Wednesday, 13 August 2014

క్షేత్రస్థాయి కృషి ` క్షేత్రస్థాయి నిర్మాణంపై కేంద్రీకరించండి

    2012, ఫిబ్రవరి 2`4, కామ్రేడ్‌ హరికిషన్‌సింగ్‌ సూర్జిత్‌ నగర్‌, ఖమ్మంలో జరిగిన 23వ రాష్ట్ర మహాసభలో ‘‘క్షేత్రస్థాయి కృషి ` క్షేత్రస్థాయి నిర్మాణంపై కేంద్రీకరించండి’’ అనే నినాదాన్ని మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ నినాదాన్ని అమలు పర్చడానికి పార్టీ మరియు ప్రజాసంఘాలు ప్రణాళికలు రూపొందించుకుని కృషి చేయాలని, ప్రజాపునాదిని పెంపుదల చేయడంతోపాటు, పార్టీని విస్తృత ప్రాంతాలకు, వివిధ రంగాలకు విస్తరించే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని మహాసభ ఆదేశించింది. రాష్ట్రంలో కేంద్రీకరించే నియోజకవర్గాల్లో మరియు విస్తరణ కొరకు నిర్ణయించిన మండల కేంద్రాల్లో ఈ కృషి ప్రాధాన్యత కీలకంగా ఉండాలి. ఈ ఆదేశాన్ని అమలు చేయడానికి రైతురంగంలో ప్రత్యేకమైన కృషి జరగాలి. రైతుసంఘం బహుళవర్గ సంఘంగానే ఉంది. పేద, మధ్యతరగతి, ధనిక రైతులు ఈ సంఘంలో ఉన్నారు.  వాస్తవానికి రైతాంగంలో సన్న, చిన్నకారు రైతులు 83.50శాతంగా ఉన్నారు. వీరి వద్ద 43.43శాతం భూమి మాత్రం కలిగియున్నారు. మొత్తం రాష్ట్రంలో 120.45 లక్షల కమతాలు ఉండగా, అందులో సన్న, చిన్నకారు రైతుల కమతాలు 100.57లక్షలు ఉన్నారు. వీరి జీవనాధారం వ్యవసాయమే. నేడు ప్రభుత్వ విధానాల ఫలితంగా  ఈ వర్గం వారు వ్యవసాయాలను వదిలివేసి వెళ్లుతున్నారు. వ్యవసాయాన్ని వదలలేనివారు రుణభారం పెరిగి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో ఉత్పత్తి రంగంలో వీరి పాత్ర గణనీయమైంది.  ప్రస్తుతం ఈ వర్గం మధ్యదళారీల, కార్పొరేట్‌ శక్తుల దోపిడీకి ప్రత్యక్ష్యంగా, పరోక్ష్యంగా గురవుతున్నారు. ఈ వర్గాన్ని సంఘటితపరిచి వారిని దోపిడి నుండి విముక్తులగావించాలి. దీనికి తోడు రాష్ట్రంలో అమలవుతున్న సరళీకరణ విధానాల ఫలితంగా కౌలురైతుల సంఖ్య దినదినం పెరుగిపోతున్నాయి. ప్రభుత్వ అంచనాల ప్రకారమే రాష్ట్రంలో 30 లక్షలకు పైగా ఉన్నట్లు అంచనా. కానీ, వాస్తవంగా 42 లక్షల మంది కౌలుదారులు ఉన్నారు. ధనిక, భూస్వామ్య కుటుంబాలు తమ భూములను కౌలుకిచ్చి, ఇతర ఆదాయ వనరుల వైపు వెళ్లుతున్నారు. కౌలు ఆదాయాన్ని స్థిరపరచుకుని ప్రభుత్వ కాంట్రాక్టులు, మరియు ఇతర వ్యాపారాల ద్వారా అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. కౌలుదారులకు నిర్దేశించిన చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. ఫలితంగా వీరు ప్రయివేటు వడ్డీ వ్యాపారుల భారినపడి, భూ యజమానులకు చెల్లించే అదనపు కౌలు రేట్ల వలన విఫరీతమైన నష్టాలకు గురవుతున్నారు.  పేరుకు రాష్ట్ర ప్రభుత్వం కౌలుదారు రక్షణ కొరకు చట్టం తెచ్చినా, దాన్ని అమలు చేసే చిత్తశుద్ది ప్రభుత్వానికి లేదు.
