Tuesday, 12 August 2014

నవంబరు 1 నుండి రాష్ట్ర సంక్షేమం కొనసాగుతుందా?

72 రోజుల సుధీర్ఘ కాలం గడిచిన తర్వాత రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశం జరిప,ి నవంబరు 1 ఆంద్రరాష్ట్ర అవతరణ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కానుకలను ప్రకటించారు. నవంబరు మాసాన్ని సంక్షేమ మాసంగా ప్రకటించి రు.3,500 కోట్ల వరకు వివిధ పథకాల కింద లబ్దిదార్లకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని, 24 లక్షల కొత్త రేషన్‌ కార్డులకు కూపన్లు అందిస్తామని, 5లక్షల పెన్షన్లతో పాటు పావలావడ్డీ కింద నిధులు విడుదల చేస్తామని, 473 మండలాల్లో స్త్రీ శక్తిభవనాల నిర్మాణం చేస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలోనే 456 మండలాలలను కరువు మండలాలుగా ప్రకటిస్తామని నిర్ణయం తీసుకున్నారు. 10 లక్షల ఉద్యోగాల కల్పనకు పథకాలు రూపొందిస్తారు. నవంబరు 1 నుండి కిలో రూపాయి చొప్పున 5గురు గల కుటుంబానికి 20 కిలోలు ఇస్తామన్నారు. అంటే కుటుంబానికి రు.20 సహకారం అందుతుంది. 55 సంవత్సరాలుగా ప్రభుత్వాలు నవంబరు 1న అనేక ప్రకటనలు, వాగ్దానాలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ వాగ్దానాలను  కాలం గతిస్తే ప్రజలు మరిచిపోతారన్న ధీమాతో ఏ పాలకవర్గం వచ్చినా ప్రకటనలు చేసి ప్రజలను భ్రమల్లో పెడుతూనే ఉన్నారు. ప్రతి వ్యక్తికి తిండి, బట్ట, ఇల్లు కనీస అవసరాలుగా కోరుకుంటారు. ఆహారధాన్యాల ఉత్పత్తిలో రాష్ట్రం మిగులుగా ఉన్నప్పటికీ ఆకలిచావుల రాష్ట్రాల జాబితాలో చేరడం గమనించాలి. వ్యవసాయరంగంలో దినదినం కునారిల్లుతున్న పరిస్థితులు గమనిస్తే ఆందోళన చెందాల్సి వస్తున్నది. 1995 నుండి 2010 నాటికి రాష్ట్రంలో 31,120 మంది ఆత్మహత్యలకు పాల్పడినట్లు ‘‘జాతీయ నేర నమోదు సంస్థ’’ ప్రకటించింది. వ్యవసాయ,చేనేత, విద్యా రంగాలలో ఆత్మహత్యలు గణణీయంగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రాభివృద్ధిని ఈ ఆత్మహత్యలు వెక్కిరిస్తున్నాయి.
‘‘ ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పునర్నిర్మాణ కార్యక్రమం’’ పేరుతో వ్యవసాయరంగంలో కొనసాగుతున్న ప్రపంచ బ్యాంకు సంస్కరణల ఫలితంగా 1997 నుండి ఉత్పత్తి, ఉత్పాదకత స్థిరంగానే ఉంటున్నది. 1998`99లో 73.70 లక్షల హెక్టార్లు సాగు చేయగా 149.05లక్షల టన్నుల ఆహారధాన్యాలు ఉత్పత్తి జరుగగా  2009`10లో 66.67లక్షల హెక్టార్ల విస్తీర్ణం సాగు కాగా 155.99 లక్షల టన్నులు ఉత్పత్తి వచ్చింది. దీనిని బట్టి వ్యవసాయంలో ప్రభుత్వ పథకాల వల్ల పెరుగుదల ఏపాటిదో గమనించవచ్చు. అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు గత సంవత్సరం దిగుబడులు పెరిగాయి. 