Tuesday, 12 August 2014

రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

           73, 74 సవరించిన రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థలకు విధిగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరపాలి. ఐదు సంవత్సరాల కాలం ముగియడానికి మాసం రోజుల ముందే ఎన్నికల ప్రక్రియ పూర్తిచేసి కొత్తగా ఎన్నికైన వారికి పదవులలో కొనసాగే హక్కు కల్పించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేస్తూ ఆర్డినెన్స్‌ను తెచ్చింది. ఇది ఈ ప్రభుత్వానికి కొత్త కాదు. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయకుండా సక్రమంగా జరపాలన్న ఉద్దేశ్యంతో భారత రాజ్యాంగానికి సవరణలు తెచ్చారు. కానీ ఆ చట్టాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అతిక్రమించడం అత్యంత నేరపూరిత చర్య. స్థానిక సంస్థల్లో ప్రజల చొరవను పెంచి పాలనలో వారి భాగస్వామ్యాన్ని కల్పించడానికి ఉద్దేశించిన ఉన్నతలక్ష్యం ప్రభుత్వ విధానాల ఫలితంగా ప్రక్కదారి పడుతున్నది.
రాష్ట్రంలో రామరాజ్య స్థాపనకు స్థానిక సంస్థలను బలోపేతం చేయడమే లక్ష్యమని జాతిపిత మహాత్మాగాంధీ అనేక సందర్భాల్లో పాలకుల దృష్టికి, ప్రజల దృష్టికి తెచ్చారు. స్వరాజ్య స్థాపన జరిగాక స్థానిక సంస్థల ఆధిపత్యానికి ప్రథమ అవకాశం కల్పించాలని ప్రకటించారు. అదే విధంగా 1994లో ప్రధాని రాజీవ్‌గాంధీ అన్ని రాష్ట్రాలకు వర్తించే విధంగా రాజ్యాంగం 73,74ను సవరించారు. ఈ సవరణలకు అనుకూలంగా రాష్ట్రాలు తగు చట్టాలను చేసి అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది. దాని వెలుగులో ‘‘ఆంధ్రప్రదేశ్‌ పంచాయితీరాజ్‌ చట్టం 1994’’ను చేసి 1994 మే 30 నుండి అమలులోకి వచ్చింది. ఈ రాజ్యాంగ సవరణ చేయడానికే 1994కు ముందు రెండు సంవత్సరాల పాటు తీవ్ర తర్జనభర్జనలు జరిగాయి. 73వ రాజ్యాంగం గ్రామ పంచాయితీ, జిల్లా పరిషత్‌లకు ఉద్దేశించబడగా, 74వ రాజ్యాంగం మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఉద్దేశించి ఎన్నిలకను విధిగా ప్రతి ఐదు సంవత్సరాలకు జరపాలని లక్ష్యంగా పెట్టారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో పై చట్టాన్ని అనుసరించి 1995లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు పరోక్ష పద్దతిన జరిపారు. ఎన్నికలకు ముందు ఆరు మాసాలు ఆర్డినెన్స్‌ ద్వారా కాలయాపన చేసారు. చివరకు ప్రజా వత్తిడితో ఎన్నికలు నిర్వహించారు. 2001లో తిరిగి ఎన్నికలు జరపడానికి ముందు ఆర్డినెన్స్‌ ద్వారా ఎన్నికలు వాయిదా వేశాయి. అదే పరిస్థితి 2006లోనూ, 2011 లోనూ కొనసాగింది. 2011 జూలై 25తో గ్రామ పంచాయితీ, మండల` జిల్లా పరిషత్‌ల కాలపరిమితి ముగిసినా స్పెషల్‌ ఆఫీసర్లను పెట్టి పాలన సాగించడానికి ఆరు మాసాలు పొడిగిస్తూ ఆర్డినెన్స్‌ తెచ్చారు. ఏ రూపంలో పరిశీలించినా ఇది రాజ్యాంగ విరుద్ద చర్య తప్ప మరొకటి కాదు. దేశంలో అసాధారణమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎన్నికలు వాయిదా వేయడం సమంజసంగా ఉండవచ్చు. కానీ, పాలక వర్గాలు ఆంతరంగిక కుమ్ములాటల్లో మునిగి ఎన్నికలను వాయిదా వేయడం రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించడమే అవుతుంది.