    సన్న, చిన్నకారు రైతులతో పాటు కౌలురైతులను  సంఘటితపరచి  వ్యవసాయ కార్మిక సంఘంతో కలిసి ఉద్యమించడం ద్వారా సరళీకృత ఆర్థిక విధానాల ఫలితంగా నష్టపోతున్న ఈ వర్గానికి ఆదాయ వనరులు పెంచాలి. అంతేతప్ప, ప్రభుత్వాలు తమ విధానాలను మార్చుకుంటాయన్న నమ్మకం నేటి రైతులకు లేదు. వ్యవసాయరంగంలోకి కార్పొరేట్‌ సంస్థలు రావడానికి వీలుగా అమలువుతున్న ఈ విధానాలు రైతులకు ప్రాణ సంకటంగా తయ్యారయ్యాయి. అందుకే రైతుసంఘం ‘‘క్షేత్రస్థాయి కృషి ` క్షేత్రస్థాయి నిర్మాణం’’ చేసి రైతాంగాన్ని సంఘటితపరచి ఉధ్యమాలవైపు నడపించాలని పార్టీ ఆదేశించింది. ఇందుకనుగుణంగా రైతుసంఘాలు కృషి కొనసాగించాలి. వర్గ దృక్పదంతో సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలి తప్ప, భూస్వాములతో కలిసిన మొత్తం రైతాంగ సమస్యలను తీసుకోవడం ద్వారా నష్టపోతున్న రైతాంగానికి విముక్తి ప్రసాదించలేము.
సమగ్ర పరిశీలన:
    నేడు సన్న, చిన్నకారు రైతులు మరియు కౌలురైతులు ఎదుర్కొంటున్న అన్ని అంశాలను క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేయాలి. సమగ్ర పరిశీలన అనగా రైతులు ఎదుర్కొనే అన్ని కోణాలను పరిశీలించడమే.  అలా పరిశీలించి అందులో ప్రధానంగా ఉండే కీలకాంశాన్ని పట్టుకోవాలి. ఆ అంశం పరిష్కారానికి ఉద్యమం చేపట్టాలి. అలా చేపట్టినప్పుడు రైతులు ఏ రాజకీయ పార్టీల వెనుకాలనున్నప్పటికీ తమ సమస్యల పరిష్కారానికి ఉద్యమంలోకి వస్తారు. స్థానిక సమస్యల పరిశీలన అనగా, పంట కాలువల రిపేర్లు `చెరువులు, లిఫ్టులు, వాటర్‌షెడ్డు పథకాలు, విద్యుత్‌ పంపుసెట్ల సమస్యల పరిష్కారానికి నిరంతరం ఆందోళనలు పడుతున్నారు. ఆ సమస్యలను పరిష్కరించడానికి గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ఉద్యమించాలి. స్థానికసంస్థల ద్వారా కేటాయించే నిధులతో మైనర్‌ ఇరిగేషన్‌ వనరులు రిపేర్లు అవుతాయి.  విద్యుత్‌ సరఫరాను మెరుగుపర్చడానికి సంబంధిత సబ్‌స్టేషన్‌ వద్ద ఆందోళనల ద్వారా పరిష్కరించవచ్చు. ఒక్కోసారి స్పాంటెనీయస్‌గా, మన ప్రమేయం లేకుండానే వారి అవసరాల కొరకు పెద్ద ఎత్తున ఉద్యమాలు వస్తున్నాయి. అందులో రైతాంగం స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఆ ఉద్యమంపై ప్రభుత్వం నిర్బంధం ప్రయోగించినా వెనక్కు తగ్గకుండా పరిష్కారం వరకు పోరాడుతున్నారు. అలాంటి సందర్భాల్లో సంఘం వారితో కలిసి వారి ఉద్యమానికి నాయకత్వం వహించాలి.
    అధ్యయనం చేయడానికి పత్రికలు, ప్రభుత్వ నివేదికలు పాక్షికంగానే ఉపయోగపడతాయి. ప్రత్యక్ష సర్వేల ద్వారా వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి. ప్రత్యక్ష సర్వేల ద్వారా సమగ్ర పరిశీలన చేయాలి.
