Wednesday, 13 August 2014

వ్యవసాయాభివృద్దిపథంలో చైనా

       9.6 మిలియన్‌ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల చైనాలో కేవలం అన్ని పంటలకు కలిపి122 మిలియన్‌ హెక్టార్లు మాత్రమే సాగుభూమి ఉంది. (భారతదేశంలో ఒక ఆహారధాన్యాల ఉత్పత్తిమాత్రమే120 మి.హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతున్నది.)అడవులు 195.45 మిలియన్‌ హెక్టార్లు (ప్రపంచ ఆటవిక విస్థీర్ణంలో 20.36 శాతం) ఉంది. నేడు సంభవించిన గ్లోబల్‌ వార్మింగ్‌ను అధిగమించి చైనా పర్యావరణంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నది. ఫలితంగా వాతావరణంలో పెద్దగా మార్పులు రాలేదు. మొత్తం జనాభాకు ఆహార సమస్యను పరిష్కరించడమే కాక, వారికి పౌష్టికాహారం అందుబాటులో ఉంచింది.  బీజింగ్‌, షాంఘై, టియాంగ్‌జన్‌, బోంగ్‌కింగ్‌ మున్సిపాలిటీలు నేరుగా కేంద్ర ప్రభుత్వ నిర్వాహణలో కొనసాగుతున్నాయి. హాంకాంగ్‌, తైవాన్‌, మకావో ప్రాంతాలు స్వతంత్య్ర పరిపాలన కొనసాగిస్తునప్పటికీ విదేశీ, కరెన్సీ, రక్షణ రంగాల్లో చైనా పరిపాలనకు లోబడి సమైక్యంగా పనిచేస్తున్నాయి. ప్రస్తుతం ఆహారధాన్యాల ఉత్పత్తి 50 కోట్ల టన్నులు దాటింది. హెక్టారు దిగుబడి సగటున 90 క్వింటాళ్ళుగా ఉంది. పారిశ్రామిక ఉత్పత్తి 20`25 శాతం అభివృద్ధి రేటు ఉంది. ఐటి తదితర టెక్నాలజీ వ్యవస్థ వృద్ధిరేటు ప్రపంచంలోని సామ్రాజ్యవాద దేశాలకన్నా ఎక్కువగా ఉంది. షాంఘైపట్టణ అభివృద్ధని గమనిస్తే ప్రపంచంలో ఏ పట్టణమూ అంత అభివృద్ధిస్థాయిలో లేదనవచ్చు.  
ముఖ్యంగా మూడు అంశాలను అమలు జరుపుతున్నది. (1) శాస్త్రీయ ఆచరణ (2) సుస్థిర అభివృద్ది (3) సమాజ అభివృద్దిపై కేంద్రీకరణ పెట్టింది. చైనా అభివృద్దిలో ‘‘సోషలిస్ట్‌ మార్కెట్‌ ఎకానమి’’ కీలక పాత్ర వహిస్తున్నది. మార్కెట్‌ ఎకానమి అను పదం పెట్టుబడిదారులకు పేటెంట్‌గా వినియోగిస్తున్నారు. కానీ, ఈ విధానాన్ని సోషలిస్టు ఆర్థిక విధానానికి అనుసందానం చేసి మిశ్రమ ఆర్థిక విధానం కొనసాగుతున్నది.
