Wednesday, 13 August 2014

నిరాశపర్చిన వ్యవసాయ బడ్జెట్‌

              అనేక ఉద్యమాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ బడ్జెట్‌కు నాందిపలికింది. బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ముందు అన్ని పక్షాలతో చర్చించి, వారి సలహాలు తీసుకుని, వాటిని బడ్జెట్‌లో పొందుపరుస్తామని చెప్పిన వ్యవసాయ శాఖా మాత్యులు తీర బడ్జెట్‌లో అవేవీ గమనంలోకి తీసుకోకుండానే 15శాఖల బడ్జెట్లను ఒకచోట చేర్చి వ్యవసాయ బడ్జెట్‌గా ప్రకటించాడు. 25,962 కోట్ల రూపాయల బడ్జెట్లో రు.14,679.50 కోట్ల ఇరిగేషన్‌ బడ్జెట్‌, రు.3,621.99 కోట్ల ఉచిత విద్యుత్‌ సబ్సిడీని కలిపి ఈ బడ్జెట్‌ను పెంచి చూపారు. ఇరిగేషన్‌ ప్రత్యేకించి వ్యవసాయ రంగానికే కాక, త్రాగునీటికి, పారిశ్రామిక రంగానికి, వరదల నివారణకు, ఇతర రంగాలకు వినియోగమవుతున్నది. వ్యవసాయ బడ్జెట్‌లో గతంలో వ్యవసాయం, తోటలు మరియు పట్టు శాఖలకు మాత్రమే స్థానం కల్పించారు. ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ పేర వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు ప్రణాళికేతర నిధుల కేటాయింపుతో పాటు, పంట రుణాలు రు.72,450 కోట్లు కూడా బడ్జెట్‌కు బయట కేటాయించామని చూపారు. ఈ బడ్జెట్‌తో ప్రస్తుత వ్యవసాయ సంక్షోభం పరిష్కారం కాదు.
        వ్యవసాయ శాఖ విస్తరణ ఖాళీలు పూర్తిచేసి, ప్రతి ఐదు గ్రామాలకు ఒక యూనిట్‌గా ఏర్పాటు చేసి ఆ  కేంద్రం నుండి రైతులకు సహకరించాలి. యంత్రాలను అద్దెలకు ఇవ్వడం, భూసార పరీక్షలు నిర్వహించడం, విత్తనాలు`ఎరువుల వినియోగాన్ని రైతులకు తెలియపర్చడం, స్థానికంగా విత్తనాలు ఉత్పత్తి చేసి వారికే సరఫరా చేయడం జరపాలి. రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ ద్వారా, మార్కెట్‌ కమిటీల ద్వారా, సహకార సంఘాల ద్వారా వ్యవసాయ ఉపకరణాలను రైతులకు అందించాలి. ప్రకృతి వైఫరిత్యాల వలన పంటలకు నష్టం వాటిల్లినప్పుడు ఎకరాకు రు.10వేలు చెల్లించే విధంగా బడ్జెట్‌లో పొందుపర్చాలి. భీమా వాస్తవ సాగుదారుకు చెల్లించే విధానం ఉండాలి.  ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు అమలు కానప్పుడు తక్కువ ధరకు అమ్ముకున్న రైతులకు నష్టపోయిన సొమ్మును ప్రభుత్వం చెల్లించే విధంగా బడ్జెట్‌ కేటాయింపులు చేయాలి. చిన్న`సన్నకారు రైతులకు ఉపయోగపడే యంత్రాలను విరివిగా పూర్తి సబ్సిడీపై అందించాలి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ కృషి విజ్ఞాన యోజన క్రింద నిధులు కేటాయిస్తున్నది. అనుబంధ రంగాలైన తోటల పెంపకం, పశు సంక్షేమంకు తగిన నిధులు కేటాయించాలి.  వడ్డీలేని రుణం చెల్లించే విధంగా ముందే నిధులు కేటాయించాలి. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం రుణ సౌకర్యం కల్పించాలి. ఆత్మహత్యలకు పాల్పడకుండా అందుకు  కారణమైన చర్యల నివారణకు కృషి సల్పాలి. పై కోర్కెలను రైతు సంఘాలు ప్రభుత్వం ముందు పెట్టాయి. కానీ ప్రభుత్వం ఇవేవీ గమనంలోకి తీసుకోలేదు.
బడ్జెట్‌ ఏర్పాటుకు ముందు కర్నాటక, చత్తీస్‌ఘడ్‌, అమెరికా పర్యటనలు చేసారు. కానీ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్‌ను రూపొందించడంలో ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా వైఫల్యం చెందింది. ఇప్పటికైనా బడ్జెట్‌ను తిరిగి సమీక్షించి వ్యవసాయ సంక్షోభ నివారణకు అనుకూలంగా రూపొందించాలి. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, అందరి అభిప్రాయాలు తీసుకుని రూపొందించాలి. ప్రధానంగా ఆత్మహత్మల నివారణ లక్ష్యంగా బడ్జెట్‌ రూపొందించడానికి ప్రభుత్వం చర్యలుచేపట్టాలి.
 25.03.2013
సారంపల్లి  మల్లారెడ్డి

No comments:

Post a Comment