'' సేంద్రీయ వ్యవసాయం - ఆహార భద్రత '' సమీక్షకు ఈ దిగువ అంశాలు పరిశీలించాలి.
1. కమతాలు 2. సాగు భూమి వివరాలు 3. విత్తనాలు
4. ఎరువులు - క్రిమిసంహారక మందుల వాడకం
5. ఉత్పత్తులు 6. పర్యావరణం 7. పశు సంవర్థనం
8. అడవులు 9. కనీస మద్దతు ధరలు 10. ఆహార భద్రత
పై విస్తీర్ణాలను పరిశీలించినప్పుడు సన్న, చిన్నకారు మరియు సెమీ మీడియం రైతులకు 94.5శాతం కమతాలు వున్నాయి.వీరు మొత్తం సాగు భూమిలో 75శాతం సాగుచేస్తున్నారు. రాష్ట్రంలోని ఆహార ధాన్యాల ఉత్పత్తిలో సంహభాగం వీరే చేస్తున్నారు. ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచడానికి ఈ కమతాలలో కృషి సాగాలి. వీరు ఆహార భద్రతకు కీలకంగా ఉపయోగపడతారు.
2. సాగు భూమి వివరాలు : ఆంధ్రప్రదేశ్‌లో గత దశాబ్ధ కాలంగా పరిశీలించినప్పుడు సాగు విస్తీర్ణంలో పెద్దగా మార్పులేదు. సాగుయోగ్యమైన భూమి 3.75 కోట్ల ఎకరాలు కాగా, 2.53 కోట్ల ఎకరాలు మాత్రమే సాగువుతున్నాయి. దాదాపు యేటా 1.20 కోట్ల ఎకరాల భూమి బీళ్ళుగా వుంటున్నది. సాగుకు యోగ్యమైనప్పటికీ ఈ బీడు భూములను సాగులోనికి తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం వైపునుండి ఎలాంటి కృషి లేదు. వర్షాలపై ఆధారపడిన వ్యవసాయం మన రాష్ట్రంలో సాగుతున్నది. సాగయ్యే విస్తీర్ణంలో కూడా పండ్ల తోటల పేర 44 లక్షల ఎకరాలు వినియోగిస్తున్నారు. దీనికి తోడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరియు ప్రభుత్వ భూ సేకరణ క్రింద దాదాపు 40 లక్షల ఎకరాలను వినియోగంలోకి తెచ్చి సాగుచేయకుండా బీళ్ళుగా పెడుతున్నారు. సాగయ్యే భూమి తగ్గడం వలన ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా తగ్గుతున్నది.
3. విత్తనాలు - టెక్నాలజీ - పంటల మార్పిడి : సంస్కరణల అనంతరం విత్తన రంగంలో పెద్దమార్పులు వచ్చాయి. ఇంతకముందు జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థలు విత్తనాలు సరఫరా చేశాయి. ఉత్పత్తి, ఉత్పాదకతలు పెరగడమేగాక పర్యావరణానికి ఎలాంటి హాని జరగలేదు. ప్రస్తుతం అమెరికన్ బహుళజాతి సంస్థ మోన్‌శాంటో విత్తన రంగంలోకి ప్రవేశించాక బి.టీ విత్తనాలు వచ్చాయి. ఇవి ఉత్పత్తి, ఉత్పాదకతను దెబ్బతీయడమేగాక పర్యావరణానికి తీవ్రహాని కలిగిస్తున్నాయి. ఈ చేలలో పనిచేస్తున్నవారికి చర్మవ్యాధులు రావడమేగాక గర్భశ్రావాలు కూడా జరుగుతున్నాయి. ఈ పంట ఆకులు మేసిన పశువులు మరణిస్తున్నాయి. క్రిమిసంహారిక మందుల వాడకం తగ్గుతుందని చేసిన ప్రచారం ఆచరణలో అమలులేదు. గతం కన్నా ఎక్కువ క్రిమిసంహారక మందులనే వినియోగిస్తున్నారు. ఈ విత్తనాలను ఆహార ధాన్యాలలోకి, కూరగాయలలోకి ప్రవేశపెడుతున్నారు. పైగా, తమ విత్తనాలు అమ్ముడుపోని వాటిని కోల్డ్ స్టోరేజీలలో పెట్టి తిరిగి రెండో సంవత్సరం అమ్మడం వలన ఆ విత్తనాలు వేసిన రైతులకు కాయ, పూత లేకుండా పోతున్నాయి. నాణ్యతలేని విత్తనాలవల్ల యేటా 5, 6 లక్షల ఎకరాలలో పంటలకు నష్టం వాటిల్లుతున్నది. బి.టీ విత్తనాల ఆకులు, కాండం భూమిపై పడిన తర్వాత వర్షాకాలంలో ఆ ఆకుల నుండి విషతుల్యమైన పదార్థం భూగర్భ జలాల్లోకి చేరుపోతున్నది. పర్యావరణంపై తీవ్రప్రతికూల ప్రభావం కల్గిస్తున్నది.
