Thursday, 14 August 2014

ప్రభుత్వాలు మానిఫెస్టోలు అమలు జరపాలి

    తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ పాలకపక్ష పార్టీగా అవతరించింది. తన మానిఫెస్టోలో ‘‘రైతులందరికీ రుణమాఫీ, 8 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు, పంపుసెట్లపై సర్‌ఛార్జీ రద్దు, విత్తనోత్పత్తి కేంద్రంగా తెలంగాణ, నిజామాబాద్‌ జిల్లాలో చెరుకు, పసుపు పరిశోధనా కేంద్రాల ఏర్పాటు గ్రీన్‌ హౌస్‌ కల్టివేటర్‌లకు 75శాతం సబ్సిడీ, చిన్న సాగునీటి వ్యవస్థ పునరుద్ధరిస్తామని’’ టిఆర్‌ఎస్‌ ప్రకటించింది.
    అదేవిధంగా తెలుగుదేశం తన మానిఫెస్టోలో ‘‘వ్యవసాయ రుణాలమాపీపై తొలిసంతకం చేస్తానని, ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశపెట్టడం, మెట్ట ప్రాంతాలకు సాగునీటి కల్పన, వాటర్‌హార్వెస్టింగ్‌, వాటర్‌షెడ్‌ పథకాలు, రోజుకు 9 గంటల ఉచిత విద్యుత్‌, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, రు.1000 కోట్లతో మార్కెట్‌ ఇన్‌టర్‌వెన్షన్‌ఫండ్‌ ఏర్పాటు మరియు ఎం.ఎస్‌ స్వామినాధన్‌ చెప్పినట్టు వ్యవసాయ పంటలకు కనీస మద్ధతు ధర నిర్ణయం చేస్తామని’’ ప్రకటించారు.
    వాస్తవానికి రుణమాఫీలు చేయాలంటే 29.05.2014 రోజున జరిగిన బ్యాంకర్ల కమిటీ సమీక్ష ప్రకారం రైతుల బకాయిలు ఆంధ్ర ప్రదేశ్‌లో రు.87,612 కోట్లు, తెలంగాణ రాష్ట్రంలో రు.49,564 కోట్లు ఉన్నాయి. టిఆర్‌ఎస్‌ పార్టీ మరియు టిడిపి పార్టీలు ప్రకటించినట్లు రుణాలు రద్దు చేయాలంటే మొత్తం రు.1,37,176 కోట్లు రద్దు చేయాలి. ఇది రాష్ట్ర బడ్జెట్‌ నుండే భరించాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకులకు కౌంటర్‌ గ్యారంటీ ఇవ్వడం ద్వారా రుణాలు రద్దు చేసే అవకాశం ఉంటుంది. రుణమాఫీ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించుకోవాలనుకుంటే ఒక సంవత్సరం వాయిదా మీరిన బాకీ కాకుండా 3 సంవత్సరాలు వాయిదా మీరిన బాకీలు(ఎన్‌.పి.ఎలలు) మాత్రమే రద్దు చేస్తామంటే అది రు.22,655 కోట్లకు పరిమితం అవుతుంది. కానీ రైతులు మొత్తం రుణాలు రద్దు అవుతాయని ఆశిస్తున్నారు. ఇప్పటికే సాగు సీజన్‌ మొదలైంది. జూన్‌ 15 నాటికి రైతులందరికీ రుణ పంపిణీ జరగాలి. ఇందులో కౌలుదారులకు మరియు ఇంత వరకు రుణం పొందని కొత్త రైతులకు రుణ సౌకర్యం కల్పించాలి. రెండు రాష్ట్రాలలో కలిపి 25 లక్షల మంది కౌలు రైతులు మరో 25 లక్షల మంది రుణం పొందని రైతులు ఉన్నట్లు బ్యాంకులు అంచనా వేశాయి. యేటా కౌలు రైతులకు రు. 2000 కోట్లు లక్ష్యంగా నిర్ణయిస్తూ 2011 నుండి నేటికీ యేటా రు.300 కోట్లకు మించి రుణాలు ఇవ్వలేదు. కొత్త రైతులకు యేటా 100 మందికి ప్రతి బ్రాంచి రుణాలు ఇవ్వాలని లక్ష్యం నిర్ణయిస్తున్నారు. ఈ విధానం వలన ఎన్ని దశాబ్దాలు గడిచినా రైతులకు తగినంత రుణం రాదు. అందువల్ల ప్రైవేటు వడ్డీలపై ఆధారపడి రుణగ్రస్తులై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రస్తుత కొత్త ప్రభుత్వాలు గతంలో జరిగిన లోపాలను అధిగమించాలి.
