Wednesday, 13 August 2014

ఆహార ఉత్పత్తిలో మనం ఎక్కుడున్నాం ?

11వ జాతీయ ప్రణాళిక అంచనా ప్రకారం దేశంలో దారిద్య్ర రేఖకు దిగువన 30 కోట్ల మంది ప్రజలు బ్రతుకులీడుస్తున్నట్లు ప్రకటించారు. 1973లో 55శాతం దారిద్య్రరేఖకు దిగువనుండగా, 2004లో  ఆ సంఖ్య 27శాతానికి తగ్గినట్లు తెలిపారు. వాస్తవానికి మొత్తం జనాభాలో మూడిరట ఒకవంతు ప్రజలు దారిద్య్రంలో ఉన్నారు. గ్రామీణ ప్రజల్లో 30శాతం మంది అత్యంత దరిద్య్రులుగా ఉన్నారు. అయితే పట్టణాలకు వలసలు వలన కొంత తగ్గింది. ముఖ్యంగా దళిత, గిరిజనుల్లో 2005లో 80శాతం దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్లు అంచనా. ప్రధానంగా రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, జార్ఖండ్‌, ఒరిస్సా, చత్తీస్‌ఘర్‌ రాష్ట్రాల్లో అత్యంత దరిద్య్రులు ఉన్నట్లు ప్రణాళికా సంఘం లెక్కులు చెబుతున్నాయి. వీరివద్ద ఉత్పత్తిసాధనాలు (భూములు, వ్యవసాయ పరికరాలు) లేవు. చదువు రానివారు 80శాతంకు పైగా ఉన్నారు. అనారోగ్యం వీరి వెంటనే ఉంటుంది. అయినా వీరు సామాజిక సేవ చేస్తూనే ఉన్నారు. వీరి కొద్ది ఆదాయాలను కూడా కొల్లగొట్టడానికి గ్రామీణ ప్రాంతాల్లో మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు విరివిగా వెలిసాయి. 2005లో 57 లక్షల మంది ప్రజలకు ఎచ్‌ఐవి సోకింది. ఇందులో 15`49 సంవత్సరాల మధ్య గల వారు ఉన్నారు. వీరిలో 24 లక్షల మంది మహిళలు ఉన్నట్లు సర్వేలో తేలింది. ఇది పెరగడానికి దారిద్య్రంకూడా ఒక కారణం.
పౌష్టికాహార లోపం వల్ల ఆరోగ్య సమస్యలే కాక, బుద్దిమాంద్యం, ఇతర జబ్బులు ఆవరిస్తున్నాయి. కనీస ఆదాయం కొరకు ఇతర ప్రాంతాలకు వలసలు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రతా చట్టం తెస్తున్నట్లు గత మూడు సంవత్సరాలుగా నిరంతరం ప్రచారం చేస్తోంది. కానీ చట్టం తేవడానికి ఇప్పటికీ వెనకముందులాడుతున్నది. దేశ వ్యాపితంగా ఆహారభద్రతా చట్టం రావాలని పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా సాగుతున్నాయి. ఆహార భద్రత చట్టానికి ముందు కేంద్ర ప్రభుత్వం అనేక కమిషన్లు వేసింది. అనేక మంది సర్వేలు చేసారు. తన నివేదికలను కేంద్రానికి ఇచ్చారు. కానీ, కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు రు.22.40 రూపాయలు, పట్టణ ప్రాంతల్లో రు.28.70 రూపాయలు ఆదాయం వచ్చినవారిని దారిద్య్రరేఖకు దిగువనుండి తగ్గించబోతున్నట్లు తెలిపింది. దీనిపై టెండూల్కర్‌ కమిటీ37%, సక్సేనా 50%, అర్జున్‌సేన్‌ గుప్తా కమిటీలు77%గా నిర్ణయించాయి. కనీసం రోజుకు 100 రూపాయల ఆదాయం పైన వచ్చినవారినే బిపిఎల్‌ నుండి తొలగించాలని తమ నివేదికల్లో తెలిపారు. దాని ప్రకారం 70శాతం ప్రజలు బిపిఎల్‌ పరిధిలోకి వస్తారు.