ఉపకరణాల సమస్యలు:
    విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు మరియు బయోపెర్టిలైజర్స్‌ వలన రైతులు యేటా పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. కావాలనే వ్యాపారులు, మధ్య దళారీలు వీటిని కృత్రిమ కొరత సృష్టించి, బ్లాక్‌ మార్కెట్‌ చే యడం, అధిక ధరలకు అమ్మడం, రైతుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యతలేని సరుకును ఎక్కువ ధరకు అంటగడుతున్నారు. ఫలితంగా యేటా రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లుతున్నది. నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించడానికి ఎలాంటి చట్టాలు లేవు.  రాజ్యాంగంలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతను నిర్దేశించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను ఉద్దేశ్యపూర్వంగా కేంద్రంపైకి తోసి తప్పుకుంటున్నది. నాణ్యతగల ఉపకరణాలు సకాలంలో రైతులకు అందుటకు వీలుగా వాటిని వినియోగించే కాలానికి నెల రోజుల ముందే ఉపకరణాల సరఫరా ఎలా ఉందో తెలుసుకోవాలి. కొరత ఉన్నచో రైతాంగాన్ని సమాయత్తపరచి గ్రూపు మీటింగుల ద్వారా, కరపత్రాల ద్వారా విషయాన్ని వారికి తెలిపి సమస్య పరిష్కారం కొరకు కృషి చేయాలి. సంఘం సంబంధిత రైతుల కమిటీ నాయకత్వాన ఆందోళనలు సాగాలి.
    దినదినం వ్యవసాయ రంగంలో నాగటి పశువుల సంఖ్య తగ్గిపోతున్నది. యంత్రాల ద్వారానే సాగుచేస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని యంత్రాలుగల వర్గాల వారు రేట్లు బాగా పెంచేస్తున్నారు. యంత్రాల ధరలు, డీజిల్‌ ధరలు పెరిగాయని చెప్పి రైతాంగంపై భారాలు వేస్తున్నారు. చిన్న తరహా యంత్రాల పంపిణీ పథకాలు ఉన్నప్పటికీ  ఏ సన్న, చిన్నకారు రైతు వాటిని కొనగలిగిన స్థితిలో లేరు. యంత్రాల అద్దెలు తగ్గాలంటై ఆందోళన చేపట్టడం ద్వారా భూస్వామ్య వర్గాలకు మరియు పేద వర్గాలకు మధ్య వర్గ పోరు మొదలవుతుంది. రైతుసంఘ నాయకత్వం ముందు పీఠిన ఉండి అద్దెల తగ్గింపునకు ఉద్యమించాలి.  లేదా ప్రభుత్వమే యంత్రాల సౌకర్యం కల్పించి అద్దె పద్దతిపై నిర్వహించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి.
రుణాల సమస్య:
    బ్యాంకుల ద్వారా, సహకార సంస్థల ద్వారా మరియు ప్రయివేటు వడ్డీ వ్యాపారుల ద్వారా రుణాలు పొంది  రైతులు పెట్టుబడులు పెడుతున్నారు. ఈ రుణాల విషయాన్ని సమగ్రంగా పరిశీలించినప్పుడు (1) రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ కేటాయింపు (2) జిల్లా గ్రామీణ సహకార వాణిజ్య బ్యాంకుల ద్వారా రుణ పంపిణీలో జరుగుతున్న అవకతవకలు, ప్రయివేటు వడ్డీ వ్యాపారుల నుండి అధిక వడ్డీలకు రుణ లభ్యత, మైక్రో ఫైనాన్స్‌ సంస్థల ద్వారా రుణాలు మరియు రుణ భారం పెరిగి ఆత్మహత్యలు మొదలగు సమస్యలన్నీ పరిశీలించాలి. ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో సన్న, చిన్నకారు రైతులకు మరియు కౌలు రైతులకు రుణ లభ్యతకు గల అవకాశాలను గుర్తించి సాధనకు ఉద్యమించాలి. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం యేటా వేల కోట్లు రుణాలు పంపిణీ చేస్తున్నట్లు ప్రకటిస్తూనే ఉంటారు. 2012`13లో పంట రుణాల క్రింద 40,330 కోట్లు మరియు దీర్ఘకాలిక రుణాల క్రింద 12381 కోట్లు కేటాయించినట్లు మాసం రోజుల క్రితం ప్రకటించారు. కానీ ఇవేవీ అర్హతగల పేద రైతులకు అందవు. ఇది గత చరిత్ర చెబుతున్న వాస్తవం. అర్హత గల సన్న, చిన్నకారు రైతులు 30 లక్షల మందికి పైగాను, మరియు మొత్తం కౌలు రైతులు రుణాల కొరకు ప్రయివేటు వడ్డీ వ్యాపారులపై ఆధారపడుతున్నారు. వడ్డీ నిర్ణయానికి ప్రయివేటు వ్యాపారులు ఎలాంటి చట్ట నిబంధనలు పాటించారు. ఈ వర్గ రైతులు పండిరచిన పంట వడ్డీలకే సరిపోతున్నదన్నది జరుగుతున్న వాస్తవం. వడ్డీ తగ్గింపులు చేయాలంటే వారికి నాయకత్వపు సమస్య వస్తోంది.  తామెక్కడ ఆందోళన చేపడితే రుణాలు రావేమోనన్న భయం వెంటాడుతుంది. సంఘటిత ఆందోళనలు జరిగిన చోట వడ్డీ తగ్గింపులే కాక, బ్యాంకుల ద్వారా సంస్థాగత రుణాలు పొందిన ఫలితాలు మన ముందు ఉన్నాయి.