1985`86 నుండి 20 కరువులు, 26 వరదల వలన నేటివరకు యేటా భారీ ఎత్తున పంటలకు రైతులు నష్టపోతున్నారు. కొన్ని సంవత్సరాలలో వరదలు, కరువులు ఏకకాలంలో సంభవించిన ఘటనలు ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాల పైకి సమస్యను తోసి ప్రభుత్వం తప్పుకుంటున్నది. కానీ ఇది వాస్తవం కాదు. ప్రకృతి వైపరీత్యాల నష్టాన్ని కనీసం 70 శాతం తగ్గించడానికి అవకాశాలున్నాయి. యేటా గోదావరి, క్రిష్ణా, తుంగభద్ర, పెన్నా వంశధార మొదలగు నదుల నీరు వేల టిఎంసిలు సముద్రం పాలగుచున్నాయి. కరువులు వచ్చిన సంవత్సరాలలో కూడా నీరు వృధా అవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం జరిపి నికరమైన ‘‘జలవిధానాన్ని’’ ఏర్పరుచుకొని, సక్రమంగా అమలు జరిపినచో రాష్ట్రంలో గల 74 వేల చెరువులలో 30 వేల చెరువులను నింపవచ్చు. చెరువులన్నీ గోలుసుకట్టుగా ఉన్నాయి. ప్రాజెక్టులు నిండే అవకాశాలు గమనించి కాలువల ద్వారా చెరువులు నింపడానికి తగు ప్రాతిపదిక ఏర్పరచాలి.  ప్రతియేటా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చడం ద్వారా వరద నష్టాన్ని, వరదలలో మరణాలను తగ్గించవచ్చు. వరదలకు తెగిపోయిన చెరువులను శాశ్వత ప్రాతిపదిపై బాగు చేయడానికి పభుత్వానికి ప్రణాళిక లేదు. బడ్జెట్‌ కేటాయింపులు చేయడం, రిపేర్లు జరుగకున్నా జరిగినట్లు రికార్డు చేసి నిధులు కాజేయడం యేటా జరుగుతున్నది. ప్రకృతివైపరీత్యాల పరిశీలనకు కేంద్ర బృందాల పర్యటనలు ఏర్పాటు చేయటం, నివేదికలివ్వడం ఆనవాయితీగా వస్తున్నది. గత 7 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వాన్ని రు.42,533 వేల కోట్లు అర్థించగా కేంద్రం రు.1994 కోట్లు మాత్రమే సహకరించింది. 2009లో రు.9,474 కోట్లు అర్థించగా రు.572 కోట్లు మాత్రమే ఇచ్చింది. 2009 వరదల నష్టం 11,707 కోట్లు కోరగా 606.88 కోట్లు మాత్రమే ఇచ్చింది. వ్యవసాయ రంగ అభివృద్ధి ద్వారా పారిశ్రామిక రంగం, సేవా రంగం అభివృద్ధి ఆధాపడి ఉందన్న వాస్తవాన్ని ఈ మద్యనే ప్రణబ్‌ ముఖర్జీగారు ప్రకటించడం గమనార్హం. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలను అరికట్టవచ్చని సెలవిచ్చారు. కానీ రాష్ట్రప్రభుత్వానికి గత 5 దశాబ్దాలుగా ఈ సూచన చెప్పినా వినలేని పాలన సాగిస్తున్నారు. 1961లో రాష్ట్ర జనాభా 3.60 కోట్లు కాగా 2011లో 8.47 కోట్లకు పెరిగాం. జనాభా పెరిగినా ఆ దామాషాలో ఉత్పత్తి మాత్రం పెరగలేదు. కమతాల సంఖ్య పెరుగుతూ సగటు కమతం 3 హెక్టార్ల నుండి 1.20 హెక్టార్లకు తగ్గింది. 83.50 శాతంగా ఉన్న 5 ఎకరాలలోపు కమతాల భూ విస్తీర్ణం క్రమంగా తగ్గుతున్నది. వీరిని భూముల నుండి తరిమివేసే విధానాలు కొనసాగుతున్నాయి. విత్తనాలు, ఎరువులు, రుణాలు, వ్యవసాయ సలహాలు అందకుండా శాఖను కుదిస్తూ, మార్కెట్లలో కనీస మద్దతు ధరలు లభించకుండా చేసి వారిని భూముల నుండి పారిపోయే విధానాలు అమలు జరుపుతున్నారు. చైతన్య యాత్రలు, రచ్చబండ చర్చలు సమస్యలను పరిష్కరిస్తాయా?