టెక్నాలజీ అభివృద్ధి పేర పశువుల వినియోగానికి బదులు వ్యవసాయ రంగంలో యంత్రాల వినియోగం పెరిగింది. నాటు మొదలుకొని కోత వరకు అన్ని అంశాలలో యాంత్రికీకరణ వేగవంతంగా జరిగింది. వ్యవసాయోత్పత్తుల నుండి లభ్యమయ్యే చెత్తచెదారం లాంటి సేంద్రీయ ఎరువులకు వినియోగపడే కీలకమైన భాగాన్ని వృధా చేస్తున్నారు.
పంటల మార్పిడి విధానం పేరుతో ఆహార ధాన్యాల విస్తీర్ణాన్ని తగ్గించి ఎగుమతి ఆధారిత ఉత్పత్తులను పెంచేవిధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది.
4. ఎరువులు - క్రిమిసంహారక మందుల వాడకం : సేంద్రీయ ఎరువుల వాడకం తగ్గడంతో రసాయనిక ఎరువుల వాడకం, క్రిమిసంహారక మందుల వాడకం విపరీతంగా పెరుగుతున్నది. 2007 ఖరీఫ్‌లో 27.33 లక్షల టన్నుల ఎన్.పి.కె ఎరువులు వినియోగించగా, 2008 రబీలో 34లక్షల టన్నుల ఎరువులను వినియోగించారు. రసాయనిక ఎరువులే కీలకంగా ఉత్పత్తికొరకు వినియోగిస్తున్నారు. సేంద్రియ ఎరువులు వేయకుండా రసాయనిక ఎరువులు మాత్రమే వినియోగించడం వల్ల భూ సారం దెబ్బతింటున్నది. అనేకచోట్ల ''చవిటి'' భూములుగా మారాయి. ఇంకా మారుతున్నాయి. చివరకు ఉత్పత్తి తగ్గుతున్నది.
క్రిమిసంహారక మందుల వాడకం పెరుగుతున్నది. 2001-02లో క్రిమిసంహారక మందుల న్యూట్రియాంట్స్ 19.57 లక్షల మెట్రిక్ టన్నులు వినియోగించగా, 2006-07లో 24.84 లక్షల మెట్రిక్ టన్నులు వినియోగించారు. ఈ విధంగా వినియోగం నిరంతరం పెరుగుతూనే వుంది. వీటి వాడకం పెరగడం వల్ల పంటలకు మేలుచేసే క్రిములు మరణిస్తున్నాయి. పంటలు విత్తిననాటి నుండే క్రిమికీటకాదుల దాడులు వుంటున్నాయి. విచిక్షణా రహితంగా క్రిమిసంహారక మందుల వినియోగం జరుగుతున్నది. ముఖ్యంగా వ్యవసాయశాఖ సుసుప్తావస్థలో వుండడం వలన ఎరువుల వ్యాపారులు విస్తృత ప్రచారం చేసి తమ క్రిమిసంహారక మందుల్ని అవసరం లేకున్నా రైతులచే వినియోగింపజేస్తున్నారు.