    కౌలుదారులకు రుణ గుర్తింపు కార్డులు ఇప్పించడం, రుణాలు ఇప్పించడంతో పాటు ప్రభుత్వ పథకాలు, పంటల భీమా పరిహారం మరియు ప్రకృతి వైఫరిత్యాల పరిహారం అందే విధంగా స్థానికంగా సంఘం ఏర్పాటు చేసి వారి నాయకత్వం ద్వారా సాధించేటట్లు కృషి చేయాలి. ఆ విధంగా వచ్చినవారిని పార్టీలో సంఘటితపర్చుకోవాలి.
మార్కెటు సమస్యలు :
    ఈ సమస్యలో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి మద్దతు ధరల నిర్ణయం కాగా రెండవది స్థానికంగా మద్దతు ధరలు అమలు జరపకపోవడం. మద్దతు ధరలు అనేది రాష్ట్ర వ్యాపిత సమస్య. కానీ, నిర్ణయించిన ధరలను కూడా అమలు జరపక వ్యాపారులు, మధ్య దళారీలు రైతాంగానికి వేలకోట్ల నష్టం కలిగిస్తున్నారు. ముఖ్యంగా సన్న,చిన్నకారు రైతులు, కౌలు రైతులు పంట చేతికి రాగానే కల్లం నుండే అమ్ముకుంటారు. దీనిని అవకాశంగా తీసుకుని పంటల కోత కాలంలో రెండు మాసాల పాటు మధ్దతు ధరల కన్నా తగ్గించి కొనుగోలు చేయడం, ఆ సందర్భంగా వ్యాపారులు సిండికేట్‌గా రూపొందడం జరుగుతున్నది. ఈ వ్యాపార వర్గాలకు ప్రభుత్వం అండగా ఉంటోంది.  ఒకేసారి ధరలు తగ్గడంతో రైతుల్లో సహనం చచ్చిపోయి, భౌతికంగా ఆందోళనలకు దిగడం చూస్తున్నాం.  అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గాయని, ఎగుమతులపై ప్రభుత్వాలు నియంత్రణ పెట్టాయని లేదా అమ్మకానికి వచ్చిన సరుకు నాణ్యతా ప్రమాణాలకు అనుకూలంగా లేదని చెప్పి ధరలు దింపివేయడం జరుగుతున్నది. మరొకవైపున తప్పనిసరి అమ్ముకునే విధంగా రుణదాతల ఒత్తిడి ఉంటుంది. ఇన్ని కారణాల వలన ధరలు తగ్గుతున్నాయి.  నాణ్యతా ప్రమాణాలను రైతులకు తెలియపరచి మద్దతు ధరలు లభ్యమయ్యేటట్లు చూడాల్సిన బాధ్యత సంఘ నాయకులపై ఉంది.  మార్కెట్‌ అనగానే ఏరోజుకారోజు వచ్చిపోయే రైతులు సమన్వయం లేని పరిస్థితి ఉంటుంది. అదే సందర్భంలో సంఘటితంగా ఉన్న వ్యాపార వర్గాలు పెద్ద ఎత్తున అనేక అక్రమ పద్దతుల్లో దోపిడీలు సాగిస్తున్నాయి. అలాంటి సందర్భాల్లో సంఘం తరుపున మార్కెట్‌ జరిగినన్ని రోజులు రెగ్యులర్‌గా ఇద్దరు లేదా ముగ్గురు కార్యకర్తలు మార్కెట్‌ ఆవరణలో ఉండడం వలన కొన్ని నష్టాల నుంచి రైతాంగాన్ని తప్పించవచ్చు. ఆ సందర్భంగా వస్తున్న ఉద్యమాలకు నాయకత్వం వహించవచ్చు. తద్వారా రైతులతో సంబంధాలు దృడంగా ఏర్పడతాయి.  మార్కెట్‌ కమిటీలు, కొనుగోలు దారులు, సరుకులు అమ్మిపెట్టే వ్యాపారులు మరియు ప్రభుత్వ అధికారుల మధ్య గల సాన్నిహిత్యాన్ని బహిరంగపరచి కనీస మద్దతు ధరలు అమలు జరిపే విధంగా సంఘటితమైన ఉద్యమం ఉండాలి. సంబంధిత రైతులు పాల్గొనేటట్లు చూడాలి.