1956 నుండి 2009 నాటికి 9 రాష్ట్ర పంచవర్ష ప్రణాళికల కాలంలో 28 లక్షల హెక్టార్లు భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కింద, 7.6లక్షల హెక్టార్లు మైనర్‌ ఇరిగేషన్‌ కింది సాగు నీటి వనరులు కల్పించినా, 22.86 లక్షల హెక్టార్లు, భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కింద, 7.50 లక్షల హెక్టారు మత్రమే సాగయ్యింది. రు.12 వేల కోట్ల  రైతుల పెట్టుబడితో   24 లక్షల బావుల కింద 40లక్షల ఎకరాలు సాగు కిందికి తెచ్చారు. ఒక విధంగా ప్రభుత్వ సాగునీటి కల్పనకన్నా అదనంగా సాగు వసతి కల్పించుకున్నారు. అనేక కారణాలు చూపి వీరికి విద్యుత్తు సరఫరాపై ఆంక్షలు విధించి ప్రసార కాలాన్ని మూడు, నాలుగు గంటలకు కుదించారు. ఉచిత విద్యుత్తును ఎత్తి వేయాలని, ఆహార పంటల విస్తీర్ణం తగ్గించాలని ప్రపంచ బ్యాంకు తెస్తున్న ఒత్తిడి తలొగ్గి ఆ విధానాల అమలుకు పూనుకుంది.
ప్రస్తుత పెట్టుబడిదారీ సమాజంలో నిరుద్యోగం, అసమాన అభివృద్ధి, ప్రాంతీయ వెనకబాటుతనం సహజలక్షణంగా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ విధానాల ఫలితమే నేటి రాజకీయ అస్థిరతకు కారణం. 1956 నుండి  శ్రీకృష్ణ కమీషన్‌ ఏర్పాటు మరియు ప్రస్తుత రాష్ట్ర అనిశ్చితిపై నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెస్‌ పార్టీయే. ఇన్ని సందర్భాలలో జరిగిన ఒప్పందాలలో కీలక భాగస్వాములూ కాంగ్రెస్‌ వారే. కాంగ్రెస్‌ పాలక వర్గం రాష్ట్రాన్ని అధోగతిలోకి నెట్టి, తమ ప్రభుత్వ అనుసరిస్తున్న అవినీతి విధానాలను ప్రశ్నించకుండా వక్రమార్గం పట్టిస్తున్నారు.
అవినీతిలో నిండా కూరుకుపోయిన కాంగ్రెస్‌ అందులో నుండి బయటపడడానికి అధికారాన్ని వినియోగిస్తున్నది. సత్యం కుంభకోణం మొదలు ఎంఆర్‌ ప్రాపర్టీస్‌, రాజీవ్‌ ఉద్యోగశ్రీ, ఆరోగ్యశ్రీ చివరకు సర్వశిక్షాభియాన్‌, నెల్లూరు కిసాన్‌ సెజ్‌తోపాటు, ఓబులాపురం, బయ్యారం గనుల కుంభకోణాలలో వేలకోట్లు కైంకర్యం చేశారు. చివరకు విత్తనాల కుంభకోణాలు వదలలేదు. జలయజ్ఞంలో వేలకోట్లు కాజేశారు. ప్రస్తుతం ప్రాజెక్టుల పనులు నిల్చిపోయినా అడిగే నాథుడు లేడు. గత ప్రభుత్వం 16 కుంభకోణాలలో రు.12,366 కోట్లు కాజేశారు. ఏ ప్రభుత్వం అధికారానికి వచ్చినా కుంభకోణాలలో కోట్లు కాజేయడం కొనసాగుతూనే ఉంది. ప్రజాసంక్షేమాలు దారిమల్లుతూనే ఉన్నాయి.