1956 నుండి పరిశీలన చేస్తే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను పాలక వర్గాల ఆధిపత్యానికి అనుకూలంగా మార్చుకోవడానికే ప్రయత్నించారు తప్ప, గ్రామీణ, పట్టణ ప్రజల అభివృద్దికి ఏ మాత్రం కృషి జరగలేదు. 1956`64 (8 సంవత్సరాలు), 1964`70 (7 సంవత్సరాలు), 1970`81 (11 సంవత్సరాలు), 1981`88 (7 సంవత్సరాలు) 1988`95 (7 సంవత్సరాలు) కాల పరిమితితో పంచాయితీ వ్యవస్థ కొనసాగింది. ఏనాడు ఐదు సంవత్సరాల కాలపరిమితి ముగియగానే ఎన్నికలు జరిపిన దాఖలాలు లేవు. పై పరిస్థితులే రాజ్యాంగం 73వ సవరణ తర్వాత కొనసాగడం ఆందోళన కలిగించే అంశం. ప్రజల రాజకీయ చైతన్యాన్ని పెంచి, వారి అభివృద్దిని వారే తీర్చిదిద్దుకునేటట్లు చేయడంలో స్థానిక సంస్థల పాత్ర ప్రముఖమైనదని అందరూ భావిస్తారు. మేధావులు, కమిషన్లు అనేక సందర్భాల్లో స్థానిక సంస్థలను పటిష్టవంతం చేయాలని అనేక సూచనలు చేసారు.
మూడంచెల విధానాన్ని రాష్ట్రంలో కొనసాగిస్తున్నారు. గ్రామ పంచాయితీకి నిధులు రాబట్టడానికి మండల పరిషత్‌లో గ్రామం నుండి ఎన్నికైన ఎంపిటిసి కృషి చేయాలి. అతనికి గ్రామ పంచాయితీలో బాధ్యత ఉంటుంది. అదే విధంగా మండల పరిషత్‌లో జడ్పిటీసీకి బాధ్యత ఉంటుంది. కానీ విచిత్రమేమిటంటే అటు గ్రామ పంచాయితీలోనూ, ఇటు మండల పరిషత్‌లోనూ వీరికి కార్యాలయాలు లేవు. అధికారాల విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ 29 అధికారాలను పంచాయితీలకు బదలాయించకుండా తాత్సారం చేస్తున్నది. అనేక ప్రజా ఆందోళనలు జరిగినప్పటికీ పెడచెవిన పెడుతున్నది. పంచాయితీ వ్యవస్థను పాలకవర్గాలు జేబు సంస్థలుగా మార్చుకున్నాయి. మార్చి 2000 నాటికి 10 అంశాలను. 2008 డిశంబర్‌ నాటికి మిగిలిన 19 అంశాలను బదలాయిస్తామని కేంద్ర పంచాయితీ శాఖా మంత్రి మణిశంకర్‌ అయ్యర్‌ ముందు నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పందంపై సంతకం చేసారు. కానీ అది నేటికీ అమలు జరగలేదు. నిధుల కేటాయింపు గమనిస్తే ఏనాటికైనా స్థానిక సంస్థలు ప్రజా అభివృద్ది సంస్థలుగా మారుతాయన్న నమ్మకం లేదు. రాష్ట్ర బడ్జెట్‌లో ఈ రంగానికి ఏనాడు 3.5 శాతానికి మించి నిధులు కేటాయించలేదు. ఈ నిధులతో అభివృద్ది జరుగుతుందా? పైగా రాష్ట్ర  ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, కేంద్ర 13వ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ పంచాయితీ రాజ్‌ వ్యవస్థకు నిధులు కేటాయిస్తూ అభివృద్దికి సూచనలు చేసింది. కేంద్రం కేటాయించిన నిధులు కూడా వక్రమార్గం పడుతున్నాయి. రాష్ట్రం ఫైనాన్స్‌ కమిషన్‌ సూచనలను ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నది. అధికార  వికేంద్రీకరణ ప్రచారం చేస్తూ కేంద్రీకరణకే విధానాలు కొనసాగుతున్నాయి. పాలక వర్గానికి రాష్ట్రంలో రాజకీయ అనుకూలత ఏర్పడినప్పుడే ఎన్నికలు జరపడం పరిపాటిగా వస్తున్నది. పాలక వర్గం ఎడల ప్రజలు వ్యతిరేకతతో ఉన్నప్పుడు ఏదో కారణం చెప్పి ఎన్నికలు వాయిదా వేస్తున్నారు. ఈ విధానం వలన స్థానిక సంస్థలు మరింత బలహీనపడి, ప్రజల్లో ఈ సంస్థల ఎడల ఉన్న చొరవ తగ్గుతోంది. ఈ సంస్థల్లో పాల్గొనాలన్న ఉత్సాహం కొరవడుతుంది.
