Tuesday, 12 August 2014

కౌలురైతుల ఆర్డినెన్స్‌ ` పరిశీలన

2011 జూన్‌ 8న ఆంధ్రప్రదేశ్‌ భూఅధీకృత రైతుల ఆర్డినెన్స్‌( ఆంధ్రప్రదేశ్‌ లాండ్‌ లైసెన్స్‌డ్‌ కల్టివేటర్స్‌ ఆక్టు `2011) కు నిబంధనలు ప్రకటించారు. ఈ ఆర్డినెన్స్‌ ప్రకారం కౌలుదారుల పేర్లు ఒక ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేసి వారికి రుణ గుర్తింపు కారుడలు ఇస్తారు. ఈ కార్డు పొందిన కౌలు రైతుకు బ్యాంకుల నుండి పంట రుణాలు, ప్రకృతివైపరీత్యాల సందర్భంగా పంటల పరిహారం, పంటల భీమా పథకం, మరియు ప్రభుత్వ వ్యవసాయ పథకాలు లభిస్తాయి. ప్రస్తుతం కౌలు రైతుకు ఎలాంటి రక్షణ లేదు. ఈ ఆర్డినెన్స్‌ ద్వారా కొంత మేరకైనా రక్షణ కలుగుతుందని కౌలు రైతులు విశ్వాసంతో ఉన్నారు. అనేక సంవత్సరాల రైతులు ఉద్యమ ఫలితంగా ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ తెచ్చింది. 2004లో   నియమించిన కోనేరు రంగారావు కమిషన్‌ కౌలుదారుల సమస్యలపై చేసిన సిఫారసులను అమలు చేయడానికి 2003లో జివోనెం. 1049ని ప్రభుత్వం జారీ చేసింది. ఈ జివో అమలుకు 2010 నవంబరులో 14369 ఉత్తర్వును ఇచ్చింది. ఈ ఉత్తర్వు ప్రకారం కౌలు రైతుల పేర్లు నమోదు చేసి గుర్తింపు కార్డులివ్వాలి. కానీ ప్రభుత్వం కౌలు రైతులకు చట్టం తెస్తానంటూ 2011 మార్చి 24న శాసన సభలో బిల్లును ప్రవేశపెట్టింది. కానీ బిల్లును ఆమోదానికి పెట్టలేదు. శాసన సభ ప్రోరోగ్‌ కావడంతో ఆ బిల్లు ఉద్దేశ్యాలతో పై ఆర్డినెన్స్‌ను తెచ్చింది. ఈ ఆర్డినెన్స్‌ వచ్చిన తేదినుండి ఆరు మాసాలలో శాసన సభ ఆమోదం పొంది చట్టంగా గవర్నర్‌ సంతకం కావాలి. ఆరు మాసాలలో శాసన సభ ఆమోదం పొందని తీర్పు ఆర్డినెన్స్‌ రద్దవుతుంది.
ఇంతకు ముందు ‘‘ ఆంధ్రప్రదేశ్‌ (ఆంధ్ర ఏరియా) కౌలుదారీ చట్టం, 1956 రాష్ట్రపతి ఆమోదం పొందింది. (09.09.1956) ఈ చట్టానికి 21.11.1974న సవరణలు చేశారు. ఈ సవరణలు రాష్ట్రపతి ఆమోదం పొందాయి. ఆమోదం పొందిన సవరణలతో ఈ చట్టాన్ని 01.07.1980 నుండి అమలు పర్చడానికి రూల్స్‌ విడుదల చేశారు. కానీ ఈ చట్టాన్ని అమలు చేయకుండా సుప్తావస్థలో పెట్టారు. ఈ చట్టప్రకారం కౌలు దారులకు కౌలు రేటు, తొలగింపు నిబంధనలు, హక్కులు ఉన్నప్పటికీ భూమిపై ఎలాంటి హక్కులు లేకుండా చట్టంలో స్పష్టంగా  విశదపర్చారు. లేని భయాన్ని ఊహించుకొని భూయజమానులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి చట్టం అమలు కాకుండా చేశారు. ప్రస్తుత ఆర్డినెన్స్‌ కూడా అదే వ్యతిరేకత వచ్చింది. అయినప్పటికీ ప్రభుత్వం అమలుకు పూనుకుంది.
ఆర్డినెన్స్‌ ప్రకారం కౌలుదారు గ్రామ రెవెన్యూ అధికారికి గుర్తింపు కార్డు గురించి ధరఖాస్తు చేసుకోవాలి. ఆ ధరఖాస్తులో సర్వేనెంబరు వేయాలి. (సహజంగా రైతులకు సర్వేనెంబర్లు తెలియవు) ఈ ధరఖాస్తులలో గ్రామ సభల్లో ఆమోదించిన వాటికే గుర్తింపు కార్డులిస్తారు. తృణీకరించబడిన ధరఖాస్తులు ప్రతీ సంవత్సరం జూన్‌ 15 లోగా పై ఆధికారులకు అప్పీలు చేసుకోవాలి. కార్డు ఒక సంవత్సరం మాత్రమే( ఖరీఫ్‌, రబ్బీపంటలకు మాత్రమే) వర్తిస్తుంది. ప్రతి సంవత్సరం మార్చిలో కార్డు కొరకు ధరఖాస్తు చేసుకోవాలి. ఒకే కుటుంబంలోని( అన్నదమ్ములు, అక్క చెల్లెల్లు,తల్లిదడ్రులకు) వారి మధ్య భూములు కౌలుకు చేసినచో వారికి ఈ ఆర్డినెన్స్‌ వర్తించదు. ప్రభుత్వ భూములకు, దేవాలయ భూములు, వక్ఫ్‌ భూములకు ఈ చట్టం వర్తించదు. ప్రైవేటు భూములకు మాత్రమే వర్తిస్తుంది.