పారిశ్రామిక రంగం
ప్రభుత్వ రంగంలోని పరిశ్రమలు దాదాపు మూత వేశారు. గత ప్రభుత్వ కాలంలో 14 ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయడం ద్వారా 22వేల మంది కార్మికుల బజారు పాలు కాగా, ప్రస్తుత ప్రభుత్వ కాలంలో నాలుగు ఫ్యాక్టరీలను మూసి వేయడం ద్వారా 14,500 మంది నిరుద్యోగులయినారు. ఆజాంజాహి మిల్లుకు చెందిన 100 ఎకరాలను అమ్మి వేశారు. ప్రభుత్వ, సహకార రంగంలోని చక్కెర మిల్లులను ప్రైవేటు పరం చేసి చెరుకు రైతులకు ధర రాకుండా చేశారు. 6 లక్షల ఎకరాల చెరుకు విస్తీర్ణం 4 లక్షల ఎకరాలకు తగ్గింది. ఉన్న ఫ్యాక్టరీలు మూసి వేసి 10లక్షల ఉద్యోగాలు ఎలా కల్పిస్తారు? వ్యవసాయశాఖలో ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ నాలుగు సంవత్సరాలుగా చెబుతున్నా ఆచరణ శూన్యం. ఉపాధ్యాయ ఉద్యోగాల కొరకు ఆందోళనలు చేసినవారిపై కేసులు పెట్టిన ప్రభుత్వం రానున్న కాలంలో లక్షల కొద్ది ఉద్యోగాలు కల్పిస్తామంటే ప్రజలు నమ్ముతారా?
భూసేకరణ, భూపందేరం ఫార్సుగా మారింది. బలవంతంగా పేద రైతుల నుండి భూములు సేకరించి పెద్దలకు కట్టబెడుతుంది. ఈ మధ్య ఒక నెల్లూరు జిల్లాలోనే 18 థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలకు 10 వేల ఎకరాల భూమిని కట్టబెట్టేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. డిసెంబర్‌ 2010 నాటికి రాష్ట్రంలో 73 ఎస్‌ఇజడ్‌లు నోటిఫై చేయగా మరో40 ఎస్‌ఇజడ్‌లకు ప్రాథమిక ఆమోదం తెలిపారు. వీటి కింద  1లక్షా 70 వేల ఎకరాల భూమిని సేకరిస్తున్నది. సాగు నీటి ప్రాజెక్టులకు, ఔటర్‌ రింగు రోడ్డుకు, ఇండ్లు, పరిశ్రమల పేరుతో రాష్ట్రంలో 13.5 లక్షల ఎకరాల భూమిని సేకరించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటికీ సేకరించిన భూమికి కనీసం పరిహారాలు చెల్లించకపోవడం వలన భూములు, ఆస్తులు కోల్పోయిన వారు వీధులపాలయ్యారు. భూములు కోల్పోయిన వారిని కాల్పులకు గురి చేశారు. భూములు పొందిన వారు పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు చేసి కోట్లు గడిస్తున్నారు. 80 లక్షల గృహాలు నిర్మాణం చేస్తామని ఇందిరమ్మ పథకం 3 దశలుగా నిర్ణయించారు. 2010 ఫిబ్రవరి 14 వరకు 46.33 లక్షల ఇండ్లు పూర్తైనట్లు బడ్జెట్‌ పత్రాలలో ప్రకటించారు. పూర్తి కాని ఇండ్లను కూడా అయినట్లు ప్రకటించడంతో
ఉన్న ఇండ్లు కోల్పోయిన ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు.
ఆరోగ్యం, విద్యా తదితర రంగాల పరిస్థితి అభివృద్ధి దశలో లేదు.  ఈ రెండు రంగాలు పూర్తిగా కార్పోరేట్‌ సంస్థల చేతిల్లోకి వెళ్లి పోయాయి. ఆరోగ్యం కోసం వెళ్ళినా, చదువుల కోసం వెళ్ళినా లక్షల రూపాయలు కావాలి. ఇది చెల్లించలేని పేద, మధ్యతరగతి వారు ఆరోగ్యానికి, విద్యకు నోచుకోవడం లేదు. అందుకే అక్షరాస్యతలో రాష్ట్రంలో 12వ స్థానంలోకి వెళ్ళింది. వైద్యసౌకర్యాలు లేక దోమకాటుకు గురై యేటా వేలాది మంది ప్రాణాలు విడుస్తున్నారు. ఇదేనా సంక్షేమ రాజ్యం? 55 సంవత్సరాల పాలనలో సాధించిందేమిటి? ప్రాప్తకాలజ్ఞతగా కొంత అభివృద్ధి