వ్యవసాయ రంగాన్ని పరిశీలిస్తే అభివృద్దిని అర్థం చేసుకోవచ్చు. విప్లవానికి ముందు దేశంలో భూస్వాముల చేతుల్లో భూములున్నాయి. 01.10.1949 విప్లవం తర్వాత భూ పంపిణీ జరిగింది. గతంపై ఉత్పత్తి ఉత్పాదకత పెరిగింది. 1978లో ప్రపంచంలో వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన టెక్నాలజీని, భారీ యంత్రాలను వినియోగించి ఉత్పత్తిని, ఉత్పాదకతను మరింత పెంచడానికి చిన్న కమతాలు ఆటంకంగా ఉన్నాయి. రైతులను చైతన్యపరచి సహకార వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేసారు. గ్రామంలోని కుటుంబాల సభ్యులు ఇందులో వాటాదారులుగా ఉంటారు. వీరికి ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని, విత్తనాలను మరియు ఆర్థిక సౌకర్యం కల్పిస్తుంది. దీనితో ఈ వ్యవస్థలో గతంపై ఉత్పత్తి, ఉత్పాదకత పెరిగింది. అయితే మరింత ఉత్పాదకతను పెంచడానికి సహకార వ్యవసాయ క్షేత్ర వాటాదారుల అనుమతితో కొంత భూమిని కంపెనీ సేద్యానికి ఇస్తున్నారు. కంపెనీ సేద్యం అనగా కుదుర్చుకున్న కాంట్రాక్ట్‌ కాలం వరకే వారికి హక్కు ఉంటుంది. భూమిపై యాజమాన్యపు హక్కు గ్రామ ప్రభుత్వానిదే. ప్రస్తుతం ఉన్న చట్టాల ద్వారా మాత్రమే కంపెనీకి లీజుకు ఇస్తారు. కంపెనీ సేద్యం వలన గ్రామ సహకార క్షేత్రానికి గాని, లేదా గ్రామానికి కాని పర్యావరణరీత్యా గాని, మరి యే రూపంలో గాని నష్టం వాటిల్లే పరిస్థితిలో కాంట్రాక్టును రద్దు చేస్తారు. గ్రామ కమిటీ మరియు గ్రామ పార్టీ ఆమోదం లేకుండా బయటివారికి కౌలుకు ఇవ్వరాదు. స్థానిక రిజిష్టరీ కంపెనీలకు మాత్రమే గ్రామ కమిటీ ఆమోదంతో కౌలుకు ఇస్తారు. మార్కెట్‌ ఎకానమీ ద్వారా రైతులు తమ సరుకులను ప్రాసెస్‌ చేసి మార్కెట్‌లో అమ్ముతారు. మార్కెట్‌ ధరలో వ్యవసాయ పెట్టుబడికి నష్టం వాటిల్లే పరిస్థితి ఉన్నప్పుడు కమిటీ రెకమండేషన్‌ వలన ప్రభుత్వం రైతులకు నష్టం లేకుండా ఉండే విధంగా పరిహారాన్ని వెంటనే రాయితీగా చెల్లిస్తుంది. ధర తక్కువ ఉంటే ప్రభుత్వం జోక్యం వెంటనే పెరుగుతుంది. సహకార క్షేత్రాలు మరియు కంపెనీలు వచ్చాక వారి వార్షికాదాయం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం గ్రామీణ వార్షికాదాయం 20 వేల యువాన్లు (1.60 లక్షల రూపాయల)కు పెరిగింది. అయినప్పటికీ పట్టణప్రాంత ఆదాయాలకు, గ్రామీణ ప్రాంత ఆదాయాలకు వ్యత్యాసం చాలా ఉంది. గ్రామీణ ప్రాంత ఆదాయాలను పెంచడానికి అక్కడి సహకార క్షేత్రాలు చిన్నచిన్న పరిశ్రమలను కూడా స్థాపిస్తున్నారు. ఇనుము తయారీ, పంప్‌సెట్ల తయారీ, ఆహార దాన్యాల ప్రాసెసింగ్‌, మాంసం ప్రాసెసింగ్‌, పందులు, కోళ్లు, బాతులు, గొర్రెలు, చేపల పెంపకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. వీటి ఆదాయం వ్యవసాయ ఆదాయానికి మించి వాటా దారులకు వస్తున్నది. గ్రామంలో గాని, పట్టణంలో గాని ఇళ్లు లేనివారు లేరు. ప్రతివారికి ఇల్లు తప్పనిసరి. మెజారిటీ వయస్సు కలిగిన వారికి మాత్రమే ఇంటి భూమిని కేటాయిస్తారు. 25శాతం లాభోక్త చెల్లిస్తే, 75శాతం ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇంట్లో శానిటరీతో పాటు, అన్ని సౌకర్యాలు కలిగి అన్ని ఇండ్లు ఒకే మోడల్‌గా నిర్మాణం చేస్తున్నారు. ఆదాయం పెరుగుదల కొరకు పట్టణాలకు వెళ్లినవారికి పార్మింగ్‌ సొసైటీలో సభ్యత్వం ఉండదు. పట్టణంలో ఎదైనా కంపెనీలో గాని, ఫ్యాక్టరీలో గాని ఉద్యోగం ఇస్తున్నప్పుడు ఆ కంపెనీ అతనికి ఇంటి సౌకర్యం కల్పిస్తుంది. ఒకసారి పట్టణానికి వచ్చినవారు తిరిగి గ్రామాలకు దాఖలాలు లేవు.