ఆహార భద్రతా చట్టం ఆమోదించడం వలన కేంద్ర ప్రభుత్వంపై భారం పెరుగుతుందని, దీనిని ఆమోదించకూడదని ప్రధాని ఆర్థిక సలహా కమిషన్‌ కన్వీనర్‌ రంగరాజన్‌ గారు ప్రభుత్వాన్ని ప్రభావితం చేస్తున్నారు. ప్రస్తుతం చౌకడిపోల ద్వారా దేశంలో 5.2 కోట్ల టన్నుల బియ్యం, గోదుమలు పంపిణీ చేస్తున్నామని, ఆహార భద్రతా చట్టం అమలులోకి వస్తే ఇది 7.5 కోట్ల టన్నులకు పెరుగుతుందని అంటున్నారు. దీని వలన ప్రస్తుతం ఇస్తున్న ఆహార సబ్సిడీ రు.76,267 కోట్ల నుండి రు.88వేల కోట్లకు పెరుగుతుందని, అంత భారాన్ని కేంద్రం భరించలేదని సలహాలు ఇస్తున్నారు.
సంస్కరణలు చేపట్టిన 1997 నుండి నేటి వరకు వ్యవసాయం భారంగా మారి 2.5 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరు ఆహారోత్పత్తి చేయడానికి కృషి చేస్తూ రుణగ్రస్తులై ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
వాస్తవాలేమిటి? 1947లో దేశంలో 35 కోట్ల జనాభా ఉండగా, 13 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయినాయి. ఆ తర్వాత 1965 నుండి 1985 వరకు అమలు జరిగిన హరిత విప్లవంతో ఉత్పత్తి 5 రెట్లకు అనగా, 24 కోట్ల టన్నులకు పెరిగింది. అదే సందర్భంలో జనాభా 121 కోట్లకు పెరిగింది. నేడు జరుగుతున్న ఆహార ధాన్యాల ఉత్పత్తి, సక్రమ పంపిణీ ` వినియోగం జరిగినచో వాస్తవానికి మరొక 2కోట్ల టన్నుల లోటు ఉంటుంది. ఆహార భద్రత అంటే బియ్యం, గోదుమల సరఫరా మాత్రమే కాదు, అందరికీ పౌష్టికాహారం అందుబాటులో ఉంచాలి. కనీసం గ్రామీణ ప్రాంతాల్లో 2400 క్యాలరీల శక్తిగల ఆహారం, పట్టణాల్లో 2100 గల ఆహారం తీసుకోవాలి. మంచి ఆరోగ్యవంతుడు 2800 క్యాలరీల శక్తిగల ఆహారం తీసుకోవాలి. సమగ్ర ఆహారం అంటేÑ బియ్యం, గోదుమలతో పాటు 90శాతం ఇతర పౌష్టికాహార సరుకులు అందుబాటులో ఉండాలి. కానీ మన దేశంలో జనాభా పెరుగుదలకు తగినట్టుగా ఆహార ధాన్యాల ఉత్పత్తి జరగడం లేదు. జనాభా 1.9 శాతం పెరుగుతుండగా, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఎగుడుదిగుళ్లు ఉన్నప్పటికీ 1.1 శాతంగా పెరుగుతున్నది. 