ఉంటుంది. కానీ అది ప్రణాళికాబద్దమయంగా ప్రభుత్వాలు చేసింది కాదు. శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా దిగజారింది. దొగతనాలు, మానభంగాలు, ప్రేమోన్మాదుల ఘాతుకాలు, మహిళలపై వేధింపులు, ఆకస్మిక మరణాలు యేటా లక్షల్లో జరుగుతున్నాయి. వీటి నివారణకు ఎలాంటి చర్యలు లేకపోగా యేటేటా వీటి సంఖ్య పెరుగుతూనే ఉంది. మాఫియా ముఠాలు పెరిగాయి. ఈ ముఠాలకు పాలకులకు సంబంధాలున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వం మాత్రం పన్నుల పెంపు ద్వారా, మద్యం అమ్మకాలు, భూముల అమ్మకాలు, రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెంచడం ద్వారా ప్రజలపై భారాలు మోపుతున్నది. ఇంటి పన్ను, రెగ్యులరైజేషన్‌ పన్ను, త్రాగు నీటి పన్ను భరించలేనంతగా పెంచారు. ఇన్ని భారాలు పెంచి నవంబరు మాసంలో సంక్షేమ మాసంగా ప్రకటించి ప్రజలకు ఎన్ని పథకాలు అమలు చేస్తారు. అన్ని వర్గాల ప్రజల కొనుగోలు శక్తి తగ్గి మాంద్యంలోకి వెళ్తున్నారు. రాష్ట్రం నుండి లక్షలాది మంది దుబాయ్‌, ఇతర దేశాలకు వలస వేళ్ళడమే కాక దేశంలోని పారిశ్రామిక ప్రాంతాలకువలస వెళుతున్నారు. వలసలు వెళ్లినవారు తిరిగి వస్తారో, రారో అని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వలస వెళ్ళిన చోట నేరారోపణల్లో చిక్కుకోవడం, ఆకస్మిక మరణాలకు గురికావడం జరుగుతున్నది. ఆ కుటుంబాలకు ఆదుకునే దిక్కులేక వీధిన పడుతున్నారు. ఇదేనా రాష్ట్ర అభివృద్ధి? రాష్ట్రం రుణాంధ్రప్రదేశ్‌గా, అవినీతి ఆంధ్రప్రదేశ్‌గా దేశ చరిత్రలో ప్రథమ స్థానంలో నిలుస్తున్నది. ప్రజాసమస్యలను పట్టించుకునే స్థితిలో పాలక పక్షాలు లేవు. ప్రభుత్వం ప్రపంచబ్యాంకు అడుగులకు మడుగులొత్తుతున్నది. ఇంత దిగజారిన ప్రభుత్వాన్ని ఏనాడూ ప్రజలు చూడలేదు.
1946లో పుచ్చలపల్లి సుందరయ్య గారు ‘‘విశాంధ్రలో ప్రజారాజ్యం’’ అను పుస్తకాన్ని ప్రచురించారు. అందులోని వివరాలను అధ్యయనం చేసి పరిష్కరిస్తే రాష్ట్రంలో నేడున్న పరిస్థితులు వచ్చేవి కావు. స్వాతంత్య్ర పూర్వమే ప్రభుత్వాలకు రాష్ట్రాభివృద్ధి యెడల తగు సూచలను కమ్యూనిస్టు పార్టీ చేసింది.ఆ సమస్యల సాధనకు పోరాటాలు నిర్వహించింది. కానీ ఉద్యమాలను నిర్భందంతో అణిచి వేయడమే కాక రాష్ట్రాన్ని అధోగతికి తీసుకు వెళ్ళే విధానాలను నేటి వరకు పాలకులు కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పటికైనా ప్రజలకు విశ్వాసం కలిగించే విధంగా ప్రణాళికలు రూపొందించి రాష్ట్రాభివృద్ధికి పాలక వర్గాలు కృషి చేయాలి. రాష్ట్రంలో ఉన్న అన్ని భౌతిక వనరులను వినియోగంలోకి తెచ్చే విధంగానూ, వెనకబడిన ప్రాంతాలలో మౌలిక సమస్యల అభివృద్ధికి కృషి చేసే విధంగా చర్యలు చేపట్టాలి. ఆయా రంగ నిపుణులతో చర్చించి, ప్రజల సూచనలను గమనంలోకి తీసుకొని అభివృద్ధి పధంలోకి రాష్ట్రాన్ని తీసుకెళ్ళాలి.

సారంపల్లిమల్లారెడ్డి

No comments:

Post a Comment