ప్రతి గ్రామంలో వృద్దులకు విడిగా సౌకర్యాలు కల్పించబడ్డాయి. వారికి గ్రామ క్షేత్రం అన్ని విధాల ఆర్థిక సహాయం చేస్తుంది. ప్రభుత్వం కూడా ప్రతి వ్యక్తికి 1000 యువాన్ల వరకు రాయితీలు ఇస్తుంది. ఎక్కడా వృద్దులు ఇబ్బందులు పడిన దాఖలలు కనపడవు. ముఖ్యంగా బిక్షాటన చైనాలో కనిపించదు. ప్రతి గ్రామానికి పక్కా రహదారులు, రవాణా సౌకర్యాలు ఉన్నాయి. గ్రామ వ్యవసాయ క్షేత్రాలకు నూతన టెక్నాలజీ అందించడానికి ఎప్పటికప్పుడు పరిశోధన కేంద్రాల ద్వారా సలహాలు మరియు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంటుంది. చాంగ్‌షా పట్టణంలో గల లాంగ్‌`పింగ్‌ హైటెక్‌ వ్యవసాయ క్షేత్రం పరిశోధనలపై పెద్దగా కేంద్రీకరించి పనిచేస్తున్నది. ప్రస్తుతం చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలకు గ్రామీణ ప్రాంతాల నుండి వస్తున్నారు.
నీటి పారుదల విషయంలో గణనీయమైన అభివృద్ది సాధించారు. దేశంలోని 1500 నదుల నుండి నీటిని సాధ్యమైనంత వరకు వినియోగిస్తున్నారు. యాంగ్‌సీ నది 6403 కిలో మీటర్లు ఉండి 13 రాష్ట్రాల గుండా పారుతుంది. దీనిపై బ్రంహ్మాండమైన త్రీగోర్జెస్‌ ప్రాజెక్టును సాగునీటికి, హైడల్‌ ప్రాజెక్టు నిర్మించారు. అదే విధంగా చైనాలో లభించే ఖనిజ సంపదను వెలికితీసి భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసారు. భారీ పరిశ్రమలన్నీ ప్రభుత్వ రంగంలోనే నిర్వహిస్తున్నారు. చిన్నచిన్న పరిశ్రమలు లేదా ఉప పరిశ్రమలు ప్రయివేటు కంపెనీలు నిర్వహిస్తున్నాయి. ఈ విధంగా వ్యవసాయ, పారిశ్రామిక, సాంఘిక రంగాల్లో చిన్నచిన్న ఉత్పాదకతలను ప్రైవేటు కంపెనీలకు అప్పగిస్తున్నారు.
    గ్రామాలలో ఇండ్లు లేనివారు లేరు. నూతనంగా ఇళ్ళు కావల్సినవారికా స్థలం కేటాయిస్తారు. లాభోక్త 25%, ప్రభుత్వం 75% చెల్లించి ఒకే నమూనా కలిగిన ఇండ్ల నిర్మాణం చేపడతారు. శానిటరీ, రోడ్డు మొదలగు ప్రాధమిక సౌకర్యాలు కల్పిస్తారు. 
సోషలిస్టు మార్కెట్‌ ఎకానమిని అమలు చేస్తూ అభివృద్ది సాధిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో ప్రపంచంలోనే చైనా రెండో స్థానంలో ఉంది. ఆహారధాన్యాలే కాక వాణిజ్య పంటల్లోకూడా ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచడానికి ప్రత్యేక పరిశోధనలు జరుపుతున్నారు. స్వంత దేశీయ టెక్నాలజీనే అభివృద్ధి పరిచి తమ అవసరాలకు పోగా ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తున్నారు. రైతులకు న్యాయమైన ధరలు లభించేవిధంగా ప్రభుత్వం అనేక రాయితీలు కల్పిస్తున్నది. సహాకార వ్యవసాయ క్షేత్రాల నుండి వచ్చే ఆదాయమే కాక ఆ క్షేత్రాలు నిర్వహిస్తున్న వ్యవసాయాధారిత పరిశ్రమల ద్వారా అదనపు ఆదాయాన్ని రైతులు పొందుతున్నారు. యాంత్రిక వ్యవసాయం, అధునాతన టెక్నాటజీ వినియోగంతో రైతుల ఆదాయం పెంచే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తున్నది.
సారంపల్లి మల్లారెడ్డి
25.07.2012

No comments:

Post a Comment