5. ఉత్పత్తులు : ఆహార ధాన్యాల ఉత్పత్తిలో గత దశాబ్ధకాలంగా పెద్దగా అభివృద్ధిలేదు. ధాన్యం (బియ్యం) 118.72 లక్షల టన్నులు, ముతక ధాన్యాలు (రాగులు, సజ్జలు, జొన్నలు, మొక్కజొన్న) 34.10 లక్షల టన్నులు మరియు పప్పుధాన్యాలు 13.47 లక్షల టన్నులు 2006-07లో ఉత్పత్తి జరిగినట్లు రికార్డులు తెలుపుతున్నాయి. 1998లోనే ప్రస్తుత ఉత్పత్తిని సాధించాం. ఆ తర్వాత 120 లక్షల టన్నులకు పడిపోయింది. 2006-07లో వర్షాలు సక్రమంగా వుండటం వలన ఈ ఉత్పత్తి పెరిగింది. గత రెండు దశాబ్ధాలుగా ఉత్పత్తిలో పెద్ద మార్పు రాలేదు. ఉత్పత్తిలో 50శాతం రాష్ట్రంలో వినియోగించగా, మిగిలిన 50శాతాన్ని ఎఫ్.సి.ఐ ద్వారా గానీ, ప్రయివేటు వ్యాపారుల ద్వారాగానీ ఎగుమతి చేస్తున్నారు.
పండ్లతోటల విస్తీర్ణం 44.15 లక్షల ఎకరాలకు పెరిగింది. హార్టీకల్చర్ శాఖ మరింత విస్తీర్ణం పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నది. కానీ, యీ ఉత్పత్తులకు మార్కెట్‌లో కనీస ధరలు కూడా లభ్యంగాక తోటలను నరికివేస్తున్నారు.
6. పర్యావరణం : ప్రస్తుత వ్యవసాయ విధానం పర్యావరణంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నది. గతంలో బహుళ పంటలు వేసిన భూములలో నేడు వేలాది ఎకరాలలో ఒకే ఒక పంటను వేస్తున్నారు. దీనివలన క్రిమికీటకాదుల దాడులు ఉధృతంగా పెరుగుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాల బెడద తీవ్రంగా వుంటున్నది. చెట్లు నరికివేయడం వలన వర్షాభావ పరిస్థితులు ఏర్పడడమేగాక భూమి కోత పెరుగుతున్నది. భూమి కోతను అరికట్టగల పంటలు వేయకుండా పంటల మార్పిడిచేసి ప్రభుత్వం ఎగుమతి ఆధారిత పంటలను ప్రోత్సహిస్తున్నది. విచిక్షణారహితమైన క్రిమిసంహారక మందుల వాడకం, బయో సీడ్స్ వాడడం వలన భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. చివరకు గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులు కూడా కలుషితమవుతున్నాయి. ఈ నీటిని వినియోగించిన పంటలు, పశువులు అనారోగ్యానికి గురవుతున్నాయి.
7. పశు సంపద - వినియోగం : 1956లో 112.76 లక్షల ఆవులు, ఎద్దులు వుండగా, 2003లో 94.24 లక్షలకు తగ్గాయి. అదే సందర్భంలో బర్రెలు 1956లో 59.67 వుండగా, 2003లో 107.68కి పెరిగాయి. ఈ పెరుగుదల పట్టణాల్లోను, సెమీ పట్టణ ప్రాంతాల్లో జరిగింది. గ్రామీణ ప్రాంతంలో క్రమానుగతంగా పశు సంపద పెద్దస్థాయిలో తగ్గిపోతున్నది. ఒకవైపున ప్రభుత్వాలే పాలివ్వడానికి ఉపయోగపడని లేదా సాగుకు ఉపయోగపడని పశువుల నిర్మూలనగావిస్తున్నారు. ఫలితంగా సేంద్రియ ఎరువుల కొరత పెరిగింది. గ్రామాల్లో గతంలో ఒక రైతు ఒక నాగలి, ఎద్దులు కల్గిన రైతు తన రెండు ఎకరాల పొలంలో సేంద్రియ ఎరువులను 10 టన్నుల వరకు వేసేవారు. కానీ నేడు సేంద్రియ ఎరువుల వినియోగం దాదాపుగా తగ్గిపోయింది.