4 శాతం పెంచడానికి యేటా కేంద్రవ్యవసాయ శాఖ లక్ష్యంగా నిర్ణయిస్తున్నది. కానీ ఏనాడూ లక్ష్యాన్ని చేరలేదు. జనాభా పెరుగుతున్న కారణంగా భూ విస్థీర్ణం పెరిగే ఆస్కారం లేదు. అందువలన ఉన్న భూమిలోనే ఉత్పాదకతను పెంచాలి. దేశంలో 19.06 కోట్ల హెక్టార్ల భూమి సాగుచేస్తున్నాం. వరి ఉత్పాదకత 2005 `2011 వరకు హెక్టారుకు 2240 కిలోల దిగుబడి దాటలేదు. గోదుమలు 2938 కిలోలు దాటడం లేదు. కోటి 10 లక్షల హెక్టార్లలో పత్తి వేస్తుండగా, ఏనాడూ ఉత్పాదకత హెక్టారుకు 510 కిలోల దూది (గింజ తీసిన పత్తి) దాటలేదు. దాదాపు అన్ని పంటల పరిస్థితి ఇదే విధంగా ఉంది. నూనె గింజల ఉత్పత్తి దినదినం తగ్గడం వలన యేటా 40 నుండి 50 లక్షల టన్నుల నూనెను దిగుమతి చేసుకుంటున్నాం. ఉత్పాదకత పెరగక పోవడంతో పెరుగుతున్న పెట్టుబడికి తగిన ఆదాయం రాక గ్రామాల్లోని ప్రజానీకం పెద్ద ఎత్తున వలసలు పోతున్నారు. 1993లో 9శాతం నుండి రైతులు 2005 నాటికి 8 శాతానికి తగ్గారు. డాక్టర్‌ ఎంఎస్‌ స్వామినాధన్‌ వివరించినట్టు 1 డిగ్రీ సెల్సియస్‌ వేడి పెరిగితే 60 లక్షల టన్నుల గోదుమ పంటను నష్టపోతాము. కానీ నేటి పర్యావరణ పరిస్థితులను అధ్యయనం చేస్తున్న శాస్త్రవేతలు 2 డిగ్రీల సెల్సియస్‌ వేడి పెరిగినట్టు అంచనా వేసారు. ప్రపంచ జనాభాలో 16 శాతం, ప్రపంచ పశుసంపదలో 20 శాతం ఉండగా, నీటి లభ్యతలో 4 శాతం మాత్రమే మనం కలిగియున్నాము. వ్యవసాయానికి, త్రాగునీటికి ఇప్పుడే కొరత కనపడుతున్నది. 2020`25 నాటికి ఈ కొరత అత్యంత తీవ్రంగా ఉంటుందని విశ్లేషణలు చేస్తున్నారు. ప్రపంచ ఆహార మరియు వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) గత 10 సంవత్సరాల్లో దేశంలో నీటి రక్షణకు కోటి 50 లక్షల డాలర్లు సహాయం చేసింది. నెదర్లాండ్‌ ప్రభుత్వం 2004 నుండి2009 వరకు భూ గర్బ జలాల వెలికితీత, లిప్టు పథకాలు, త్రాగునీటికి కోటి 47 లక్షల డాలర్లు సహకరించింది. దేశంలోని 23 వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు 1973 నుండి 1994 వరకు ఎఫ్‌ఏవో సహకారం చేసింది. ఐనప్పటికీ భారత వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెరగలేదు. కారణం, వ్యవసాయ ఉపకరణాలన్నీ 1997 నుండి క్రమక్రమంగా నేటికీ 80శాతం బహుళజాతి సంస్థల నిర్వహణలోకి వెళ్లాయి. నాణ్యతలేని విత్తనాల సరఫరా, అధిక ధరలలు రైతులు ఏటా కోట్లాది ఎకరాల పంటలకు, మరియు ఆదాయాన్ని నష్టపోతున్నారు. ఆహార ఉత్పత్తి పెరగకుండా ఆహార భద్రత చట్టం చేసినప్పటికీ దాని అమలు సంశయాత్మకమే.
