణాలను ప్రభుత్వం రాయితీపై సరఫరా చేయాలి.
        (3) విత్తన చట్టాన్ని రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా వుండాలి.  రాష్ట్రాలకు విత్తన చట్టంపై                     పూర్తిబాధ్యత వుండాలి.
        (4) మెట్టభూముల్లోకూడా వరి పండిరచడానికి వీలుగా విత్తనాలు కనిపెట్టాలి.
        (5) కనీస మద్దతు ధరల నిర్ణయాన్ని డా॥ ఎం.ఎస్‌ స్వామినాథన్‌ సూచనల మేరకు అమలు చేయాలి.                     భారత ఆహార సంస్థ రాష్ట్రాల సివిల్‌ సప్లయ్‌ సంస్థలు, మార్కెటింగ్‌ సంస్థలు కొనుగోల్లో పూర్తి బాధ్యత                     తీసుకొని మధ్యదళారులను తొలగించాలి. 
        (6) దేశీయ అవసరాలకు సరిపోగా మిగిలిన బియ్యాన్ని మాత్రమే ఎగుమతులకు అంగీకరించాలి.                     ప్రజాపంపిణీ వ్యవస్థను మెరుగుపరిచి ప్రతి వ్యక్తికి ఆహార భద్రత కల్పించాలి.
        (7) సాగునీటి వనరుల కల్పనను పెంచాలి.  కేంద్రం నిధులు కేటాయించాలి.  వరి పండిరచే రైతులకు                     కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇవ్వాలి.
తేది:01.12.2010  
సారంపల్లి మల్లారెడ్డి
ఉపాధ్యక్షులు, 

అఖిల భారత కిసాన్‌ సభ

No comments:

Post a Comment