ప్రభుత్వ పథకాలు:
    రాష్ట్ర ప్రభుత్వం 34 పథకాలు ప్రకటించినా ఇందులో పేదరైతులకు అందేవి సున్న. చాలా వరకు పేదరైతుల పేరుతో ధనిక, భూస్వామ్య వర్గాలు ప్రభుత్వ పథకాలను కైంకర్యం చేస్తున్నాయి.  ఆ విధంగా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు పేద రైతులకు దక్కకుండా పోతున్నాయి. చివరకు వర్మి కంపోస్ట్‌, బిందుసేద్యం, తుంపరసేద్యం, ఎలుకలు, కోతుల నివారణ పథకాలకు కేటాయించిన బడ్జెట్‌ కేటాయింపులన్నీ  మధ్య దళారీల పాలవుతున్నాయి. బడ్జెట్‌ కేటాయింపులు చేసి విడుదల చేయకపోవడాన్ని, వ్యవసాయ రంగానికి కేటాయిస్తున్న నిధులపై అవగాహనను క్షేత్రస్థాయి వారికి కల్పించాలి. భూసార పరీక్ష కేంద్రాలు కూడా వీరికి ఉపయోగకరంగా లేవు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను స్థానికంగా అర్హులైన పేదలకు అందునట్లు చూడాలి. అదే విధంగా పంటల భీమా పథకం సన్న,చిన్నకారు రైతులకు ఉపయోగపడనిదిగా ఉంది. ఈ పథకం గురించి ఎక్కువ మందికి తెలియదు. పైగా రుణ లభ్యత లేకపోవడం వలన భీమా ప్రీమియం బ్యాంకుల ద్వారా చెల్లింపులు జరుగవు. వాస్తవానికి సంస్థాగత రుణం పొందనివారి నుండి కూడా భీమా ప్రీమియం వసూళ్లు చేసి వారికి ఈ పథకాన్ని వర్తింపచేయాలి. కానీ ఆ వైపు కృషి ప్రభుత్వం వైపు నుండి కానీ, వ్యవసాయ శాఖ వైపు నుండి కానీ జరగడం లేదు. పేద రైతుల ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలి. ఇందుకు అనుగుణంగా క్షేత్రస్థాయి ఉద్యమాలు రావాలి. గతంలో ఇచ్చిన సబ్సిడీని సరళీకరణ విధానాల ఫలితంగా కోత పెట్టారు.  వడ్డీమాఫీ, పావలా వడ్డీ లాంటి పథకాల మొత్తాలను కూడా భూస్వామ్య వర్గాలే కాజేస్తున్నాయి. వీటికి సంబంధించిన వివరాలను గ్రూపు సమావేశాలు జరిపి వాస్తవ లబ్దిదారుల పేర్లు తెలియపర్చాలి. అదే విధంగా ప్రభుత్వ పథకాలకు ఎంపికైన వారిని గ్రామ సభల్లో ఎన్నుకునే విధంగా సంఘం కృషి చేయాలి.