దేశంలో వామపక్ష ప్రభుత్వాలు కేరళ, బెంగాల్‌, త్రిపుర రాష్ట్రాల్లో 73,74వ రాజ్యాంగ సవరణకు ముందు నుండే ప్రతి ఐదు సంవత్సరాలకు విధిగా ఎన్నికలు జరిపే ఆనవాయితీ కొనసాగుతున్నది. బడుగు వర్గాలకు రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి రాజీ లేకుండా అత్యధిక స్థానాలను కేటాయించారు. పైగా గ్రామాభివృద్ది కమిటీలు వేసి అందులో పోటీ చేసి ఓడిన వ్యక్తికి బాధ్యతలు కల్పించారు. మహిళాలకు, బలహీన వర్గాలకు, దళితులకు, గిరిజనులకు, ప్రధాన్యత ఇవ్వబడిరది. ప్రతి పంచాయితీలలో ఫైనాన్స్‌, విద్యా, ఆరోగ్యం, భూమి, వ్యవసాయం, చేపలు, పంటలు, వగైరా శాఖలకు స్టాండిరగ్‌ కమిటీలు వేసి వాటి ద్వారా వారి సమస్యలు పరిష్కారిస్తారు. ప్రతి వార్డులో (గ్రామంలో) ఎన్నికైన అభ్యర్థి అభివృద్ది కమిటీ చైర్మన్‌గాను, అతనితో పోటి చేసి ఒడిపోయిన వ్యక్తి ఉప చైర్మన్‌గా ఉంటాడు, మరో 18మంది ని కమిటీలోకి తీసుకుంటారు. దీని వలన గ్రామంలో జరుగు పనులలో అవకతవకలకు అస్కారం లేదు. లిఫ్ట్‌ పథకాలను పంచాయితీ నిర్వహిస్తుంది. ఒక వరి పంటకు ఎకరాకు రు.240, మెట్ట పంటకు రు.90 రూపాయలు వసూలు చేస్తారు. రైతులు తమ సమస్యల పరిష్కారానికి పంచాయితీ దాటి వెళ్ల వలసిన అవసరం లేదు. పశ్చిమ బెంగాల్‌లోని  బర్ధమాన్‌ (భరద్వాన్‌) జిల్లాలోని రైనా పంచాయితీ సమితిలోని రైనా గ్రామ పంచాయితీని విశ్లేషించినప్పుడు దాని నిర్వహణ ప్రజలకు సన్నిహితంగా వుండి, వారి ప్రయోజనాలను రక్షిస్తున్నట్లు కనబడుతుంది. ఈ గ్రామ పంచాయితీలో 16వేల జనాభా వుంది. 11వేల మంది ఓటర్లు వున్నారు. 13 గ్రామాలు కలిపి గ్రామ పంచాయితీగా ఏర్పడిరది. ఈ గ్రామ పంచాయితీని 12 వార్డులుగా విభజించారు. అందులో మూడు వార్డులు మహిళలకు, నాల్గు వార్డులు దళితులకు, ఒక వార్డు గిరిజనులకు కేటాయించగా, మిగిలిన నాలుగు వార్డులు జనరల్‌ స్థానాలుగా వున్నాయి. పంచాయితీలో 2500 సన్న, చిన్నకారు రైతు కుటుంబాలు వున్నాయి. 