అప్పీల్లను జూన్‌ 30లోగా పరిష్కరించాలి. ఒక వేళ అధికారి కాలం పొడిగించదలుకుంటే కాలం పొడిగించవచ్చు. పంట రుణం కౌలుదారుకు, దీర్ఘకాలిక రుణం భూ యజమాని పొందడానికి అర్హత ఉంటుంది. చట్టం అమలు బాధ్యత ‘‘ ఆంధ్రప్రదేశ్‌ పరిపాలన ప్రధాన కమిషనర్‌ ’’ (సిఎల్‌ఎల్‌ఎ)బాధ్యత ఉంది. రుణ కార్డుకు అగు ఖర్చును కార్డుదారు నుండి వసూలు చేస్తారు. ప్రభుత్వం గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు అనేక వేదికలపై చర్చలు సాగించడమే కాక వివిధ ప్రభుత్వ సమావేశాలలో కూడా చర్చించి ఈ చట్టాన్ని రూపొందించారు. రాష్ట్రంలో 24 లక్షల కౌలుదారులున్నట్లు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ అంచనా వేసింది. మొత్తం 40 లక్షల మంది కౌలుదారులుంటారని రైతుసంఘాలు అంచనా వేశాయి. ప్రభుత్వం వద్దకు ఏడున్నర లక్షల మంది మాత్రమే ధరఖాస్తు చేసుకోగా అందులో లక్షాయాభైవేల మందిని గ్రామ సభలలో అనర్హులుగా ప్రకటించారు. అనర్హులుగా ప్రకటించడానికి ప్రధానంగా భూయజమానులు అభ్యంతరం చెప్పడమే. కొన్ని చోట్ల వి.ఆం.్‌వో.లు భూయజమానులతో మిలాఖతై భూ యజమానులకు అనుకూలంగా వ్యవహరించారు. యజమానులకు ఫోన్‌ చేసి మరీ రప్పించారు. వారితో ఫారం`5 పెట్టించారు. కొన్ని చోట్ల భూయజమానులు ధరఖాస్తు పెట్టిన కౌలుదారులను బెదిరించి, పెట్టిన ధరఖాస్తులను వాపసు తెప్పించారు. మరికొన్ని చోట్ల గ్రామసభలు జరపకుండానే ఆటంకాలు కల్పించారు. భూములపై కౌలుదారులకు ఎలాంటి హక్కులు కలిగే ఆస్కారం లేకున్నప్పటికీ భూ యజమానులు కౌలుదారులకు ఆ కనీస రక్షణలు లేకుండా అడ్డుపడ్డారు. కారణాలేమిటి? భూయజమానుల చెప్పుచేతలలో కౌలుదారులను అట్టిపెట్టుకోవడం తాము కోరినపుడు ధాన్యం అమ్మడం, యజమానికి తోచినంత కౌలు రేటు నిర్ణయించుకునే అవకాశం, బ్యాంకు రుణాలు యజమానులు పొంది కౌలుదారులనుండి ఎక్కువ వడ్డీరేటు వసూలు చేయడం, ప్రకృతి వైపరిత్యాల సందర్భంగా వచ్చు పంటల పరిహారం మరియు భీమాపరిహారం కాజేయడానికి అవకాశాలు అట్టేపెట్టుకోవడానికి ఈ చట్టం అడ్డంకిగా వస్తుందని భూయజమానులు వ్యతిరేకించారు.  
భూయజమాని కౌలుకివ్వడానికి కారణాలు :
1. వ్యవసాయం చెయ్యడం వల్ల వచ్చే ఆదాయం కన్నా కొన్ని రెట్లు హెచ్చు ఆదాయం వచ్చే రంగాలు                పట్టణాలలో ఉండడం వలన భూస్వాములు అక్కడికి చేరారు.
2. భూమజమానులకు పంటల ఆదాయంపై ఎలాంటి వ్యయప్రయాసాలుండవు
3. కౌలుకివ్వడం ద్వారా వచ్చే ఆదాయం సొంతంగా వ్యవసాయం చేస్తే వచ్చే ఆదాయంకన్నా ఎక్కువగా
   ఉండడం.
4. కౌలు ద్వారా వచ్చే ఆదాయంతో పెట్టుబడి పెట్టి లాభాలు సంపాదించడం.
5. భూములను హామీగా పెట్టి ఒకటికి మించిన బ్యాంకుల నుండి అప్పులు తీసుకుంటూ వ్యాపారాలు,                కాంట్రాక్టులు, పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టడం.
6. ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే అన్ని రకాల రాయితీలు, సబ్సిడీలు నిరాఘాటంగా పొందగలగటం.
7. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయినా భూయజమానికి నష్టంలేదు. పైగా ప్రభుత్వం నుండి            వచ్చే పరిహారం భీమాపరిహారం వీరే పొందుతారు.
8. భూ యజమాని కుటుంబపనులకు కౌలు చేసే కుటుంబం చెల్లింపులు లేకుండా పనులు చేసి పెట్టడం.