వ్యవసాయ అనుబంద ఉత్పత్తులు:
    పై వర్గాల వారు పాలు, కూరగాయలు ప్రధాన ఆదాయవనరుగా ఉత్పత్తులు సాగిస్తున్నారు. కానీ  ఈ ఉత్పత్తిదారులను మధ్య దళారీలు, వ్యాపారులు పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారు. ఒక్కో దశలో ఉత్పత్తిలో 25 శాతం నుండి 50 శాతం వరకు లాభాలు గడిస్తున్నారు. సంఘటిత మధ్య దళారీలు అసంఘటితంగా ఉన్న పాలు, కూరగాయల రైతుల నుండి పెద్ద ఎత్తున లాభాలు గడిస్తున్నారు.  త్రాగునీటి ధర కూడా పాలకు రావడం లేదు. అదే విధంగా కూరగాయలు కొనుగోలుకు వినియోగదారుడు చెల్లించే ధరలో ఉత్పత్తిదారునికి 50శాతం మాత్రమే వస్తుంది. కూరగాయల విత్తనాలు పూర్తిగా బహుళజాతి సంస్థల ఆదీనంలోకి వెళ్లాయి. నాణ్యతలేని విత్తనాలను అత్యధిక ధరలకు అమ్ముతున్నారు. ముఖ్యంగా ఈ రెండు రంగాల్లో మహిళల పాత్ర 80 శాతంగా ఉంటుంది. వీరిని సంఘటితపరచి ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా మహిళలపై కేంద్రీకరణకు మంచి అవకాశాలు ఉన్నాయి. పై రెండు రంగాలకు రైతుసంఘం తరపున మహిళలను కేటాయించాలి. ముఖ్యంగా పట్టణాలకు, గ్రామాలకు ఈ ఉత్పత్తులు లింకు సరుకుగా పనిచేస్తాయి. ప్రతి రోజు ఉదయం 4 గంటలకే ఈ ఉత్పత్తులను తీసుకుని పట్టణాలకు వస్తారు. ఉత్పత్తిదారుల ప్రమేయం లేకుండా సరుకులను అమ్మేసి వ్యాపారులు తమకు తోచిన ధరలను రైతులు చెల్లిస్తున్నారు. రైతు బజార్లు, పాల సేకరణ కేంద్రాలు మధ్య దళారీల ఆధిపత్యంలోకి వెళ్లాయి. ఎక్కడైనా రైతులు నిలవేస్తే వారిపై భౌతికదాడులు కూడా జరుగుతున్నాయి.  ఆ సందర్భంగా ఆ కేంద్రాల్లో వారికి రక్షణ కావాలి. ఈ రక్షణ సంఘం ఇవ్వగలిగినప్పుడు వారందరినీ సమీకరించడం సాధ్యమవుతుంది. పైగా ఆ కేంద్రాల్లో నిరంతరంగా వారి సమస్యలు తెలుసుకుని అమలు చేయగల పూర్తికాలం కార్యకర్తలను కేటాయించాలి.
ఆత్మహత్యల నివారణ:
    ఆత్మహత్యలకు పాల్పడుతున్నది సన్న, చిన్నకారురైతులతో పాటు కౌలు రైతులు మాత్రమే. ఆత్మహత్యల పరంపర అదే పనిగా కొనసాగుతున్నాయి. వీటి నివారణకు ప్రభుత్వం వైపు నుండి కాని, ప్రజా సంస్థల నుండి గాని ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. చివరకు సానుభూతి ప్రకటించడం కూడా లేకుండా పోయింది. రుణ భారం పెరిగిన రైతాంగానికి ధైర్యం కలిగించి ఉద్యమంలోకి వచ్చే విధంగా సంఘం కృషి చేయాలి. వారు ఎదుర్కొనే సమస్యలను నిరంతరం వారికి అందుబాటులో ఉండి పరిష్కారం దిశగా కృషి సాగాలి. ఆ విధంగా ఉద్యమాల్లోకి వచ్చినవారు ఆత్మహత్యలకు దూరంగా ఉంటారు. ‘‘తమకు తగిన అండ ఉంది’’ అన్న ధైర్యాన్ని కలిగించే విధంగా క్షేత్రస్థాయిలో సంఘ కార్యకర్తలు పనిచేయాలి. అలా చేసినప్పుడు స్థానికంగా రైతుల, నాయకుల మధ్య సంబంధాలు ఘనీభవించి, తమ సమస్యలకు పరిష్కారం చూపు నాయకుడు తమ వద్దనే ఉన్నాడనే ధైర్యం కలుగుతుంది. ఆ విధంగా వారు ఎదుర్కొనే సమస్యలను ఎప్పటికప్పుడు సమగ్ర పరిశీలన చేసి పరిష్కారం దిశగా కృషి చేయాలి.