చైనా అభివృద్ధి : భారత దేశం స్వాతంత్య్రం పొందిన 2 సంవత్సరాల అనంతరం చైనా విముక్తి పొందింది. ప్రపంచంలోనే జనాభాలో మొదటిస్థానంలో ఉంది. 132.8 కోట్ల జనాభా కలిగిన జనాభాలో సాగుభూమి భారతదేశం కన్నా తక్కువ. భారతదేశం 19.06 కోట్ల హెక్టార్లలో సాగుచేస్తుండగా, చైనా 12.17 కోట్ల హెక్టార్లు మాత్రమే సాగుచేస్తున్నది. తలసరి భూమి 0.092 హెక్టార్లు మాత్రమే. ప్రపంచ సగటు తలసరిలో 40% మాత్రమే ఉంది. విశాలమైన భూమి ఉన్నప్పటికీ సాగుకు యోగ్యమైనది లేదు. 20 కోట్ల హెక్టార్లు అడవికింద ఉంది. ఉన్న కొద్దిసాగుభూమిలోనే ఉత్పాదకతను పెంచి ప్రపంచంలో ఆహారధాన్యాల ఉత్పత్తిలో మొదటిదేశంగా ఉంది. 1978 నుండి నేటి వరకు 1500 కొత్త హైబ్రిడ్‌వంగడాలను వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టారు. సూపర్‌రైస్‌ హెక్టారుకు 8.5 టన్నుల ధాన్యం దిగుబడి వస్తున్నది. 40 రకాల సంకర పశుజాతులను అభివృద్ది చేశారు. 1958 నుండి భూమిని సమిష్టి ఆస్థిగాను, సేద్యం ఉమ్మడిగాను సాగిస్తున్నారు. రైతులు పండిరచిన ఉత్పత్తులను ప్రభుత్వం విధిగా సేకరించి, పంపిణీ బాధ్యతను చేపట్టింది. 1978లో కుటుంబ కాంట్రాక్టు పద్ధతి ద్వారాను, గతంలో ఉన్న సహకార వ్యవసాయ క్షేత్రాల ద్వారా ‘‘రెండు దశల’’ విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఒక విధంగా పోటీతత్వాన్ని ఉత్పత్తి రంగంలో కొనసాగిస్తున్నారు. 2001లో 1.50లక్షలసహకార ఫార్మింగ్‌ సంస్థలను ఏర్పాటు చేసి అందులో 3.87 కోట్ల మందిని సభ్యులుగా చేర్చుకున్నారు. గ్రామప్రజలలో 54.5% రైతులుగాను, 45% పరిశ్రమలలో పనిచేసేవారున్నారు. రెండు రంగాల వలన ఆహారోత్పత్తి పెరిగింది. 2008లో 25.66 కోట్ల రైతు కుటుంబాలు ఉన్నట్టు అంచనా వేశారు. 1978`2008లో (30 సంవత్సరాలు) హెక్టారుకు 2.5టన్నుల నుండి 5 టన్నులకు ఉత్పత్తిని పెంచారు. కూరగాయలు, గోదుమలు, మొక్కజొన్న, ఆలుగడ్డలు, పాలు ఒకటేమిటి అన్ని రంగాలలో ఉత్పత్తిని ప్రపంచంలో మొదటిస్థానానికి తెచ్చారు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ చేయడం ద్వారా 970 మిలియన్‌ కిలోవాట్ల శక్తిని నేడు వినియోగిస్తున్నారు. 54.5%పనులు యాంత్రీకరణ ద్వారానే జరుగుతున్నాయి. దేశ జిడిపి 537 బిలియన్‌ యువాన్‌లకు చేరుకుంది. ఒక మౌ భూమి(హెక్టారులో 15వ వంతు) అనగా 4 గుంటల భూమిలో 344.4 కిలోలు ఉత్పత్తి చేస్తున్నారు. సోషలిస్టు మార్కెట్‌ ఎకానమి అమలు జరుపుతూ ఇతర దేశాల టెక్నాలజీని స్వదేశంలో అభివృద్ధి చేసి ఉత్పత్తి పెరుగుదలకు కృషి చేస్తున్నారు.
ప్రపంచంలోని మూడు ప్రధానదేశాల ఉత్పత్తులు ఈ విధంగా ఉన్నాయి.(2010లో కోట్ల టన్నులలో)


      చైనాలో వ్యవసాయ పరిశోధనలపై ప్రభుత్వం పెద్దగా కేంద్రీకరించడం వలననే ఈ ఫలితాలు సాధిస్తున్నారు. నిరంతర పరిశోధన ఫలితాలను రైతుల వద్దకు చేర్చడానికి ప్రభుత్వం అత్యంత శ్రద్ద చూపుతున్నది. పెద్దఎత్తున నిధులు కేటాయిస్తున్నారు. గ్రామీణ తలసరి జీవనాదాయం 20 వేల యువాన్‌లు ఉంది. (1యువాన్‌R8రూపాయలు) అయినప్పటికీ మరింత జీవనాదాయాన్ని పెంచుకోవడానికి పట్టణాలకు వలసలు వెళుతున్నారు.  గ్రామాలలో చదువురాని వారు, ఇండ్లులేనివారు లేరు. రవాణా సౌకర్యం అత్యంత అభివృద్ధిలో ఉంది. మార్కెట్‌ ఎకానమి అయినప్పటికీ వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలులో ధరలు తగ్గకుండా గిట్టుబాటయ్యేటట్టు ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. నేరుగా ప్రభుత్వం రైతులకు నగదు రూపంలో సహకరిస్తున్నది.1978నాటికి ఆహారధాన్యాలు దిగుమతులు చేసుకున్న చైనా, ప్రస్తుతం మిగులు ఉత్పత్తులు చేసి ఎగుమతులు చేస్తున్నది. కానీ భారతదేశం తనకున్న నీటి వనరులను, సాగునీటిని, భూమిని, టెక్నాలజీని వినియోగించి ఉత్పాదకతను పెంచాల్సి ఉన్నప్పటికీ పెంచకపోవడం వలన గ్రామీణ దారిద్య్రం ఏటేటా పెరుగుతున్నది.