గ్రామీణపేదలు ఎందుకు కౌలు చేస్తున్నారు :
1. వలసుల పోకుండా ఉపాధి దొరుకుతుందనే ఆశ
2. కుటుంబ సభ్యులంతా అదనంగా శ్రమించి మిగుల్చుకోవచ్చుననే భావన
3. సొంతంగా వ్యవసాయం చేయడాన్ని సామాజిక హోదాగా భావించడం.
4. పొలంలోని గడ్డితో పశువులను పోషించి పాల ఉత్పత్తిపై అదనపు ఆదాయం పొందాలనే తాపత్రయం.
5. అప్పు తెచ్చి పిల్లలను చదివించాలనే కోరిక
6. తిండి గింజలు మిగులుతాయన్న ఆశ.
కానీ కౌలు రేట్లు ఎకరా పదివేల నుండి యాభై వేల వరకు వివిధ పంటలకు ఉండడంతో కౌలుదారుకు రుణభారమే తప్ప మిగులు కనబడదు. 2010 డిసెంబర్‌ ` 2011 జనవరి నెలలో వచ్చిన తూఫాన్‌లకు పంటలు నష్టపోయిన కౌలు రైతులు 160 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కనీసం వీరికి భూయజమానుల నుండి కానీ ప్రభుత్వం నుండి కానీ ఎలాంటి సహాయం అందలేదు.
స్వయం సహాయక గ్రూపులకు కౌలుదారీ చట్టం :
స్వయం సహాయక గ్రూపులలోని పేద మహిళలను 2014 నాటికి లక్షాధికారులను చేయాలన్న ఉద్దేశ్యంతో  ఈ చట్టం శాసనసభలో ఆమోదించారు. ఈ చట్టం ప్రైవేటు భూములు కౌలుకు తీసుకొని 5 సంవత్సరములు సాగు చేయటానికి అవకాశం కల్పిస్తుంది. భూయజమాని మారినా 5 సంవత్సరాలు కౌలుకు తీసుకున్న గ్రూపు కొనసాగుతుంది. గ్రూపుకు ` భూయజమానికి మధ్య అవగాహనతో కౌలురేటు నిర్ణయించుకోవాలి. ప్రకృతి వైపరిత్యాల వల్ల పంటకు నష్టం వాటిల్లితే ఇన్సురెన్సు, ప్రభుత్వ నష్ట పరిహారంతో కౌలు రేటును సర్దుబాటు చేస్తారు. అగ్రిమెంటు చేసుకున్న గ్రూపులకు ప్రభుత్వ, మరియు వ్యవస్థాగత రుణాలు పొందవచ్చు. 5 సంవత్సరాల అనంతరం కౌలు అగ్రిమెంటు దానంతట అదే రద్దవుతుంది. ఈ చట్టంలో భూయజమానుల నుండి స్వయం సహాయక గ్రూపులకు భూమిని ఇప్పించి గ్రిమెంటు చేయించే బాధ్యత ప్రభుత్వం తీసుకోలేదు. అది స్వయం సహాయక గ్రూపులే చేసుకోవాలి. తరతరాలుగా కౌలు చేస్తున్న రైతులు రుణగ్రస్తులవుతుండగా స్వయం సహాయక గ్రూపుల మహిళలు లక్షాధికారులుగా ఎలా మారుతారు? 1956 కౌలు చట్టం వర్తింప చేసినచో కనీసం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. పై రెండు చట్టాలు ఆచరణలో కౌలుదారులకు ఏ మాత్రం రక్షణ కల్పిస్తాయో అనుభవం ద్వారా తెలుసుకోవల్సిందే. ఏదిఏమైనా ప్రభుత్వం భూస్వాముల పక్షమేనన్నది వాస్తవం. చట్టాలు చేసినంత మాత్రన రక్షణలు కల్పించబడవు. వాటిని అమలు చేయడం ద్వారా మాత్రమే కొంత మేరకైనా రక్షణలు కల్పించవచ్చు. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఆశిద్దాం.
సారంపల్లి మల్లారెడ్డి

No comments:

Post a Comment