500 కుటుంబాలకు భూమిలేదు. ఇందులో 250 కుటుంబాలు కౌలుదార్లుగా వున్నారు. గ్రామ పంచాయితీలో రెవిన్యూ అధికారి మరియు అటెండర్‌ వుంటారు. ఎనిమిది స్వయం సహాయక సంఘాలు వున్నాయి. ఇందులో నాలుగు అటవీ అభివృద్ధిలో పనిచేస్తున్నాయి. మరో రెండు విత్తనోత్పత్తి రంగంలో వున్నాయి. మిగిలిన రెండు చెపల పెంపకం, కుటీర పరిశ్రమలలో వున్నాయి. అన్ని స్వయం సహాయక గ్రూపులకు ఆదాయ వనరులు కల్పించబడినాయి. గ్రామ పంచాయితీ ఓటర్లు ముగ్గురు సమితి సభ్యులను ఎన్నుకొంటారు. వీరు పంచాయితీ సమితిలో తమ గ్రామ పంచాయితీ సమితికి రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ద తీసుకొంటారు. సర్పంచ్‌ పంచాయితీ సమితిలో ఎక్స్‌ అఫిషియోగా వుంటారు. పంచాయితీలో నాలుగు స్టాండిరగ్‌ కమిటీల వున్నాయి. 1. ప్రణాళిక, ఫైనాన్స్‌, 2. విద్య ` ఆరోగ్యం, 3.అడవులు భూమి, 4.వ్యవసాయం, పశు సంవర్థక శాఖ, చేపలు వగైరా. ఈ నాలుగు స్టాండిరగ్‌ కమిటీలకు ఛైర్మన్‌లు ఎన్నుకోబడాతారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలి. కుట్ర బుద్దితో పాలక పక్షానికి అనుకూలంగా కోర్టులకు వెళ్లి ఏదో అంశంపై స్టేలు పొందడం ఆనవాయితీగా వస్తున్నది. రిజర్వేషన్‌ సమస్యలను ఎన్నికల తేదీ రావడానికి ముందే పరిష్కరించుకోవాలి. అదే విధంగా ఒక సారి ప్రత్యక్ష ఎన్నికలు జరిగాక ప్రభుత్వం మారినప్పుడు తిరిగి దానిని పరోక్ష ఎన్నికలవైపు మార్చడం రాజ్యాంగ స్పూర్తికే విరుద్ధం. ప్రజలు అంగీకరించిన విధానాన్ని కనీసం 10 సంవత్సరాల పాటు కొనసాగించి అందులోని లోపాలను సవరించుకోవడానికి ప్రయత్నించాలి తప్ప, ప్రభుత్వాలు మారినప్పుడు పాత విధానాలను తిరగదోలి తమకు అనుకూలమైన విధానాలను రూపొందించడం ప్రజామోదం పొందినట్లు కాదు. తక్షణమే రాష్ట్రంలో ఎన్నికలను జరపడానికి తగు చట్టపరమైన ఏర్పాట్లు ప్రభుత్వం చేయడం ద్వారా రాష్ట్రాభివృద్దికి తోడ్పడుతుంది. అదే విధంగా రాష్ట్ర కేంద్ర ఆర్థిక కమిషన్లు చేసిన సూచనలను కచ్చితంగా ప్రభుత్వం పాటించే విధంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవాలి. స్థానిక సంస్థలలో ప్రజల చొరవను పెంచాలి.

సారంపల్లి మల్లారెడ్డి
తేది:28.07.2011

No comments:

Post a Comment