(‘‘ అసంఘటిత రంగంలో ఆదాయాలు, జీవన వ్యయం’’ అర్జున్‌ సేన్‌గుప్తా కమీషన్‌ 2007 ఆధారంగా)
నేడు భారత రైతులు ఆహార భద్రతకు, స్వయం సమృద్ధతకు ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న 25 కోట్ల టన్నులకు అదనంగా మరో 5 కోట్ల టన్నులు పెంచాలి. అయితే రైతులు తమ ఆదాయానికి గ్యారంటీ ఉండడం, ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు, ప్రకృతివైపరీత్యాల సందర్భంగా పంటలకు పరిహారం, వ్యవసాయ ఉపకరణాల ధరల తగ్గింపు, లేదా పంటపెట్టుబడి తగ్గింపు, పంటల భీమా మరియు బోనస్‌ తదితర సమస్యలకు పరిష్కారం లేక ఆందోళనలో ఉన్నారు. ఈ సమస్యలను ప్రభుత్వమే పరిష్కరించాలి. కానీ ప్రభుత్వం ఆ దిశగా ప్రణాళికలు రూపొందించి అమలు జరపడం లేదు.
భూసమస్య : దీనిని మూడు విధాలుగా చూడాలి. 1) భూమిలేనివారు లేదా కౌలుదారులు, 2) భూమి సేకరణ, దురాక్రమణ, 3) వ్యవసాయానికి వినియోగం.
1) గ్రామీణ ప్రజానీకంలో నేటికీ 65% ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. వీరిలో దాదాపు 45% మందికి సెంటు`గుంట భూమిలేనివారున్నారు. నేడు మారిన వ్యవసాయ సంబంధాల ప్రకారం వ్యవసాయ కార్మికులుగా పనులు లేనందున కౌలుదారులుగా మారుతున్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణ ఫలితంగా గతంలో ఉన్నదానికి 50%పైగా పనిదినాలు కోల్పోయారు. గ్రామాలలో పశుసంపద కూడా తగ్గింది. ఫలితంగా కౌలురైతుల విస్తరణ పెరుగుతున్నది.  వీరు కోట్ల సంఖ్యలో ఉన్నారు. చివరకు ఏజెన్సీ ప్రాంతాలలో కూడా కౌలువిధానం విస్తరించింది. పంటకు పెట్టుబడి మరియు కౌలురేటుపోగా కౌలురైతుకు మిగిలేది అప్పులే. సామాజిక హోదా, మరొక పని లేకపోవడంతో, నైపుణ్యంగల పనులు రాకపోవడంతో ముఖ్యంగా చదువు లేనందువలన కౌలుదారు స్థితి నుండి బయటపడలేకపోతున్నారు. కానీ వీరికి ఏ రాష్ట్రంలోనూ రక్షణ లేనిస్థితి ఉంది. కొన్ని రాష్ట్రాలలో రక్షణ చట్టాలు ఉన్నప్పటికీ బహిరంగంగానే ఆ చట్టాలను ఆ ప్రభుత్వాలు అమలు చేయడంలేదు. వీరికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. 