    ముఖ్యంగా వాస్తవ సాగుదారుపేరు రెవెన్యూ రికార్డులో నమోదు చేసి ప్రతివాడికి పాసుపుస్తకం ఇవ్వాలి. పాసు పుస్తకం ఉంటేనే రుణసౌకర్యంతోపాటు, విత్తనాలు, ఎరువులు కొనుగోలుకు, ప్రకృతివైపరిత్యాల పరిహారం తీసుకోవడానికి, ప్రభుత్వ పథకాలను పొందడానికి ఉపయోగకరంగా ఉంటుంది. వేల కోట్ల ప్రభుత్వ పథకాలు వచ్చినప్పటికీ పాసు పుస్తకాలు లేక ఆర్హతగల వాళ్ళు తమ హక్కులు కోల్పోతున్నారు. అలాగే మైనర్‌ ఇరిగేషన్‌ రిపేర్లు సంవత్సరాల తరబడి లేకపోవడం వలన చెరువు కుంటలలో నీరు నిలువ ఉండడం లేదు. ఫలితంగా భూగర్భ జలాలు పెరగడంలేదు. చాలా మంది సన్న, చిన్నకారు రైతులు చిన్న నీటి వనరుల కిందనే సాగు చేస్తున్నారు. దాదాపుగా 85శాతంగా ఉన్న సన్నచిన్నకారు రైతులకు చిన్ననీటి వనరులతోపాటు లిప్టు పథకాల కింద సేద్యానికి వీలుగా సాగునీటి సౌకర్యం కల్పించాలి. ఉభయ రాష్ట్రాలలో 1850 లిప్టు పథకాలు ఉండగా వాటి కింద 7.5 లక్షల ఎకరాలు సాగువుతున్నది. ఇందులో 50 శాతం సాగుభూమి లిప్టులు పని చేయకపోవడం వలన పడావగా మారింది. తెలంగాణ జిల్లాల్లో గల 35 వేల చెరువుల కింద 16 లక్షల ఎకరాలు సాగు కావలసిన లోకలైజ్‌ ఆయకట్టు ఉండగా ప్రస్తుతం 4.5 లక్షల ఎకరాలు మాత్రమే సాగవుతున్నది. ఆంధ్రప్రదేశ్‌లో గల 37 వేల చెరువుల కింద 18 లక్షల ఎకరాలు సాగు కావలసి ఉండగా 9 లక్షల ఎకరాలు సాగవుతున్నది. దీనిపై ప్రభుత్వాలు దృష్టిపెట్టాలి. అదేవిధంగా రెండు ప్రభుత్వాలు ప్రకటించినట్లు నాణ్యతగల విద్యుత్తు 7`9 గంటలు సరఫరా చేసి 30 లక్షల బావుల కింద 40 లక్షల ఎకరాల ఆయకట్టుకు రక్షణ కల్పించాలి.
    విత్తనోత్పత్తి రాష్ట్రంలో విత్తనాల కొరతను సృష్టించి బ్లాక్‌ మార్కెట్‌లో ధరలు పెంచి రైతులను దోపిడీ చేస్తున్నారు. కనీస విత్తన చట్టం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు విత్తన చట్టాలు తెస్తామని తమ మానిఫెస్టోల్లో ప్రకటించారు. నాణ్యతగల విత్తనాలను రైతులకు అందజేయడానికి మార్కెట్‌ కమిటీల ద్వారా వాణిజ్యం నెరపాలి. బహుళజాతి సంస్థలను ఈ రంగం నుండి బహిష్కరించాలి. 2.5 ఎకరాల లోపు రైతులకు ఎరువులు విత్తనాలు పూర్తి సబ్సిడీపై ఇవ్వాలి. అప్పుడు మాత్రమే సన్నచిన్నకారు రైతులకు లబ్ది జరుగుతుంది.