8. అడవులు : రాష్ట్రంలో 153.45 లక్షల ఎకరాల అడవులు వున్నాయి. ఈ అడవులలో దాదాపు 60శాతం చెట్లులేని అడవులు వున్నాయి. అడవులను నాశనం చేయడం ఒక క్రమపద్ధతిలో సాగిపోతున్నది. వ్యవసాయరంగానికి అడవుల వలన అనేక విధాలుగా లాభాలు వున్నాయి. 1. పశు గణాభివృద్ధిని పెంచుకోవడానికి మేత అందుబాటులో వుంటుంది. 2. సకాలంలో వర్షాలు రావడానికి లేదా తుపాన్‌లనుండి రక్షణకు ఉపయోగపడతాయి. 3. క్రిమికీటకాదుల దాడులు రాకుండా నివారిస్తాయి. 4. భూ గర్భ జలాల స్థాయి పడిపోకుండా కాపాడతాయి. వ్యవసాయానికి కావాల్సిన కలప, పచ్చిరొట్ట, సేంద్రియ ఎరువులు లభిస్తాయి. ఇన్ని ప్రయోజనాలు వున్న అడవుల తొలగింపు పెద్దయెత్తున కొనసాగుతున్నది. దీనికి పాలకవర్గాలే అండగా వున్నాయి.
9. కనీస మద్దతు ధరలు : ప్రస్తుతం వ్యవసాయోత్పత్తులకు కేంద్ర ధరల నిర్ణాయక సంఘం ప్రకటించిన కనీస మద్దతు ధరలు లభ్యంకావడంలేదు. వినియోగదారులు చెల్లించేదానిలో ఉత్పత్తిదారుని వాటా దారుణంగా పడిపోతున్నది. తిరిగి వ్యవసాయోత్పత్తులు చేయడానికి రైతులు ముందుకు రావడంలేదు. కారణం తమ పెట్టుబడులు కూడా రాకపోవడమే. కనీసం తన కుటుంబ జీవనాధారానికి మరియు పెట్టుబడికి తగిన ఆదాయం వ్యవసాయం నుండి రావాలి. ఆవిధంగా వచ్చినప్పుడే వ్యవసాయం తిరిగి కొనసాగుతుంది. ఉత్పత్తిదారునికి (రైతుకు) వినియోగదారుడు చెల్లించేదానిలో 80శాతం విధిగా చెందాలి.
10. ఆహార భద్రత : ప్రతి వ్యక్తికి ఆహార భద్రత కల్పించబడాలి. జనాభా పెరుగుదలకనుగుణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగాలి. రాష్ట్రం మిగులు ఉత్పత్తి రాష్ట్రంగా వున్నప్పటికీ నేటికీ 40శాతం మంది పేదలు తగినంత ఆహారం తీసుకోవడంలేదు. ఉత్పత్తికి తగిన విధంగా పంపిణీ విధానం లేదు. కొద్దిమందికి మిగులుగా వుండడం, అనేకమందికి కొరతగా వుండడం చూస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యక్తికి 2400 కేలరీల శక్తిగల ఆహారం, పట్టణ ప్రాంతాలలోని వారు 2100 కేలరీల శక్తిగల ఆహారం కనీసంగా తీసుకోవాలి. కానీ, నేడు 1600-1700 మధ్య గల కేలరీల శక్తిగల ఆహారం మాత్రమే తీసుకుంటున్నారు. పౌష్టికాహారం అనేకమందికి అందుబాటులో లేదు. పాలు, గుడ్లు, మాంసకృత్తులుగల ఆహార ధాన్యాల తలసరి సగటు వినియోగం పడిపోతున్నది. 1956లో తలసరి బియ్యం 148 కిలోలు వినియోగించగా, నేడది 125 కిలోలకు తగ్గింది. పౌష్టికాహార లోపం వలన పుట్టుకతోనే శిశుమరణాల సంఖ్య పెరుగుతున్నది. ఐదు సంవత్సరాల వరకు జీవించి మరణించేవారి సంఖ్య కూడా పెరుగుతున్నది. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసి పిల్లలకు యిస్తున్న పౌష్టికాహారం వలన లబ్ధి తక్కువే. కనీసం ప్రతి వ్యక్తికి ఆహార భద్రత వుండేవిధంగా జీవనాదాయం వుండాలి. ఉపాధి కల్పించి కొనుగోలు శక్తి పెంచాలి. ఆ విధంగా ఆహార భద్రత అందరికీ కల్పించాలి.
---

No comments:
Post a Comment