2) 1894 నాటి చట్టప్రకారం దేశంలో భూసేకరణ పెద్దఎత్తున సాగుతున్నది. రాజ్యాంగం రీత్యా భూసమస్య రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్నప్పటికీ కేంద్రం ‘‘భూసేకరణ చట్టం’’ ముసాయిదాను పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఏ ఒక్కరాష్ట్రం కూడా కేంద్రం తమ హక్కులు కాజేస్తున్నదంటూ ఘర్షణకు రాకపోవడం గమనించాలి. సంస్కరణల ఫలితంగా విదేశీ, బహుళజాతి సంస్థలు కోట్ల ఎకరాలు దేశంలో భూ సేకరణకు పూనుకున్నాయి. పెట్టుబడులు తెస్తున్నామని, వ్యవసాయ ఉత్పత్తులు పెంచుతామని, పనిదినాలు గ్యారంటీగా ఉంటాయని చెప్పి భూ సేకరణ చేస్తున్నారు. భూములు కోల్పోయినవారికి తగిన పరిహారం రాకపోగా ఉన్న ఉపాధి కోల్పోయి నిరాశ్రయులవుతున్నారు. భూములు కోల్పోయిన నిర్వాసితుల సంఖ్య కోట్లలోకి చేరుతున్నది. అత్యవసర సేకరణ పేరుతో మరియు ప్రజాప్రయోజనాల పేరుతో ప్రభుత్వం నిర్బంధంగా భూములు సేకరించి రియల్‌ఎస్టేట్‌ దారులకు, భూమాఫియాదారులకు, తమ అవసరానికి మించి భూమిని పరిశ్రమాధిపతులకు పందేరం చేస్తున్నారు. వామపక్ష ప్రభుత్వాలు మినహా అన్ని రాష్ట్రాలలో ఈ తతంగం పెద్దఎత్తున సాగింది. ఇంకా సాగుతున్నది.
మరోవైపున పేదల భూముల దురాక్రమణ పెద్దఎత్తున కొనసాగుతున్నది. సీలింగు, మిగులుభూముల చట్టాలను, ప్రభుత్వభూముల అసైన్డ్‌ చట్టాలను, ఎజెన్సీ ఏరియాలోని షెడ్యూల్డ్‌(1/70)చట్టాలను ఘోరంగా వుల్లఘించి ధనికులు, పారిశ్రామికవేత్తలు భూములు లాక్కుంటున్నారు. ముఖ్యంగా ఎజెన్సీలోని ఖనిజ సంపదను, అటవీసంపదను(రంగురాళ్ళు,ఇనుము,బొగ్గు) అక్రమంగా కొల్లగొట్టడానికి ప్రభుత్వం లక్షలాది ఎకరాల భూమిని ఉచితంగా పరిశ్రమాధిపతులకు బదలాయిస్తున్నది. భూ సేకరణకు, భూ ఆక్రమణ నివారణకు కట్టుదిట్టమైన చట్టాలు చేయడానిక,ి స్వాతంత్య్రం వచ్చి 60 ఏండ్లు దాటినా ఆంగ్లేయులు చేసిన చట్టాలనే పట్టుకు వెళ్ళాడుతున్నారు.
3) వ్యవసాయానికి ఉపయోగపడే భూమిపై ‘‘భూ చట్టాలు’’ అమలు జరుగుటలేదు. వాస్తవసాగుదారు పేరు రెవెన్యూ రికార్డులో నమోదులేదు. పాసుపుస్తకాలు, భూమిపై హక్కుపత్రాలు లేకపోవడం వలన భూ యజమానులు భూమిని అభివృద్ధి చేసి అధికోత్పత్తి చేయడానికి ఇష్టపడడంలేదు. సమగ్ర భూ చట్టాలు చేసి వాస్తవసాగుదారుకు, భూమిపై హక్కు కలిగిన పేదలకు మరియు కౌలుదారులకు రక్షణ కల్పించే చట్టాలను చేయాలి. అప్పుడే వ్యవసాయోత్పత్తి పెరుగుదల జరుగుతుంది.