    రాష్ట్ర మహాసభ ఇచ్చిన పిలుపును జయప్రదం చేయడానికి క్షేత్రస్థాయిలో వైవిద్యానికి తగినట్టుగా సంఘాలను, బృందాలను ఏర్పాటు చేయాలి. ఒక మైనర్‌ ఇరిగేషన్‌ లేదా ఒక కాలువ లేదా విద్యుత్‌ సమస్య పరిష్కారాలకు విడివిడిగా కమిటీలు వేయాలి.  ఆ కమిటీల ద్వారా ఆ సమస్య పరిష్కారానికి కృషి చేయాలి. ఎన్ని సమస్యలు వస్తే అన్ని సమస్యలకు విడివిడిగా సంఘాలను, బృందాలను వేసి వాటికి నాయకత్వాన్ని ప్రోత్సహించాలి. జిల్లా, రాష్ట్ర నాయకత్వాలు క్షేత్రస్థాయిలో గలవారికి తగు సమాచారాన్ని, ప్రభుత్వ విధానాల ఫలితంగా వచ్చే ప్రమాదాలను తెలియపరచి చైతన్యపర్చాలి. జిల్లా, రాష్ట్ర నాయకత్వం ఒక్కో సమస్యలో ప్రత్యేకత కలిగియుండాలి. ఆ ప్రాంతంలో పండే అని పంటలపై సమగ్ర అవగాహన ఉండాలి. సమస్యలను ముందే గుర్తించి అందుకు తగిన ఆందోళనలకు రూపకల్పన చేయాలి. స్పాంటేనియస్‌గా వచ్చే ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనాలి. నాయకత్వం  రైతుల నుండి వచ్చే విధంగా చూడాలి. అంతర్గత నాయకత్వానికి ప్రాధాన్యతను ఇవ్వాలి. ఆ విధంగా వచ్చిన నాయకత్వాన్ని అభివృద్ది పరచుకోవడానికి, రాజకీయ చైతన్యం కల్పించడానికి రాజకీయ తరగతులు నిర్వహించాలి. పై సమస్యల్లో కలిసివచ్చే రైతాంగాన్ని సంఘటిత పరచి వారిని పార్టీ సభ్యులుగా తయారు చేయాలి. సరళీకృత విధానాల ఫలితంగా వస్తున్న దీర్ఘకాలిక ప్రమాదాలను వారికి గుర్తింపజేసి, వాటికి వ్యతిరేకంగా ఉద్యమించే విధంగా క్షేత్రస్థాయిలో నిర్మాణం చేయాలి.  కొంత మేరకు క్షేత్రస్థాయిలో కృషి చేసినప్పటికీ నిర్మాణంపై పూర్తి అలక్ష్యం కొనసాగుతున్నది. ఉధ్యమాల వల్ల స్థానికంగా కొన్ని ఫలితాలు వచ్చినప్పటికీ, ఆ ఉద్యమంలో పాల్గొన్న వారిని నిర్మాణంలో పెట్టడం ద్వారానే పార్టీ విస్తరణ జరుగుతుంది. కొత్త ప్రాంతాలకు, కొత్త రంగాలకు విస్తరిస్తాం. అంతర్గత నాయకత్వాన్ని పెంచుకోవడం ద్వారా నాయకత్వ కొరత సమస్య ఉత్పన్నం కాదు. ఆగ్జలరీల శాఖలను ఏర్పాటు చేసి, వాటిని నిర్మాణంలో పెట్టి ఆ తర్వాత కాండిడేట్‌ శాఖలుగా ప్రమోటు చేసేవరకు ఆ బాధ్యతను సంఘమే చూడాలి. ఆ విధంగా మహాసభ ఇచ్చిన పిలుపు ద్వారా కమ్యూనిస్టు ఉద్యమాన్ని విస్తరింప చేయాలి.
తేది.16.05.2012
సారంపల్లి మల్లారెడ్డి

   

No comments:

Post a Comment