Monday, 11 August 2014

నిజాం సుగర్స్‌ - వివరణ

    2004 మే 14న అధికారానికి వచ్చిన కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ .రాజశేఖరరెడ్డి ఈ ఫ్యాక్టరీని తిరిగి ప్రభుత్వరంగంలోకి తెస్తానని ప్రకటించారు. ఈ బదిలీపై శాసనసభా కమిటీని వేశారు. ఈ కమిటీ నివేదికను యిచ్చింది. ఆ నివేదికను ప్రభుత్వం ఆమోదించింది. అయినా కాంగ్రెస్‌ పాలనా కాలం ఐదు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ప్రాజెక్టును తిరిగి స్వాధీనం చేసుకోవడంలో నేటికీ జాప్యం చేస్తూనేవుంది.  నిజాం సుగర్స్‌నుకొనుగోలు చేసిన డెల్టా పేపర్‌మిల్లు 11 ''నిజాం దక్కన్‌ షుగర్స్‌ లిమిటెడ్‌''గా పేరు మార్చింది. దక్కన్‌ సుగర్స్‌ ఫ్యాక్టరీలోని ఇనుప తుక్కు (స్క్రాప్‌) అమ్మకం ద్వారా రు. 90 కోట్లు సంపాదించింది. వేలాది మంది కార్మికులు పనిచేసిన ఈ కర్మాగారంలో (బోధన్‌) 72 మంది శాశ్విత కార్మికులు, 130 మంది సీజనల్‌ కార్మికులుమాత్రమే పనిచేస్తున్నారు. బోధన్‌ ఫ్యాక్టరీలో 4, 5 లక్షల టన్నుల చెరకు ఆడాల్సివుండగా, 2008-09 సంవత్సరంలో 85 వేల టన్నులు మాత్రమే చెరకును ఆడించారు.  ప్రస్తుతం తోంభై రోజులు పనిచేయకుండానే మూతపడింది. గంబోజిపేట 2 లక్షల టన్నులు ఆడాల్సివుండగా, మెట్‌పల్లి 30వేల టన్నులు ఆడాల్సివుండగా అందులో 50శాతం కూడా ఆడకుండానే మూసివేశారు.
    గత సంవత్సరం చెరకు టన్ను ధర రు. 1120 - 1170 లు మాత్రమే చెల్లించారు. ఇందులో రైతులకు యివ్వాల్సిన బాకీ టన్నుకు రు. 120ల చొప్పున చెల్లించాల్సివుంది. తర్వాత ఇందులో కొంత చెల్లింపులు జరిగాయి.  2009-10 సంవత్సరానికి రైతులను చెరకు వేయడానికి ప్రోత్సహించుటకు చెరకు ధరను  టన్నుకు రు. 1350లకు పెంచుతూ ప్రకటన చేశారు. అయినా రైతులు చెరకు వేయడానికి సుముఖంగా లేరు.
ప్రాజెక్టు వివరాలు :
బోధన్‌ ప్రాజెక్టు క్రింద 17000 ఎకరాల భూమి కేటాయించారు. ఆతర్వాత అందులో 9వేల ఎకరాల భూమిని రైతులకు పట్టాలిచ్చారు. మరో రెండువేల ఎకరాలను వేలం వేసి అమ్మారు.  ప్రస్తుతం రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో ఫ్యాక్టరీ వుంది. మరో రెండు వేల ఎకరాలు బీళ్లుగా వున్నప్పటికీ కొందరి అక్రమ స్వాధీనంలో వుంది. ఈ విధంగా అత్యంత విలువైన 17000 ఎకరాల భూమిని అటు సాగు చేసుకొంటున్న రైతులకు గానీ, ఇటు ఫ్యాక్టరీ అభివృద్ధికి గానీ ఉపయోగపడలేదు.
    నూతన ఫ్యాక్టరీ యాజమాన్యం 1200 మంది సిబ్బంది నుండి రు. 2000 చొప్పన జీతం నుండి కోతపెట్టి ఇండ్ల స్థలాలకు ప్రతికుటుంబానికి 200 చ.గజాల చొప్పున 130 ఎకరాల భూమిని పంపిణీ చేస్తామని డబ్బు వసూలు చేశారు. నేటికీ వారికి ఇండ్ల స్థలాలు యివ్వలేదు.
    నిజాం సాగర్‌ ఆధారితంగా ఏర్పాటు చేసిన ఈ ఫ్యాక్టరీకి చెరకు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. నిజాం సాగర్‌లోకి పూడిక రావడం వలన మరియు కాల్వలకు లైనింగ్‌ లేకపోవడం వలన పొలాలకు నీరు చేరక చెరకు విస్తీర్ణాన్ని తగ్గించారు. కొంతమంది బావుల క్రింద చెరకు వేసి పండించినా అంత లాభసాటిగా లేదు.
    నిజాం సుగర్స్‌ సంస్థలను, ఫ్యాక్టరీలను పునరుద్ధరించి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నిర్వహణ కొనసాగించడం వలన తెలంగాణా ప్రాంతంలో 10 లక్షల టన్నుల చెరకును క్రష్షింగ్‌ చేసేవిధంగా అభివృధ్ధి చేయవచ్చు. తద్వారా అటు రైతాంగానికి, యిటు కార్మికుల ఉపాధికి మరియు పరోక్షంగా ఫ్యాక్టరీపై ఆధారపడిన వారికి ఉపాధి కల్పించేవిధంగా వుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తన హామీలు నిలబెట్టుకుంటూ నిజాం సుగర్స్‌ బదలాయింపులను రద్దుచేసి ప్రభుత్వ రంగంలోనే పని చేయించాలి.
   
---

No comments:

Post a Comment