    ఎరువుల కొరత రాబోతున్నట్టు ముందే ప్రకటిస్తున్నారు. రాష్ట్రానికి రావలసిన ఎరువుల కేటాయింపు తగ్గించినట్లు చెప్తున్నారు. ఈ వార్తను ప్రచారంలో పెట్టి ఉన్న ఎరువులను బ్లాక్‌ మార్కెటింగ్‌ ద్వారా అధిక ధరలకు అమ్మాలనే ప్రయత్నమే తప్ప మరొకటికాదు. రాష్ట్రంలోనున్న మిక్సింగ్‌ ప్లాంట్లు నాణ్యతలేని ఎరువులను రైతులకు అంటగడుతున్నారు. సబ్సిడీ ఎరువులను అక్రమంగా మిక్సింగ్‌ ప్లాంట్లకు తరలిస్తున్నారు. వీటిపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. రైతులకు ఎరువులు సకాలంలో అందించాలి. కల్తీలేని క్రిమి సంహారక మందులు కనీస ధరలకు అందుబాటులో పెట్టాలి. ప్రభుత్వ పథకాల కింద చిన్న రైతులకు వ్యవసాయ యంత్రాలను 90శాతం సబ్సిడీపై ఇవ్వాలి. సోయా, పొద్దుతిరుగుడు, వేరుశనగ, మొక్కజొన్న, పప్పుధాన్యాలు నూర్చే యంత్రాలను రైతులకు అందుబాటులో పెట్టాలి. భారీ యంత్రాలను నిరుత్సాహపర్చాలి. చిన్న యంత్రాలను ప్రోత్సహించాలి. దీనికి ప్రతి మండలంలో అద్దె, కొనుగోలు పద్దతిపై వ్యవసాయశాఖ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ప్రతి మండలంలో ఎరువులు, క్రిమిసంహారక మందులను పరిశీలించే ల్యాబులను ఏర్పాటు చేయాలి. వ్యవసాయశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి. ఆదర్శ రైతుల వ్యవస్థను తొలగించి వ్యవసాయ డిప్లమా హోల్డర్లను నియమించి రైతులకు సలహాలు, సహకరించే విధంగా చూడాలి. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలులో మధ్య దళారీల పాత్రను తగ్గించి ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోలు చేయాలి. వ్యవసాయాధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు అధిక ధర చెల్లించడంతోపాటు వినియోగదారులకు తక్కువ ధరకు సరుకులు అందించవచ్చు. దీనికి సివిల్‌ సప్లైయ్స్‌, మార్కెటింగ్‌ సంస్థలకు బాధ్యత అప్పజెప్పాలి. మార్కెట్‌ కమిటీలకు నేటికీ యేటా రు.500 కోట్లు పన్నులు వస్తున్నాయి. వీటిని ప్రభుత్వం ఇతర పనులకు వినియోగిస్తున్నది. అలాకాక మార్కెట్‌ యార్డునుండి గ్రామాలకు లింకు రోడ్లు, మార్కెట్‌యార్డులో త్రాగునీటి వసతులు ఏర్పాటు చేయాలి. మార్కెట్‌లకు వచ్చిన సరుకుకు నష్టం జరిగితే దానిని మార్కెట్‌ కమిటీలే భరించాలి. ఆ విధంగా రైతులకు ఏమాత్రం నష్టం జరగకుండా మార్కెట్‌ కమిటీల బాధ్యత ఉండాలి. ఉత్సాహం గల రైతు యువకులకు మార్కెట్‌ కమిటీలు, వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా ట్రేయినింగ్‌ క్లాసులు నిర్వహించాలి. పంటల భీమా పథకాన్ని రైతు ప్రయోజనాలకనుగుణంగా మార్పు చేసి అమలు చేయాలి. ప్రస్తుతం ఉన్న పంటల భీమా విధానం రైతాంగానికి ఏమాత్రం ఉపయోగకరంగా లేదు.
    పై సమస్యల పరిష్కారానికి ‘‘వ్యవసాయ అభివృధ్ధి కమిటీలను’’ మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏర్పరచాలి. ఇందులో వ్యవసాయ నిపుణులు, మహిళా రైతులు, స్థానిక ఆదర్శరైతులు సభ్యులుగా ఉండాలి. వ్యవసాయ శాఖాధికారి కన్వీనర్‌గా ఉండాలి. దీనికి నిధులు కేటాయించాలి. వ్యవసాయ బడ్జెట్‌ విడిగా రూపొందించి శాసనసభ ఆమోదం పొందాలి. బడ్జెట్‌లో కనీసం 10శాతం నిధులు కేటాయించాలి. ఆ విధంగా ఎప్పటికప్పుడు వస్తున్న సమస్యలు పరిష్కరించడమేకాక రైతులు నష్టపోయినప్పుడు వెంటనే పరిహారం చెల్లించే విధంగా విధానాలు రూపొందించాలి.
సారంపల్లి మల్లారెడ్డి
తేది : 30.05.2014

No comments:

Post a Comment