విత్తన రంగం : ఇందులో 6 అంశాలున్నాయి. 1) లభ్యత / దిగుమతి / సాంప్రదాయక విత్తనాల రక్షణ /అకౌంటబిలిటీ, 2) మేధోసంపత్తి హక్కులు, 3) విత్తన వాణిజ్యం / వ్యాపారం, 4) గుత్తాధిపత్యం, 5) ధరలు, 6) జన్యు దొగతనం
పైఆరు సమస్యలలో రైతులకు హక్కులు లేకుండా చేసి సంస్కరణల అనంతరం క్రమక్రమంగా నేడు బహుళజాతి సంస్థల గుత్తాధిపత్యంలోకి విత్తనం వెళ్ళింది. మన దేశీయ / సాంప్రదాయ విత్తనాలు కనుమరుగయ్యాయి. గుత్తసంస్థలు మేధోసంపత్తి హక్కుల పేర విత్తనాలలో కొద్దిగా మార్పులు చేసి మొత్తం విత్తనాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. 100% విత్తన మార్పిడి పేరుతో(రీప్లేస్‌మెంట్‌) ప్రతిసారి కంపెనీల నుండి అధిక ధరలకు విత్తనాలను కొనవలసిన పరిస్థితి ఏర్పడిరది. ధరలపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు ఎలాంటి నియంత్రణ విధించే హక్కులేదు. వేల సంవత్సరాలుగా కాపాడుతూ వచ్చిన మన దేశీయ ‘‘జీన్‌బ్యాంకును’’ విదేశీ గుత్తాధిపతులు పెద్దఎత్తున తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. విత్తన రంగంలో 1. సామాజిక సీడ్‌బ్యాంకు ఏర్పాటు, 2. బ్రీడిరగ్‌ విత్తనాలను రైతులకు అందించడం, 3. విత్తన చట్టం కేంద్రం లేదా రాష్ట్రం చేయడం, 4.జన్యుమార్పిడి విత్తనాలపై రైతులకు హక్కులు కల్పించుట, 5. ప్రభుత్వ, ప్రజారంగంలో విత్తన కార్పోరేషన్‌ ఏర్పాటు, 6.విత్తనాలపై రైతుకు పూర్తి ఆధిపత్యం, 7. విత్తన పరిశోధనకు పెద్తఎత్తున నిధులు కేటాయించడం వగైరా చర్యలు ప్రభుత్వం చేపట్టాలి.
పర్యావరణం`వ్యవసాయం : ప్రస్తుత టెక్నాలజీ`ఎరువులు`నూతన విత్తనాల వలన పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి. పూర్తి పరిశోధనలు చేయకుండానే విదేశీ టెక్నాలజీని వాణిజ్యపరంగా ఉత్పత్తులలో ప్రవేశపెట్టడంచే ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మొక్కకు 30 రకాల పోషకాహారాలు అవసరం. కానీ మన వ్యవసాయంలో భాస్వరం, నత్రజని, పోటాష్‌ మాత్రమే విస్తృతంగా వినియోగిస్తున్నాం. సాంప్రదాయ ఎరువులు అదృష్యమైనాయి. పంటలకు మేలు చేసే క్రిములు మరియు వానపాములు వగైరా నశించే క్రిమిసంహారక మందులు, ఎరువుల వినియోగం వలన పంటపైనేగాక పర్యావరణంపై ప్రభావం చూపుతున్నాయి. ఒక గ్రాముపేడలో 1000 రకాల క్రిములుంటాయి. వీటిని పంటలను రక్షించడానికి వినియోగించవచ్చు. చెత్త, పట్టణ కంపోస్టు నుండి ఎరువును తయారు చేయవచ్చు. గాలి నుండి నత్రజనిని స్వీకరించి పంటలకు అందించే కొన్ని క్రిములను నాశనం చేసే విధంగా నేటి ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం చేస్తున్నారు. జీవ మార్పిడి పంటలలో పని చేస్తున్నవారికి చర్మరోగాలు, ఇతర ఊపిరితిత్తుల సంబంధ వ్యాధులు, గర్భస్రావాలు, పంటలు మేసిన పశువుల మరణాలు సంభవిస్తున్నాయి. రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు వినియోగం విస్తృతంగా పెరగడంతో గ్రామీణ ప్రజలపైననే గాక పర్యావరణంపై దుష్ఫలితాలు చూపుతున్నాయి. వీటన్నింటినీ నివారించే చర్యలు చేపట్టాలి. నేడు ఆహారధాన్యాలు బయోడీజిల్‌కు, ఆల్కహాల్‌ తయారీకి వినియోగిస్తున్నారు. దీనివల్ల ఆహార కొరత ఏర్పడి ఆకలి చావులు సంభవిస్తున్నాయి.
నివారణ చర్యలు
1) వాస్తవసాగుదారుకు భూమిపై హక్కులు కల్పించాలి. రాష్ట్రప్రభుత్వాలు ఇందుకు తగిన రక్షణ చట్టాలను చేయాలి. భూ సేకరణ రైతుల కోర్కెమేరకే చేయాలి. ఎజెన్సీ రైతుల రక్షణ పర్యావరణ రక్షణకు కీలకం. అందువల్ల ఎజెన్సీలో వారికి పూర్తి హక్కు కలిగే విధంగా భూచట్టాలను చేసి అమలు చేయాలి.
2) విత్తనాలు, ఇతర వ్యవసాయోపకరణాలపై రైతులకు పూర్తి హక్కులుండాలి. రుణ సౌకర్యం తగినంత అందుబాటులో ఉంచాలి. విదేశీ సంస్థలను వ్యవసాయ రంగం నుండి నిషేధించాలి. నేటి టెక్నాలజీని దేశీయ వాతావరణానికి అనుకూలంగా అభివృద్ధి పరిచి రైతులకు ఉచితంగా అందించాలి. విదేశీ టెక్నాలజీని మన దేశ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించాలి.
3) వ్యవసాయ, విత్తన పరిశోధనలపై కేంద్రం అవసరమైన నిధులు కేటాయించడంతోపాటు ప్రత్యేకమైన శ్రద్ధను కనబర్చాలి. ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా విత్తనాలను రూపొందించాలి. నిరంతరం భూసార పరీక్షలు నిర్వహించి విత్తనాలు, ఎరువులు ఏమోతాదులో వాడాలో తెలియపర్చే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.
4) వ్యవసాయ ఉత్పత్తులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిగా కొనుగోలు గ్యారంటీ చేయాలి. వినియోగదారులకు సరఫరా చేయాలి. మధ్యదళారీల పాత్రను తొలగించాలి. వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యతను, నిల్వ సౌకర్యాన్ని అవసరమైన చోట ఏర్పాటు చేయాలి. ప్రతి మండల కేంద్రంలో మార్కెటింగ్‌ సౌకర్యం అన్ని హంగులతో కల్పించాలి. కాంట్రాక్టు మార్కెటింగ్‌ విధానం, మార్కెట్లను ప్రైవేటీకరించే చట్టాలను ఉపసంహరించాలి.
5) రైతుల ఆదాయానికి గ్యారంటీ ఉండాలి. వారి ఉత్పత్తుల ధరలు తగ్గినప్పుడు ప్రభుత్వాలు పరిహారం  నగదు రూపంలో చెల్లించాలి. ఇందుకు రాష్ట్రస్థాయిలో కమీషన్లు ఏర్పాటు చేయాలి. ఆత్మహత్యలను నివారించే దిశగా పై చర్యలను చేపట్టాలి. ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా పూర్తి పరిహారం రైతులకు అందించాలి.
పర్యావరణ పరిరక్షణకు ఇతర దేశాలలోని అనుభవాలను సమీక్షించి మన దేశ రైతుల ప్రయోజనమేకాక, దేశ ఆహారభద్రతకు ఉత్పత్తిని పెంచే విధంగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రస్తుత విధానాలను మార్చి, మనకు ప్రయోజనకరమైన విధానాలను రూపొందించి అమలు చేయాలి.
(జీవవైవిధ్యంపై సదస్సులు, వరిలో నూతన పరిశోధనలు, ఆత్మహత్యల నివారణ సదస్సులు సెప్టెంబర్‌, అక్టోబర్‌ మాసాలలో జాతీయ`అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాదులో జరుగుతున్నాయి. సెప్టెంబర్‌ 12,13న భోపాల్‌(మధ్యప్రదేశ్‌)లో వ్యవసాయరంగ పరిరక్షణపై సదస్సు జరిగింది. నేడు దేశీయ వ్యవసాయ విధానాలలో చేయాల్సిన మార్పులను సూచిస్తూ వివిధ రాష్ట్రాల రైతులు చేసిన సూచనలకు సంక్షిప్తరూపం)
సారంపల్లి మల్లారెడ్డి
14.09.2012

No comments:

Post a Comment